Skip to main content

STEM: కోర్సుల్లో మహిళల ముందడుగు

సాక్షి, అమరావతి: ఒకప్పుడు సంప్రదాయ కోర్సులకే పరిమితమవుతూ వచ్చిన మహిళలు ఇప్పుడు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులవైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
STEM Courses
స్టెమ్ కోర్సుల్లో మహిళల ముందడుగు

సై­న్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్‌తో కూడిన స్టెమ్‌ (ఎస్‌టీఈఎం) కోర్సుల్లో వారి చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆలిండియా సర్వే ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఐష్‌) కొద్దికాలం కిందట విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో స్టెమ్‌ కోర్సుల్లో మహిళల సంఖ్య భారీగా పెరిగింది. సాంకేతిక విద్యాకోర్సులు అమలవుతున్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థల్లో వీరి చేరికల శాతం 2016–17లో 8 మాత్రమే ఉండగా 2020–21 నాటికి 20కి పెరిగింది. 2021–22 విద్యాసంవత్సరంలో ఇది 22.1 శాతానికి చేరింది. సాంకేతిక విద్యాకోర్సుల్లో మహిళల చేరికలను పెంచేందుకు కేంద్రప్రభుత్వం కూడా వారికోసం 2017 నుంచి సూపర్‌ న్యూమరరీ కోటాను ప్రవేశపెట్టింది. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరుతోపాటు అర్హత సాధించడంలోను మహిళల శాతం తక్కువగా ఉండేది. దీనివల్ల ఐఐటీల్లో వారిసంఖ్య స్వల్పంగా ఉండేది. సూపర్‌ న్యూమరరీ కోటాను పెట్టడంతో గత ఐదేళ్లలోనే వారి చేరికలు 20 శాతానికి పెరిగాయి. ఎన్‌ఐటీల్లో అయితే వారి చేరికలు 23 శాతంగా ఉండడం గమనార్హం. ఐఐటీల్లో 2017లో చేరిన మహిళలు 995 మందే కాగా 2021లో ఆ సంఖ్య 2,990కి చేరింది.

చదవండి: డిగ్రీ నచ్చేలా.. విభిన్న కాంబినేషన్‌ కోర్సులు..

స్టెమ్‌ కోర్సుల వైపు చూపు 

మహిళలు సాంకేతిక, వృత్తిపరమైన కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్క ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోనే కాకుండా ఇతర సంస్థల్లోను స్టెమ్‌ కోర్సులకు వారు ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీలతో పాటు ప్రైవేటు వర్సిటీల్లోను ఈ కోర్సుల్లో మహిళల చేరికలు పెరిగినట్లు ఐష్‌ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. 2017లో స్టెమ్‌ కోర్సుల్లో చేరిన మహిళలు 41.97 లక్షల మందికాగా 2021 నాటికి ఆ సంఖ్య 43.87 లక్షలకు చేరినట్లు ఐష్‌ నివేదిక పేర్కొంది. 

చదవండి: New courses: ఇంటర్‌ కాలేజీల్లో స్వల్పకాలిక కోర్సులు
సంప్రదాయ కోర్సుల్లో కన్నా స్టెమ్‌ కోర్సుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడమే ఈ కోర్సుల వైపు వారు దృష్టి కేంద్రీకరించడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

చదవండి: New Courses: కొత్త కోర్సులకు ఎన్ వోసీ అవసరం లేదు

ఇతర దేశాల్లో కన్నా ఇండియాలోనే చేరికలు అధికం 

ఇతర దేశాల్లో కన్నా మన దేశంలోనే స్టెమ్‌ కోర్సుల్లో మహిళల చేరికలు అత్యధికంగా ఉన్నాయని ప్రపంచబ్యాంకు గతంలో విడుదల చేసిన నివేదికలో విద్యారంగానికి సంబంధించిన గణాంకాల్లో తెలిపింది. స్టెమ్‌ కోర్సుల గ్రాడ్యుయేట్లలో మహిళల శాతం ఇండి­యాలో 43 కాగా అమెరికాలో 34, బ్రిటన్‌లో 38, కెనడాలో 31 మాత్రమేనని వివరించింది. మన దేశంలో గత ఐదేళ్లలో స్టెమ్‌ కోర్సుల్లో రెండుకోట్ల మంది వరకు మహిళలు చేరినట్లు ఐష్‌ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఐదేళ్లలో మహిళల చేరికల్లో రాష్ట్రాల వారీగా చూస్తే 30.80 లక్షల మందితో తమిళనాడు ప్రధమ స్థానంలో, 24.65 లక్షల మందితో ఉత్తరప్రదేశ్‌ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం గ్రాడ్యుయేట్లలో 32.2 శాతం మంది మహిళలున్నారు. 2014తో పోలిస్తే మహిళల చేరికలు గణనీయంగా పెరిగాయి. 2014లో గ్రాడ్యుయేట్లలో 26.9 శాతం మంది మాత్రమే మహిళలున్నారు. 

చదవండి: New Courses: కొత్త కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు

Published date : 05 Jan 2023 05:07PM

Photo Stories