Skip to main content

ఓపికతో కష్టపడితే సివిల్స్ సాధ్యమే.. సివిల్స్ 960 ర్యాంకర్ పున్నమ్ కుమార్..

డాక్టర్ కంటే సివిల్ సర్వెంట్‌గానే ప్రజలకు ఎక్కువ సేవ చేయవచ్చనే నమ్మకంతోనే సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాను. దీనికోసం 3 సంవత్సరాల నుంచి ప్రిపేరయ్యాను. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా దాటలేదు. దాంతో మరింత పట్టుదలతో కృషి చేశాను. ఎంపిక అవుతాననుకోలేదు. అయితే ఈ ర్యాంక్ సరిపోదనీ.. మంచి ర్యాంకు వచ్చేవరకు రాస్తూనే ఉంటానని.. అంటున్నారు 2012 సివిల్స్ 960 ర్యాంకర్ బి. పున్నమ్ కుమార్...

ప్ర: సివిల్స్‌కు ఎంపికయినందుకు ఎలా ఫీలవుతున్నారు?
జ: చాలా సంతోషంగా ఉంది. నిజంగా సంవత్సరాల తరబడి కష్టపడినందుకు ఫలితం దక్కింది. ఎంపికవుతాననే నమ్మకం ఉంది కానీ ఎక్కడో తెలియని ఆందోళన. అయితే ఈ ర్యాంకు సరిపోదు. మెరుగైన ర్యాంకు వచ్చేంత వరకు రాస్తూనే ఉంటాను.

ప్ర. మీ కుంటుంబ నేపథ్యం, విద్యార్హతలు....?
జ. మాది అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో చిన్న వ్యవసాయ కుటుంబం. ఇంటర్ అదిలాబాద్‌లోని ఉట్నూర్ ఏపీఆర్‌జేసీలో చేశాను. మెడిసిన్ మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజ్‌లో చదివాను.

ప్ర: సివిల్స్ రాయాలని ఎప్పుడు, ఎందుకు అన్పించింది? దీనికేమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా?
జ: మెడిసిన్ చదువుతున్నప్పుడే సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి అప్పటి నుంచే ప్రిపరేషన్ సాగించాను. గతేడాది చిక్కడపల్లి ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో ఉద్యోగం వచ్చింది. అది చేస్తూనే బాగా ప్రిపరేషన్ సాగించాను. ఒక డాక్టర్ కంటే సివిల్ సరె ్వంట్‌గానే ప్రజలకు ఎక్కువ సేవచేసే అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి గౌరవం హోదా లభిస్తాయి. నా స్నేహితులు కూడా చాలా ప్రోత్సహించారు. అందుకే సివిల్స్ రాయాలనకున్నాను.

ప్ర: ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టారు? రోజుకు ఎన్ని గంటలు చదివేవారు?
జ: 3 సంవత్సరాల కిందే ప్రిపరేషన్ ప్రారంభించాను. రోజుకు 8 గంటలు పైగా చదివేవాణ్ని. ప్రామాణిక పుస్తకాలు, కోచింగ్‌లో చెప్పిన మెటీరియల్ నుంచి సొంత నోట్స్ రాసుకునేవాణ్ని.

ప్ర: కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? మీరు చదివిన ప్రామాణిక పుస్తకాలేంటి?
జ: ఆర్‌సీ రెడ్డి ఇనిస్టిట్యూట్. క్లాస్ నోట్స్ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఎక్కువగా చదివాను. సాక్షి, హిందూ పేపర్ చదువుతూ కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకునేవాణ్ని.

ప్ర: మీ ఆప్షనల్స్ ఏంటి ? అవే తీసుకోవడానికి కారణం?
జ: హిస్టరీ, తెలుగు లిటరేచర్. ఈ సబ్జెక్టులు నాకు సులభం అన్పించింది అందుకే తీసుకున్నాను. వీటికి మెటీరియల్ కూడా ఎక్కువగా లభిస్తుంది.

ప్ర. తెలుగు లిటరేచర్ ఆప్షనల్‌గా తీసుకున్నారు కదా? ఇంటర్వ్యూ తెలుగులో చేశారా? ఇంగ్లీషులోనా?
జ. ఇంగ్లీష్‌లోనే చేశాను.

ప్ర: ఇంటర్వ్యూ ఎలా జరిగింది? అడిగిన ప్రశ్నలేంటి?
జ: ఇంటర్వ్యూ చాలా కూల్‌గా జరిగింది. దాదాపు 25 నిమిషాలు చేశారు.

-డయాబెటిస్ అంటే ఏంటి?
-శరీరంలో ఉండే ఎముకల సంఖ్య?
-ఇండో-చైనా సంబంధాల గురించి చెప్పండి?
-1857 తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు? అది సబబేనా?
-భారత్ కంటే చైనా ఎందుకు ముందంజలో ఉంది?
-మీ జిల్లాలో ట్రైబ్స్ సమస్యలేంటి? వంటి ప్రశ్నలు అడిగారు.

ప్ర: సివిల్స్‌కు ఎంపిక కాకుంటే ఏం చేసేవారు ? మూడోసారి ప్రయత్నించే వారా ?
జ: తప్పకుండా.. మూడోసారేంటి నాకున్న చివరి అవకాశం వరకు ప్రయత్నించేవాణ్ని. అయితే ఉద్యోగం చేసుకుంటూనే ప్రయత్నిస్తాను.

ప్ర. సివిల్స్‌లో వచ్చిన మార్పులపై మీ అభిప్రాయం?
జ: అన్నీ మన మంచికే అనుకోవాలి. ఒక సివిల్ సర్వెంట్‌ను ఎంపిక చేయాలంటే అన్ని కోణాల్లో పరీక్షిస్తారు. ఇది యూపీఎస్సీ బాధ్యత. దీనికణుగుణంగానే మార్పులు చేశారు. అవి కూడా వచ్చే సంవత్సరం నుంచే కాబట్టి మనమే వాటిని స్వీకరించి సిద్ధమవ్వాలి.

ప్ర: సివిల్స్ రాయాలనుకునే వాళ్లకు మీరిచ్చే సలహా ?
జ: పక్కా ప్రణాళిక వేసుకొని ఓపికతో కష్టపడి చదివితే సివిల్స్ సాధించవచ్చు. ప్రతి దానికి టెన్షన్ పడకుండా ముందుగా బేసిక్స్‌పై అవగాహన సాధించాలి. పదే పదే చదవడం, నోట్స్ రాసుకోవడం వల్ల చదివింది గుర్తుంటుంది. కోచింగ్ వెళ్లడం కొంత లాభిస్తుంది. ఇతర ఏ వ్యాపకాలు లేకుండా లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తే విజయం తథ్యం.
Published date : 07 May 2013 06:32PM

Photo Stories