Skip to main content

AP: బడిలో బుక్స్‌ రెడీ.. అక్షర యజ్ఞానికి అంతా సిద్ధం!

First Day Books For Government School Students
  • మొదటి సెమిస్టర్‌కు 3,54,61,730 టెక్ట్స్‌ బుక్స్, వర్క్‌ బుక్స్‌ సిద్ధం  
  • సరిహద్దు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఉర్దూ, కన్నడ, తమిళ, ఒడియాలోనూ ముద్రణ  

జీకే వీధి, కోటనందూరు నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి:  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తొలిరోజే పుస్తకాలను అందచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల కోసం సుమారుగా ఆరు కోట్ల పుస్తకాలను సిద్ధం చేసి స్టాక్‌ పాయింట్లకు చేర్చడం గమనార్హం. విద్యార్థుల సంఖ్య, కొత్త చేరికలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు బ్యాగులు,  యూనిఫారం, బూట్లు, సాక్సులతో కూడిన ‘జేవీకే’ కిట్లను పాఠశాలలకు రవాణా ఖర్చులు చెల్లించి మరీ చేరవేస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు జగనన్న విద్యా కానుక కిట్లలోని వస్తువుల నాణ్యతను విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. స్టాక్‌ పాయింట్ల వద్ద నాణ్యతను క్షుణ్నంగా పరిశీలించాకే తీసుకుంటున్నారు. ఎక్కడైనా లోపాలున్నట్లు గుర్తిస్తే తిప్పి పంపించి నాణ్యతతో కూడినవి తెప్పిస్తున్నారు. జిల్లా, మండల స్థాయి స్టాక్‌ పాయింట్లకు చేరిన కిట్ల నాణ్యతను ర్యాండమ్‌గా పరిశీలించాలని విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులను  ఆదేశించారు.
  
రెండో సెమిస్టర్‌కు సైతం.. 
రాష్ట్రవ్యాప్తంగా 2023–24 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు అవసరమైన 3,54,61,730 పాఠ్య పుస్తకాలు, వర్కు బుక్స్‌తోపాటు 2,32,46,064 నోటు పుస్తకాలను మండల స్టాక్‌ పాయింట్లకు చేర్చారు. జూన్‌ 11 నాటికి వంద శాతం పాఠశాలలకు చేరవేసేలా చర్యలు చేపట్టారు. పుస్తకాల ప్రింటింగ్‌కు నాణ్యమైన పేపర్‌ను తమిళనాడు న్యూస్‌ పేపర్‌ ప్రింటర్స్‌ నుంచి కొనుగోలు చేశారు.

చదవండి: ‘బీ’టెక్‌ బేరం షురూ!

ఇక ఈ ఏడాది నవంబర్‌ నుంచి ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్‌ కోసం సైతం ఇప్పటి నుంచే పుస్తకాల ముద్రణ చేపట్టారు. రెండో సెమిస్టర్‌కి సంబంధించి 1,06,82,403 పుస్తకాలను జూలై చివరి నాటికి విద్యార్థులకు అందించేలా  అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు  ద్విభాషా పాఠ్య పుస్తకాలు (బైలింగ్యువల్‌) ముద్రిస్తుండగా రాష్ట్ర సరిహద్దుల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఈ ఏడాది ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా భాషల్లోను పాఠ్యపుస్తకాలను ముద్రించారు. మొత్తం 425 టైటిల్స్‌తో అత్యధిక సంఖ్యలో పుస్తకాలను తేవడం  గమనార్హం.

తొమ్మిదో తరగతిలో ఎన్సీఈఆర్టీ.. 
జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యలో ఎన్సీఈఆర్టీ కరిక్యులమ్‌ను సైతం ప్రవేశపెట్టింది. 2023–24 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో పూర్తిస్థాయిలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో అన్ని సబ్జెక్టుల పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. దీంతో పాటు ఆరు, ఏడు తరగతుల్లో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్‌ సబ్జెక్టులను, ఎనిమిదో తరగతిలో ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ సబ్జెక్టులను ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు అనువుగా మార్చారు. ఈసారి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకూ వర్క్‌ బుక్స్‌ అందించనున్నారు.

చదవండి: TS: పాఠశాలకు చేరని ‘పాఠాలు’!

ఐదు శాతం అదనంగా.. 
జూన్‌ 12వ తేదీన 39,95,992 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేపట్టనున్నారు. ఐదు శాతం అదనంగా అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కిట్లలో 34,93,765 బ్యాగులు (88 శాతం) ఇప్పటికే స్టాక్‌ పాయింట్లకు చేరుకోగా మిగిలినవి రవాణాలో ఉన్నాయి. బూట్లు, సాక్సులు కలిపి 36,26,732 యూనిట్లు (92 శాతం), యూనిఫామ్స్‌ వంద శాతం, నోటు పుస్తకాలు 83 శాతం, బెల్టులు 92 శాతం, డిక్షనరీలు నూరు శాతం స్టాక్‌ పాయింట్లకు చేరడంతో పాటు అక్కడి నుంచి అన్ని స్కూళ్లకు చేరాయి.

Published date : 10 Jun 2023 05:57PM

Photo Stories