Skip to main content

AQI Women Ambassador: ఏక్యూఐ ఉమెన్‌ అంబాసిడర్‌

సరోజ్‌ బెన్, జరీనా, ముంతాజ్‌లాంటి సామాన్య మహిళలు తమలాంటి సామాన్యుల కోసం వాయు కాలుష్యంపై దిల్లీ గల్లీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోర్టబుల్‌ ఏక్యూఐ(ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) మానిటర్‌లతో ‘వాయు కాలుష్య నివారణకు మన వంతుగా చేయాల్సింది’ అనే అంశంపై ప్రచారం చేస్తున్నారు...
AQI Women Ambassador

దిల్లీలోని నందనగిరి ప్రాంతం. చేతిలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) మానిటర్‌తో 39 సంవత్సరాల సరోజ్‌ బెన్‌ ఇద్దరు ముగ్గురు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ‘విషయం ఏమిటీ?’ అని అడుగుతూ మరో ఇద్దరు మహిళలు, ఆ తరువాత మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అడిగిన వారికల్లా ఓపిగ్గా చెబుతోంది సరోజ్‌.

‘మీ ఏరియాలో వాయుకాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది...’ అంటూ ప్రారంభించి ఆ సమస్య తలెత్తడానికి కారణాలు, దీని ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు... మొదలైన వాటి గురించి చెబుతూ పోయింది.

‘మీరు గవర్నమెంట్‌ ఆఫీసరా?’ అని ఎవరో అడిగారు. ‘కాదమ్మా, నేనూ నీలాగే గృహిణిని. పెరుగుతున్న వాయుకాలుష్యం గురించి బాధపడి, కాలుష్య నివారణకు నా వంతుగా ఏదైనా చేయాలని ఇలా వీధులు తిరుగుతున్నాను’ అని చెప్పింది సరోజ్‌.

సరోజ్‌ బెన్‌ మాత్రమే కాదు గ్రాస్‌రూట్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ‘మహిళా హౌజింగ్‌ ట్రస్ట్‌’ కమ్యూనిటీ మూమెంట్‌ ‘హెల్ప్‌ దిల్లీ బ్రీత్‌’ ప్రభావంతో ఎంతోమంది సామాన్య మహిళలు వాయు కాలుష్యంపై అవగాహన చేసుకున్నారు. తమలాంటి వారికి అవగాహన కలిగించడానికి వాడ వాడా తిరుగుతున్నారు.

చదవండి: Delhi Air Pollution: ఈ నగరానికి ఏమైంది?

కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ పౌరుల్లో వాయు కాలుష్యంపై అవగాహన కలిగించడానికి మహిళా హౌజింగ్‌ ట్రస్ట్, హెల్ప్‌ దిల్లీ బ్రీత్‌ సంస్థలు సామాన్య మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. పోర్టబుల్‌ ఏక్యూఐ మానిటర్‌లతో దిల్లీలోని గల్లీలు తిరుగుతూ వాయుకాలుష్య నివారణపై ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళలు ‘ఏక్యూఐ ఉమెన్‌ అంబాసిడర్‌’లుగా గుర్తింపు పొందారు.

AQI Women Ambassador

ఏక్యూఐ అంబాసిడర్‌లు హెల్ప్‌ దిల్లీ బ్రీత్, మహిళా హౌజింగ్‌ ట్రస్ట్‌ నిర్వహించే సమావేశాలకు హాజరు కావడమే కాదు ప్రచార వ్యూహాల గురించి కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. ‘కమ్యూనిటీ యాక్షన్‌ గ్రూప్‌’గా ఏర్పడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటారు.

‘వాయు కాలుష్యం గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక గృహిణితో అన్నప్పుడు నా ముఖం మీద తలుపు వేసినంత పనిచేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈసారి అలా కాదు ఇలా చేయాలనుకున్నాను. దిల్లీలోని నెహ్రూ నగర్‌కు వెళ్లినప్పుడు నా బ్యాగులో ఉన్న కొన్ని పోస్టర్‌లను ఆమెకు చూపాను. అవి చూసి అయ్యో ఏమిటి ఇది అన్నట్లుగా అడిగింది. అలా మెల్లగా టాపిక్‌ను మొదలుపెట్టాను. ఆమె చాలా శ్రద్ధగా విన్నది. పరిస్థితులను బట్టి ఏ రూట్‌లో వెళ్లాలో అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే సమస్య ఉండదు’ అంటుంది సీమ అనే ఏక్యూఐ అంబాసిడర్‌.

చదవండి: Air Pollution: వాయు కాలుష్యానికి విరుగుడు

‘ఉపన్యాసం ఇచ్చినట్లు కాకుండా మన ఇంటి పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉంటే ఎలా చెబుతామో అలా వాయు కాలుష్యం గురించి చెబుతాను. ఉదాహరణలతో అర్థమయ్యేలా చెబుతాను. పెద్దవాళ్లకే సాధ్యం కాని పెద్ద సమస్య ఇది. మన వల్ల ఏమవుతుంది... అని కొందరు అంటారు. మీలా అందరూ అనుకోవడం వల్లే అది పెద్ద సమస్యగా మారింది అని నేను అంటాను. మొదటగా మీరు చేయాల్సింది మీ పెరట్లో ఒక మొక్క నాటడం అని సలహా ఇస్తాను. నేను చెప్పింది వారికి నచ్చినట్లు వారి హావభావాలను బట్టి గ్రహిస్తాను’ అంటుంది ఏక్యూఐ అంబాసిడర్‌ ముంతాజ్‌.

ఏక్యూఐ అంబాసిడర్‌ల కృషి వృథా పోవడం లేదు. ఇప్పుడు ఎంతో మంది కాలుష్యాన్ని నియంత్రించే చర్యల గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారు. వారు పెద్ద చదువులు చదుకున్నవారేమీ కాదు. సామాన్య మహిళలు. ఏక్యూఐ అంబాసిడర్‌ల విజయానికి ఇది ఒక ఉదాహరణ.

మార్పు మొదలైంది...

జరీనా ప్రతిరోజూ ఏక్యూఐ మానిటర్‌తో ఉదయం, సాయంత్రం వివిధ ప్రాంతాలలో పొల్యూషన్‌ లెవెల్స్‌ను చెక్‌ చేస్తుంది. ‘కొన్నిసార్లు కాలుష్యం తక్కువగా, మరికొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం  ఎక్కువగా ఉన్నప్పుడు ఏక్యూఐ మానిటర్‌పై ఎరుపు రంగు కనిపిస్తుంది. కొత్త సంఖ్యలు కనిపిస్తాయి. ఒకప్పుడు వాయుకాలుష్యం గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే ఇప్పుడు చాలామందిలో మార్పు రావడాన్ని గమనించాను’ అంటుంది జరీనా.ఏక్యూఐ అంబాసిడర్‌ అయిన జరీనా వాయునాణ్యత, వెంటిలేషన్, బొగ్గు పొయ్యిలకు దూరంగా ఉండడం... మొదలైన అంశాలపై దిల్లీ గల్లీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.

ఇలా కూడా...

వాడ వాడలా తిరుగుతూ వాయుకాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు లేబర్‌ కార్డు, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు, పీఎం సురక్షిత్‌ మాతృత్వ అభియాన్, సుమన్‌ యోజనలాంటి ప్రభుత్వ సామాజిక, సంక్షేమ పథకాల గురించి భనన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు తెలియజేస్తున్నారు ఏక్యూఐ అంబాసిడర్‌లు. స్కీమ్‌కు సంబంధించిన పత్రాలు నింపడం నుంచి ఐడీ కార్డ్‌లు వారికి అందేలా చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయం అందిస్తున్నారు.

Published date : 02 Mar 2024 04:23PM

Photo Stories