Education policies: ‘గుర్తింపు’నకు ససేమిరా.. ప్రమాణాలు అరకొర
- రాష్ట్రంలో మౌలిక వసతుల్లేని కాలేజీలే ఎక్కువ ఉన్నత విద్యపై ‘నాక్’ నివేదిక
- సొంత భవనం లేని సంస్థలు 71 %
- 1,976 సంస్థలకుగాను ‘నాక్’ గుర్తింపు ఉన్నది 141 సంస్థలకే
- అందులోనూ మళ్లీ గుర్తింపునకు వెళ్లని కాలేజీలు 81
జాతీయస్థాయిలో నాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో 11 శాతమే ఉండటాన్ని నివేదిక ప్రస్తావించింది. పరిశోధన, మౌలిక వసతుల కల్పనలో ఉన్నత విద్యాసంస్థలు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లోని ఉన్నత విద్య ప్రమాణాలపై నాక్ అధ్యయనం చేసింది. ఇందులోభాగంగా తెలంగాణలో జరిపిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను ఇటీవల బెంగుళూరులో విడుదల చేసింది.
Colleges: ప్రమాణాలు లేని కాలేజీలపై కఠిన చర్యలు
రాష్ట్రంలో మొత్తం 1,976 ఉన్నత విద్యా సంస్థలుంటే, ఇందులో 141 మాత్రమే నాక్ గుర్తింపు పొందాయి. వీటిల్లో 35 ప్రభుత్వ, 19 గ్రాంట్–ఇన్–ఎయిడ్, 87 ప్రైవేటు సెల్ఫ్ ఫైనాన్స్ సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 విశ్వవిద్యాలయాల్లో పదింటికే నాక్ గుర్తింపు ఉంది. ప్రభుత్వంలోని శాతవాహన, జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, అంబేడర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఇప్పటి వరకూ నాక్ గుర్తింపు లేదు. నాక్ గుర్తింపు ఉన్న 141 కాలేజీల్లో 81 కాలేజీలు తిరిగి గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. పట్టణ ప్రాంతాల్లోని 72 కాలేజీలకు, సెమీ అర్బన్‌లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 సంస్థలకు గుర్తింపు ఉంది.
వెనుకబాటుకు కారణాలేంటి?
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సింహభాగం గ్రామీణ నేపథ్యంలోనే ఉన్నాయి. నాక్ గుర్తింపు పొందాలంటే నాణ్యత ప్రమాణాలు పెంచాలి. దీనికి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అరకొర ఆదాయం వచ్చే ఈ కాలేజీలు ఈ దిశగా ముందుకెళ్లడం లేదు. నాక్ గుర్తింపు కోసం కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా ఇష్టపడటం లేదు. పట్టణ ప్రాంతాల్లో బడ్జెట్ కాలేజీలు కూడా ఆదాయం పెద్దగా ఉండటం లేదని నాక్ ప్రమాణాల వైపు చూడటం లేదు. రాష్ట్రంలోని 71 శాతం ఉన్నత విద్యాసంస్థలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవని నివేదిక పేర్కొంది. వీటిల్లో 36 శాతం కాలేజీల్లో కనీస వసతులు కూడా లేవంది. బోధనా సిబ్బంది విషయంలోనూ ఏమాత్రం నాణ్యత పాటించని కాలేజీలు ఎక్కువగా ఉన్నట్టు తేటతెల్లమైంది. మంచి ప్రమాణాలున్న అధ్యాపకులను నియమిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాలని, అప్పుడు విద్యార్థుల ఫీజులు పెరుగుతాయని కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి.
సరికొత్త ఆవిష్కరణలు చేపట్టాలని విద్యార్థులకు గవర్నర్ సూచన
నాక్ గుర్తింపు ఎందుకు?
వివిధ రంగాల్లోని ప్రముఖులతో నాక్ ఏర్పడింది. జాతీయస్థాయిలో విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు ఇది తోడ్పడుతుంది. ప్రధానంగా ఏడు అంశాలను నాక్ గుర్తింపు ప్రామాణికంగా తీసుకుంటుంది. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, అమలు; విద్యాబోధన స్థాయి; పరిశోధన దిశగా పురోగతి; మౌలిక సదుపాయాలు; విద్యార్థి పురోగతి; ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత; అత్యుత్తమైన ప్రమాణాల అమలు అనే అంశాలను నాక్ పరిశీలిస్తుంది. వీటి ఆధారంగా మార్కులు, గ్రేడ్లు ఇస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటకతో పోలిస్తే తెలంగాణ ఈ విషయంలో వెనుకబడే ఉందని నాక్ నివేదిక స్పష్టం చేస్తోంది. ‘ఎ’గ్రేడ్‌లో కేవలం 11 సంస్థలుంటే.. ‘బి’గ్రేడ్‌లో 71 సంస్థలు, మిగతావి ‘సి’గ్రేడ్‌లో ఉన్నాయి. నాక్ గుర్తింపు పొందిన సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని నిధులు కూడా అందుతాయి.
గుర్తింపు కోసం వస్తే రూ.లక్ష నజరానా
తగిన ప్రమాణాలు పాటించి నాక్ గుర్తింపు కోసం విద్యా సంస్థలు పోటీపడేలా ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. నాక్ గుర్తింపు కోసం అర్హతలతో వస్తే రూ.లక్ష నజరానా ఇవ్వాలని నిర్ణయించాం. గ్రామీణ ప్రాంతాల్లోనే డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల మౌలిక సదుపాయాల మెరుగు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది విద్యార్థులతో నడిపే కాలేజీల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది.
– ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
చదవండి: ఎడ్యుకేషన్ న్యూస్