NCC.. దేశ సేవకు మేము సైతం..! ఎన్‌సీసీ క్యాడెట్ల సర్టిఫికెట్ A, B, C ప్రయోజనాలు ఇవే..
స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాల, కళాశాలల విద్యార్థులకు సైన్యం, నావిక దళం, ఎయిర్‌ఫోర్స్ ట్రై సర్విసెస్‌లో శిక్షణ అందజేయడం కోసం ఏర్పడిన భారత సాయుధ దళాల యువ విభాగం నేషనల్ క్యాడేట్ కార్ప్స్(ఎన్‌సీసీ). మన భారత దేశ సైన్యంలో సిబ్బంది కొరతను భర్తీ చేసే లక్ష్యంతో భారత రక్షణ చట్టం ప్రకారం 1948లో ఎన్‌సీసీ ఏర్పాటైంది.
1949లో బాలికల విభాగం, 1950లో ఎయిర్‌వింగ్, 1952లో నేవీ వింగ్ ఏర్పడ్డాయి. 1962 చైనా– ఇండియా యుద్ధం తర్వాత దేశం అవసరాన్ని తీర్చడానికి 1963లో ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆయుధాల్లో, డ్రిల్ తదితర అంశాల్లో శిక్షణ తప్పనిసరి చేశారు.
చదవండి: Special Shoes : సాయుధ బలగాల సిబ్బందికి ఐఐటీ ప్రత్యేకమైన బూట్లు..
తెలంగాణ, ఏపీ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌లో 9 గ్రూపులు..
1949లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌సీసీ స్థాపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో టివోలీ థియేటర్ సమీపంలో రాష్ట్ర ఏన్‌సీసీ డైరెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. 1962లో ఎయిర్ కమోడోర్‌ను డైరెక్టర్‌గా నియమించారు. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్ కార్యాలయంగా మారింది.
చదవండి: DG of Army Medical Services : ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ..
ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, వరంగల్–4 గ్రూపులు, ఆంధ్రలో గుంటూరు, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం 5 గ్రూపులు ఉన్నాయి. 9 గ్రూపుల్లో జూనియర్, సీనియర్ వింగ్‌లలో లక్షా నలభై వేల మందికి పైగా క్యాడెట్లు ఉన్నారు. ప్రస్తుతం ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఎయిర్ కమోడోర్ వీఎం.రెడ్డి ఉన్నారు.
ఎన్‌సీసీ క్యాడెట్లకు వివిధ అంశాల్లో శిక్షణ..
తొమ్మిది గ్రూపుల పరిధిలోని వివిధ బెటాలియన్లు, పాఠశాల, కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణ శిబిరంలో ఆయుధ శిక్షణ, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్ లేదా బాటిల్ క్రాఫ్ట్, ఫైరింగ్‌తో పాటు క్రమశిక్షణ, యోగా, నాయకత్వ లక్షణాలు, మార్చింగ్ డ్రిల్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ విషయాలపై నిపుణులతో ఉపన్యాసాలు, క్రీడా పోటీలు, వ్యర్థాలను రిసైక్లింగ్ చేసే పద్ధతులు, కెరీర్ కౌన్సిలింగ్‌తో పాటు సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛ భారత్, రక్తదానం, వివిధ అంశాలపై అవగాహన ర్యాలీలు తదితర వాటిల్లో క్యాడెట్లకు తర్ఫీదు అందజేస్తారు.
ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రయోజనాలు..
ఏ-సర్టిఫికెట్ – జూనియర్ వింగ్ లేదా జూనియర్ క్యాడెట్ల విభాగంలో 2 సంవత్సరాల ఎన్‌సీసీ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు ఏ సరి్టఫికెట్ అందజేస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరీక్షలు జరుగుతాయి.
బీ-సర్టిఫికెట్ – పాఠశాల, కళాశాలల తరఫున సీనియర్ వింగ్ లేదా సీనియర్ క్యాడెట్లకు రెండు సంవత్సరాల కోర్సు పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు బి సర్టిఫికెట్ అందజేస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు నిర్వహిస్తారు.
సీ-సర్టిఫికెట్ – ఎన్‌సీసీలో సీనియర్ వింగ్ లేదా సీనియర్ క్యాడెట్ల విభాగంలో మూడు సంవత్సరాల కోర్సు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన క్యాడెట్లకు సీ సర్టిఫికెట్ జారీచేస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో పరీక్షలు నిర్వహిస్తారు. డిఫెన్స్‌లో చేరాలనుకునే అభ్యర్థులకు సీ సరి్టఫికెట్ ఉపయోగపడుతుంది. వీరికి ఆర్మీ వింగ్‌లో 3–15 శాతం, నేవీలో 05–08, ఎయిర్‌వింగ్‌లో 10 శాతం రిజర్వేషన్లు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఇక క్యాడెట్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అకాడమిక్ ఇయర్‌లో క్యాడెట్లకు రూ.6 వేల ఉపకార వేతనం, అత్యుత్తమ క్యాడెట్‌కు రూ.4,500, ద్వితియ అత్యుత్తమ క్యాడెట్లకు రూ.3,500 ప్రోత్సహకాలు అందజేస్తున్నారు.
అవకాశాలు ఉంటాయి..
శిక్షణ పొంది వివిధ ఎన్‌సీసీ కోర్సుల్లో ఉత్తీర్ణులైన ఎన్‌సీసీ క్యాడెట్లకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయోజనాలు అందజేస్తోంది. సీ సరి్టఫికెట్లు సాధించిన క్యాడెట్లకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో రిజర్వేషన్లు ఉంటాయి. ఏ, బీ సరి్టఫికెట్లు పొందిన వారికి ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు ఉంటాయి.
– వి.ఎం.రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్