Skip to main content

PM-POSHAN: ఏ పథకంగా మధ్యాహ్న భోజన పథకం పేరును మార్పు చేశారు?

PM-POSHAN

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత మధ్యాహ్న భోజన పథకం పేరును ‘‘నేషనల్‌ స్కీమ్‌ ఫర్‌ పీఎం పోషణ్‌ ఇన్‌ స్కూల్స్‌(ప్రధానమంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ పథకం)’’గా మారుస్తూ మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్‌ 29న సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు సైతం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు.

పీఎం పోషణ్‌ పథకం – ముఖ్యాంశాలు

  • 2021–22 నుంచి 2025–26 వరకూ ఐదేళ్లపాటు పథకాన్ని కొనసాగిస్తారు. ఇందుకు కేంద్రం రూ.54,061.73 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.31,733.17 కోట్ల మేరకు వ్యయాన్ని భరించనున్నాయి.
  • ఆహార ధాన్యాల కోసం కేంద్రం రూ.45 వేల కోట్లు అదనంగా వెచ్చించనుంది.
  • మొత్తంగా ఐదేళ్లలో పీఎం పోషణ్‌ పథకం అమలుకు రూ.1,30,794.90 కోట్లు ఖర్చు చేయనున్నారు.
  • ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడ్‌ పాఠశాలల్లో వండి, నిత్యం ఒకపూట వేడిగా భోజనం అందించే ఈ పథకంతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
  • గతంలో ఈ పథకం పేరు ‘నేషనల్‌ స్కీమ్‌ ఫర్‌ మిడ్‌డే మీల్‌ ఇన్‌ స్కూల్స్‌’గా ఉండగా ఇప్పుడు ‘నేషనల్‌ స్కీమ్‌ ఫర్‌ పీఎం పోషణ్‌ ఇన్‌ స్కూల్స్‌’గా మార్చినట్టు కేంద్రం వెల్లడించింది.
  • 2007 వరకు ఈ పథకం పేరు ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ న్యూట్రిషనల్‌ సపోర్ట్‌ టు ప్రైమరీ ఎడ్యుకేషన్‌’ అని ఉండగా, 2007లో ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ మిడ్‌ డే మీల్‌ ఇన్‌ స్కూల్స్‌’గా మార్చారు.
  • దేశవ్యాప్తంగా 11.20 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల మంది విద్యార్థులకు పీఎం పోషణ్‌ స్కీమ్‌ వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. 
  • స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.24,400 కోట్లు వెచ్చించినట్టు కేంద్రం తెలిపింది.

పిల్లలకు ‘తిథి భోజనం’

  • పీఎం పోషణ్‌ పథకాన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ ప్రీ–ప్రైమరీ లేదా బాల వాటికలకు కూడా వర్తింపజేయాలని కేంద్రం యోచిస్తోంది. 11.80 కోట్ల విద్యార్థులకు ఇది అదనం.
  • తిథి భోజనం కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
  • ప్రత్యేక సందర్భాలు, పండుగల సమయాల్లో ప్రత్యేకమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ఉద్దేశించిన సామాజిక భాగస్వామ్య కార్యక్రమం ఈ తిథి భోజనం.
  • పాఠశాలల్లో న్యూట్రిషన్‌ గార్డెన్స్‌ అభివృద్ధి చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తోటల పెంపకాన్ని విద్యార్థులకు పరిచయం చేయడమే దీని ఉద్దేశం. ఇప్పటికే 3 లక్షల పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.
  • అన్ని జిల్లాల్లో సామాజిక తనిఖీలు తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అనుబంధ పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారు.

చ‌ద‌వండి: కేంద్రం ప్రారంభించనున్న ఆపద మిత్ర కార్యక్రమం ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మధ్యాహ్న భోజన పథకం పేరును ‘నేషనల్‌ స్కీమ్‌ ఫర్‌ పీఎం పోషణ్‌ ఇన్‌ స్కూల్స్‌’గా మార్చేందుకు ఆమోదం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 29
ఎవరు    : కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ)
ఎందుకు : మధ్యాహ్న భోజన పథకానికి కొత్త రూపు తెచ్చి... మరింత మంది చిన్నారులకు పోషకాహారాన్ని అందించేందుకు...
 

Published date : 30 Sep 2021 01:33PM

Photo Stories