AP CM YS Jagan: 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక.. ఇంకా ఉచితంగా..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవుని దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నాం. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలి. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుంది. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి.
బైజూస్ యాప్‌ను పేద పిల్లలకు..
పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. బైజూస్ యాప్‌ను పేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యార్థుల కోసం బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కూడా అందజేస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చాం. పిల్లల భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం మాది. విద్యాసంత్సరం ఆరంభంలోనే విద్యాకానుక అందిస్తున్నాం. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. ఒక్కో కిట్ విలువ రూ.2వేలు అని సీఎం జగన్ అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఉండాలని..
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడతూ.. వరుసగా మూడో విడత విద్యాకానుకను అందిస్తున్నాం. 47 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యాకానుకను ఇస్తున్నాం. విద్యాకానుక కోసం ఈ ఏడాది రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నేడు ఇచ్చే విద్యాకానుకతో కలిపి ఇప్పటివరకూ మొత్తంగా రూ.2,368 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేశాం. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఉండాలని సీఎం చెప్పారు. ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లు. అక్టోబర్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తామని మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు.
విద్యపై వ్యయం భవిష్యత్తుకు..
విద్యపై పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి అనే మహోన్నత ఆశయంతో సీఎం జగన్ ఏటా విద్యారంగానికి బడ్జెట్‌లో రూ.వేల కోట్లు కేటాయిస్తున్నారు. విద్యార్థుల అభ్యసనానికి అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందులో భాగంగా.. జగనన్న విద్యాకానుక కింద బడులు తెరిచిన తొలిరోజే ప్రతి విద్యార్థికీ ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ (కుట్టుకూలితో సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగ్యువల్ (తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉండే) పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందిస్తుంది. గతంలో అందుకోని వారు, ప్రస్తుతం కొత్తగా చేరిన వారికి మాత్రమే ఈ డిక్షనరీలను ఇస్తారు. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు కిట్లను అందజేస్తారు.
మూడేళ్లలో జేవీకే కింద రూ.2,368.33 కోట్లు వ్యయం
జగనన్న విద్యాకానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రూ.931.02 కోట్లు వెచ్చిస్తోంది. ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.రెండువేలు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు తెలిసినవే. వీటన్నింటి ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు ఏటా పెరుగుతున్నాయి.
పలుచోట్ల ‘సీట్లు లేవు’ అన్న బోర్డులు..
పలుచోట్ల ‘సీట్లు లేవు’ అన్న బోర్డులు పెట్టే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. నిజానికి.. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫార్మ్‌ల సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసేలేదు. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ సీఎం జగన్ పాఠశాలలు తెరిచిన రోజు నుండే జగనన్న విద్యా కానుక కిట్ అందిస్తున్నారు.
నాణ్యతలో రాజీ లేకుండా..
వస్తువుల నాణ్యతలో రాజీ లేకుండా బ్రాండెడ్ వస్తువులనే పంపిణీ చేయించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయా వస్తువులను, నాణ్యతను ముందుగా తాను స్వయంగా పరిశీలిస్తున్నారు. తొలి రెండేళ్లలో బాలురు, బాలికలకు వేర్వేరు స్కూలు బ్యాగులను పంపిణీ చేయించారు. కానీ, ఈసారి అందరికీ ఒకేరకమైన బ్యాగులను అందిస్తున్నారు. అంతేకాక.. జనరల్ నాలెడ్జిని పెంపొందించేలా ఉండే కవర్ పేజీలతో నోట్‌బుక్స్‌ను అందిస్తున్నారు. యూనిఫారం నాణ్యత విషయంలోనూ రాజీపడకుండా అందిస్తోంది.
ఏవైనా సందేహాలుంటే..
ఈ విద్యాకానుక వస్తువుల పంపిణీలో ఏవైనా సందేహాలుంటే 9908696785 నెంబర్‌కు పనివేళల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే, cmo.apsamagrashiksha@gmail.com లేదా spdapssapeshi@gmail.comకు తెలియచేయాలన్నారు. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలనూ జారీచేశారు.
ప్రతి సంవత్సరం..
ప్రతీ విద్యార్ధికీ దాదాపు రూ. 2,000 విలువైన జగనన్న విద్యా కానుక ద్వారా అందనున్నాయి. 2020 –21 విద్యా సంవత్సరంలో 42,34,322 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం రూ. 648.10 కోట్లు. 2021 –22 విద్యా సంవత్సరంలో 45,71,051 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం రూ. 789.21 కోట్లు. 2022 –23 విద్యా సంవత్సరంలో 47,40,421 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందనున్నారు. దానికి అయిన వ్యయం రూ. 931.02 కోట్లు. ఇదంతా కలిపి ఇప్పటివరకు చేసిన మొత్తం వ్యయం 2,368.33 కోట్లు.
వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక చర్యల వల్ల 2018–19 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్ధుల సంఖ్య 7 లక్షలుకు పైగా పెరిగి 2021–22 నాటికి 44.30 లక్షలకు చేరింది. అదే సమయంలో ప్రభుత్వ, ప్రేవేట్ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరిగి 72.47 లక్షలకు చేరింది.
కట్టుబాట్ల నుంచి స్వేచ్ఛలోకి..
బాలికల డ్రాపౌట్ రేట్‌ను తగ్గించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మందికి పైగా విద్యార్ధినులకు స్వేచ్ఛ ద్వారా ఏటా రూ. 32 కోట్ల వ్యయంతో నెలకు 10 చొప్పున ఏడాదికి 120 నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ న్యాప్‌కిన్లు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. మన బడి నాడు – నేడు ద్వారా విద్యాసంస్ధల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం కూడా చేపట్టిన ప్రభుత్వం.
లంచాలకు తావులేకుండా..
అర్హులందరికీ క్రమం తప్పకుండా కుల, మత, పార్టీ వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళుతున్నది.
విద్యారంగంలో ప్రభుత్వం 36 నెలల్లో చేసిన వ్యయం వివరాలు ఇలా..
➤ జగనన్న అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య 44,48,865 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 19,617.53 కోట్లు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకమే లేదు.
➤ జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల సంఖ్య 21,55,298 లక్షలు, జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల సంఖ్య 18,77,863 లక్షలకు గాను, రెండింటికీ కలిపి అందించిన మొత్తం రూ. 11,007.17 కోట్లు. గత ప్రభుత్వంలో ఇచ్చినవే అరకొర ఫీజులు, అవీ ఏళ్ళ తరబడి పెండింగ్‌లు, గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు రూ. 1,778 కోట్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది.
➤ జగనన్న విద్యా కానుక లబ్ధిదారుల సంఖ్య 47,40,421 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 2,368.33 కోట్లు. గత ప్రభుత్వంలో స్కూల్స్ తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫార్మ్‌ల సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్ధితి, ఇక ఇతర వస్తువుల ఊసేలేదు.
➤ జగనన్న గోరుముద్ద లబ్ధిదారుల సంఖ్య 43,26,782 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 3,087.50 కోట్లు. గతంలో నాసిరకం ఆహారం, ఉడికీ ఉడకని అన్నం, రుచీపచీ లేని కూరలు, ఆయాల జీతాలు సైతం 8–9 నెలలు పెండింగ్‌లోనే ఉన్నాయి.
➤ పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశలో 15,715 స్కూళ్ళకి అందించిన మొత్తం రూ. 3,669.00 కోట్లు, రెండోదశలో 22,344 స్కూళ్ళకి అందించిన మొత్తం రూ. 8,000.00 కోట్లు. మూడు దశల్లో రూ. 16,450 కోట్ల వ్యయంతో మొత్తం 56,572 స్కూల్స్‌లో అభివృద్ది పనులు. గతంలో శిధిలావస్ధలో బడులు, సౌకర్యాల లేమి.
➤ వైఎస్సార్ సంపూర్ణ పోషణ లబ్ధిదారుల సంఖ్య 34,19,875 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 4,895.45 కోట్లు. గతంలో నామమాత్రంగా పౌష్టికాహారం, అదీ కొందరికే పరిమితం
➤ స్వేచ్ఛ (శానిటరీ న్యాప్‌కిన్స్) లబ్ధిదారుల సంఖ్య 10.01,860 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 32 కోట్లు. గత ప్రభుత్వంలో లేదు.