Bhaskar Halami: కడు పేదరికం నుంచి ‘అగ్ర’ శాస్త్రవేత్త దాకా...
కష్టపడే తత్వంతో ఎలాంటి సమస్యలనైనా దీటుగా ఎదుర్కోవచ్చని చాటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన అతని పేరు భాస్కర్ హలామీ (44). ఆయన కుటుంబం కుర్ఖేదా తహసీల్ పరిధిలోని ఛిర్చాది గ్రామంలో ఉండేది. అక్కడి నుంచి అమెరికాలోని మేరీలాండ్‌లో ప్రఖ్యాత బయోఫార్మా సంస్థ సిర్నావోమిక్స్‌లో సీనియర్ సైంటిస్ట్ (రీసెర్చ్, డెవలప్‌మెంట్) స్థాయికి ఎదిగారు బాస్కర్. ఆ క్రమంలో ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ‘‘మాది నిరుపేద కుటుంబం. ఒక్కపూట భోజనం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు తలచుకుంటే ఆ కష్టాలన్నీ ఎలా గట్టెక్కామా అని ఆశ్చర్యం వేస్తుంది. చేయటానికి పని ఉండేది కాదు. వర్షాకాలంలో మరీ దారుణం. తింటానికే ఉండేది కాదు.
చదవండి: Success Story : కేవలం రూ.80 పెట్టుబడి పెట్టి.. రూ.1600 కోట్లలకు పైగా సంపాదించాం.. ఈ ఐడియాతోనే..
అస్సలు అరగని మహువా పూలను తెచ్చుకుని వండుకుని వాటినే తినేవాళ్లం. కొద్దిగా దొరికే ముడి బియ్యంతో గంజి కాచుకుని తాగేవాళ్లం. మా కుగ్రామంలో 90 శాతం కుటుంబాలది ఇదే దీనావస్థ. మా తల్లిదండ్రులు ఇతరుల ఇళ్లలో పనిచేసేవారు. నాన్నకు ఊరికి 100 కి.మీ. దూరంలో స్కూల్లో వంటమనిషిగా పని దొరికాక అక్కడికి వెళ్లిపోయాం. యవత్మాల్‌లోని విద్యానికేతన్ ప్రభుత్వ పాఠశాలలో పది దాకా చదివా. అమ్మానాన్నలకు చదువు విలువ బాగా తెలుసు. వాళ్లు పస్తులుండి మాకు అన్నం పెట్టారు. ఉన్నదంతా మా చదువుకే ఖర్చు పెట్టేవారు.
చదవండి: Inspiring Success Story : ఒకే జిల్లా. ఒకే బ్యాచ్.. ఎస్సై జాబులు కొట్టారిలా.. సొంత ఊరు కోసం..
గడ్చిరోలీలో సైన్స్‌లో డిగ్రీ చేశాక నాగ్‌పూర్‌లో కెమిస్త్రీలో పీజీ చేశా. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలోనూ పాసయ్యా. కానీ నాకు పరిశోధనపై ఆసక్తి. అందుకే అమెరికా వెళ్లి మిషిగన్ వర్సిటీలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలో పీహెచ్‌డీ చేశా. ఇప్పటికీ ఈ రంగంలో నియామక కంపెనీలు నా సలహాల కోసం కుప్పల కొద్దీ మెయిల్స్ పంపుతుంటాయి. మా సొంతూళ్లో అమ్మా,నాన్నలకు ఇల్లు కట్టిచ్చా’’ అని భాస్కర్ చెప్పుకొచ్చారు. భాస్కర్ స్ఫూర్తిదాయక గాథ అందరికీ తెలిసేలా రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ‘టీ విత్ ట్రైబల్ సెలబ్రిటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది!