Degree: డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల నిలుపుదలకు నిరాకరణ
ఆన్ లైన్ ప్రవేశాలను యథాతథంగా కొనసాగించుకోవచ్చని ఉన్నత విద్యా శాఖకు స్పష్టం చేసింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల ప్రవేశాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చి చెప్పింది. ఆన్ లైన్ ప్రవేశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. డిగ్రీ కాలేజీల్లో ఆన్ లైన్ ప్రవేశాలను సవాల్ చేస్తూ బురదగుంట మేరీకీర్తన, దారా ప్రసాదరావు అనేవారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు సెప్టెంబర్ 29న మరోసారి విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాదీ ఆన్ లైన్ ద్వారానే ప్రవేశాలు చేపట్టామని చెప్పారు. పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు వెయిటేజీ ఇచ్చారని తెలిపారు. ఆన్ లైన్ ప్రవేశాలు నిబంధనలకు అనుగుణంగానే చేపడుతున్నామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ, ఆన్ లైన్ ప్రవేశాలను యథాతథంగా చేపట్టుకోవచ్చంటూ ఉత్తర్వులిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 25కి వాయిదా వేశారు.
చదవండి:
New Degree Courses : మారుతి నుంచి కొత్తగా డిగ్రీ కోర్సు..టాటా సహకారంతో పాటు ఉద్యోగాలు కూడా..