Skip to main content

YSRHU: హెల్త్‌ వర్సిటీ వెబ్‌సైట్‌లో మార్పులు.. ఇకపై అన్ని కొత్త పేరుతోనే

లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని హెల్త్‌ యూనివర్సిటీ పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మారుస్తూ అక్టోబర్‌ 31న ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ మార్పుల ప్రక్రియకు నవంబర్‌ 1న శ్రీకారం చుట్టింది.
YSRHU
హెల్త్‌ వర్సిటీ వెబ్‌సైట్‌లో మార్పులు.. ఇకపై అన్ని కొత్త పేరుతోనే

అన్ని రకాల వెబ్‌సైట్‌లను డాక్టర్‌ వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా మారుస్తున్నారు. ఇకపై అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు, ఇతర కార్యకలాపాలు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుతోనే నిర్వహించనున్నారు. ఇందుకోసం అనుబంధ కళాశాలలకు, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌కు సమాచారం ఇవ్వనున్నారు. ఒకట్రెండు రోజుల్లో యూనివర్సిటీ భవనాలపై ఉన్న పేర్లు సైతం మార్పుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

చదవండి: Family doctors: లక్షకుపైగా కుటుంబాలకు సమకూరనున్న ‘ఫ్యామిలీ డాక్టర్లు’

గతంలో రెండుసార్లు పేరు మార్పు 

విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం ఇప్పుడు కొత్తేమీ కాదని సీనియర్‌ వైద్యులు అంటున్నారు. తొలుత యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (యూహెచ్‌ఎస్‌)గా ఉండేదని, ఆ తర్వాత ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా నామకరణ చేశారని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారని పేర్కొన్నారు. అప్పట్లో వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని.. ఇప్పుడు కూడా ఏమీ ఉండవని వారంటున్నారు. 

చదవండి: MBBS & BDS Admissions: 85% సీట్లు రాష్ట్ర విద్యార్థులకే.. ఈ కేటగిరీ సీట్లపై ఉత్తర్వులు జారీ

వైఎస్సార్‌ సేవలకు గుర్తింపుగానే..

ఇక రాష్ట్రంలో వైద్య రంగానికి దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగానే హెల్త్‌ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని యూనివర్సిటీ డెంటల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి సేవలతో పాటు, కొత్తగా మూడు వైద్య కళాశాలలను ఏర్పాటుచేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నారని, వర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెట్టడంతో తప్పులేదని, విద్యార్థులకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టంచేశారు.

చదవండి: అడ్మిషన్లలో 10% ఎస్టీ రిజర్వేషన్లు

Published date : 02 Nov 2022 03:44PM

Photo Stories