Skip to main content

Education Hub: ఎడ్యుకేషన్‌ హబ్‌గా డిచ్‌పల్లి

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌) : డిచ్‌పల్లి మండలంలో తెలంగాణ యూనివర్సిటీ, ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ ఉన్నాయని, ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ ఏర్పాటుతో డిచ్‌పల్లి ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుతుందని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు.
Education Hub
ఎడ్యుకేషన్‌ హబ్‌గా డిచ్‌పల్లి

డిచ్‌పల్లి మండలానికి మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం సీఎంసీ ప్రాపర్టీ బోర్డు ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆగ‌స్టు 17న‌ సీఎంసీ ఆవరణలోని భవనాలను పరిశీలించారు. చివరకు బాలికల హాస్టల్‌ భవనాన్ని ఎంపిక చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్య నభ్యసించేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల మంజూరుతో ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఇదే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభిస్తారని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో ని ఇతర డిగ్రీ కళాశాలల్లో లేని జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు డిచ్‌పల్లి డిగ్రీ కళాశాలలో ప్రవేశ పెట్టబోతున్నామన్నారు. విద్యార్థుల డిగ్రీ చదువు పూర్తయిన వెంటనే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా నూతన కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ రిక్క లింబాద్రిని సంప్రదించగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

చదవండి: Motukuri Chandralekha: పేద విద్యార్థులకు ఆదర్శం చంద్రలేఖ

44వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సీఎంసీ ఆవరణలో డిగ్రీ కళాశాల ఏర్పాటు వల్ల విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా డిగ్రీ కళాశాల ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అడిగిన వెంటనే డిచ్‌పల్లికి డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌ కు, కళాశాల కోసం భవనాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన సీఎంసీ యాజమాన్యానికి, బోర్డు సభ్యులకు రూరల్‌ ప్రజలు, విద్యార్థుల తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఎంపిక చేసిన భవనం మరమ్మత్తు పనులకు అవసరమైన నిధుల మంజూరు కోసం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతును కలిసి మాట్లాడుతానన్నారు. మరమ్మతులకు ఎంత ఖర్చవుతుందో ఎస్టిమేషన్‌ తయారు చేయాలని సంబంధిత ఇంజనీర్‌ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సీఎంసీ ప్రాపర్టీబోర్డు సభ్యులు శ్యాంసన్‌, చర్చి ఫాదర్‌ ఏసు కుమార్‌ స్టీఫెన్‌, దినకర్‌, ప్రమోద్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్‌ గజవాడ జైపాల్‌, నాయకులు నారాయణరెడ్డి, కృష్ణ, మోహన్‌రెడ్డి, సాయిలు, అమీర్‌, పద్మారావు, విఠల్‌, అంబర్‌సింగ్‌, నడిపన్న, అంజయ్య, యూసుప్‌, నవీన్‌, సుదాం, విజయ్‌, కార్యకర్తలు తదితరులున్నారు.
 

Published date : 18 Aug 2023 04:54PM

Photo Stories