Skip to main content

ఏకంగా ప్రధాని ఇందిరాగాంధీ వాహనానికే రాంగ్‌ పార్కింగ్‌ చలాన్ రాశారు...ఈ ఐపీఎస్ ఆఫీస‌ర్‌

ఈ దేశంలోని ప్రతి అమ్మాయికీ, ప్రతి మహిళకు ఇన్‌స్పిరేషన్‌. ఆమే.. కిరణ్‌ బేడీ.
భారతదేశ తొలి మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్. తొలి ఐపీఎస్‌ మహిళా అధికారి మాత్రమే కాదు, టెన్నిస్‌ చాంపియన్‌ కూడా. ఇప్పుడీమె పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్నారు. నలభై ఐదేళ్ల క్రితం 1975 రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మొత్తం పురుషులే ఉన్న ఢిల్లీ పోలీస్‌ దళాన్ని కిరణ్‌ బేడీ ముందుండి నడిపించారు.

1972లో 23 ఏళ్ల వయసులో ఐపీఎస్‌ సర్వీస్‌లోకి వచ్చిన కిరణ్‌ బేడి ప్రస్తుతం 71 ఏళ్ల వయసులో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్నారు. నేరస్థులకు సింహస్వప్నంగా ఉంటూనే, నేర స్వభావం గల ఖైదీలను తిరిగి మనుషులుగా మార్చే విధంగా జైలు సంస్కరణలను తీసుకొచ్చారు. తీహార్‌ జైలు ఇప్పుడు కొంచెం మనిషిగా ప్రవర్తిస్తోందంటే.. జైళ్ల ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా బేడీ తీసుకున్న చర్యల కారణంగానే. ఆ క్రితం వరకు తీహార్‌లో శుభ్రత ఉండేది కాదు. ఖైదీలకు పోషకాహారం పెట్టేవాళ్లు కాదు. జైల్లో మానవ హక్కులన్నవే ఉండేవి కావు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా, యాంటీ టెర్రరిస్ట్‌ స్పెషలిస్టుగా కూడా మాదక ద్రవ్య సామ్రాజ్యాలపై, తీవ్రవాద కార్యకలాపాలపై బేడీ పట్టు బిగించారు.

కిరణ్‌ బేడీ అమృత్‌సర్‌ అమ్మాయి. అక్కడి ఒక కాలేజ్‌లో పొలిటికల్‌ సైన్స్‌ టీచర్‌గా ఆమె కెరీర్‌ మొదలైంది. తర్వాత సివిల్స్‌ రాసి ఐ.పి.ఎస్‌. అయ్యారు. కెరీర్‌ మొదటి నుంచి కూడా ఆమె ఎంత స్ట్రిక్టుగా ఉండేవారో చెప్పడానికి ఇప్పటికీ ఒక సందర్భం ఉదాహరణల్లోకి వస్తుంటుంది. ట్రాఫిక్‌ డ్యూటీలో ఉన్నప్పుడు ఏకంగా ప్రధాని ఇందిరాగాంధీ కాన్వాయ్‌లోని వాహనానికే ఆమె రాంగ్‌ పార్కింగ్‌ చలాన్‌ రాశారట! అందుకు శ్రీమతి గాంధీ ఆమెను ప్రశంసించి బ్రేక్‌ ఫాస్ట్‌కు పిలిచారని కూడా అంటారు. అయితే ఆ పిలవడం అన్నది అప్పుడు కాదు, వేరే సందర్భంలో అంటారు కిరణ్‌బేడీ. అయినా ఈ ఉక్కుమహిళ నుంచి స్ఫూర్తిని పొందడానికి సందర్భాలతో పనిలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజ‌యాలు కిరణ్‌బేడీ సొంతం.
Published date : 17 Sep 2020 12:39PM

Photo Stories