సాక్షి, అమరావతి: సమాజంలో పోటీ పడి రాణించాలంటే విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సాధించాలని ఎన్‌టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి(డీటీడబ్ల్యూఓ) ఎం.రుక్మంగదయ్య చెప్పారు.
150 మంది గిరిజన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ
నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో 150 మంది గిరిజన విద్యార్థులకు ‘నాయకత్వ లక్షణాలు, సాఫ్ట్ స్కిల్స్’పై డిసెంబర్ 4న శిక్షణ ఇచ్చారు. విజయవాడ బావాజీపేట నవజీవన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రుక్మంగదయ్య మాట్లాడుతూ నవజీవన్ బాలభవన్ ద్వారా 150 మంది బడి బయట ఉన్న గిరిజన పిల్లలను తిరిగి పాఠశాల్లో చేర్పించడంతో పాటు వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.
నవజీవన్ ప్రోగ్రాం మేనేజర్ శీలం జోసఫ్ డోనాల్డ్ మాట్లాడుతూ గిరిజన పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని నిరంతరం మెరుగుపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ జాన్ అలెగ్జాండర్ విలియమ్స్, కోఆర్డినేటర్స్ నజ్మా, పి.ఝాన్సీరాణి, సుజాత పాల్గొని మాట్లాడారు.