Telangana Schools: స్కూల్స్ ప్రారంభం.. ఈ సారి ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే..
కొత్త ఆశలు, సరికొత్త ఆలోచనలతో నూతన విద్యా సంవత్సరంలోకి విద్యార్థులు అడుగుపెట్టారు. అందంగా ముస్తాబైన పాఠశాలలు పిల్లలకు స్వాగతం పలికాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు. సెలవులకు స్వస్తి పలికిన విద్యార్థులు పేరెంట్స్‌కు టాటా చెబుతూ స్కూల్‌లో అడుగుపెట్టారు.
వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో..
సుమారు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తవకపోవడం, వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారన్న ప్రచారం జరిగినా.. ఆ ఊహాగానాలకు విద్యాశాఖ తెరదించింది. 13వ తేదీ నుంచే యథావిధిగా పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే
మోడల్ స్కూల్స్‌లో..
రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 26లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. రెసిడెన్షియల్, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్‌లో మరో 2.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇక 10,800 ప్రైవేటు స్కూళ్లలో 32 లక్షల మంది విద్యార్థులున్నారు. మొత్తంగా 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల బాట పట్టనున్నారు. కరోనా ప్రభావం కారణంగా రెండేళ్ల తర్వాత ఈ విద్యా సంవత్సరంలోనే సకాలంలో స్కూళ్లు ప్రారంభమవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపట్టింది.
ఈ సారి ఆంగ్ల మీడియంతో..
ఈ విద్యా సంవత్సరం నుంచే సర్కారీ బడుల్లో 1–8 తరగతులకు ఆంగ్ల బోధన మొదలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు 80 వేల మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిద్ధం చేసింది. వారు ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయనున్నారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ రెండు మాధ్యమాల్లోనూ ఉండేలా సిద్ధం చేశారు. పుస్తకం బరువు పెరగకుండా.. సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 వరకూ ఒక భాగం, ఎస్‌ఏ–2 వరకు మరో భాగంగా విభజించారు. ఇంగ్లిష్ మీడియం నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఈసారి ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
పలు సమస్యలతో..
పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న తరుణంలో ఇప్పటికీ పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కొత్తగా ఇంగ్లిష్ మీడియం కోసం రెండు భాషల్లో ముద్రించిన పుస్తకాలు స్కూళ్లకు సరిపడా చేరలేదు. 2.10 కోట్ల పుస్తకాలు అవసరంకాగా.. ఇప్పటికీ 20 లక్షల పుస్తకాలే ముద్రించినట్టు సమాచారం.
ఎక్కువ ధర కోట్ చేయడంతో..
కాగితం కొరత ఆలస్యానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పుస్తకాలు అందుతాయని అంటున్నా.. మరో నెల వరకూ వచ్చే అవకాశం కన్పించడం లేదు.
➤ ఇక గత ఏడాది సర్కారీ స్కూళ్లలో యూనిఫారాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా ఈ సమస్య కన్పిస్తోంది. 1.5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరంకాగా.. ఇప్పటివరకు 60 లక్షల మీటర్లే కొనుగోలు చేశారు. మిగతాది కొని, కుట్టించి, పంపిణీ చేయాలంటే సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు.
➤ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్యగానే ఉంది. బోధనేతర సిబ్బందీ సరిగా లేరు. 2019–20 విద్యా సంవత్సరంలో 21 వేల మంది విద్యా వలంటీర్ల సేవలు తీసుకున్నారు. కోవిడ్‌తో గత ఏడాది వీరి సేవలు నిలిపివేశారు. మళ్లీ వారిని తీసుకుంటే కొంతవరకు సమస్య తీరుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.
➤ కొద్దిరోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఈ ఏడాది కూడా విద్యా రంగం పరిస్థితి ఏమిటన్న ఆందోళనలూ వెంటాడుతున్నాయి.
సెలవులు పొడగించే ప్రసక్తే లేదు..
తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున పాఠశాలలకు సెలవులకు పొడగింపులు ఉండొచ్చనే కథనాలు జోరందుకున్నాయి. అయితే అలాంటిదేం ఉండబోదని విద్యాశాఖ ఆ వెంటనే స్పష్టత ఇచ్చేసింది. కరోనా కేసుల పరిస్థితి అదుపులోనే ఉన్నందున.. సెలవులు పొడగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కరోనా జాగ్రత్తలతో పాఠశాలలు నడిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.