Jagananna Gorumudda: 'గోరుముద్ద'కు తాజ్ రుచులు.. మెనూ ఇదీ..
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి పోషకాలతో అందించాలన్న లక్ష్యంతో వంటల తయారీలో మరిన్ని మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రోజుకో మెనూ చొప్పున వారంలో ఆరు రోజులపాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెల (జూన్) 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో ప్రభుత్వం మరింత దృష్టిపెట్టింది.
ప్రస్తుతం అందిస్తున్న మెనూనే మరింత రుచితో పాటు పోషకాలతో అందించేందుకు తిరుపతిలోని హోటల్ తాజ్ చెఫ్‌ల సహకారం తీసుకుంది. రోజుకో మెనూ అందిస్తున్నందున అదే భోజనాన్ని ఇక ప్రత్యేకంగా ఎలా తయారుచెయ్యొచ్చో తెలిపేలా ఆరు వీడియోలను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. వీటిని మధ్యాహ్న భోజనం వండుతున్న సుమారు 85 వేల మంది సిబ్బందికి చూపించి అవగాహన కల్పి0చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
చదవండి: Collector Muzammil Khan: స్కూళ్లలో ‘లంచ్, లర్న్’ కార్యక్రమం అమలు
ఆయా వీడియోల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన వంట ఎలా చేయాలో తాజ్ చెఫ్‌లు వివరించడమే కాకుండా వాటి ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేస్తారు. గోరుముద్ద యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలను మధ్యాహ్న భోజనం అందించే రాష్ట్రంలోని 44,190 పాఠశాలల్లో పనిచేస్తున్న మొత్తం 85 వేల మంది వంటవారు వారి స్మార్ట్‌ఫోన్లలో చూస్తారు. స్మార్ట్‌ఫోన్ లేకుంటే ఉన్నత పాఠశాలల్లోని ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ)పైన, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీల్లోను పాఠశాల సమయం ముగిశాక సిబ్బందికి చూపిస్తారు.
పిల్లల ఆరోగ్యం కోసం మెనూ రూపకల్పన..
నిజానికి.. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో బాధ్యతలు చేపట్టాక పేద పిల్లల విద్య, ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టిపెట్టారు. అప్పటికే నిర్విర్యమైపోయిన ప్రభుత్వ పాఠశాల విద్యపై పలు సంస్కరణలు అమలుచేశారు. అప్పటివరకు బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్నం నీళ్ల సాంబారు, ముద్దయిపోయిన అన్నం పెడుతుండడంతో 40 శాతం మంది పిల్లలు కూడా ఆ భోజనాన్ని తినకపోవడాన్ని గుర్తించారు.
దీంతో ముఖ్యమంత్రే స్వయంగా రోజుకో మెనూ చొప్పున ‘జగనన్న గోరుముద్ద’ను రూపొందించారు. వంటపై మూడంచెల పర్యవేక్షణ ఏర్పాటుచేసి ఉపాధ్యాయులు, విద్యార్థులను భాగస్వాములను చేశారు. రాష్ట్రంలోని 44,190 ప్రభుత్వ పాఠశాలల్లో ఏ రోజు ఏ మెనూ ఎలా ఉందో పరిశీలించేందుకు.. వంటలో నాణ్యతను చూసేందుకు ‘ఏఐ’ టెక్నాలజీ యాప్‌ను రూపొందించి, మండల స్థాయి నుంచి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, ముఖ్య కార్యదర్శి వరకు ఆ వివరాలు తెలిసేలా చర్యలు తీసుకున్నారు.
చదవండి: Food Safety Awareness: మధ్యాహ్న భోజనంతోనే విద్యార్థులు బడి బాట
దీంతో నాలుగేళ్లుగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య 90 శాతానికి పెరిగింది. మిగిలిన 10 శాతం మంది (ముఖ్యంగా బాలికలు) ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి బాక్సులను తెచ్చుకుంటున్నారు.
జగనన్న ‘గోరుముద్ద’తో పరిపూర్ణత..
పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు రాష్ట్రంలోని 44,190 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు.
విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫో ర్టి ఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం పెడుతున్నారు. రోజుకో మెనూ చొప్పున సోమవారం నుంచి శనివారం వరకు 16 రకాల పదార్థాలను గోరుముద్దలో చేర్చారు.
చదవండి: PM-POSHAN: ఏ పథకంగా మధ్యాహ్న భోజన పథకం పేరును మార్పు చేశారు?
ఏ రోజు ఏయే పదార్థాలు పెట్టాలో మెనూలో స్పష్టంగా పేర్కొన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడ్రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి చేశారు.
ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల లేదా విలేజ్ క్లినిక్ నుంచి సిబ్బంది వచ్చి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా రక్తహీనతను తగ్గించేందుకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు.
మధ్యాహ్న భోజనం 100 శాతం తినేలా మార్పులు..
ప్రస్తుతం రాష్ట్రంలోని 36,612 పాఠశాలల్లో విద్యార్థులు 100 శాతం మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. మరో 5,012 పాఠశాలల్లో 95–99 శాతం మంది తింటుండగా, 885 పాఠశాలల్లో 90–95 శాతం మధ్య, 439 పాఠశాలల్లో 85–90 శాతం మధ్య, 353 పాఠశాలల్లో 80–85 శాతం మంది గోరుముద్ద తీసుకుంటున్నారు. 522 పాఠశాలల్లో 50–80 శాతం, 60 పాఠశాలల్లో 30–50 శాతం మధ్య ఉండగా, 236 పాఠశాలల్లో మాత్రమే 30 శాతంలోపు తీసుకుంటున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లోను 100 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకునేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బడికి వచ్చిన ప్రతి విద్యార్థీ బడిలో అందించే మధ్యాహ్న భోజనం తినేలా రుచిగా, వంటలో పిల్లల ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు ఉండేలా చర్యలు చేపట్టారు. అందుకనుగుణంగా తిరుపతిలోని హోటల్ తాజ్ చెఫ్‌లతో వంటలపై రూపొందించిన వీడియోల ద్వారా సిబ్బందికి అవగాహన కల్పిస్తారు.
గోరుముద్ద మెనూ ఇదీ..
- సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటేబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ
- మంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు
- బుధవారం వెజిటేబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ
- గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు
- శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
- శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్