Education Hub: మానుకోట ఎడ్యుకేషన్ హబ్‌గా మారనుంది
అయితే ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత లేనివారు చదువు మధ్యలో మానేసి వచ్చిన పనులు చేసుకునేవారు. అయితే పరిస్థితులు మారాయి. అధునాతన హంగులతో కలెక్టరేట్, ప్రభుత్వ మెడికల్‌కాలేజీ, నర్సింగ్, ఇంజనీరింగ్, ఉద్యాన కళాశాలలు, కేజీ టు పీజీ వరకు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలతో మానుకోట ఎడ్యుకేషన్ హబ్‌గా మారనుంది. పేద పిల్లలకు ఉన్నతవిద్య అందనుంది.
చదవండి: పాఠశాలకు ‘డిజిటల్ సామగ్రి’ అందజేత
అందుబాటులో ఉన్నత విద్య..
జిల్లాలో ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. గత సంవత్సరం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభమైంది. దీంతో అనుబంధ నర్సింగ్ కళాశాల కూడా వచ్చింది. వీటి ద్వారా 100 పడకలుగా ఉన్న ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిగా రూపుదిద్దుకుంది. ఇందులో 330 పడకలతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
దీంతో గతేడాది నుంచి 150 మంది వైద్య విద్యార్థులు, 60 మంది నర్సింగ్ విద్యార్థులు చదువుతున్నారు. మరో రెండు నెలల్లో రెండో బ్యాచ్ ప్రారంభం కానుంది. అదేవిధంగా సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేశారు. భూసేకరణ పూర్తికాగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ఏడాది ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించలేదు.
వచ్చే ఏడాది తరగతులు ప్రారంభించనున్నారు. అలాగే ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిన ఉద్యానవన కళాశాలలో ఏటా 60 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోనున్నారు. అలాగే జిల్లాలో గిరిజన మహిళా గురుకుల ఆశ్రమ పాఠశాల ఏర్పాటుకు రూ. 23కోట్లు మంజూరయ్యాయి.
దీంతో కేజీ టు పీజీ వరకు గిరిజన బిడ్డలు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మహాత్మాజ్యోతిరావు పూలే, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏకలవ్య మొత్తం 33 గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో 1,4040 మంది విద్యార్థులు చదువుతున్నారు.