Godavari River: గోదావరిలో అపారంగా ఉన్న జలసిరులు.. ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత
ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతం(బేసిన్)లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకుని తాజాగా తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని సీడబ్ల్యూసీ వెల్లడించింది.
గోదావరిలో ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించిన అధ్యయనాల్లో నిర్ధారించిన దానికంటే అధికంగా నీటి లభ్యత ఉందని ప్రకటించింది. దీనిపై అంతర్రాష్ట్ర జలవనరులు, బచావత్ ట్రిబ్యూనల్ సమయంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం గల ఇంజినీర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
నీటి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయాలంటే వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకోవాలని చెబుతున్నారు. బేసిన్‌లో కొంతకాలం అధిక వర్షపాతం కురవడం.. ఆ సమయంలో ఒకేసారి గరిష్టంగా వరద రావడం తదితర కారణాల వల్లే గోదావరిలో నీటి లభ్యత పెరగడానికి కారణమని నీటిపారుదలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గోదావరి బేసిన్ ఇదే..
దేశంలో రెండో అతి పెద్ద నది గోదావరి. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్‌లో సముద్రమట్టానికి 1,067 మీటర్ల ఎత్తులో జన్మించిన గోదావరి.. మహారాష్ట్ర, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లలో 1,465 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏపీలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
Floods: వరద ముంపులో.. అగ్ర స్థానంలో ఉన్న బీహార్.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న ఏపీ!!
గోదావరికి ప్రవర, పూర్ణ, మంజీర, పెన్‌గంగ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ప్రధాన ఉప నదులు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పుదుచ్చేరిలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం.
సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ముఖ్యాంశాలు..
➢ గోదావరిలో 1985–86 నుంచి 2022–23 వరకు ఏటా సగటున 4,561.60 టీఎంసీల లభ్యత ఉంది.
➢ 2013–14లో గరిష్టంగా 8,664.82 టీఎంసీల లభ్యత ఉండగా.. 2009–10లో నీటి లభ్యత కనిష్టంగా 2,066.62 టీఎంసీల లభ్యత ఉంది.
➢ బేసిన్‌లో సగటున 1,167 మి.మీ. వర్షపాతం కురుస్తుంది. దీనివల్ల గోదావరిలో ఏటా సగటున 12,869.74 టీఎంసీల ప్రవాహం ఉంటుంది. 1994–95లో గరిష్టంగా 1,484 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గరిష్టంగా 17,054.89 టీఎంసీల ప్రవాహం ఉంది. 2015–16లో బేసిన్‌లో కనిష్టంగా 914 మి.మీ.ల వర్షపాతం కురవడం వల్ల ఆ సంవత్సరంలో గోదావరిలో కనిష్టంగా 9,608.43 టీఎంసీల ప్రవాహం ఉంది.
➢ 1985–2023 మధ్య ఏటా సగటున 850.38 టీఎంసీలను మాత్రమే సాగునీటి కోసం వినియోగించుకున్నారు.
➢ 2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, పశువులకు తాగునీటి కోసం 70.28 టీఎంసీలు వాడుకున్నారు.
➢ బేసిన్‌లో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలు ఏటా సగటున 181.52 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ నిర్ధారించింది.