Skip to main content

వైద్యో నారాయణో హరిః

స్వచ్ఛమైన తెల్లని కోటు, ఆత్మీయమైన చెరగని చిరునవ్వు, మొక్కవోని నిబ్బరం, అలుపెరగని అంకితభావం, విసుగెరగని వృత్తి ప్రేమ వైద్యునికి సహజ ఆభరణాలు. ఈ ఆభరణాలు ధరించి వచ్చే వైద్యుడిని చూడగానే రోగికి సగం స్వస్థత చేకూరుతుంది. వైద్య వృత్తిలో వేసే ప్రతి అడుగూ, పనిచేసే ప్రతి క్షణమూ సామాజిక సంబంధాలు, మానవతా విలువలు, శాస్త్ర సాంకేతిక వాస్తవాలు, ఊహకందని ..ప్రకృతి పరమాత్మ లీలలు... వీటి మధ్య సున్నితమైన సమన్వయాన్ని సాధించాల్సి వస్తుంది...

ఆయన బాల్యం చాలా కఠినంగా గడిచింది. విద్యాభ్యాసం డూన్ స్కూల్ లోనో, కాన్సెప్ట్ స్కూల్ లోనో జరగలేదు. పుస్తకాలు, పెన్నులు కూడా లేక ఇసుక మీద వేలితో రాస్తూ అక్షరాలు నేర్చుకున్నాడు. ఉదయం ఐదు గంటలకే గేదెలు, ఆవులు తోలుకొని అవి గడ్డి మేస్తుంటే తాను అక్షరాలు నేర్చుకొనేవాడు. గ్రామంలో విద్యా, వైద్య సదుపాయాలుండేవి కాదు. ఒకరోజు పక్కింట్లో నుంచి పెద్ద అరుపులు, ఏడ్పులు విన్పించాయి. పరిగెత్తికెళ్లి చూస్తే కాన్పులో బిడ్డను ప్రసవిస్తూ 20 ఏళ్ల తల్లి చనిపోయిందని తెలిసింది. ఒక్క డాక్టరు కూడా లేని ఆ గ్రామంలో ఇలాంటివి జరగకుండా నేనేమీ చేయలేనా అని అతని మనసును కలచివేసింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో మిగిలిన సోదరులను చదివించడానికి వివాహం కూడా చేసుకోలేదు. తన కళ్ల ముందు మరో తల్లి బిడ్డకు జన్మనిస్తూ చనిపోకూడదని సంకల్పించాడు. పట్టుదలతో చదివి మద్రాసులోని స్టాన్లీ మెడికల్ కాలేజ్ లో సీటు సంపాదించి ప్రసూతి వైద్యంలో నైపుణ్యం సాధించాడు. ఆర్మీలో వైద్యం అందించే డాక్టరుగా చేరాడు. విధి వక్రించి నాలుగేళ్ల తర్వాత ఆర్థ్రైటిస్ (Arthritis) వ్యాధి సోకడంతో మిలటరీ నుంచి పంపించి వేశారు. వేళ్లు వంకరలు తిరిగిపోయి ప్రసూతి వైద్య నిపుణుడిగా పని చేయనీకుండా చేసిందా వ్యాధి. శస్త్ర చికిత్స మాట దేవుడెరుగు. వేళ్లతో పెన్ను కూడా పట్టుకోలేని పరిస్థితి. నెమ్మదిగా అడుగులు వేస్తూ నడవటం కూడా కష్టమైంది. కానీ పట్టుదలను, తన సంకల్పాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వీడలేదు. చేతివేళ్లకు బరువు లేకుండా వేళ్లను సున్నితంగా కదిలిస్తూ తాను ఏం చేయగలనని ఆలోచించాడు. కొన్ని ఏళ్లు అలాగే శ్రమిం చాడు. నెమ్మదిగా కంటి డాక్టరుగా మారాడు. వేళ్లు వంకరలు తిరిగిపోయి ఉండటం వల్ల కంటి శస్త్ర చికిత్సా పరికరాలను ఎంతో నైపుణ్యంగా తనదైన ఒక నేర్పుతో పట్టుకుని కంటి ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టాడు. ఆయన శస్త్ర చికిత్సా పరికరాలు పట్టుకొనే విధానం విచిత్రంగా ఉన్న ఆయన శస్త్ర చికిత్స చేస్తే నూరు శాతం పరిపూర్ణమైన శస్త్ర చికిత్స అని అందరికీ అన్పించేది. ఆయన శస్త్ర చికిత్స చేయడమే కాక ఎంతోమందికి నేర్పేవారు. ఆయన శస్త్ర చికిత్స చేస్తుంటే ఆయన తాదాత్మ్యాన్ని చూసేవారికి రమణీయ మనోహరంగా అన్పించేది. పసిపాప అమాయకత్వం, తల్లి నిస్వార్థ ప్రేమ, నిబ్బరమైన హృదయం, నిశితమైన చూపు, అంకితభావంతో కూడిన క్రమశిక్షణ అన్ని మేళవించి లయాత్మక విన్యాసంగా కన్పించేది/అన్పించేది.

కళాకారుడికి నిర్జీవమైన వాయిద్యాలు, చిత్రకారుడికి ప్రాణం లేని కాన్వాస్, శిల్పికి ప్రాణరహిత శిలలు, వీటి ద్వారా చూపించే నైపుణ్యాన్నే లలిత కళలు (ఫైన్ ఆర్ట్స్) అన్నారు. మరి ప్రాణమున్న దేహాన్ని తన నైపుణ్యం ద్వారా నిర్జీవం కాకుండా పునర్జీవితాన్ని చేసే ఈ వైద్య కళ నిజంగా Finest of Fine Arts కదా!

1978 లో కంటి చికిత్సలో నూతన మెళకువలు నేర్చుకోవడానికి మిచిగన్ (అమెరికా) వెళ్లే అవకాశం లభించింది. అక్కడ కంటి ఆసుపత్రిని, అంకితభావాన్ని, నైపుణ్యాన్ని చూసి తన కూడా అలాంటిది ఎందుకు ఆరంభించకూడదు అనుకున్నాడు. సోదరులతో, సోదరీమణులతో చర్చించి ఒక సేవా సంస్థను ఏర్పాటు చేయాలనుందని వెల్లడించారు. సత్సంకల్పానికి తక్షణమే ముహూర్తం. కుటుంబ సభ్యులు బంగారం ఇతరత్రా సామాన్లు అమ్మి ఆయనకు అప్ప చెప్పారు. ఆయన ఆరాధించే యోగి అరవిందో మాటలు గుర్తు చేసుకున్నారు.

"There is a power within that knows beyond our knowings. We are greater than our thoughts and sometimes earth unveils that vision here to live and to love are signs of infinite things. When we grow in spiritual consciousness we identify ourselves with all that is in the world. So there is no exploitation. It is ourselves we are helping, it is ourselves we are healing. Whenever you see a man is in contact with his soul, then he enjoys a beautiful sky, a beautiful tree, a beautiful bird, suddenly you hear a piece of music then you lose yourself. Everything opens up in a different way.

కుటుంబ సభ్యులు ఇచ్చిన దానితో పాటు, ఇల్లు కూడా తాకట్టు పెట్టి రెండు లక్షలు అప్పు తెచ్చి 11 పడకలతో తాను ఆరాధించే ‘యోగి అరవిందో’ పేరు మీదుగా ‘అరవింద్ ఆస్పత్రి’ని ప్రారంభించారు. కంటిచూపు లేమిని భూమ్మీద నుంచి శాశ్వతంగా తరిమేయాలన్నదే ఆయన ఆశయం. ప్రపంచంలో దాదాపు ఐదు కోట్ల మంది అంధత్వం బారిన పడుతుంటే వారిలో నాలుగో వంతు భారతీయులే. మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో వడ్డించే ఆహారపదార్థాలను పని విభజనతో ఒక ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్ లో తయారు చేసినట్లు చేయడాన్ని గమనించి, తన దగ్గర జరిగే కంటి ఆపరేషన్లలో కూడా 70 శాతం పనులుగా ఉండే సాధారణ ప్రక్రియలన్ని పారా మెడికల్  సిబ్బంది చేసేటట్లుగా, ముఖ్యమైన చికిత్చను డాక్టర్లు చేసే విధంగా  శస్త్ర చికిత్చా పద్దతిని అభివృద్ధి చేయడం ద్వారా ఒక రోజులో చేయగలిగే కంటి ఆపరేషన్ల సంఖ్యను ఎన్నో రెట్లు పెంచగాలిగారు. అదే విధంగా తినే వస్తువుల తయారీలో వారికి ఫ్రాంచైజీలు ఉన్నప్పుడు సేవారంగం అయిన చికిత్సలో ఎందుకుండకూడదు అని ఆలోచించారు. దేశం మొత్తం మీద ఐదు ఆస్పత్రులు ‘అరవింద్’ పేరు మీద విస్తరించాయి.

ఈ ఆస్పత్రుల్లో పనిచేసే ప్రతి స్థాయి సిబ్బందినీ కొన్ని వ్యక్తిగత సిద్ధాంతాలకు అనుగుణంగా ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా బాధ్యతా సరిహద్దులుంటాయి. అక్కడ పని చేయడానికి నైపుణ్యం కంటే ఆలోచనా విధానం మూలం. నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి ఆస్పత్రే శిక్షణ ఇస్తుంది. సగటున భారతదేశంలో కంటి డాక్టరు 220 ఆపరేషన్లు చేస్తే అదే అరవింద్ ఆస్పత్రి డాక్టరు దాదాపు 2,000 ఆపరేషన్లు చేస్తున్నారు. దేశం మొత్తం మీద ఏడాదికి ఎన్నో లక్షల ఆపరేషన్లు ‘అరవింద్ ఆస్పత్రి’ ద్వారా జరుగుతున్నాయి. చేయించుకోబోయే ఆపరేషన్ ఉచితంగానా లేదా కొంత రుసుం చెల్లించాలా అనేది రోగి నిర్ణయించుకుంటాడు. అయితే ఇద్దరికీ ఒకే నాణ్యత కలిగిన వైద్యం చేస్తారు. సగటున రెండు వంతులు ఉచితంగాను, ఒక వంతు ఫీజు చెల్లించి ఆపరేషన్లు జరుగుతాయి. ఫీజు చెల్లించగల ఒక రోగి ఫీజు చెల్లించలేని ఇద్దరు రోగుల ఖర్చు భరిస్తాడన్నమాట. ఆరంభంలో చికిత్సలో అవసరమయ్యే Lens import చేసుకొనేవారు. ప్రతి లెన్స్‌కీ 200 డాలర్లు ఖర్చు వస్తుండటంతో తమ నైపుణ్యాన్ని ఉపయోగించి ప్రతి Lens 5 డాలర్లకే తమ దగ్గరే తయారు చేస్తూ సొంత అవసరాలకు పోను, 85 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చారు. 85 ఏళ్ల వయసులో కూడా ఉదయం ఏడు గంటలకు ఆస్పత్రికి వచ్చేవారాయన. క్రమం తప్పకుండా పేషెంట్లను చూసే వారు. సాధారణ జీవితం, నిజాయితీ, నిబద్ధతల్లో గాంధీజీయే ఆయన ఆదర్శం. అలా ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిన వ్యక్తి డాక్టర్ ’V’ అని అందరూ ప్రేమగా పిలుచుకునే డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి.

డాక్టర్ వెంకట స్వామి జీవితాన్ని చూస్తే..
"In nothing do men more nearly approach the Gods than in giving health to men" అనే సిసిరో మాటలు గుర్తుకొస్తాయి.

ఆశ్రమానికో, ఆలయానికో వెళ్లి ఆధ్యాత్మికాభివృద్ధి తెచ్చుకోవడం కంటే ఆదరణతో ఆరోగ్యాన్నందించటం మెరుగైన ఆధ్యాత్మికాభివృద్ధి అనేది ఆయన జీవిత సారం.

వైద్యవృత్తి మిగతా అన్ని వృత్తులకంటే గొప్పది. ప్రపంచ నాగరికతల అధ్యయనంలో లభించే ముఖ్యమైన పాఠం ఏమిటంటే.. ఏ నాగరికతైనా నిలదొక్కుకోగలిగింది అంటే దానికి కారణం ఆ సమయంలో ఉన్న అధ్యాపకులు, డాక్టర్లు, సైనికులే. ధనమే జీవన ప్రాధాన్యంగా పరుగులు తీస్తున్న ఆధునిక నాగరికత సునామీని తట్టుకుని సంవత్సరాల శ్రమకోర్చి డాక్టర్ కావాలనే ఆశయం కలిగి ఉండటం కష్టమే. కానీ ఈ వృత్తి విలక్షణత మరి దేనికీ లేదు.. రాదు. ఇది వ్యాపారం కాదు.. కారాదు. అల్పకాలంలో అనంతమైన డాలర్లు ఆర్జించకపోవచ్చు. స్వల్పకాలంలో జీవనోపాధి కోసం నేర్చే తాత్కాలిక విద్యను, శాశ్వతమైన యశస్సును, ఆత్మానందాన్ని ఇచ్చే, సంవత్సరాల తరబడి అకుంఠిత దీక్షతో చేసే తపస్సు లాంటి వైద్యవిద్యను ఎలా పోల్చ గలం? అరటి చెట్టును కొబ్బరి చెట్టుతో పోల్చగలమా?

నేను చదువుకుంటున్న రోజుల్లో నిమ్స్ (NIMS) పూర్వ డైరక్టర్ శ్రీ కాకర్ల సుబ్బారావు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా కొంతమంది విశిష్ట వ్యక్తులు ఆయన్ని సన్మానించి అభినందించారు.

ఆ సభలో తన జీవితాశయాన్ని శ్రీ సుబ్బారావు గారు చిన్న శ్లోకంలో వివరించారు.

నత్వహం కామయే రాజ్యం
న స్వర్గం నపునర్భవం
కామయే దుఃఖ తప్తానాం
ప్రాణినా మార్తి నాశనమ్


‘‘నాకు రాజ్యం, స్వర్గం, పునర్జన్మ వీటి మీద కాంక్ష లేదు. నా కోరిక ఒక్కటే. దుఃఖంతో తపించే ప్రాణుల ఆర్తిని తొలగించటమే’’. హిరణ్యకశపుణ్ణి శిక్షించి ప్రహ్లాదుడిని రక్షించడానికి నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుడిని సంహరించిన నారాయణుడు (విష్ణుమూర్తి) ప్రహ్లాదుడిని అనుగ్రహించిన సందర్భంలో ప్రహ్లాదుడు అన్న మాటలివి. ఎంత అణకువ, ఆర్తి ఉన్న ఆశయం డాక్టరు సుబ్బారావు గారిది. అలాంటి వారిని వరిస్తే అవార్డుల విలువ మరింత ఇనుమడిస్తుంది. డాక్టరు చదవాలనుకునేవారూ, చదువుతున్నవారూ, చదివినవారూ ఈ శ్లోకాన్ని రోజుకోసారి జ్ఞప్తికి తెచ్చుకొంటే పేరు ప్రఖ్యాతులు వారిని వెతుక్కుంటూ వస్తాయి. ‘‘నైపుణ్యం, మానవత్వం కలపోసిన మానవ దేవతలే డాక్టర్లు. ప్రాణం సృష్టించడం ఎంత గొప్ప దైవకార్యమో నిలబెట్టడం కూడా అంతే గొప్ప దైవకార్యం’’ అన్న వోల్టేరు మాటలు అక్షరసత్యం.

మదర్ థెరిస్సాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. అది ఆవిడ కావాలని కోరుకోలేదు. దాని కోసం పరితపించనూ లేదు. వ్యాధి పీడితుల్లోనే నాకు జీసస్ కన్పిస్తాడు (Jesus in Disguise) అని అనేవారు. వారికి సేవ చేస్తున్నప్పుడు భగవంతునికి ఎంతో దగ్గరగా ఉన్నట్లు అన్పిస్తుంది. ఆకలితో, అనారోగ్యంతో, అనాదరణతో అలమటిస్తూ బాధపడేవారు మనలోని దైవాన్ని త్వరగా అనుభవించేటట్లు మనకు సహాయపడేవారే అంటారామె. ఆమె విమాన ప్రయాణం ఎప్పుడు చేసినా విమానంలో ఇచ్చే ఆహారాన్ని ఎవరైనా తినకుండా వదిలివేస్తే లేదా తిరస్కరిస్తే ఆ ఆహారాన్నంతా పోగు చేసి తీసికొచ్చి క్షుధార్తులకు పెట్టేవారు. దయతో, ప్రేమతో చేసే చిన్న సాయమైనా నిర్దయ నిరాదరణలతో కూడిన పెద్ద దానాలను మించిందని అనే వారు. ఆమె మాటల్లో, చేతల్లో పోతన చెప్పిన మాటలే ధ్వనిస్తాయి. (రంతిదేవుడు ఒక క్షుధార్తునితో)

అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి
త్రావుమన్న రావన్న శరీరధారులకు నాపద వ
చ్చిన వారి ఆపదల్ గ్రన్నన మాన్పి వారికి
సుఖంబులు సేయుట కన్న నొండు మేలున్నదె


తన వద్ద ఉన్నదంతా క్షుధార్తులకు పెట్టి కొద్ది రోజులుగా ఆకలితో ఉంటూ సంపాదించిన కొద్ది అన్నాన్ని భార్యా బిడ్డలతో తినబోతుండగా దాన్ని కూడా క్షుధార్తికి పెట్టి మిగిలిన నీళ్లు తాగబోతుండగా మరో వ్యక్తి వచ్చి ఆకలిగా ఉంది అని ఆర్థిస్తే అంతటి నిస్సహాయ నీరస స్థితిలో కూడా రంతిదేవుడు అన్న మాటలివి.

‘అయ్యా! నా దగ్గర అన్నము లేదు కానీ చక్కని మధురమైన నీరు ఉంది. ఇది స్వీకరించు. తోటివారి కష్టాలు తీర్చి వారికి సాయపడటం కంటే నాకు కావలసిందేముంది’ అని అప్యాయంగా నీటిని అందించాడు.

మదర్ థెరిస్సా, రంతిదేవులను అలా తీర్చిదిద్దిన మూల గుణాలను గురించి కనీసం ఆలోచిస్తేనైనా మనం చేసే పని పట్ల, మన వృత్తి పట్ల మన దృ క్పథం మధురంగా మారుతుందేమో.

50 వేల గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ వేణుగోపాల్‌కు తన గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు తన స్టూడెంట్స్ టీంలో అందరికంటే తక్కువ అనుభవమున్న డాక్టరుతో ఆపరేషన్ చేయించుకోవడమే కాక ఐదు గంటల్లోనే స్పృహలోకి వచ్చి ఆయన వేసిన మొదటి ప్రశ్న ICU లో పేషెంట్లు ఎలా ఉన్నారని. ఎంత అంకిత భావం!

ఆయుర్వేద గ్రంథమైన చరక సంహితలో వైద్య వృత్తిలో ఉండే వారందరికీ పాటించాల్సిన కనీస ధర్మాలు క్రోడీకరించడం జరిగింది. మన పూర్వులు వైద్యునికి ఉండాల్సిన లక్షణాలను గురించి ఒక శ్లోకంలో ఇలా చెప్పారు.

గురో రధీ తాఖిల వైద్య విద్యః
పీయూష పాణిః కుశలః క్రియాసుః
గత స్పృహో ధైర్య ధరః కృపాళుః
శుద్ధోధికారీ భిషగీదృశః స్యాత్


వైద్య శాస్త్రాన్ని గురు ముఖంగా అధ్యయనం చేసిన వాడై ఉండాలి. చికిత్సా క్రియల్లో సమర్థుడుగా ఉండాలి. ధనాశ లేనివాడై ఉండాలి. మందు కోసం ఎవడన్నా వచ్చాడా వాణ్ణి పీల్చి పిప్పి చేద్దామనే ఆశాపాతకుడై ఉండరాదు. ఎలాంటి జబ్బునైనా మాన్పగలననే ధైర్యం కలవాడై ఉండాలి. పరిశుద్ధ చరిత్రుడుగా ఉండాలి. అన్నిటినీ మించి అమృతహస్తుడై ఉండాలి. అంటే చేయివాసి బాగుండాలి. ఇలాంటి వాడే వైద్యం చేయించడానికి అర్హుడు.

ఒక మందుల దుకాణంలో గోడపై ఇలా రాసి ఉంది "Never go to a doctor whose office plants have died". అంటే తన చుట్టుపక్కల ఉండే సమస్త ప్రాణుల మీద అవాజ్యమైన మమకారం అవసరం. ఈ వైద్య విద్యను విద్య అనే కంటే పవిత్రమైన బాధ్యత అనడం సముచితం. బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ. అందుకని తల్లిని అయితే నాకేంటి లాభం అని జన్మనిచ్చే తల్లి ఆలోచించగలదా. అలాగే పునర్జన్మనిచ్చే డాక్టర్ కూడా!!

ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ కూడా మాట్లాడలేని స్థితిలో ఉండి కూడా మూడు సార్లు బైపాస్ సర్జరీ చేయించుకుని నడవలేక వీల్ ఛెయిర్‌కు పరిమితమై, పక్షవాతంతో బాధపడుతూ కూడా తోటి మానవుల బాధను చూడలేక గత 40 ఏళ్లుగా దాదాపు మూడు లక్షల ఆపరేషన్లు చేసి, జన్యు పరమైన సమస్యలతో ఏర్పడే ముఖ, శారీరక వికలత్వాన్ని ఎంతోమందికి దూరం చేసి వారిని ఆత్మవిశ్వాసంతో జీవింపచేసేందుకు దారి చూపిన డాక్టర్ శరద్‌కుమార్ దీక్షిత్‌ను మరింత క్లిష్ట పరిస్థితిలో ఉండి అంతమందికి ఎలా వైద్యం చేస్తున్నారని ప్రశ్నిస్తే ‘‘వారి సమస్యలను తీరుస్తున్నంతసేపు నాకు నా వైకల్యాలేవీ గుర్తు రావు. నావల్ల వారికి మెరుగైన జీవితం లభిస్తుంటే అంతకంటే నాకు కావల్సిందేముంది’’ అంటారు పద్మశ్రీ గ్రహీత. ఎనిమిది సార్లు నోబెల్ పురస్కారానికి నామినేట్ అయినా అవార్డు రాలేదని బాధపడరు సరికదా నా పేషెంట్ తన ముఖ లేదా శారీరక వైకల్యం పోయి తానిప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందు కంటే ఎంతో పరిపూర్ణమైన జీవితం గడుపుతున్నానని చెప్పినప్పుడు ఎనిమిది నోబెల్ బహుమతులు అందుకున్నంత ఆనందం నాకు కలుగుతుందని అంటారీ మానవ దైవం.

అలాగే డాక్టర్ బిమన్ చంద్ర రాయ్ (B.C. Roy). చిన్నతనంలోనే తల్లిని కోల్పోయినా తండ్రి సేవా భావం క్రమశిక్షణలో తోటివారి మనసును అర్థం చేసుకోవడం నేర్చుకున్నాడు. కష్టపడి చదివి మెడికల్ కాలేజీలో స్కాలర్‌షిప్‌తో చేరాడు. కాలేజీలో ఒకచోట రాసిన సందేశం 'Whatever thy hands find to do, do it with thy might'. 'ఏ పని చేద్దామనుకుంటున్న పూర్తి శక్తితో చెయ్యి.' ఈ సందేశమే జీవితాంతం ఆయనకు దిక్సూచి అయింది. స్వాతంత్య్రోద్యమంలో కూడా ఎంతోమందికి సేవ చేశాడు. ఒకసారి గాంధీజీ వైద్యం చేయడానికి వెళితే ‘నీతో వైద్యం నేనెందుకు చేయించుకోవాలి? నువ్వు 40 కోట్ల భారతీయులందరికీ ఉచితంగా వైద్యం చేస్తున్నావా?’’ అని అడిగారు. 40 కోట్ల భారతీయుల ప్రతినిధికి నేను వైద్యం చేస్తున్నాను. తర్వాత వారికీ చేస్తాను అని గంభీరంగా పలికి గాంధీజీకి వైద్యం చేసి తర్వాత మరణించేవరకూ తన మాటను నిలబెట్టుకున్నారు. మరణించే రోజు కూడా ఉదయం రోగులకు వైద్యం చేసి, మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ తర్వాత ఒక ఇష్టమైన దైవగీతాన్ని పాడుకుంటూ పరలోకం వెళ్లిపోయారు. తన నివాసాన్ని కూడా వైద్యశాలగా మార్చమని వీలునామా రాసిన ఆ నిస్వార్థ వైద్య, రాజకీయ తపస్వి పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న డాక్టర్ బి.సి. రాయ్. వైద్యరంగానికి అంతటి నిస్వార్థ సేవ చేసిన ఆయన బి.సి. రాయ్ పుట్టిన రోజు, మరణించిన రోజు కూడా ఒకటే కావడం విశేషం. అందుకే ఆరోజును (జూలై ఒకటో తేదీ) ‘డాక్టర్స్ డే’ గా జరుపుకుంటాం.

వైద్య వృత్తిలో వేసే ప్రతి అడుగూ, పనిచేసే ప్రతి క్షణమూ సామాజిక సంబంధాలు, మానవతా విలువలు, శాస్త్ర సాంకేతిక వాస్తవాలు, ఊహకందని ప్రకృతి పరమాత్మ లీలలు.... వీటి మధ్య సున్నితమైన సమన్వయాన్ని సాధించాల్సి వస్తుంది. యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు.

‘‘ఆతురస్య చకిం మిత్రం’’ రోగ పీడితునికి ఎవరు మిత్రుడు అని, ‘‘ఆతురస్య భిషజ్ఞిత్రం’’ రోగ పీడితునికి వైద్యుడే ఆప్త మిత్రుడని ధర్మరాజు సమాధానమిస్తాడు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ శాంత గారు తను అవార్డు అందుకుంటున్న సమయంలో డాక్టర్ వృత్తిలోని తన మూల సూత్రాన్ని ఇలా వివరిస్తారు.

"When the sick approach the gates of the hospital, weak in body and spirit and full of fear, there is only one response, you have to become part of them. Every obstacle I have overcome, every patient I have cured, every child I have treated who has grown, got married and come back to see me with his children made my whole life memorable".

‘‘శారీరకంగా, మానసికంగా దుర్భలంగా ఉన్న ఒక పేషెంట్ ఏమవుతుందోనన్న భయంతో మన వద్దకు వచ్చినప్పుడు వారితో మమేకం కావడమే మన ప్రతిక్రియగా ఉండాలి. నేను వైద్యం చేసిన తర్వాత ఆ వ్యక్తులు పెద్దయి తమ కుటుంబ సభ్యులు భార్యా పిల్లలతో నా దగ్గరకొచ్చి తమ ఆనందాన్ని పంచుకొన్నప్పుడల్లా నా జీవితం మధురానుభూతులతో నిండిపోతుంది’’ ఎంత దైవత్వంతో నిండిన మాటలు. పేషెంట్లను social security నంబర్లుగా భావించే ఆసుపత్రులు ఇటువంటి దైవ వైద్యుల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందేమో కదా! లేకపోతే ఒక కవి ఒకానొక సందర్భంలో

వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ సహోదరః
యమస్తు హరతిప్రాణః వైద్యః ప్రాణాని ధనాని చ


‘‘వైద్యుడు యముని సోదరుడు. యముడు ప్రాణాన్ని మాత్రమే హరిస్తాడు. వైద్యుడు ప్రాణాన్ని, ధనాన్ని కూడా హరిస్తాడు’’ అన్న మాటలు నిజం అని భావించే ప్రమాదం లేకపోలేదు.

A doctor shall have heart of a mother, eye of an eagle, and hand of a lady (వైద్యునికి తల్లి లా ఆత్మీయమైన హృదయం, రోగాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే గద్ద లాంటి దీర్ఘదృష్టి, స్త్రీ చేయిలా కోమలమైన స్పర్శ కలిగిన వారై ఉండాలి.) స్వచ్ఛమైన తెల్లని కోటు, ఆత్మీయమైన చెరగని చిరునవ్వు, మొక్కవోని నిబ్బరం, అలుపెరగని అంకితభావం, విసుగెరగని వృత్తి ప్రేమ వైద్యునికి సహజ ఆభరణాలు. ఈ ఆభరణాలు ధరించి వచ్చే వైద్యుడిని చూడగానే రోగికి సగం స్వస్థత చేకూరుతుంది.

"People caring for people compassion and kindness in difficult circumstances. This is the medicine we need the most".
‘‘ప్రతికూల పరిస్థితుల్లో దయార్ధ్ర హృదయంతో తోటివారిని సేవించగలగడమే అత్యంత ముఖ్యమైన మందు.’’ అంటారు డాక్టర్ బీసీ రాయ్. తమ తమ వృత్తుల్లో తీరిక లేకుండా గడిపే ఒక తల్లిదండ్రుల పిల్లవాడు బరువు పెరగడం లేదనీ, ఎన్ని మందులు టానిక్కులూ వాడినా ప్రయోజనం కన్పించ లేదనీ ఒక పిల్లల డాక్టరు వద్ద మొరపెట్టుకున్నారు. ఆ పిల్లల డాక్టరు గారు ఇచ్చిన ప్రిస్కిప్షన్ 'The baby to be loved every three hours'.

అందుకే డాక్టరు వ్యాధిని గుర్తించేటప్పుడు సైంటిస్ట్ గానూ, చికిత్స చేసేటప్పుడు ఆర్టిస్ట్ గాను, రోగితో సంభాషించేటప్పుడు ఒక ఆత్మీయుడిగాను, రోగిని మందలించేటప్పుడు ఒక తల్లిగాను తన నైపుణ్యాన్ని మెరుగు పరచుకుంటున్నప్పుడు ఒక కళాకారునిగాను, రోగికి మందులు బిల్లు రాసేటప్పుడు ఒక తండ్రిగాను ఇలా ఎన్నో రూపాల్లో రూపాంతరం చెందుతూ నారాయణుడిలా దశావతారాలు ఎత్తాల్సి ఉంటుందనే కాబోలు ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు. వైద్యుడు సాక్షాత్తూ భగవత్స్వరూపుడు. ‘లాభానాం శ్రేష్టమా రోగ్యం’ అన్ని లాభాల్లోకి శ్రేష్టమైంది ఆరోగ్యం. అటువంటి శ్రేష్ట లాభాన్నిచ్చే నరశ్రేష్టుడు నారాయణుడే కదా! మన వైద్య విద్యార్థులూ, వైద్య నిపుణులూ ఈ దైవీ గుణ సంపదతో తుల తూగాలనీ ఆ నారాయణునిలా నిత్యం స్మరింపబడాలనీ ఆ నారాయణుడినే ప్రార్థిద్దాం. వేదవ్యాసుని మాటల్లో..

శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః


శరీరం వ్యాధిగ్రస్తమై బలహీనమైనప్పుడు ఔషధమే గంగాజలం, వైద్యుడే నారాయణుడు, శ్రీహరి (హరించువాడు).

వెద్యుడి వృత్తి ధర్మాల ప్రమాణ స్వీకారం
ప్రాచీన గ్రీకు వైద్యుడు, ఆధునిక వైద్య వృత్తి పితామహుడైన హిపోక్రేట్స్ వైద్య వృత్తిలో పాటించాల్సిన కనీస ధర్మాల గురించి వివరించిన అంశాలను వైద్యవృత్తిలో చేరబోయే వారందరూ వృత్తి ధర్మాలను ప్రమాణ స్వీకారంగా తప్పనిసరిగా స్వీకరిస్తారు.
 • ‘‘సమస్త దేవతల సాక్షిగా నా శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరించి ఈ ప్రమాణం చేస్తున్నాను.
 • ‘‘నాకీ వైద్య విద్యను నేర్పిన గురువులను, నా తల్లిదండ్రులతో సమానంగా ఆరాధిస్తాను.
 • నా వ్యక్తిగత జీవితంలో శీలం, సంస్కారంతో స్వచ్ఛంగా జీవిస్తాను. నా దగ్గరకు వచ్చే రోగులకు అవసరమైన మోతాదు వరకే హాని చేయని మందులను వాడమని సలహా ఇస్తాను.
 • పర గృహంలోకి ప్రవేశించే సమయంలో పవిత్ర భావంతో ఆ గృహంలోని స్త్రీ, పురుషుల పట్ల ఎటువంటి చెడు తలంపులు దరి చేరనీయకుండా (సోదర భావంతో మెలుగుతూ) ఆర్తుల బాధను ఉపశమింపచేసే ఉద్దేశంతోనే చికిత్స చేస్తాను.
 • నా దగ్గరకొచ్చి తమ వ్యాధి బాధలను చెప్పుకొనే వారందరి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతూ వారి privacy, dignity లకు భంగం కలుగనివ్వను.
 • నా దగ్గరకొచ్చేవారు అపారమైన నమ్మకంతో తమ ప్రాణాన్ని నా చేతుల్లో ఉంచుతున్నారన్న విషయాన్ని మననం చేసుకుంటూ వారి పట్ల అంకితభావంతో అణకువతో నా పరిధి మేరకు నేను చేయగలిగిన సర్వప్రయత్నాలు చేసి వారిని కాపాడుతాను.
 • నా వృత్తి ఒక విజ్ఞానశాస్త్రమే కాక ఒక కళగా కూడా భావించి శస్త్ర చికిత్సకు వాడే కత్తెరలు, మందులు ఎంత ముఖ్యమో వాటి కంటే రోగి పట్ల సానుభూతి, ఆత్మీయత, దయ మరింత ముఖ్యమైనవని గుర్తుంచుకుంటాను.
 • వైద్య వృత్తి పురోగతికి దోహదం చేసిన పూర్వ గురువులందరి బాటలో పయనిస్తూ నేను ఆర్జించిన జ్ఞానాన్ని అర్హులకు పంచుతాను. నాకు తెలియని విషయాన్ని ‘తెలియదు’ అని అంగీకరిస్తూ రోగి ఉపశమనానికి అవసరార్థం నా మిత్రులు, గురువులు, నిపుణుల సలహా తీసికొనేందుకు, నా వృత్తి మెళకువలు పదును పెట్టుకొనేందుకు నేను సిగ్గుపడను.
 • చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి వీలైనంతవరకు ప్రజల్లో రోగ నివారణకు నేను చేయాల్సిన కృషి అంతా చేస్తాను.
 • నేనూ సమాజంలో భాగం కాబట్టి సమాజంలోని తోటి మానవుల పట్ల, బలవంతుల-బలహీనుల పట్ల, ధనవంతులు-పేదవారి పట్ల సమభావంతో వ్యవహరించడం నా సామాజిక బాధ్యతగా భావిస్తాను.
 • నేను జీవించినంతకాలం వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆనందంగా ఉంటూ, జీవితాన్ని చాలించిన తర్వాత నా తోటివారి శ్రేయోభిలాషిగా గుర్తుంచుకోబడాలని, గౌరవించబడాలని, దానికి అవసరమైన వృత్తి పరమైన కట్టుబాట్లలో జీవిస్తూ నా జీవితాన్ని పరిపుష్టం చేసిన వృత్తిని నేను పరిపుష్టం చేయడానికి ప్రయత్నిస్తాను’’. ఈ ప్రమాణాన్ని వైద్య వృత్తిలో ప్రవేశించే వారందరూ స్వీకరించినా త్రికరణ శుద్ధిగా పాటించేవారు మాత్రమే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

 
Published date : 20 Nov 2021 02:16PM

Photo Stories