Skip to main content

AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూ­ర్తుల పోస్టులకు న్యాయాధికారులు (జిల్లా జడ్జిలు) కోటా నుంచి ఇద్దరు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయ­మూర్తులు జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్మానం చేసింది.
SC Collegium Approves Appointment Of 2 Judicial Officers For Andhra Pradesh High Court

జుడిషి­యల్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ)గా బాధ్యతలు నిర్వర్తి­స్తున్న డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావును హైకోర్టు న్యాయమూ­ర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

ఈ ఇద్దరి నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత అవి ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తరువాత వీరి నియామకాన్ని కేంద్ర న్యాయ శాఖ నోటిఫై చేస్తుంది. ఈ ఇద్దరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంటుంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పోస్టులకు హైకోర్టు కొలీజియం త్వరలోనే కొందరి పేర్లను సిఫారసు చేయనుంది.

అవధానం హరిహరనాథ శర్మ..
కర్నూలుకి చెందిన అవధానం హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్‌ 16న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, రామచంద్రయ్య. తండ్రి పురోహితులు. శర్మ 1988లో కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో బీఎస్‌సీ, 1993లో నెల్లూరు వీఆర్‌ కాలేజీలో బీఎల్‌ పూర్తిచేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయి, కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 1994 నుంచి 98 వరకు సీనియర్‌ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 

1998లో స్వతంత్రంగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2017–18లో అనంతపురం ప్రధాన జిల్లా జడ్జిగా, 2020–22లో విశాఖపట్నం ప్రధాన జిల్లా జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి ఏపీ జుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 2016లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా అందుకున్నారు.

Revenue Secretary: రెవెన్యూ కార్యదర్శిగా తుహిన్ కాంత పాండే

డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు..
ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. పద్మావతి, వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు. లక్ష్మణరావు ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్‌ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యశించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్‌ సర్టిఫికెట్లు సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. 

క్రిమినల్‌ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు కావలిలో కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 2014లో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన పరీక్షలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్‌ సాధించారు. తొలుత ఏలూరులో మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. 

V Narayanan: ఇస్రో నూతన చైర్మన్‌గా నియమితులైన నారాయణన్

ఆ తరువాత రాష్ట్రంలో పలు చోట్ల వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్‌ (జుడిషియల్‌)గా నియమితులయ్యారు. ఆయన పనితీరు, క్రమశిక్షణ నచ్చిన హైకోర్టు ఆయన్ని రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ)గా నియమించింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే 2038 వరకు సుదీర్ఘ కాలం పాటు ఆ పోస్టులో కొనసాగనున్నారు.

Published date : 17 Jan 2025 08:56AM

Photo Stories