School Uniforms: నెల రోజులు గడుస్తున్నా యూనిఫాంను అందించలేదు
దీంతో పాత యూనిఫాంతోనే విద్యార్థులు బడులకు హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అయినా విద్యార్థులకు యూనిఫాం, స్టూడెంట్ కిట్ల అందజేతలో ప్రభుత్వంలో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి.
2019లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని తల్లిదండ్రులు గుర్తుచేసుకుంటున్నారు.
2020–21 విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్లపాటు బడి తెరిచిన రోజే జగనన్న విద్యాకానుక పేరిట యూనిఫాం, పుస్తకాలతో పాటు విద్యా సామగ్రిని అందించారని, కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపడం లేదని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
చదవండి: National Scholarship: జాతీయ స్కాలర్‌షిప్‌నకు విద్యార్థుల ఎంపిక
ఒక్క గుడ్డ ముక్కా ఇవ్వలేదు
అధికారం చేపట్టిన వెంటనే ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం విద్యార్థులను మాత్రం గాలికి ఒదిలేసింది. 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థులకు కనీస సౌకర్యాల కల్పనలో దృష్టి సారించక విఫలమైంది. ఈ ఏడాదిలో జిల్లాలో ఒక్క విద్యార్థికీ ఒక్క గుడ్డ ముక్క కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులు గతేడాది జగన్ ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాంతోనే పాఠశాలలకు వస్తున్నారు.
సాధారణంగా బడిఈడు పిల్లలు అంటే ఏడాది కాలంలో వారి శారీరక పెరుగుదల నమోదవుతూ ఉంటుంది. గతేడాదికి, ఇప్పటికీ విద్యార్థుల ఎత్తు, లావు, బరువుల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. ఆ మేరకు వారు కొత్త యూనిఫాం కుట్టించుకుని పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులంతా చాలీచాలనీ యూనిఫాంతో బడులకు హాజరవుతున్నారు.
చదవండి: DSC 2024: నేటి నుంచే డీఎస్సీ.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంఖ్య, పరీక్షా కేంద్రాలు వివరాలు ఇలా..
బడులు తెరిచి నెల గడిచినా..
2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి నెల రోజులు గడిచింది. గత నెల 13న పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.
అప్పటినుంచి విద్యార్థులు యూనిఫాం కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలు ప్రారంభం కాక ముందే విద్యార్థుల తల్లిదండ్రులకు యూనిఫాం కుట్టించడానికి వస్త్రాలను అందించేవారు. అలాగే కుట్టు చార్జీల కింద ప్రాథమిక స్థాయి విద్యార్థులకు జతకు రూ.40, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.60 చొప్పున చెల్లించేవారు.
అయితే ఈ ఏడాదిలో ఇప్పటివరకూ యూనిఫాంను విద్యార్థులకు అందించలేదు. ఇదిలా ఉండగా యూనిఫాం వస్త్రాలు త్వరలోనే వస్తాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కుట్టు చార్జీలు ఎంత ఇస్తారు అనేదానిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
స్టూడెంట్ కిట్లదీ అదే పరిస్థితి..
ఈ విద్యాసంవత్సరంలో స్టూడెంట్ కిట్లు కూడా విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందలేదు. ముఖ్యంగా 1,36,316 స్కూల్ బ్యాగ్‌లు జిల్లాకు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 19 మండలాలకు సరిపడా 95,988 బ్యాగులు మాత్రమే వచ్చాయి. మరో 11 మండలాలకు కావాల్సిన 40,328 బ్యాగులు రా వాల్సి ఉంది.
అలాగే 28 మండలాలకు చెందిన 1,36,868 విద్యార్థులకు అందాల్సిన బూట్లకు గాను 20 మండలాలకు చెందిన 99,404 మందికి మాత్రమే అందాయి. మరో 8 మండలాలకు చెందిన 37,464 మందికి బూట్లు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి.
వీటితో పాటు 28 మండలాలకు చెందిన 1,36,316 మంది విద్యార్థులకు అందాల్సిన యూనిఫాంలో ఒక్క జత కూడా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో బడి తెరిచిన రోజే..
గత నాలుగేళ్లలో ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు జగనన్న విద్యాకానుకను అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందజేశారు. వాటిలో తప్పని సరిగా మూడు జతల యూనిఫాం ఉండేలా చర్యలు తీసుకున్నారు.
అలా 2020–21లో 1,22,654 మందికి సుమారు రూ.18.77 కోట్ల విలువైన విద్యాకానుకలు అందజేశారు. 2021–22లో 1,39,229 మందికి రూ.21.30 కోట్లు, 2022–23లో 1,87,051 మందికి రూ.37.33 కోట్లు, 2023–24లో 1,55,998 మందికి రూ.38.99 కోట్ల విలువైన విద్యాకానుకలు అందజేశారు.