Family doctors: లక్షకుపైగా కుటుంబాలకు సమకూరనున్న ‘ఫ్యామిలీ డాక్టర్లు’
ఆ కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకోవడం, రెండు వారాలకోసారి ఇంటికే వచ్చి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన మందులు సూచించడం, మరీ అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించడం వంటివి చేయనున్నారు. ఎంబీబీఎస్ సిలబస్‌లో భాగంగా కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని చేపట్టాలని గతంలో చేసిన సిఫార్సులను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తాజాగా అమల్లోకి తెచి్చంది. ఈ మేరకు వైద్య విద్య క్యాలెండర్‌లోకుటుంబాల దత్తతను ప్రధాన అంశంగా ప్రస్తావించింది.
ఇంటి ముంగిటికే వైద్యం
ప్రస్తుతం చాలావరకు గ్రామాల్లో గుర్తింపు లేని ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ఆర్‌ఎంపీల వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. కొందరు తెలిసీ తెలియని వైద్యం చేస్తుండటం, నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలూ ఎన్నో. అర్హత లేని ప్రాక్టీషనర్లు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సి ఉండగా.. కొందరు సర్జరీలు, డెలివరీలు వంటివి కూడా చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అంతేగాకుండా విచ్చలవిడిగా నొప్పుల మాత్రలు, యాంటీ బయాటిక్స్, ఇతర మందులు ఇస్తున్నారు కూడా. ఈ క్రమంలో అటు గ్రామీణ ప్రజలకు మంచి వైద్యం అందించడం, ఇటు ఎంబీబీఎస్ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వివిధ వ్యాధులపై అవగాహన, ప్రాక్టీస్ లభించేందుకు.. కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఎన్‌ఎంసీ గతంలోనే సిఫార్సు చేసింది. తాజాగా దీనిని అమల్లోకి తెచి్చంది. దీనితో పలుచోట్ల గ్రామీణ ప్రాంతాల వారికి నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
Also read: Council for Social Development Report: అవగాహన లేక ‘కు.ని’కి పాట్లు!
ఒక్కో బ్యాచ్‌కు ఒక్కో గ్రామం
ఎన్‌ఎంసీ నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన ఒక్కో బ్యాచ్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. బ్యాచ్‌లోని ఒక్కో విద్యార్ధికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వైద్య విద్యార్థులకు స్థానికంగా ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. వైద్య విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే ఆస్పత్రికి రిఫర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాలి. కోర్సు మొదటి ఏడాదిలో కనీసం 10 సార్లయినా వారికి కేటాయించిన కుటుంబాల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటినీ కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. ఇలా విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే ఫ్యామిలీ డాక్టర్ల అవతారం ఎత్తుతారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల అక్కడి ప్రజలకు ఆరోగ్య సమకూరుతుందని చెప్తున్నారు.
Also read: Family doctor: ఫోన్ కాల్‌తో వైద్య సేవలు.. ఫ్యామిలీ డాక్టర్‌కు ప్రత్యేక యాప్
వేల మంది విద్యార్థులు.. లక్షన్నరకుపైగా కుటుంబాలు..
ఈ ఏడాది మొదలవుతున్న కొత్త కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 18 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో వచ్చే నెల 15వ తేదీ నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అన్ని బ్యాచ్‌లకు చెందినవారు కలిపి దాదాపు 20 వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. ఆయుష్, డెంటల్ వారినీ కలిపితే మరో ఐదారు వేల మంది జత అవుతారు. ఇంతమందికి కుటుంబాల దత్తత బాధ్యత ఇస్తే.. లక్షన్నరకు పైగా కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందనున్నాయి. ప్రతి జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉన్నందున అన్ని చోట్లా ఫ్యామిలీ డాక్టర్ పద్ధతి అమల్లోకి వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
Also read: NMC: గ్రామాల్లో కుటుంబాలను దత్తత తీసుకోనున్న వైద్య విద్యార్థులు
విద్యార్థులు చేసేదిదీ..
- వైద్య విద్యార్థులు గ్రామాల్లో తాము దత్తత తీసుకున్న కుటుంబాల వద్దకు నెలకు రెండు సార్లు వస్తారు. కుటుంబంలోని వారందరితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు.
- వ్యక్తుల వారీగా ఆరోగ్య రికార్డులను తయారు చేస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యసనాలను తెలుసుకుని నమోదు చేస్తారు.
- అవసరాన్ని బట్టి బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, గుండె పనితీరు పరీక్షలు, కేన్సర్ స్క్రీనింగ్, ఇతర వైద్య పరీక్షలు చేయిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. పరిశీలించి తగిన వైద్య సలహాలు ఇస్తారు. మందులు సూచిస్తారు. అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు.
- పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు రెగ్యులర్ చెకప్‌లపై అవగాహన కల్పిస్తారు.
- రోగాలు రాకుండా ఎలాంటి ఆహార అలవాట్లు అలవరుచుకోవాలో సూచిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తారు.
- గ్రామాల్లో స్థానిక పరిస్థితులు, తరచుగా వస్తున్న వ్యాధులను పరిశీలిస్తారు.
- ఈ అన్ని అంశాల్లో తమకు పర్యవేక్షకుడిగా ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూచనల మేరకు వైద్య విద్యార్థులు వ్యవహరిస్తారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP