Skip to main content

సుపుత్రః కులదీపకః

పిల్లల బంగారు భవిష్యత్ కోసం... తల్లిదండ్రులు తమ తాహతుకు మించి ఖర్చు చేసైనా... వారికి ఉన్నత విద్యను అందించాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. పిల్లలను గొప్ప చదువుల్లో చేర్పించేందుకు ఎన్ని త్యాగాలకైనా వెనుకాడటం లేదు. లోన్‌లు తీసుకొని మరీ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. తమ ఆలోచనలకు తగ్గట్లు పిల్లలు కూడా కష్టపడి చదవాలని కోరుకుంటున్నారు. అలా పిల్లల బంగారు భవిష్యత్తును కోరుకునే.. తల్లిదండ్రులకు పిల్లలను సకారణంగా మందలించే హక్కు, బాధ్యత రెండూ ఉన్నాయి... తల్లిదండ్రుల కోపం నీళ్లలో నిప్పు వంటిది.. వారి హృదయం విశ్వమంత విశాలమైనది.

’దైవ మనగ గురుండు నా ధర్మ మనంగ
నర్థ మన దలితండ్రులె యాత్మజునకు


వ్యక్తికి ధర్మం, అర్థం, గురువు, దైవం అన్నీ తల్లిదండ్రులే అంటాడు కాశీఖండంలో శ్రీనాధుడు!
ఈ జీవితంలో ఏదీ ఊరికే రాదు.. ప్రకృతి సిద్ధమైన తల్లిదండ్రుల ప్రేమ తప్ప! ప్రపంచంలో ఏదైనా అబద్ధం కావచ్చు.. తల్లిదండ్రుల ప్రేమ తప్ప!!

నిరుపేద కుటుంబంలో జన్మించి.. ఇప్పుడు సమాజంలో ఉన్నత హోదాలో ఉన్న మిత్రుడ్ని నీకు ఆదర్శం ఎవరు అని ప్రశ్నించాను. మహాత్మాగాంధీ అనో, బిల్‌గేట్స్ అనో, మదర్‌థెరిసా అనో సమాధానం వస్తుందని ఊహిస్తున్న సమయంలో... అతడు నమ్రతతో.. బొగ్గు గనుల్లో పని చేస్తున్న ‘మా నాన్న’ అని సమాధానమిచ్చాడు. చిన్నప్పటి నుంచి తన కష్టాన్నే నమ్ముకున్న మా నాన్న ... నన్నూ కష్టాన్నే నమ్ముకొమ్మన్నాడు. తన చేత్తో బొగ్గు పట్టుకుంటే.. నా చేత్తో కలం పట్టించాడు. బాల్యంలో తాను చదువుకోలేకపోయానని, తన చేతుల్లో సత్తువ ఉన్నన్నాళ్లు నా చేతిలో కలం వదలకుండా చూస్తానని మాట ఇచ్చాడు. నేను ఈ ఉన్నత స్థానం చేరే వరకు మాట తప్పని ఆ కర్మయోగి చేతలే నన్నింతటివాడ్ని చేశాయి. అందుకే మా నాన్న నాకు ఆదర్శం అని ఉద్వేగంగా చెప్పాడు. నాన్న పట్టించిన ఆ కలం, అతన్ని ఎన్నో లక్షల మంది భవిష్యత్‌ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా మార్చింది. మరి ఆ మిత్రుడిలా... నాన్నను, నాన్న కష్టాన్ని, మాటలను గుర్తుంచుకుని.. తండ్రి రుణాన్ని తీర్చుకునే పుత్రులెందరు?!

‘‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనియించినపుడే కలుగదు జనులా పుత్రుని కనుగొని పొగడగా’’అప్పుడు కలుగుతుందని సుమతీ శతకకారుడు చెప్పిన మాటలు ఎంతో నిజం!
 
తండ్రి, కొడుకుకి బహుమానం ఇస్తే.. కొడుకు ఆనందంతో నవ్వుతాడు. అదే కొడుకు, తండ్రికి బహుమానం ఇస్తే, ఆ తండ్రి ఆనందంతో ఏడుస్తాడు. కొడుకు తనను మించిన గొప్పవాడు కావడమే తండ్రికి బహుమానం. అదే పుత్రోత్సాహం!!

ఒక రోజు ఒక చెవిటి బాలుడు స్కూల్ నుంచి టీచర్ రాసిచ్చిన చీటి ఇంటికి తీసుకొచ్చాడు. అందులో‘‘మీ అబ్బాయిలాంటి మూర్ఖుడికి చదువు చెప్పడం చాలా కష్టం. దయచేసి స్కూల్ మాన్పించేయండి అని రాసి ఉంది. పిల్లవాడి తల్లి అది చదివి, మా అబ్బాయి చదువు నేర్చుకోలేనంత మూర్ఖుడేమి కాదు. వాడికి నేనే చదువు చెప్తాను. మా పిల్లవాడ్ని మూర్ఖుడన్న వాళ్లు నిలబడి గౌరవించే రోజు వస్తుంది’’ అని, తనే పిల్లవాడికి చదువు చెప్పింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి, కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయినపుడు యావత్ అమెరికా ప్రజలంతా ఒక్క నిమిషం పాటు లైట్లన్నీ ఆర్పివేసి, అతనికి తమ శ్రద్ధాంజలిని అర్పించారు. ఎందుకంటే... ఆ వ్యక్తి విద్యుత్ బల్బుతో పాటు వెయ్యికి పైగా పేటెంట్లను తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. అతనే ‘థామస్ ఆల్వా ఎడిసన్’. ‘‘పిల్లవాడు చెప్పలేనిది కూడా అర్థం చేసుకోగలిగేది తల్లి. ఎవరిపైనా ఆధారపడకుండా జీవించడం నేర్పేది తల్లి. అసాధ్యమైన పనులు చేయడానికి తల్లి ప్రేమే ఇంధనం అని’’ అంటూ.. తన తల్లి గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటారు ఎడిసన్. అందుకే అన్నారు - ‘మాతాసమం నాస్తి శరీర పోషణం’. ఈ శరీరాన్ని పోషించడంలో ప్రపంచంలో తల్లికి సాటి ఎవరూ లేరు. మరి అలా పెంచి పోషించిన తల్లిని, తల్లి మాటలను, గుర్తుంచుకుని ఆచరించేది ఎందరు?!

ఇటీవల కాన్పూరులో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక తహశీల్దారు పగలు, రాత్రి కష్టపడుతూ.. పిల్లల్ని గొప్ప చదువులు చదివించాలని, లోన్ తీసుకుని మరీ కొడుకుని మంచి కాలేజీలో చేర్పించాడు. తీరా కుమారుడి ఫలితాలు చూస్తే.. చాలా నిరాశాజనకంగా వచ్చాయి. తాను అంత కష్టపడి చదువు చెప్పిస్తున్నా.. తనకున్న తపన పిల్లాడికి లేదన్న బాధతో.. కాస్త కష్టపడి చదివితే ఇంకా మంచి మార్కులు వచ్చేవి కదా! అని మృదువుగా మందలించాడు. దానికే ఆ కుర్రవాడు క్షణికావేశానికి లోనై.. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయిన పిల్లవాడు సెకన్లలో తన జీవితాన్ని అంతం చేసుకుంటే.. పిల్లవాడ్ని తలచుకుని, ఆ తల్లిదండ్రులు క్షణమొక యుగంగా అనుభవిస్తున్న వ్యధ వర్ణనాతీతం. ఇలా పిల్లల క్షణికావేశాలతో.. జీవచ్ఛవాల్లా బతికే తల్లిదండ్రులు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు.

ఒక ప్రముఖ క్రీడాకారుడ్ని జీవిత బీమా ఏజెంట్ ఇలా అడిగాడు...‘‘నీ కోసం కాకపోయినా, నీ తల్లిదండ్రుల కోసమైనా ఏదన్నా పాలసీ తీసుకో..నీకేదైనా జరిగితే వారికి కష్టంలేకుండా జీవితం సాగిపోతుంది’’ అని! దానికి ఆ క్రీడాకారుడు ఇలా అన్నాడు. ‘‘ నాకే జీవిత బీమా అవసరం లేదు. నేను పుట్టినప్పటి నుంచి ప్రతిరోజూ వారి జీవిత సారాన్నంతా నాకే ధారపోశారు. ఇప్పటివరకూ వారే నా జీవిత బీమా. ఇప్పుడు నేనే వారికి సర్వస్వం. నేను జీవించి ఉండడమే వారికి జీవిత బీమా. నేనివ్వలేని రక్షణ వారికి ఏ బీమా ఇస్తుంది? నాకేదైనా జరిగితే పాలసీ క్లైమ్ చేసుకోవడానికి ఎవరూ ఉండరు, వాళ్లు నన్ను ఎంత అమితంగా ప్రేమిస్తారంటే.. నాకేదైనా జరిగితే వారు జీవించి ఉండలేరు’’ అన్నాడు. తల్లిదండ్రుల కోపం నీళ్లలో నిప్పువంటిది. వారి హృదయం విశ్వమంత విశాలమైంది.‘దైవ మనగ గురుండు నా ధర్మ మనంగనర్థ మన దలితండ్రులె యాత్మజునకు’ వ్యక్తికి ధర్మం, అర్థం, గురువు, దైవం అన్నీ తల్లిదండ్రులే అంటాడు కాశీఖండంలో శ్రీనాధుడు.

ఈ జీవితంలో ఏదీ ఊరికే రాదు..ప్రకృతి సిద్ధమైన తల్లిదండ్రుల ప్రేమ తప్ప! ప్రపంచంలో ఏదైనా అబద్ధం కావచ్చు.. తల్లిదండ్రుల ప్రేమ తప్ప. తండ్రి మాటలకు క్షణికావేశానికి లోనై, ఆత్మహత్య చేసుకునే ముందు ఆ కుర్రవాడు ఈ ఉదాహరణలో క్రీడాకారుడిలా ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఆ కుటుంబం, ఆ కుర్రవాడి భవిష్యత్ మరోలా ఉండేవేమో!!

కష్టపడి పిల్లల బంగారు భవిష్యత్‌ని కోరుకునే తల్లిదండ్రులకు పిల్లల్ని సకారణంగా మందలించే హక్కు, బాధ్యత రెండూ ఉన్నాయి. వివరణ, సంజాయిషీ, క్షమాపణ చెప్పవలసిన అవసరంరాని పనులే ఒక వ్యక్తి చేసే సరైన పనులు. తమ పనుల వల్ల ఈ మూడింటిలో ఏదైనా చెప్పవలసి వస్తే... వారి పనులను ప్రశ్నించి హితబోధ చేసి, అవసరమైతే మందలించే బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు మందలించినపుడు ఎందుకు మందలించారో అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని...తమ పనులను తాము సమతుల్య భావంతో విశ్లేషించుకోగలిగితే...ఆవేశం, అనర్థం స్థానంలో ఓర్పు, ఆలోచనా చోటు చేసుకుంటాయి.

ఒక పిల్లవాడు ఒక దుకాణంలోకి వెళ్లి అక్కడి యజమానిని ‘‘నేనొక ఫోన్‌కాల్ చేసుకోవచ్చా అని అడిగాడు?’’. షాపు యజమాని సరే అన్నాడు. దగ్గరలో ఉన్న ఎత్తుపీట మీదకి ఎక్కి పోఫోన్ అందుకు న్నాడు బాలుడు. షాపు యజమాని ఆసక్తిగా బాలుడ్ని గమనిస్తున్నాడు. టెలిఫోన్‌లో సంభాషణ ఇలా సాగింది. ‘‘అయ్యా! మీ ఇంట్లో తోటమాలిగా పని చేసే అవకాశం నాకు ఇప్పిస్తారా.’’ ‘‘నా వద్ద ఇప్పటికే తోటమాలి ఉన్నాడు’’ అని సమాధానం ఇచ్చింది అవతలి కంఠం. దానికి పిల్లవాడు ‘‘అయ్యా మీ దగ్గర పనిచేసే వ్యక్తి తీసుకునే జీతంలో సగానికి నేను చేస్తాను అన్నాడు.’’ ‘‘నా దగ్గర ఉన్న తోటమాలి పనితో నేను సంతృప్తిగా ఉన్నాను’’ అని అవతలి నుంచి సమాధానం వచ్చింది. దానికి పిల్లవాడు మరింత ఓర్పుతో..‘‘ అయ్యా మీ తోటపనితో పాటు మీ ఇల్లు శుభ్రం చేసే పని కూడా ఆ సగం జీతానికే చేస్తాను’’ అంటూ అభ్యర్థించాడు. ‘‘కుదరదు, అవసరం లేదు. నా వద్ద ఉన్న తోటమాలి పనితో నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను’’ అని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. పిల్లవాడు చిరునవ్వుతో తను కూడా ఫోన్ పెట్టేశాడు.

ఈ సంభాషణ అంతా వింటున్న షాపు యజమాని పిల్లవాడితో...‘‘నీ ఆశావాద దృక్పథం నాకు బాగా నచ్చింది. పని కోసం ప్రాధేయపడుతున్నట్టున్నావ్! నీకు ఇష్టమైతే నేనే నీకు పని ఇస్తాను’’అన్నాడు. పిల్లవాడు వెంటనే..‘‘అక్కర్లేదు సార్’’అన్నాడు. ‘‘మరి నీవు పని కోసం టెలిఫోన్‌లో అవతలి వ్యక్తిని అంతగా బతి మాలాతున్నావ్ కదా!’’ ‘‘లేదు సార్! నేనిప్పుడు పని చేసేచోట నా పనితనం ఎలా ఉందో పరీక్షించుకుంటున్నాను. నేనిప్పుడు మాట్లాడింది నా యజమానితోనే!!’’ అని బదులిచ్చాడు. తల్లిదండ్రులు కోప్పడ్డారని క్షణికావేశానికి లోనయ్యేవారు.. ప్రశ్నించారని అసహనానికి గురయ్యేవారు... ఈ పిల్లవాడిలా తన పనితనాన్ని పరీక్షించి చూసుకుంటే... వారి జీవితం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది!

పనుపక చేయుదు రధికులు పనిచిన మధ్యములు పొందుపరతురు తండ్రుల్ పనిచెప్పి కోరి పనిచిన
ననిశము మారాడు పుత్రులధములు


తల్లిదండ్రులు చెప్పకుండానే..తాము చేయవలసిన పని చేసే పుత్రులు ఉత్తములు. తల్లిదండ్రులు చెప్పిన తరువాత చేసేవారు మధ్యములు.తమ పని తాము చేయకపోగా.. తల్లిదండ్రులు గుర్తు చేసినా కూడా ప్రతిమాటకు ఎదురు సమాధానమిచ్చే పుత్రులు అధములు అంటారు పోతన భాగవతంలో!!మరి తల్లిదండ్రులు బాధ్యతలను గుర్తు చేస్తే.. ఆవేశాలకులోనై అనర్థం కలిగించేవారిని ఏమనాలి?!

ఒక చిన్న బాలికను మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే.. ‘‘మా అమ్మా నాన్న ఎక్కడో అదే నా ఇల్లు’’ అంది. మరి అమ్మా నాన్నల వాత్సల్యంతో పెరిగి పెద్దయిన వాళ్ల ఇళ్లల్లో... అమ్మానాన్నల స్థానం ఏంటి? ప్రపంచంలోని అన్ని కెరీర్‌లలోనూ తల్లి అనే కెరీర్ అత్యంత ప్రధానమైంది. జీవితాంతం ప్రతిరోజూ 24 గంటలు విసుగు విరామం లేకుండా, సెలవు తీసుకోకుండా సేవ చేసే తల్లి ఉద్యోగం.. మానవ జాతి చరిత్రలోనే అన్ని కెరీర్‌లలోకి అతి ముఖ్యమైన, క్లిష్టమైన కెరీర్. మిగతా కెరీర్‌లలో చేయవలసిన పని, జీతభత్యాలు నిర్ధారించి ఉంటాయి. మరి జీవితాంతం సేవ చేసే తల్లికి ఇవ్వాల్సిన జీతభత్యాల్లేంటి? ప్రేమ, అప్యాయత. అది కూడా ఇవ్వలేకపోతే, ఆ మనిషి ఉనికే ప్రశ్నార్థకం. అలాగే భగవంతుడికి కూడా తండ్రి అనే పదం కంటే గొప్ప పేరు పెట్టలేక పోయామంటే.. తండ్రి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ప్రపంచంలో మనకి ఇష్టమైన వస్తువులన్నీ డజన్లలో, వందల్లో, వేలల్లో లభించవచ్చు. కానీ తల్లితండ్రి మాత్రం ఒక్కరే. ప్రతిరోజూ చూసే సూర్యోదయాన్ని, డజన్లకొద్దీ కనిపించే ఖడ్గమృగాల్ని వందలు, వేలల్లో ఉండే ఉద్యానవనాల్ని... కొత్తకొత్త ప్రదేశాలలో సరికొత్తగా చూడడానికీ వేలు, లక్షలు ఖర్చు పెట్టి సందర్శిస్తుంటారు. కానీ ప్రపంచంలో లభించే ఒకే తల్లిని, తండ్రినీ అప్యాయంగా ‘‘అన్నం తిన్నావా’’ అని రోజుకు ఒకసారి ప్రేమగా పలకరించేందుకు ఎంతమందికి సమయం దొరుకుతోంది?!
 
ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అమెరికా అత్యుత్తమ అధ్యక్షుల్లో ఒకరు. రెండు కాళ్లూ చిన్నతనంలోనే వైకల్యం పొందినా.. తన తల్లిదండ్రులు బాల్యంలో చెప్పిన ధైర్యం.. చూపిన వాత్సల్యం.. తన వైకల్యాన్ని మరచి పోయేలా చేసిందంటారు. తాను అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటపుడు.. ‘‘ఫ్రాంక్ చలి తగలకుండా ఒంటి నిండా దుస్తులు ధరించావా..? జాగ్రత్త!’’ అని తల్లి చెప్పని రోజు లేదంటారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా!! 1930లలో అమెరికా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నపుడు అధ్యక్షుడైన రూజ్‌వెల్ట్... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాక.. అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రెసిడెంట్‌గా పేరుపొందారు. అంతేకాక అమెరికా చరిత్రలోనే నాలుగుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికై మొదటి వ్యక్తిగా ఖ్యాతి పొందారు. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైనపుడు అంత నిబ్బరంగా ఉండి... ‘‘న్యూడీల్’’ విధానం (రూజ్‌వెల్ట్ ప్రతిపాదించిన నూతన ఆర్థిక సంస్కరణలు) ఎలా అమలు చేయగలిగారని అడిగితే...? ‘‘బాల్యంలో వైకల్యంతో రెండేళ్లు మంచం మీద కదలలేని స్థితిలో ఉన్నపుడు, మా అమ్మానాన్న చూపిన నిబ్బరం గుర్తు తెచ్చుకుని’’ అని సమాధానమిచ్చారు రూజ్‌వెల్ట్!!

పిల్లల్ని ప్రేమించడంలో తల్లిదండ్రులందరూ ధనవంతులే. ఈ ప్రపంచంలో ప్రేమ పంచే విషయంలో పేద తల్లిదండ్రులెవరూ లేరు. వారి ప్రేమకు వయసు, అందం ఏమి అడ్డురావు. ప్రముఖ పెయింటర్ పికాసో ఇలా అంటారు.‘‘నా తల్లి నాకు ఇలా చెప్పేది. నీవు సైనికుడివైతే ఏదో ఒకరోజు ‘జనరల్’ గా ఎదుగుతావు. మత బోధకుడిగా మారితే ఏదో ఒకరోజు ‘పోప్’ అవుతావు అని! కానీ నేను పెయింటర్‌ని అయి, పికాసోగా మిగిలిపోయాను’’. ప్రతి తల్లితండ్రి తమ పిల్లలు ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థానానికి చేరుకోవాలని కలలు అంటారు. అలా చేరుకుంటే.. ప్రపంచంలోకెల్లా ధనికులమై పోయామన్న సంతృప్తితో జీవిస్తారు. మరి అలాంటి తల్లితండ్రుల మాట వినక నిర్లక్ష్యం చేసే పిల్లలు ఎంత పేదవారు. తల్లిదండ్రుల శ్రమతో వృద్ధిలోకి వచ్చి, వారి అభివృద్ధిని చూసి ఆనందిద్దామనుకున్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరిమే పిల్లలు ఇంకెంత పేదవారో?!

మదర్‌థెరిసా అన్నట్లు దుస్తులు ధరించకుండా ఉంటేనే నగ్నత్వం కాదు. కనీస మానవతా విలువలు లేకుండడం.. తల్లిదండ్రుల పట్ల, తోటి ప్రాణుల పట్ల ప్రేమ దయ లేకుండడం.. కనీస మానవ బాధ్యతలు నిర్వర్తించలేక పోవడం కూడా నగ్నత్వమే. ప్రపంచంలో అలమటిస్తున్న వారు కేవలం ఆహారం లేక మాత్రమే కాదు, అభిమానం, అనురాగం, ప్రేమ లేక కూడా!‘‘మాతరం పితరం చైవ సాక్షాత్ ప్రత్యక్ష దేవతామ్’’ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలన్నారు. అదే సమయంలో సుపుత్రః కులదీపకః అని కూడా అన్నారు. మంచి పిల్లలే వంశానికి తేజస్సు. పిల్లలు సద్బుద్ధి కలవారైతే.. తల్లిదండ్రులకు సత్కీర్తి లభిస్తుంది. పిల్లలు చేసే సత్కార్యాలు తల్లిదండ్రులను స్మృతికి తెస్తాయి. రాముడిని చూడగానే విశ్వామిత్రుడికి రాముడి కన్నతల్లి కౌసల్య స్మృతిలో మెదిలింది. కౌసల్య మంచి బిడ్డను కన్నది. ఆమె కడుపు చల్లగా ఉండుగాక అనుకుంటున్నాడు విశ్వామిత్రుడు!!

అందుకే
‘‘కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్’’.


కౌసల్య సత్ పుత్రుడవగు ఓ రామా! తెల్లవారుతోంది. ఓ నర శ్రేష్టుడా లెమ్ము. భగవత్ప్రీతికరమైన కార్యాలు ఆచరించవలసి ఉంది అన్నాడు విశ్వామిత్రుడు!!

ఓ తండ్రి లేఖ..
తనను వృద్ధాశ్రమానికి పంపించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిసిన ఒక తండ్రి తన కొడుకుకి రాసిన ఉత్తరం ఇది...బాబూ! నాకు వృద్ధాప్యం వచ్చింది. నేను ఎంతకాలం ఈ భూమి మీద ఉంటానో నాకు తెలియదు. దయచేసి సహనంతో నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ బాల్యంనుంచి నేను నీకెన్నో విషయాలు నేర్పాను. తినడం ఎలా? బట్టలు వేసుకోవడం ఎలా? జీవితాన్ని ఎదుర్కోవడం ఎలా? నేను అన్నం తినేటప్పుడు ఎంగిలి మెతుకులు పళ్లెం చుట్టూ పడ్డా, బట్టల మీద మరకలు పడ్డా, బట్టలు సరిగా వేసుకోలేకపోయినా.. నన్ను అసహ్యించుకోకు, చిరాకు పడకు; నీ బాల్యంలో నీవు ఈ పనులు చేయడానికి నేను నీకు గంటల కొద్దీ నేర్పిన రోజులు గుర్తు తెచ్చుకో. నీతో మాట్లాడేటప్పుడు ఒకే విషయాన్ని వెయ్యిసార్లు చెప్పినా.. నన్ను విసుక్కోకు. నీ చిన్నప్పుడు నీవు నిద్ర పోవడానికి ఒకే కథను మళ్లీ మళ్లీ వెయ్యిసార్లు విసుక్కోకుండా చెప్పిన సంగతి గుర్తు తెచ్చుకో! నీతో మాట్లాడే సమయంలో నా జ్ఞాపకశక్తి తగ్గి, మాటలు సరిగా రాకపోవచ్చు. జ్ఞప్తికి తెచ్చుకోవడానికి నాకు సమయమివ్వు. ఒకవేళ జ్ఞాపకం రాకపోయినా విసుక్కోకు. నా వయసులో అతి ముఖ్యమైంది నీతో గడపడం కానీ, నా జ్ఞాపకశక్తి కాదు. ఎప్పుడైనా నా అలసిపోయిన కాళ్లు నడవనీయకపోతే నీ చేయి ఆసరాగా ఇవ్వు. నీవు మొదటి అడుగులు వేసేటప్పుడు.. నా చేయి ఎలా సాయంగా ఇచ్చానో, నా చివరి అడుగుల్లో అలానే నీ చేయి ఇవ్వు. నా పక్కన ఉన్నప్పుడు అసహనంగా, కోపంగా విసుగ్గా ఉండకు. నీవు జీవించడం ప్రారంభించినపుడు నేను నీ పక్కన ఉండి నీకు సంరక్షణగా ఎలా ఉన్నానో.. నేను జీవితాన్ని చాలించేటపుడు నా పక్కనే ఉండి, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నా జీవితంలో నేను కొన్ని పొరపాట్లు చేసినా.. నా ప్రతి అడుగు నీకు అత్యున్నత స్థానం లభించాలనే నీకు సురక్షిత మార్గాన్ని వేయాలనే. నీ జీవితాన్ని ప్రేమ, సహనంతో ప్రారంభించడానికి నీ బాల్యంలో నేను ఎలా సాయపడ్డానో... నా జీవితాన్ని ప్రేమ, సహనంతో ముగించేవిధంగా నీవు సాయం చెయ్యి. నీవు ఈ ప్రపంచంలోకి వస్తూ ఎలా మా ముఖాల్లో నవ్వులు తెచ్చావో, ఏదో ఒకరోజు నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లేటప్పుడే అదే చిరునవ్వుతో వెళ్లిపోనీ. ఇదే నీవు నాకిచ్చే అతి విలువైన బహుమానం.
ప్రేమతో..! నాన్న!!

A.V.Rajamouli, IAS
Published date : 20 Nov 2021 02:21PM

Photo Stories