Medical Faculty: వైద్య అధ్యాపకుల బదిలీల్లో వివక్ష
బదిలీలకు విధించిన షరతులపై అధ్యాపకులు మండిపడుతున్నారు. బదిలీల కౌన్సెలింగ్ సందర్భంగా ఉస్మానియా, గాంధీ, కాకతీయ (వరంగల్), నిజామాబాద్ వైద్య కళాశాలల్లోని ఖాళీలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రదర్శించకూడదన్న వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అధ్యాపకులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు, ఆ శాఖ కార్యదర్శి రిజ్వీకి మే 5న లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలల్లోని ఖాళీలను మాత్రమే బదిలీల ద్వారా భర్తీ చేస్తారు.
చదవండి: NMC: వైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్.. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఇన్ని కళాశాలలు
ఒకవేళ బదిలీ కోసం పెట్టుకున్న దరఖాస్తులు 17 కాలేజీల్లోని ఖాళీల కన్నా ఎక్కువగా ఉంటే...నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్నగర్, ఆదిలాబాద్ రిమ్స్ ఖాళీల్లో భర్తీ చేస్తారు. అంతేగానీ ఉస్మానియా, గాంధీ, కాకతీయ, నిజామాబాద్ మెడికల్ కాలేజీల్లో భర్తీ చేయబోమని చెప్పడాన్ని నిరసిస్తున్నారు. ఆయా 4 కాలేజీల్లోని వారిని ఎక్కడికీ బదిలీ చేయరా అని నిలదీశారు. ఇతర కాలేజీల్లో ఏళ్ల తరబడి పనిచేసినా ఇక్కడకు వచ్చే పరిస్థితి లేదని, ఇది తమ పట్ల చూపుతున్న వివక్షని విమర్శించారు. కాబట్టి తమకు న్యాయం జరిగేలా బదిలీ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని కోరారు.
చదవండి: Medical and Health Department: ఈ పోస్టులకూ ఆన్‌లైన్ పరీక్ష.. పరీక్ష సిలబస్ ఇదే..