Success Story: పలు ప్రయత్నాలతో సివిల్స్ లో గెలుపు
సివిల్స్ ఫలితాల్లో కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన డాక్టర్ షేక్ హబీబుల్లా ఆల్ ఇండియా స్థాయిలో 189వ ర్యాంకు సాధించారు. తండ్రి షేక్ అబ్దుల్ ఖాదర్ ప్రస్తుతం విద్యుత్ శాఖ ట్రాన్స్‌కోలో సూర్యపేట ఏడీఈగా విధులు నిర్వహిస్తుండగా తల్లి షేక్ గౌసియా బేగం గృహిణి. కాగా తాత షేక్ మహబూబ్ దౌల ప్యాలకుర్తిలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు.
తండ్రి ఉద్యోగ రీత్య హబీబుల్లా ప్రాథమిక విద్య సున్నిపెంటలో, ఆ తరువాత డోన్‌లో పూర్తి చేశారు. 2010లో కర్నూలులోని కేశవరెడ్డి స్కూల్‌లో 10వ తరగతి చదివి 559 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో 2012లో 935 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.
ఆ తర్వాత హైదరాబాద్‌లోని వెటర్నరీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తండ్రి అడుగుజాడల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, అది కూడా ఉన్నతంగా ఉండాలనే ఆలోచనలో సివిల్స్ వైపు అడుగులు వేశారు. కొంత కాలం విజయవాడలో ప్రాథమిక శిక్షణ తీసుకొని తొలి ప్రయత్నం చేసిన ఆయన 2021లో ఢిల్లీ వెళ్లారు. అక్కడ జామియా మిలియా యూనివర్సిటీలో శిక్షణ తీసుకున్నా రెండో ప్రయత్నంలోనూ ప్రిలిమ్స్‌కు అర్హత సాధించలేకపోయారు. లక్ష్య సాధన దిశగా మరింత ప్రయత్నం చేసి.. మూడో ప్రయత్నంలో 189వ ర్యాంకు సాధించారు.
ఆప్షనల్ సబ్జెక్టుగా ఆంత్రోపాలజీని ఎంచుకోగా.. ప్రస్తుత ర్యాంకుకు ఐపీఎస్ వచ్చే అవకాశం ఉన్నట్లు హబీబుల్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కుటుంబ సభ్యులు డాక్టర్ కావాలని బైపీసీలో చేర్పించగా.. వెటర్నరీ డాక్టర్ దిశగా తన పయనం సాగిందన్నారు. ఇతర ఏ ఉద్యోగం చేసినా ఆ సంతోషం కొంత వరకే ఉంటుందని, సివిల్స్‌లో రాణిస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు.