Death Star: శత్రు దేశాల ఉపగ్రహాలను నిర్వీర్యం చేసేందుకు.. సూపర్ వెపన్‌ను అభివృద్ధి చేసిన చైనా!
ఈ దిశగా ప్రయోగాలను కూడా విజయవంతంగా పూర్తిచేశారు. ఈ అత్యాధునిక ఆయుధానికి సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచినప్పటికీ అంతరిక్షంలో ఉపయోగించేందుకే ఈ తరహా ఆయుధాల అభివృద్ధి జరుగుతున్నట్లుపలు చైనా జర్నల్స్ చెబుతున్నాయి. ఇంతకీ దాన్ని ఎలా రూపొందించారు.. అందులో వాడే టెక్నాలజీ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఎలా పనిచేస్తుందంటే..
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం ఈ సూపర్ వెపన్.. మైక్రోవేవ్ ఎనర్జీ (ఒక రకమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్)ని ప్రసరించే ఏడు ‘యంత్రాలను’ ఉపయోగిస్తుంది. అంతరిక్షంలో దూరదూరంగా ఉండే ఈ ఏడు యంత్రాలు ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా అనుసంధానమై ఉన్నాయి. ఒక్కో యంత్రం ఒకే ఒక్క శక్తివంతమైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌వేవ్‌ను శత్రు లక్ష్యంపై విడుదల చేస్తుంది. ఇలా ఏడు యంత్రాల నుంచి ఏకకాలంలో ఏడు తరంగాలు విడుదలై నిర్దేశిత లక్ష్యాన్ని నాశనం చేస్తాయి. అయితే ఇలా ఏకకాలంలో లక్ష్యాన్ని ఢీకొట్టాలంటే ఆ యంత్రాల నుంచి తరంగాలు కచ్చితంగా ఒకే సమయానికి విడుదల కావాలి.
ఎంత కచ్చితత్వంతో అంటే అవి ఒక సెకనులో 170 లక్షల కోట్లవ వంతు కాలంలో విడుదల కావాలన్నమాట!! ప్రస్తుతం అత్యాధునిక జీపీఎస్ శాటిలైట్లలోని అటామిక్ గడియారాలు కొన్ని వందల కోట్ల ఏళ్లలో ఒకే ఒక్క సెకనును మాత్రమే మిస్ అవుతున్నాయి. వాటికన్నా ఎన్నో రెట్ల కచ్చితమైన కాలాన్ని లెక్కించడం అసాధ్యమని ఇప్పటివరకు భావిస్తుండగా చైనా శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని కూడా అధిగమించారు.
LignoSat: ప్రపంచంలో తొలిసారి.. నింగిలోకి దూసుకెళ్లిన కలప ఉపగ్రహం
గతేడాదే వారు సుమారు 1,800 కిలోమీటర్ల పరిధి నుంచి ఒక సెకనులో 10 లక్షల కోట్లవ వంతు కాలానికి సమానమైన కచ్చితత్వాన్ని సాధించారు. నిర్దేశిత లక్ష్యంలోని ఒకే భాగాన్ని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ తాకేందుకు ఈ ఆయుధంలో లేజర్ పొజిషనింగ్ పరికరాలు కూడా ఉన్నాయి. లక్ష్యం ఉన్న దూరం, దాన్ని ఢీకొట్టేందుకు అవసరమైన కచ్చితత్వంతో కూడిన సమయాన్ని లెక్కించాక మొబైల్ కమాండ్ సెంటర్ నుంచి దాడి చేయాలని సంకేతం పంపగానే ఆయుధంలోని యంత్రాలు వాటి పని కానిస్తాయి. కేవలం ఒక గిగావాట్ శక్తిని విడుదల చేసే సామర్థ్యంగల ఒక ఆయుధం ద్వారా భూమికి సమీపంలోని ఉపగ్రహాలను నాశనం చేయడం సాధ్యమవుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి.
కమ్యూనికేషన్ నిర్వీర్యమే ఉద్దేశం
మైక్రోవేవ్ ఆయుధాలు నిర్దేశిత లక్ష్యాలను పేల్చేసే బదులు శక్తివంతమైన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్‌ను విడుదల చేయడం ద్వారా ఆయా లక్ష్యాల్లో ఉండే ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లను దెబ్బతీస్తాయి. దీంతో ఉపగ్రహాల వంటి సమాచార వ్యవస్థల్లో గ్రౌండ్ సెంటర్లతో కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. డ్రోన్ల వంటి చిన్న లక్ష్యాలపై ఈ తరహా ఆయుధాలు సమర్థంగా పనిచేసినట్లు ఇప్పటికే పలు ప్రయోగాల్లో తేలింది.
అమెరికా ఎయిర్‌ఫోర్స్ రీసెర్చ్ ల్యాబ్ అభివృద్ధి చేసిన థోర్ (ద టాక్టికల్ హైపవర్ ఆపరేషనల్ రెస్పాండర్) కొన్ని వందల డ్రోన్లను ఏకకాలంలో నిర్వీర్యం చేయగలదు. అగ్రరాజ్యం గత నెలలోనే రష్యా లేదా చైనా శాటిలైట్ సిగ్నళ్లను నిలువరించగల మెడోలాండ్స్ అనే జామర్ ఆయుధాన్ని సమకూర్చుకుంది. మరోవైపు యూకే సైతం డ్రాగన్‌ఫ్లై లేజర్ వెపన్‌ను అభివృద్ధి చేసింది. గాల్లో ఎగిరే డ్రోన్లను కూల్చేసే సామర్థ్యాన్ని దీనికి ఉంది. అలాగే ఏకంగా 1.5 కి.మీ. దూరం నుంచే ఒక నాణెం సైజులో ఉండే లక్ష్యాన్ని కూడా కచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం.
Analog Space Mission: మొట్టమొదటి అనలాగ్ స్పేస్ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో