6th Class Entrance Exam: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: జవహర్ నవోదయ విద్యా లయంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగుస్తుందని మద్దిరాల జేఎన్‌వీ ప్రిన్సిపల్ ఎన్ నరసింహారావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో మొత్తం 80 సీట్లు ఉన్నాయన్నారు. ఎలాంటి ఫీజులు లేకుండా 6–12 వరకు సీబీఎస్‌ఈ విధానంలో ఉచిత విద్యతోపాటు వసతి కల్పన ఉంటుందన్నారు. 2024–25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ అర్హత పరీక్షలకు ఇప్పటికే 3,155 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. గతేడాది 4,196 మంది విద్యార్థుల నుంచి అర్జీలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. శుక్రవారం సాయంత్రానికి ముగిసే సరికి మరిన్ని అర్జీలు వచ్చే అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోవాలని కోరారు. జేఎన్‌వీఎస్‌టీ –2024 పరీక్షను వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉండి ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 2022–23 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఐదో తరగతి చదువుతూ ఉండాలన్నారు. అభ్యర్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులై ఉండాలని సూచించారు. అభ్యర్థి 2011 మే 1 నుంచి 2013 ఏప్రిల్ 30వ తేదీ మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ నవోదయ.జీవోవీ.ఇన్‌కు లాగిన్ అవ్వాలని సూచించారు.
చదవండి: RGUKT: ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు 3 వేల ల్యాప్‌టాప్‌లు