Skip to main content

Degree: నైపుణ్యాలు పెంచేలా ఆనర్స్ డిగ్రీ.. ప్రవేశాల షెడ్యూల్‌ ఇలా..

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడంతో పాటు సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధించేలా, పోటీతత్వాన్ని తట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ కోర్సులను 2023–24 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది.
Degree
నైపుణ్యాలు పెంచేలా ఆనర్స్ డిగ్రీ

ఆనర్స్‌ డిగ్రీ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విద్యా నిపుణులు అంటున్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రవేశాల నోటిఫికేషన్‌ కూడా విడుదలయ్యింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని 91 డిగ్రీ కళాశాలల్లో ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నారు.

చదవండి: ఐటీ, సైబర్‌ సెక్యూరిటీలపై యువతకు సీటీఈ శిక్షణ

సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహనకు..

జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా డిగ్రీ ఆనర్స్‌ కోర్సుల్లో మార్పులు తీసుకువచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోంది. ప్రధానంగా డిగ్రీ ఆనర్స్‌ కోర్సులో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న ఒక సబ్జెక్టును ప్రధాన సబ్జెక్టుగా ఎంపిక చేసుకుని నాలుగేళ్లపాటు చదవవచ్చు. దీని ద్వారా సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన పెరుగుతుంది.

చదవండి: ANGRAU: ఎన్‌ఆర్‌ఐ కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులకు ఆహ్వానం

అలాగే మరో మైనర్‌ సబ్జెక్టు, రెండు లాంగ్వేజ్‌ పేపర్లు కూడా చదవాలి. సమగ్ర విషయ పరిజ్ఞానం కోసం ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సు, మల్టీ డిసిప్లినరీ కోర్సులు కూడా ఉంటాయి. ఉదాహరణకు.. ఇంటర్‌లో బైపీసీ చదివిన విద్యార్థి డిగ్రీ బీఎస్సీ ఆనర్స్‌లో జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఫిషరీస్‌ సబ్జెక్టుల్లో ఒక దానిని మేజర్‌ సబ్జెక్టుగా, జియాలజీ, పాలిటిక్స్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌ వంటి ఆర్ట్స్‌ గ్రూపుల్లోని సబ్జెక్టులను కూడా మైనర్‌ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్‌లో ఎంపీసీ చదివిన విద్యార్థి డిగ్రీ ఆనర్స్‌లో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్స్‌, స్టాటిస్టిక్స్‌, జియాలజీల్లో ఒక దానిని మేజర్‌ సబ్జెక్టుగా ఎంచుకుని మైనర్‌ సబ్జెక్టుగా డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, యానిమేషన్స్‌ తదితర సబ్జెక్టుల్లో ఒక దానిని అభ్యసించవచ్చు.

చదవండి: School Education Department: ఉపాధ్యాయుల పదోన్నతులకు ఉత్తర్వులు

ఏ సంవత్సరంలో మానేసినా సర్టిఫికెట్‌

గతంలో విద్యార్థి డిగ్రీ చదువు మధ్యలో ఆపి వేస్తే అతడికి ఎటువంటి సర్టిఫికెట్‌ కూడా వచ్చేది కాదు. అయితే నూతన విధానంలో విద్యార్థి అనివార్య కారణాల వల్ల ఏ సంవత్సరంలో అయినా చదువు మానేసినా సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌లో చేరి మొదటి ఏడాదిలో సబ్జెక్టులన్నీ పూర్తి చేసి చదువు మానివేస్తే అండర్‌ గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌, ద్వితీయ సంవత్సరంలో చదువు మానివేస్తే అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లమా సర్టిఫికెట్‌, తృతీయ సంవత్సరంలో మానివేస్తే అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ ఇస్తారు. నాలుగేళ్లు పూర్తిచేసిన వారికి డిగ్రీ మేజర్‌ సర్టిఫికెట్‌ ఆనర్స్‌ పట్టా అందిస్తారు.

ఉమ్మడి జిల్లాలో..

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు 51 ఉన్నాయి. గత విద్యా సంవత్సరంలో 12,050 మంది బీఏ, 9,856 మంది బీకాం, 27,131 మంది బీఎస్సీ కోర్సులు పూర్తిచేశారు. ఏలూరు జిల్లాలో 40 డిగ్రీ కళాశాలలు ఉండగా గతేడాది 1,119 మంది బీఏ, 3,687 మంది బీకాం, 7,659 మంది బీఎస్సీ కోర్సులు చేశారు.

ప్రవేశాల షెడ్యూల్‌ ఇలా..

  • డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును వచ్చేనెల 5వ తేదీ వరకు పెంచారు.
  • విద్యార్థులు ఏపీఎస్‌సీహెచ్‌ఈ.జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి లేదా తమ దగ్గరలోని డిగ్రీ కళాశాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
  • జూలై 7 నుంచి 12వ తేదీ వరకూ వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవాలి.
  • జూలై 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
  • సాధారణ డిగ్రీ కోర్సులకు రూ.3 వేల వరకూ, కంప్యూటర్‌ కోర్సులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ ఫీజు ఉంటుంది.
  • అర్హులైన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సాయం అందిస్తుంది.

చదివిన గంటలను క్రెడిట్లుగా..

విద్యార్థులు మేజర్‌ సబ్జెక్టుకు సంబంధించి 21 పేపర్లు, మైనర్‌ సబ్జెక్టుకు సంబంధించి 6 పేపర్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంలో విద్యార్థి కళాశాలలో చదివిన గంటలను క్రెడిట్‌లుగా పరిగణిస్తారు. విద్యార్థి మొదటి సంవత్సరం తర్వాత కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టు, ద్వితీయ సంవత్సరం తర్వాత షార్ట్‌టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌ అనంతరం సెమిస్టర్‌ ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది.

– కేఏ రామరాజు, ప్రిన్సిపాల్‌, సీఆర్‌ఆర్‌ అటానమస్‌ కళాశాల, ఏలూరు

ప్రయోజనాలెన్నో..

డిగ్రీ నూతన ఆనర్స్‌ విధానంలో చదివే విద్యార్థులకు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీంతోపాటు ఆనర్స్‌ విత్‌ రీసెర్చ్‌ చేస్తే పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేయకుండా నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సు చేసిన విద్యార్థి పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదువును ఏడాదిలోనే పూర్తి చేయవచ్చు. డిగ్రీ కోర్సును మధ్యలో ఆపివేసినా పూర్తిచేసిన విద్యకు సంబంధించి సర్టిఫికెట్‌ ఇస్తారు.

– ప్రొఫెసర్‌ కేఎస్‌ రమేష్‌, డీన్‌, కాలేజ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, ఆదికవి నన్నయ యూనివర్సిటీ

Published date : 29 Jun 2023 05:22PM

Photo Stories