Department of Tribal Welfare: గిరిజన విద్యా సంస్థల్లో గేటు వరకే అనుమతి
గిరిజన గురుకులాలతోపాటు పలు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు భద్రత, సురక్షితమైన జీవన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంది. హైకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ ఆదేశాల మేరకు గిరిజన విద్యాసంస్థల ఆవరణలోకి ఇతర వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: Good News: రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లు శాతం ఇలా...
కచ్చితమైన నిబంధనలు
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎవరినీ గిరిజన ఆశ్రమ పాఠశాలలోపలికి అనుమతించకూడదు. బాలికలు ఉండే విద్యా సంస్థల్లోని డార్మెటరీ, మరుగుదొడ్లు ఉండే ప్రాంగణంలోకి పురుషులను అనుమతిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కలెక్టర్, ఐటీడీఏ పీవో, సంయుక్త కలెక్టర్, డీఆర్‌వో, తహసీల్దార్, ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ పాఠశాల విద్యా కమిషనర్, డీఈవో, ఎంఈవో, ఏటీడబ్ల్యూ, వైద్యాధికారి, ఎంపీడీవోలను మాత్రమే విద్యాసంస్థల్లోకి అనుమతిస్తారు. ఇతర అధికారులు, దాతలు, మీడియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు వంటి వారు విధిగా జిల్లా ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న తర్వాతే ప్రవేశం కలి్పస్తారు. గ్యాస్, కూరగాయలు, నిత్యావసర సరుకుల పంపిణీదారులను విద్యాసంస్థ ప్రాంగణం గేటు వరకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ఉత్తర్వులను ఉల్లఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్దేశిత సమయం కేటాయిస్తారని కాంతిలాల్ దండే జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.