Collector Muzammil Khan: స్కూళ్లలో ‘లంచ్, లర్న్’ కార్యక్రమం అమలు
Sakshi Education
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులకు అందుతున్న బోధన తీరు, పద్ధతులు, భోజన వసతి పరిశీలించేందుకు ఇకనుంచి ప్రతీ బుధవారం లంచ్ అండ్ లర్న్ కార్యక్రమం అమలు చేస్తామని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు.
పట్టణ శివారు రంగంపల్లిలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం లంచ్ అండ్ లర్న్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి క్యూ పద్ధతి పాటించి సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉందని ప్రశంసించారు.
చదవండి: Education News: ఇకపై మధ్యాహ్న భోజనంలో రాగి జావ... ఎప్పటి నుంచి అంటే...
అంతకు ముందు కలెక్టర్ బాలికలతో మాట్లాడి, వారి అభిరుచులు, లక్ష్యం తదితర వివరాలపై ఆరా తీశారు. ఇకనుంచి ప్రతి బుధవారం జిల్లా అధికారులు సందర్శించి ఆహార నాణ్యత, విద్యా ప్రమాణాలపై తనకు నివేదిక సమర్పిస్తారని తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయాలని సూచించారు. చదువుతో పాటు ఆటల్లోనూ పాల్గొనాలని కలెక్టర్ కోరారు.
Published date : 14 Dec 2023 03:14PM