Skip to main content

సర్వం ఆత్మవశం సుఖం సర్వం పరవశం దుఃఖం

కేఎఫ్‌సీ కథ నుంచి నేర్చుకోగలిగితే.. ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికీ చిన్నది గానీ, పెద్దది గానీ ఒక సదాశయం ఉండాలి. అది శరీరంలో, హృదయంలో అంతర్భాగంగా ఇమిడిపోయి ఉండాలి. ఆ వ్యక్తి ఆలోచనలన్నింటికీ, ఆ ఆశయమే కేంద్ర బిందువు కావాలి. సర్వ మానసిక శక్తులు ఆ లక్ష్యంపై కేంద్రీకృతం కావాలి. ఆ ఆశయ సాధనే అత్యున్నత లక్ష్యంగా బాధ్యతగా భావించాలి. తనను తాను ఆ సాధన కోసం అంకితం చేసుకోవాలి. ప్రతి క్షణంలోనూ, ప్రతి పనిలోనూ.. ప్రతి ఊహలోనూ, ప్రతి కలలోనూ.. ఆ ఆశయమే కన్పించాలి. ఆ సాధనలో కొన్ని సార్లు వైఫల్యమెదురైనా.. తన బలహీనతలను తనే అధిగమిస్తున్నట్లుగా భావించి.. పనిచేసే విధానంలో మెళకువలను నేర్చుకుంటూ.. మెరుగైన ఫలితాలను సాధించడానికి ప్రయత్నించాలి. ఆత్మనియంత్రణ అంటే ఇదే! ఈ ప్రయత్నంలో ఆశయ సాధనే కాక, శీల దృఢత్వం కూడా ఏర్పడుతుంది. ఈ శీల దృఢత్వం లక్ష్యశుద్ధిని చేస్తూ... లక్ష్యసిద్ధికి దారితీస్తుంది.

నీటి నుంచి ఆవిరి రావాలంటే... 212 డిగ్రీల ఫారన్‌హీట్ వరకూ వేడి చేయూలి. 200 డిగ్రీలు చాలదు. నీరంతా 212 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు వేడి అయితేనే ఇంజిన్ నడవడానికి కావలసిన శక్తి వస్తుంది. గోరువెచ్చని నీటితో ఇంజిను నడపాలంటే.. సాధ్యం కాదు. అలాగే గోరువెచ్చని శ్రమ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. గెలిచే వారికీ, ఓడేవారికీ ఒక్కటే తేడా! ఇక శ్రమించ లేమని కుప్పకూలే సమయంలో మరికొద్ది క్షణాలపాటు ఓపికగా శ్రమించటం. నూతన సంవత్సరం సందర్భంగా.. ఎన్నో వ్యక్తిగత నిర్ణయాలు (రిజల్యూషన్స్) తీసుకొని... కొద్దిరోజులు కూడా ఆ దారిలో పయనించలేక.. మళ్లీ పాత బాటను పట్టే ఎంతోమంది.. తమ ప్రవర్తనలో మార్పురాకుండా.. ఫలితాల్లో మార్పురాదనే విషయాన్ని గ్రహిస్తేనే... విజయం సాధ్యం!!

గద్ద జీవితకాలం 70 ఏళ్లు. తమ జాతి పక్షుల్లో అతి ఎక్కువ జీవితకాలం గద్దదే. అయితే 40 ఏళ్లు పూర్తి అయ్యేసరికి.. బాగా పొడవుగా పెరిగిన దాని గోళ్లు.. ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు (గద్ద కోడిపిల్లను కాళ్లతో ఎలా తన్నుకెళుతుందో మనకు తెలుసు). పొడవైన దాని ముక్కు కొన చివర వొంగి పోయి.. పట్టుకున్న ఆహారాన్ని ఛేదించి, నోటితో స్వీకరించడానికి సహకరించదు. ఈకలు దట్టంగా పెరిగిన దాని రెక్కలు బరువై... చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఆ వయసులో దాని ముందున్నవి రెండే మార్గాలు.. ఒకటి ఆహారాన్ని సంపాదించు కోలేక సుష్కించి మరణించటం.. రెండోది, బాధాకరమైనదైనా తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో మార్గాన్నే ఎంచుకుంటుంది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గద్ద అందుబాటులో ఉన్న శిఖరాగ్రంపై కూర్చొని.. పెరిగి పోయిన తన ముక్కుకొనను.. కాలిగోళ్ల మధ్య పెట్టుకొని ఎంతో బాధ కలిగినా, నెమ్మదిగా వొలిచేసుకుంటుంది. ఊడ గొట్టుకున్న చోట తన ముక్కు పదునుగా కొత్తగా పెరిగేవరకు ఎదురు చూస్తుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను ఊడపెరుక్కుంటుంది. కొత్త గోళ్లు పెరిగిన తర్వాత.. వాటి సాయంతో తన పాత ఈకలను పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది. ఇలా 5 నెలల బాధాకరమైన పరిశ్రమ, కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30 ఏళ్లు హాయిగా జీవిస్తుంది. సృష్టిలో మనగలగడానికి మార్పు అత్యవసరం... అనే జీవిత సత్యాన్ని గద్ద జీవించి, మనల్ని కూడా అలా జీవించమని బోధిస్తుంది.

ప్రపంచాన్ని పట్టికుదిపేస్తున్న ఆర్థికమాంద్యం పరిస్థితుల్ని గమనిస్తే... అనేక రంగాల్లోని నిపుణులకు వెన్నులో చలిపుడుతోంది. 1930లలో అమెరికాను కుదిపేసిన తీవ్ర ఆర్థిక మాంద్యం (గ్రేట్ ఎకనమిక్ డిప్రెషన్)... ఇప్పుడు ప్రపంచాన్నంతా కుదిపేయనుందా..! అనే విషయంపై ఆర్థిక నిపుణులంతా తలపట్టుకు కూర్చున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం... నవంబర్, డిసెంబర్‌లలోనే దాదాపు 8 లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయారు. ఒకప్పుడు వినియోగదారుడినే వణికించిన చమురు ధర ఐదో వంతుకు పడిపోయి...చమురు ఉత్పత్తిదారుడిని కూడా వణికిస్తోందంటే.. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఎంత తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. పెద్దపెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల్లో 10 శాతం మేరకు తొలగిస్తున్నాయి. సంస్థలో మిగిలిన ఉద్యోగులకు పని పెంచటమే కాక.. సౌకర్యాలను తగ్గిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యమైన ఉద్యోగులను కంపెనీలు కోరుకుంటున్నాయి. ఇప్పటివరకూ ప్రతి సంవత్సరం జీతంలో కనీసం 15 శాతం పెరుగుదలను చూస్తూ వచ్చిన ఉద్యోగులకు ... ఈ పరిస్థితి జీర్ణం కాకపోవచ్చు.

ఉద్యోగాల కోత, జీతాల కోత, అలవెన్సుల కోత... వంటివి సర్వసాధారణమైన ఇలాంటి పరిస్థితుల్లో.. బెంబేలు పడకుండా.. మానసిక దృఢత్వాన్ని పెంచుకుంటూ... అవసరాన్ని బట్టి తమని తాము మార్చుకుంటూ... పనిచేస్తున్న కంపెనీకి అండగా నిలవాల్సిన అవసరం ఎక్కువైంది. కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనే మానసిక స్థితి.. చలించని మానసిక సంతులనం.. వ్యక్తిగత స్థాయిలో త్యాగాలను చేయగలిగే సాహసం.. జీతం తగ్గినా.. ఆనందంగా, మరింత ఉత్సాహంతో పనిచేయగలిగే స్వభావం.. తమ ఉద్యోగుల్లో ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి.

వ్యక్తిస్థాయిలో అనేక సంవత్సరాల నుంచి నిర్మించుకున్న శీలం, విలువలు, నైపుణ్యం లాంటి వాటి అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. అల్పప్రాణి అయిన గద్ద తనని తాను పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోగలిగినప్పుడు.. ఉత్కృష్ట ప్రాణులమైన మనం చేయలేమా? అయితే ఎలా? ప్రతిరోజూ చేసే పనే అయినా..చేసే విధానంలో సమయపాలన, సామర్థ్యం, నాణ్యత, మంచి స్వభావం, అణకువ, శ్రద్ధ, సమర్పణ భావం.. ఇలాంటి లక్షణాలను చొప్పించాలి. మనతో మనమే పోటీపడితే.. చేసే పని ఏదైనా మనకు ఆనందాన్నిస్తుంది. ఇదే ఆత్మసంతృప్తికి దారి తీస్తుంది. తోటమాలి రోజూ చేసే పని ఒక్కటే.. అయితే ప్రతిరోజూ తన ప్రయత్నాల్లో నూతనత్వం తెస్తూ..  తోటలో నూతనత్వం చూస్తూ ఆనందిస్తుంటాడు. వృత్తి పట్ల సమర్పణ భావం అంటే ఇదే! ఆహారం విషయంలో కొత్తకొత్త రుచులు.. ఆహార్యం విషయంలో కొత్తకొత్త ప్రక్రియలు సాధ్యమైనప్పుడు... వృత్తిలో ఎందుకు సాధ్యం కాదు! మన అనుమతి లేకుండా.. ఎవరైనా మనల్ని అసమర్థులుగా మార్చగలరా? అలాగే ఆదాయం ఎంత తగ్గితే అంత ఖర్చు కూడా తగ్గించుకుంటే.. ఎలాంటి పరిస్థితినైనా అవలీలగా దాటొచ్చు. ఎక్కువ వస్తువులను, సేవలను, సౌకర్యాలను కలిగి ఉండటమే.. సంపన్నత కాదు. ప్రతి క్షణం మనం ఎంత ఆనందంగా ఉన్నాం... మనతో ఉన్నవారిని ఎంత ఆనందంగా ఉంచాం.. అనేదే నిజమైన సంపదకు చిహ్నం.

సంతృప్తి సహజ సంపద... విలాసాలు కృత్రిమ పేదరికం- అన్న సోక్రటీస్ మాటలు ఎంత నిజం!! ఇతరులు తమను సంపన్నులుగా భావించాలని తపన పడుతున్నవారంతా.. ఆ ప్రయత్నంలో ఎంత పేదవారిగా మారుతున్నారో.. ఆత్మావలోకనం చేసుకుంటే ఈ విషయం అర్థమౌతుంది. అవసరాలను తగ్గించుకోవటమే, నిజమైన ధనికత్వానికి చిహ్నం.. అనే సత్యాన్ని గుర్తిస్తే.. ఆదాయం తగ్గినా, తాము పేదలం కాబోమని అర్థం చేసుకోగలుగుతారు (Choose to be rich by minimising needs). కనీస అవసరాలను మించి వస్తువులను, సేవలను కలిగి ఉండటం కూడా హింసే అంటారు గాంధీజీ. అరగదీసినకొద్దీ రాయి అరుగుతుంది.. వజ్రం మెరుస్తుంది! మనం రాయా, వజ్రమా అనేది తేల్చుకోవాల్సింది మనమే. వజ్రం లాంటి వ్యక్తులు తాము పనిచేసే సంస్థలకు ఆస్తులు (ఎసెట్స్) గానూ... రాయిలాంటివారు అప్పులు (లయబిలిటీస్)గానూ.. మారటం మనం చూస్తాం!! క్లిష్ట సమయాల్లోనే మనం పూర్తి సామర్థ్యాల్ని చూపించాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లోనే ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే.. తేలిగ్గా గమ్యాన్ని చేరగలమనే భావన చాలామందిలో బలంగా ఉంటుంది. నిజంగా స్వసహాయాన్ని(సెల్ఫ్ హెల్ప్) మించిన సాయం లేదు.
|
సీతాకోకచిలుక జన్మ కథనాన్ని గమనిస్తే... స్వసహాయం ఎంత శ్రేయమో అర్థమౌతుంది. తన జీవిత పరిణామ దశలో భిన్న రూపాలుగా రూపాంతరం చెందుతూ.. అవిశ్రాంత పరిశ్రమ చేసి.. సీతాకోకచిలుకగా ప్రకృతిలోకి వస్తుంది. ఒక బాలుడు ఆడుకుంటూ.. అలాంటి ఒక సీతాకోకచిలుక తన జీవిత పరిణామ దశలో.. ఎంతో ప్రయాసపడటం గమనించాడు. అది ఎంత కష్టపడినా, బయటకు రాలేకపోతోందని జాలిపడి.. తన చేత్తో దాని రెక్కలను పట్టుకొని.. దాన్ని నెమ్మదిగా లాగి బయటికి తీసి గాలిలోకి ఎగురవేశాడు. దాన్ని బయటకు లాగి, దాని కష్టాన్ని తొలగించాను కదా! ఆ సీతాకోకచిలుక ఆనందంగా ఎగిరిపోతుందని అనుకున్నాడు ఆ బాలుడు. అయితే, అతను ఊహించినట్లు జరగలేదు. ఆ సీతాకోకచిలుక ఎగరలేక నేలమీద పడిపోయింది. పరుగున దాని దగ్గరకు వెళ్లి, తదేకంగా చూశాడు. ఆ సీతాకోకచిలుక తన రెక్కలను వేగంగా కదిలించ లేకపోతోంది. ఏం జరిగిందో బాలుడికి అర్థం కాలేదు. అంతా గమనిస్తున్న బాలుడి తండ్రి.. బాలుడి దగ్గరకు వచ్చాడు. ‘‘తన జీవిత పరిణామ దశలో.. గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారి.. తనంతట తాను బయటకు వచ్చే ప్రయత్నంలో.. దాని రెక్కలను వేగంగా ఆడిస్తూ శ్రమిస్తుంది. జిగురుతో కూడిన దాని బరువైన రెక్కలు.. వేగంగా ఆడించడం వల్ల ఆరి పోయి, తేలికవుతాయి. తేలికైన రెక్కలతో కూడిన సీతాకోకచిలుక బయటకు వచ్చి హాయిగా, తనంతట తానుగా ఎగరగలుగుతుంది. సీతాకోకచిలుకే కాదు.. మనమైనా, ఎవరైనా అంతే.. ఎంత పరిశ్రమ చేస్తే అంత ఎత్తుకు ఎగరగలుగుతాం.. ఎదగగలుగుతాం’’ అంటూ.. ప్రకృతి ధర్మాన్ని వివరించాడు తండ్రి! బాలుడికి తన తప్పు అర్థమై.. స్వసహాయం ఎంత శ్రేయమో తెలుసుకున్నాడు...

స్వసహాయమె సుశ్రేయము
స్వసహాయమె దైన్యహరము సంపత్కరమున్
స్వసహాయమె మానవులకు
వ్యసనహరము


- అనే ముట్నూరి మాటలు ఎంత నిజం (తనకు తాను సహాయం చేసుకోవడం వల్ల చింతలు, వ్యసనాలు హరిస్తాయి. సంపదలు, శుభాలు వరిస్తాయి)! స్వసహాయం అంటే.. మన ఆలోచనలకు, భావాలకు ఎవరూ బాధ్యులుకారని గుర్తించటం. మనం బాధితులమైనా, సంతోషంగా ఉన్నా... అలా ఉండటానికి మనం ఇష్టపడుతుండటం వల్లనే అనేది అర్థం చేసుకోవడం. మనం మన సుఖాల్ని గానీ, దుఃఖాల్ని గానీ... అనుభవించటానికి ఎన్నోరోజుల ముందే ఎంపిక చేసుకొని ఉంటాం. ఎందుకంటే... మన అనుమతి లేకుండా ఎవరూ మనల్ని గాయపరచలేరు. మనం అనుమతి ఇవ్వాలా లేదా అనేది మన దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. అలాగే మన వ్యక్తిత్వం వెదజల్లే భావాలు సుగంధభరితమా, కాదా! అనేది కూడా మన దృక్పథంపైనే ఆధారపడి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన దృక్పథాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది. ఒక వ్యక్తి నుంచి దేన్నైనా దొంగిలించవచ్చు.. స్వాధీనం చేసుకోవచ్చు.. కానీ, అతని దృక్పథాన్ని మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు. The last of human freedoms - freedom to choose one's attitude in any given set of circumstances, to choose one's own way. 

 
వ్యక్తుల్లో తేడా అనేది వారి శరీరాల పరిమాణాన్ని బట్టో, వారి చేతుల పొడవును బట్టో ఉండదు. వారి దృక్పథాన్ని బట్టే ఉంటుంది. మనకి మనం సాయం చేసుకోగలిగితేనే.. ఇతరులకు కూడా సాయం చేయగలం. పనిచేయటానికి దృక్పథం సాధనమైతే... ఆ దృక్పథాన్ని సానపెట్టి.. సకారాత్మకంగా పయనింపచేసి సత్ఫలితాలు రాబట్టగలిగేది ఉత్సాహం! సకల సద్గుణ సంపన్నుడైన శ్రీరాముడు కూడా సీతాన్వేషణలో అప్పుడప్పుడూ ఉత్సాహాన్ని కోల్పోయి, దుఃఖంలో మునిగిపోయేవాడు.. రుష్యమూక ప్రాంతంలో సీతాన్వేషణలో సఫలం కాలేక నిరుత్సాహపరుడైన రాముని ఉత్సాహపరుస్తూ... ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్పరం బలం సోత్సాహస్య లోకేషున కించి దపిదుర్లభమ్. ‘‘ఉత్సాహం చాలా బలమైంది. ఉత్సాహాన్ని మించిన బలం లేదు. ఉత్సాహవంతుడికి ఈ ప్రపంచంలో లభ్యంకానిది లేదు. అసాధ్యమనేది ఉండదు’’... అంటాడు లక్ష్మణుడు! ‘‘తనను తాను తృణీకరించినవాడు.. ప్రపంచాన్ని అంగీకరించలేడు’’ అనే బుచ్చిబాబు మాటలను మననం చేసుకుంటూ... ఈ నూతన సంవత్సరంలో మనందరం సరైన దృక్పథం.. సమృద్ధిగా ఉత్సాహం కలిగి ఉండి... ఎవరికోసమో ఎదురుచూడకుండా.. మనకి మనమే సాయం చేసుకోవాలనే దృఢ నిర్ణయం (Resolution) తీసుకొని, దాన్ని అమలుచేసే దిశగా పయనిద్దాం..!

సర్వం ఆత్మవశం సుఖం సర్వం పరవశం దుఃఖం
మన ఆధీనంలో ఉన్న కార్యకలాపాల వల్లే మనకు సుఖం ప్రాప్తిస్తుంది.. పరుల ఆధీనంలో ఉండే కార్యకలాపాల వల్ల దుఃఖం ప్రాప్తిస్తుంది..

నూతన సంవత్సర శుభాకాంక్షలతో..!!

గోరువెచ్చని నీటితో ఇంజిన్ నడపాలంటే.. సాధ్యం కాదు. అలాగే గోరువెచ్చని శ్రమ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. గెలిచేవారికీ, ఓడేవారికీ ఒక్కటే తేడా! ఇక శ్రమించలేమని కుప్పకూలే సమయంలో మరికొద్ది క్షణాలపాటు ఓపికగా శ్రమించటం. నూతన సంవత్సరం సందర్భంగా.. ఎన్నో వ్యక్తిగత నిర్ణయాలు (రిజల్యూషన్స్) తీసుకొని... కొద్దిరోజులు కూడా ఆ దారిలో పయనించలేక.. మళ్లీ పాత బాటను పట్టే ఎంతోమంది.. తమ ప్రవర్తనలో మార్పు రాకుండా.. ఫలితాల్లో మార్పు రాదనే విషయాన్ని గ్రహిస్తేనే... విజయం సాధ్యం!! కనీస అవసరాలను మించి వస్తువులను, సేవలను కలిగి ఉండటం కూడా హింసే అంటారు గాంధీజీ. అరగదీసినకొద్దీ రాయి అరుగుతుంది.. వజ్రం మెరుస్తుంది! మనం రాయా, వజ్రమా అనేది తేల్చుకోవాల్సింది మనమే. వజ్రం లాంటి వ్యక్తులు తాము పనిచేసే సంస్థలకు ఆస్తులు (ఎసెట్స్) గానూ... రాయి లాంటివారు అప్పులు (లయబిలిటీస్)గానూ.. మారటం మనం చూస్తాం!! క్లిష్ట సమయాల్లోనే మనం పూర్తి సామర్థ్యాల్ని చూపించాల్సి ఉంటుంది.

A.V.Rajamouli, IAS
Published date : 20 Nov 2021 02:50PM

Photo Stories