Online Complaints: ఆన్‌లైన్‌లోనే విద్యాశాఖ ఫిర్యాదులు
బోధన, బోధనేతర విభాగాల నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం సంబంధిత అధికారులతో సమావేశమై వివరాలను వెల్లడించారు.
ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో ప్రాథమిక వివరాల సేకరణ, ప్రత్యేక యాప్‌లో పొందుపరిచే ప్రక్రియను సిద్ధం చేసుకోవాలని డీఈవోలను ఆదేశించారు. దీంతో జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రక్రియను డీఈవో ప్రారంభించారు. ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఎంఈవోలు, విద్యాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 25 తర్వాత యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
చదవండి: యువత ఉజ్వల కెరీర్‌కు వేదికగా...ట్రేడింగ్
అందరికీ అందుబాటులో..
ఫిర్యాదుల స్వీకరణ కోసం రూపొందించనున్న ప్రత్యేక యాప్ జిల్లా విద్యాశాఖ పరిధిలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానుంది. బోధన, బోధనేత ర సిబ్బంది ఫిర్యా దు ఏదైనా యాప్ లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారు తన ఫోన్ నంబర్, ప్రాంతం, సమస్యకు సంబంధించిన వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయగానే, ఆ ఫిర్యాదు సంబంధిత అధికారి వద్దకు వెళ్తుంది. నిర్దేశించిన సమయంలో దానికి అధికారులు సమాధానం ఇస్తారు. ఫిర్యాదుదారు సెల్‌ఫోన్‌కు సమాచారం అందుతుంది.
కార్యాలయాల చుట్టూ తిరుగకుండా, అధికారులను, హెడ్మాస్టర్లను కలిసే పని లేకుండా ఉన్న చోటు నుంచే తమ సమస్యపై విద్యాశాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేసే అవకాశం ఏర్పడతుంది. విద్యాబోధన, మౌలిక సదుపాయాల కల్పన, టీచర్ల గైరాజరు, మధ్యాహ్న భోజనం, పాఠశాలల భవనాల స్థితిగతుల తదితర సమస్యలపై ప్రత్యేక యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. జిల్లా వ్యాప్తంగా డివిజన్ల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది.