Skip to main content

వాగ్భూషణం... భూషణం!

మన చర్యలకు మూలం మన ఆలోచనలే. మన ఆలోచనలు మన స్వభావానికి తగ్గట్టుగానే ఉంటాయి. మనం మన ఆలోచనలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే అవే మన మాటలవుతాయి. ఆ మాటలే మన చేతలవుతాయి. ఆ చేతలే మన శీలం. ఆ శీలమే మన భవిష్యత్తు. అంటే భవిష్యత్తుకు పునాది మన ఆలోచనలే.

సమాజసేవే నీ లక్ష్యం అయితే డాక్టర్‌గా సేవ చేయొచ్చు కదా? ఐ.ఎ.ఎస్. ఎందుకు? అని ఒక డాక్టర్ మిత్రుడ్ని సివిల్స్ ఇంటర్వ్యూలో అడిగారు. ‘డాక్టర్‌ని అయితే రోగాన్ని నయం చేయొచ్చు... కానీ అదే ఐ.ఎ.ఎస్. అయితే రోగానికి వెనక ఉన్న కారణాల్ని కూడా నయం చేయొచ్చు అని సమాధానం ఇచ్చాడు. అదే రోజు మరో ముగ్గురు డాక్టర్లు కూడా ఇంటర్వ్యూకి హాజరయ్యారు. కానీ అతనొక్కడే సెలెక్ట్ అయ్యూడు. దీనికి కారణం అతనికి ఉన్నమెరుగైన సంభాషణా నైపుణ్యమే. సంభాషణ అనేది కాఫీలా ఉత్తేజపరిచేదిగా, తర్వాత నిద్ర పట్టనీయకుండా ఆలోచింపచేసేదిగా ఉండాలనే దానికి అతని సమాధానమే నిదర్శనం.
ఈ కాలంలో మూడేళ్ల పిల్లవాడి నుంచి 30 ఏళ్ల ఉద్యోగార్థి వరకు ఏదో ఒక ఇంటర్వ్యూ ఎదుర్కోవాల్సిన అవసరం తప్పనిసరి అవుతోంది. సంభాషణా నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలో నెగ్గుకురావడం చాలా కష్టం. ఒక వేళ నెగ్గినా తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు పెంచుకోలేకపోవటం వల్ల జట్టులో సభ్యుడిగా టీమ్ స్పిరిట్‌తో పని చేయలేక ఆశించిన లక్ష్యాలు సాధించలేకపోతున్నారు. దీంతో ఉద్యోగాలు కోల్పొయి. .. ఆ ఒత్తిడిలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

మొక్కై వంగనిది మానై వంగదు కదా!. చిన్నప్పటి నుంచి అలవరుచుకోవాల్సిన సంభాషణా నైపణ్యాన్ని ఒక్కరోజులో కోచింగ్ సెంటర్లో నేర్చుకోలేం. అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోన్‌ను కనిపెట్టే నాటికి... ఎలీసా గ్రే అనే శాస్త్రవేత్త టెలిఫోన్ పనిచేసే సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. అయితే తోటి మేధావులను, శాస్త్రవేత్తలను ఒప్పించటంలో గ్రే విఫలమడంతో... గ్రాహంబెల్‌కు టెలిఫోన్‌ఫై పేటెంట్‌తో పాటు కీర్తి కూడా దక్కింది. సామర్థ్యం ఎంత ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఎదుటివారితో మాట్లాడి వారిని ఒప్పించగలిగే నైపుణ్యం లేకపోతే ఆ సామర్థ్యం సార్థకం కాదు అనటానికి ఇదే నిదర్శనం.

కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అదేదో జఠిల సమస్యలా కాకుండా... ఆలోచనల కూర్పు, వినే ఒర్పు, మాట్లాడే నేర్పుల సమాహారంగా భావించాలి. మన చర్యలకు మూలం మన ఆలోచనలే. మన ఆలో చనలు మన స్వభావానికి తగ్గట్టుగానే ఉంటాయి. మనం మన ఆలోచనలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే అవే మన మాటలవుతాయి. ఆ మాటలే మన చేతలవుతాయి. ఆ చేతలే మన శీలం. ఆ శీలమే మన భవిష్యత్తు. అంటే భవిష్యత్తుకు పునాది మన ఆలోచనలే. ఒక వ్యక్తి ఆలోచించే విధానం అతని పరిసరాలు, పెరిగిన వాతావరణం, విద్యాభ్యాసం, మిత్రులు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతికి ఎంత దగ్గరగా జీవిస్తే ఆలోచనలు అంత సహజంగా ఉంటాయి అంటారు శాస్త్రవేత్తలు. ఒక రోజు సంపన్న కుటుంబానికి చెందిన ఒక తండ్రి తన కొడుక్కి పేదరికం అంటే ఏమిటో చూపించాలని.. ఒక నిరుపేద కుటుంబానికి తీసుకెళ్లి అక్కడ రెండు రోజులు గడిపాడు.
 
చూశావా పేదవాళ్లు ఎంత హీనంగా జీవిస్తున్నారో, వాళ్లతో పోలిస్తే మనం ఎంత అదృష్టవంతులం అనంటూ... ఈ అనుభవం ద్వారా నువ్వు నేర్చుకున్నదేమిటని కొడుకుని అడిగాడు. కుమారుడు తడుముకోకుండా మనకి ఒక కుక్క ఉంటే వాళ్లకి నాలుగున్నాయి. మనల్ని కాపాడటానికి మన ఇంటి గోడలు ఉంటే... వాళ్లకు ఆత్మీయ మిత్రులున్నారు. మన ఇంటిలో తోట సగం వరకు స్విమ్మింగ్‌పూల్ ఉంటే.. వాళ్ల ఇంటి పక్క నుంచి సెలయేరు ప్రవహిస్తోంది. మనం నిద్రపోయేటప్పుడు బెడ్‌రూంలో విదేశీ లైట్లు వెలుగుతుంటే వాళ్లు నిదురించేటప్పడు ఆకాశం నిండా నక్షత్రాలు వెలుగుతుంటాయి. మన వరండా ఇంటిగోడ వరకు ఉంటే, వాళ్ల వరండా భూమి కనిపించ నంత వరకు ఉంది. మనకి సేవచేసే సేవకులు ఉంటే, వాళ్లు ఇతరులకు సేవచేసే సేవకులు. మన ఆహారాన్ని మనం కొనుక్కుంటే వాళ్ల ఆహారాన్ని వాళ్లు పండించుకుంటారు అని చెప్పి మనం ఎంత పేద వాళ్లమో చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. ఆ మాటలకు తండ్రి నోటి వెంట మాటరాలేదు. ఇంతటి ఉదాత్తత, స్పష్టత, సరళత ఆలోచనల్లో ఉంటే చక్కని భావ వ్యక్తీకరణకు పునాది పడ్డట్టే.

సంభాషణా నైపుణ్యంలో మరో ముఖ్య సూత్రం అవతల వారి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవటం. వినే ఓర్పు ఉంటేనే ఇది సాధ్యం. ఎదుటి వ్యక్తి చేప్పేది శ్రద్ధగా వినటమే.. ఆ వ్యక్తికి మనమిచ్చే అత్యున్నత మర్యాద. టెలివిజన్ వచ్చిన తరువాత వినే శక్తి తగ్గి, వ్యక్తిని ‘కదిలించలేని శక్తి’ స్థాయి నుంచి ‘కదలలేని వ్యక్తి’ స్థాయికి తెచ్చిందనే విమర్శ ఉంది. పెరుగుతున్న కుటుంబ కలహాలు, విడాకుల రేట్లు, సామాజిక అశాంతి వెనుక బలమైన కారణం వ్యక్తుల్లో వినే శక్తి తగ్గటమే అంటే అతిశయోక్తి కాదు. బుద్దుడు దేశాటన చేస్తునప్పుడు ఒక ఇంటి యజమాని ఎద్దులా ఉన్నావు, అడుక్కుతినే బదులు పనిచేసి సంపాదించుకోవచ్చు కదా! అని నానా దుర్భాషలాడాడు. బుద్దుడు ఓర్పుగా విని ‘ఒకవేళ మీరు దానం చేదలచి అది నేను స్వీకరించకపోతే.. ఆ భిక్ష ఎవరిదవుతుంది అని అడిగాడు. కచ్చితంగా నాదే అవుతుంది అని అన్నాడు యజమాని. అయితే మీ దుర్భాషలు కూడా నేను స్వీకరించను’ అని నిష్ర్కమించాడు. భగవంతుడు ఒక నోరు, రెండు చెవులిచ్చింది ఎక్కువ విని తక్కువ మాట్లాడటానికి. అహంకారికి చిన్న చెవులు, పెద్దనోరు ఉంటాయి. తనకు ఎముక లేక పోయినా ఇతరుల ఎముకలు విరిచే శక్తి నాలుకకు ఉంది. గురజాడ అన్నట్లు...

‘మాన్పగలిగితే కత్తికోతలు
మాన్పవసమే మాటకోతలు
కత్తి చంపును మాట వాతలు
మానవేనాడున్’


అందుకే మాట్లాడే ప్రతిమాట ఆలోచించి మాట్లాడమన్నారు. అలా అని ఆలోచించిందంతా మాట్లాడమని కాదు. ఆలోచనలు మాత్రమే మనవి. ఒకసారి మాట్లాడిన తరువాత ఆ మాటలు మనవికాదు. తరచూ తన తీవ్రమైన పదజాలంతో సహచరుల్ని బాధించే ఒక శిష్యుడ్ని సంస్కరించటానికి పూనుకున్న గురువుగారు.. ఎదుటివారిని తిట్టాలనిపించినప్పుడల్లా ఆశ్రమం ముఖద్వారానికి ఒక మేకు కొట్టమన్నాడు. కొన్నాళ్లకు తలుపు మేకులతో నిండిపోయింది. శిష్యుడి కోపం కూడా తగ్గిపోయింది. సహచరులతో మంచిగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇది గమనించిన గురువుగారు ఎదుటి వారిని సంతోషపెట్టే మాట మాట్లాడినప్పుడల్లా ఒక్కో మేకును తొలగించమన్నాడు. అలా కొన్నాళ్లకి మేకులన్నీ పోయి తలుపంతా రంధ్రాలతోమిగిలింది. అప్పుడు ఆ గురువుగారు అన్నారు...తీవ్రమైన మాటలు ఎదుటివారి హృదయూలపై చేసిన గాయూలు మానవని.

సంభాషణ అనేది ఒక కళ. మానవ అవసరాలను సంతృప్తిపరచడమే ఆ కళ లక్ష్యం. మనం ఇతరులతో సంభాషించే పద్ధతే మన జీవన నాణ్యతను తెలుపుతుంది. రామాయణంలో రాముడి గుణాలను వర్ణిస్తూ వాల్మీకి...
సత్య నిత్యం ప్రశాంతాత్మా
మృదు పూర్వంచ భాషతే
ఉచ్చమానోపి పరుషం
నోత్తరం ప్రతిపద్యతే...


రాముడు ఎప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. నిత్యం సత్యాన్నే మాట్లాడేవాడు. ఎవరైనా వస్తే తనే మొదట పలకరించి చిరునవ్వుతో మృదువుగా వారి బాగోగులు అడిగేవాడు. ఎవరైనా పరుషంగా మాట్లాడితే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు కాదు. అదే మనలో చాలా మంది ఎదుటివారు పలకరించ కుండా మనం ఎందుకు పలకరించాలని అతిశయంతో వ్యవహరిస్తాం. అందుకే కాబోలు సీతారాముల విగ్రహాల నుంచి ఆభరణాలు దొంగతనానికి గురైనప్పుడు... స్వామి వారి ఆభరణాలు పోయాయని బాధపడుతున్న తన భార్యతో త్యాగరాజ స్వామి ‘‘సుగుణ భూషణుడైన రాముడికి వేరే భూషణా లెందుకని’’ అంటాడు. దయతో మాట్లాడిన ఒక్క మాట ఎన్నో మందులు చేయలేని మేలుచేస్తుంది. ఈ జీవిత కాలంలో ఎంతోకొంత మంచి చేయగలిగినా.. తోటి వ్యక్తులతో ప్రేమతో మాట్లాడగలిగినా అంతే చాలు.

ఈ జీవితంలో మన ప్రయాణం ఒక్కసారే! ఎందుకంటే ఈ బాటలో మళ్లీ మనం కాలుపెట్టేది లేదు కదా!! భర్తృహరి అన్నట్లు తారహారాలు, మృదుపుష్ప సుగంధ జలాభిషేకాలు, ఇతర భూషణాలన్నీ నశించవచ్చు గాని.. వాక్కు నశించదు. వ్యక్తిని ఎల్లప్పుడూ అలంకరించే భూషణం వాక్కు. అందుకే వాగ్భూషణం భూషణం!!
 
A.V.Rajamouli, IAS
Published date : 20 Nov 2021 02:52PM

Photo Stories