Skip to main content

శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం

పల్లకీలు తయారు చేసే మధ్యతరగతి పార్శీ కుటుంబం నుంచి వచ్చిన అతన్ని బాల్యం నుంచీ నత్తి వెంటాడుతూనే ఉంది. బాధపడి పట్టు వీడలేదు. నచ్చిన పుస్తకాలన్నీ చదవటం ఆరంభించాడు. కొనలేని పుస్తకాలను అద్దెకు తెచ్చి మరీ చదువుకునేవాడు. అయినా జ్ఞానతృష్ణ చల్లారలేదు. గ్రాడ్యుయేషన్ కోసం కాలేజీలో చేరదామనుకుంటే... తనకు నచ్చిన కోర్సులో అన్ని కాలేజీలలోనూ అడ్మిషన్లు పూర్తి కావటంతో బొంబాయి గవర్నమెంటు కళాశాలలో అందుబాటులో ఉన్న ‘లా’ చదవటానికి చేరాడు. చేరిన రోజు నుంచీ ‘లా’ని ఒక పట్టు పట్టాలనుకున్నాడు. అంతే ‘లా’ పరీక్ష పేపర్లన్నింటిలోనూ అతనే ఫస్టు. అతని సమాధానాలు చదివిన ఒక అధ్యాపకుడు (పేపర్లు దిద్దుతూ) ‘నిజానికి నాకంటే ఈ సమాధానాలు రాసిన విద్యార్థికే ఎక్కువ పరిజ్ఞానం ఉంది’ అని కామెంట్ రాశాడు. నత్తి వెంటాడినా కాలేజీ రోజుల నుంచీ చక్కని భాషలో ఉపన్యాసాలు ఇవ్వటం అలవాటు చేసుకున్నాడు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా చేరిన తర్వాత లాయర్ల లైబ్రరీ అంతా పూర్తి చేసి జడ్జీల లైబ్రరీలో చదవుకోవటానికి అవకాశమివ్వమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించి.. న్యాయశాస్త్రాన్ని మదించాడు. బార్ (న్యాయవాదుల సంఘం) నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఒకటి కంటే ఎక్కువ సార్లు.. బహుశ అతిచిన్న వయసులో ఎంపికైనా న్యాయం కోసం కృషి చేయడానికి న్యాయవాదిగానే ఉండిపోయాడు.
 
ఎవరికీ అర్థం కాదనుకునే కేంద్ర బడ్జెట్‌పై ఆయనిచ్చే ఉపన్యాసాలు వినటానికి ముంబాయి బ్రాబోర్న్ స్టేడియంలో లక్షకు పైగా సామాన్య జనం కిక్కిరిసి నిలబడేవారు. మేధావులు ఆయన్ని ‘భారతదేశపు అంతరాత్మకు కాపలాదారు’ గా అభివర్ణించారు. రాజాజీ ఆయన్ను ‘భారతదేశానికి భగవంతుడిచ్చిన బహుమానం’ అని కొనియాడారు. నత్తితో బాధపడే ఒక వ్యక్తి అంత గొప్ప వక్తగా మారాడంటే దాని వెనుక ఎంత శ్రద్ధ ఉందో? కోరిన చదువు చదవలేదని బాధపడకుండా, చదివిన చదువులో కోరుకున్న స్థానం కంటే ఉన్నత స్థానం సాధించటమే కాక ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడు. అతడే పద్మ విభూషణ్ నానీ పాల్కీవాలా. తాను మరణించిన తర్వాత తన ఆస్తిని సేవా కార్యకమాలకు వినియోగించమనీ, కళ్లను గుడ్డివానికి, గుండెను హృద్రోగికి, మూత్ర పిండాలను పేదవారికి దానం చెయ్యమనీ... అప్పుడే తన దేశ రుణం తీర్చుకున్న వాడినవుతానని వీలునామాలో పేర్కొన్న చిరస్మరణీయుడు. మార్కులు సరిగా రాకపోతే... ‘నాకిష్టం లేని కోర్సులో చేర్పించారనీ, లెక్చరర్లు సరిగా చెప్పలేదనీ, కావలసిన పుస్తకాలు కొనలేకపోయాననీ, చదువుకోవటానికి ప్రత్యేక గది కేటాయించలేదనీ, కోచింగ్ పెట్టించలేదనీ’ సవాలక్ష సాకులు వెదికి తమ ‘శ్రద్ధాలేమి’ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నించే ఎంతోమంది విద్యార్థులు ఒక్కసారి ఆలోచించరూ?

మనసులోనిదే... మధురం...
‘మా అబ్బాయి చేతిలో ఎప్పుడూ పుస్తకమే ఉంటుంది. కానీ వీడికి 60 శాతం మార్కులు కూడా రాలేదు. వీడి ఫ్రెండ్ చదివినట్టే కనిపించడు. వాడికి 90 శాతం వచ్చాయి. కాబట్టి రీ-వాల్యుయేషన్ పెట్టించమని వచ్చిన దరఖాస్తుపై ఆయా విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలోనే పునర్మూల్యాంకనం చేయించారు. 90 శాతం మార్కులు వచ్చినతని పేపరు చూడగానే చదవాలనిపించే ముత్యాల్లాంటి అక్షరాలు, అలంకారం చేయకపోయినా రెండువైపులా వదిలిన మార్జిన్లు. అడిగిన ప్రశ్నకు సూటైన స్పష్టమైన సమాధానం... 60 శాతం మార్కు లు వచ్చిన కుర్రాడి పేపరు తీస్తే చేతిరాత చదవటానికి ఆ తండ్రికే కష్టమైంది. పోనీ రాసిన సమాధానంలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఎక్కడుందో వెతుక్కోవాలన్నమాట. అదీ స్పష్టంగా లేదు. మార్జిన్లు పాటించలేదు. చూడగానే ఇతగాడి శ్రద్ధ ఇక్కడ లేదని స్పష్టమయింది. అప్పటిదాకా పోరాడిన తండ్రి నీరు కారిపోయాడు. ‘కాలేజీకి వెళ్లటానికి బైక్ కొనిపెట్టాను. మొబైల్ ఫోను కొనిచ్చాను. ఇంట్లో చదువుకోవటానికి ఏసీ రూం ఏర్పాటు చేశాను. అడిగినవన్నీ కొనిచ్చాను. ఇన్ని సౌకర్యాలిచ్చినా వీడి ఫలితం ఇట్లా ఉంటుందని ఊహించలేద’ని బాధపడ్డాడు.

‘‘తస్య తదేవ హిమధురం యస్యమనో యత్ర సంలగ్నమ్’’

ఎవరి మనస్సు దేనిలో లగ్నమై ఉంటుందో అదే వారికి మధురంగా ఉంటుంది. ఆ కుర్రవాడికి ఎప్పుడూ పుస్తకం చేతిలో ఉందిగానీ మనస్సు అక్కడ లగ్నం కాలేదు. సౌకర్యాలన్నీ శరీరానికి సంబంధించినవి కావటంతో మనసు పరుగులు పెట్టింది. బైకుపై లైబ్రరీలకెళ్లకుండా సినిమాలకెళ్లాడు. మొబైల్ ఫోనులో లెక్చరర్లతో సందేహాలు తీర్చుకోకుండా మిత్రులతో గంటలకొద్దీ ఊకదంపుడు చర్చలు జరిపాడు. ఇక కడుపు నిండా భోంచేసి ఏసీ రూంలో చదవటానికి కూర్చున్నా శరీరం చదవనివ్వలేదు. హాయిగా నిద్రపోయాడు.

పుస్తకం చేతిలోనే ఉంది. ఏం లాభం? మనస్సులో శ్రద్ధ నాటుకోలేదు. మరి సౌకర్యాలివ్వటం తండ్రి తప్పా? లేక సరిగా ఉపయోగించుకోలేని ఆ కుర్రాడిది తప్పా? అంటే ఇద్దరిదీనని చెప్పాలి. సౌకర్యాలివ్వటంలో చూపిన శ్రద్ధవాటి సద్వినియోగంలో చూపలేకపోవటానికి తండ్రి పరోక్ష కారణమైతే... సౌకర్యాలను తండ్రి ఆశించిన లక్ష్యానికి వినియోగించకపోవటం ప్రత్యక్ష కారణం. ఒక సభలో పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారిని ఆయన బాల్యంలో విద్యాభ్యాసం గురించి అడిగితే ‘‘నేను బాల్యంలో దేనికీ ఇబ్బంది పడలేదు. తెల్లవారు జామున 4 గంటలకు లేచి వార్తా పత్రికలు పంచేవాడిని. తర్వాత స్కూలుకెళ్లే వాడిని. మధ్యాహ్నం స్కూలు నుంచి వచ్చి సైకిల్ తీసుకుని ఆ పేపర్ల డబ్బులు వసూలు చేయటానికి వెళ్లేవాడిని. సాయంత్రం చదువుకోవటానికి కరెంట్ ఉండేది కాదు. అయితే రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం తొందరగా లేస్తానని మా అమ్మ మిగతా పిల్లల కంటే నాకు కొంచెం కిరోసిన్ ఎక్కువ ఇచ్చేది. చదువుకోవటానికి కూర్చుంటే దీపంలో కిరోసిన్ అయ్యేంతవరకూ ఇంకేమీ తెలిసేది కాదు.’’ అని చెప్పారు.
 
ఆ శ్రద్ధ వల్లే కదా ఆయన రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. దీనర్థం ఇప్పుడు కిరోసిన్ దీపాల్లో చదవమని కాదు. మనసు చదువు మీద లగ్నమయి శ్రద్ధపెడితే ఉన్నత శిఖరాలను ఎవరైనా అందుకోవచ్చు. ప్రతి వ్యక్తికీ వృత్తి (చేసే పని) అనేదాన్ని ప్రకృతి ఒక అవసరంగా చేసింది. సంఘం దాన్ని బాధ్యతగా చేసింది. అలవాటు దాన్ని ఆనందంగా మారుస్తుంది. చెవిటివాడయ్యుండి శబ్దాన్ని రికార్డు చేసే యంత్రం కనిపెట్టాడంటే ఎడిసన్ తన పనిలో ఆనందాన్ని వెతుక్కోబట్టే కదా! ప్రఖ్యాత వాల్ట్ డిస్నీ గురించి తెలియని వారుండరు. చిన్నప్పటినుంచీ బొమ్మలెయ్యటమన్నా.. జంతువులన్నా ఎంతో ఇష్టం. బాల్యంలో పెన్సిల్, పేపర్ కొనటానికి కూడా ఇబ్బంది పడ్డ రోజుల్లో ఇంట్లోనే గోడల మీద రాళ్లతో బొమ్మలు వేసుకునేవాడు. ఆర్థికస్థితి అనుకూలించక రెడ్‌క్రాస్‌లో 16 సంవత్సరాల వయసులోనే అంబులెన్స్ డ్రైవరుగా కుదురుకున్నాడు. తను పనిచేసే చోట ఒక ‘చుంచు’ కుటుంబం ఉండేది. తల్లి చుంచు, దాని పిల్లలూ అందరినీ విసిగిస్తూ ఉండేవి. సహ ఉద్యోగులందరూ ఆ చుంచులకు ట్రాప్‌లు పెట్టి పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే డిస్నీ మాత్రం తనకిచ్చిన లంచ్‌ను ఆ చుంచులతో పంచుకుంటూ అమితంగా ఆనందించేవాడు. సమయం చిక్కినప్పుడల్లా తన వ్యాన్ అంతా చుంచు బొమ్మలను గీస్తూ నింపేసేవాడు. ఆ చుంచుల్లో అతి చిన్నదైన చుంచుకు తను ఇష్టపడి పెట్టుకున్న పేరే మిక్కీ. అలా వచ్చిందే మిక్కీ మౌస్. అలా బాల్యంనుంచీ ఏర్పడ్డ అమిత శ్రద్ధ, అమిత ఇష్టంతోనే వాల్ట్ డిస్నీ మిక్కీమౌస్ కార్టూన్లను గీసి మనందరి హృదయాల్లో నిలిచిపోయాడు. జీవితంలో ఎన్నిసార్లు మనం శ్వాసను తీసుకుంటామన్నది కాదు ముఖ్యం. మన పనిలో నిమగ్నమయి తదేక దృష్టి, శ్రద్ధ, ఏకాగ్రత వల్ల ఎన్నిసార్లు మనం శ్వాసను తీసుకోవటం మర్చిపోతున్నాం అనేదే ముఖ్యం అంటారు వాల్ట్ డిస్నీ.

భావాన్ని బట్టి ఫలితం..
మనుషుల్లో మనం రెండు రకాల వైఫల్యాలను చూస్తాం. ఎప్పుడూ ఏదోఒకటి ఆలోచిస్తూ ఏమీ చేయనివారు. ఆలోచించకుండా ఎప్పుడూ ఏదోఒకటి చేస్తూ ఉండేవారు. మీరు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎలా కనిపెట్టారు? న్యూటన్‌ను అడిగితే.. తదేకంగా దాని గురించే ఆలోచిస్తూ పని చేయటం వల్ల అని సమాధానమిచ్చాడు ఆయన. తీపి కలలు కనటం తప్పుకాదు. కోరికలుండటం పొరపాటు కాదు. అయితే కలలు కన్నంత మాత్రాన కార్యాలు సిద్ధించవు. కృషితో కష్టిస్తేనే సిద్ధిస్తాయి. నైపుణ్యం, అవకాశం ఉండికూడా శ్రద్ధ, సహనం లేకపోవటం వల్ల విఫలమైనవారు ఎందరో. అన్యమనస్కంగా చేస్తే ఏ కార్యమైనా జటిలమవుతుంది. మహాభారతంలో చెప్పినట్లుగా ..

‘యాదృశీ భావనాయస్య సిద్ధిర్భవతు తాదృశీ’

ఎవరు ఎలాంటి భావన కలిగి ఉంటారో వారికి అలాంటి ఫలితమే దక్కుతుంది. ఏ రంగంలోనైనా సరే ఒక మనిషి జీవన నాణ్యత అతను ఎంచుకున్న రంగంపైన కాక ఆ రంగంలో అతను చూపిన శ్రద్ధ, అత్యున్నత ప్రమాణాల కోసం అతను పడ్డ తపనపై ఆధారపడి ఉంటుంది. అదృష్టమంటే ఎక్కడో లేదు మన మనస్సు, మన అలవాట్లు మన ఆధీనంలో ఉండటమే. మనస్సు ఆధీనంలో ఉంచుకోవటం ఎలా? అనేదానికి భగవద్గీతలో అర్జునునికి చెప్తూ కృష్ణుడు

అసంశయం మహాబాహో మవోదుర్నిగ్రహం చలం..
అభ్యాసేనతు కౌన్తేయ వైరాగ్యేనచ గృహ్యతే’..


మనస్సును అదుపు చేయటం కష్టమైనా... అభ్యాసం, వైరాగ్యం చేత అదుపు చేయవచ్చు అంటాడు. అభ్యాసం అంటే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం కోసం, ఆ లక్ష్యం దిశగా అడుగులు వెయ్యటం, శ్రమించటం. లూయిస్ కారెస్ "Alice in wonderland" అనే పుస్తకంలో Alice అనే చిన్నపిల్ల ఒక చౌరస్తా వద్ద నిలబడి అటూ ఇటూ చూస్తుంటుంది. అక్కడే ఉన్న పిల్లి Aliceను గమనిస్తూ ఉంటుంది. Alice ఆ పిల్లిని అడుగుతుంది ‘ఈ రోడ్డు ఎటువైపు వెళుతుంది?’ అని. ఆ పిల్లి ప్రతిగా నీవెక్కడికెళ్లాలని’ అడుగుతుంది. దానికి Alice ‘నాకు తెలియదు’ అని సమాధానమిస్తుంది. ‘నీవెక్కడికెళ్లాలో నీకు తెలియనపుడు ఏ రోడ్డు ఎక్కడికి వెళ్లినా.. నీవు ఏ రోడ్డులో వెళ్లినా ఫలితం శూన్యం’ అని చెబుతుంది పిల్లి. లక్ష్యరహితంగా ఎంత కష్టపడినా ఉపయోగంలేదని ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. అభ్యాసం అంటే లక్ష్యసహితంగా కష్టపడటం. తేనెటీగ కష్టపడుతుంది. కందిరీగ కష్టపడుతుంది. తేనెటీగ కష్టానికి ఫలితం తేనె. మరి కందిరీగ కష్టానికి ఫలితం?
 
నిరంతర అభ్యాసం వల్ల శరీరం ఆరోగ్యంగానూ, మనసు నిర్మలంగానూ, హృదయం పరిపూర్ణంగానూ, జేబు నిండుగానూ ఉంటాయంటారు. శిక్షణలో చెమటోడిస్తేనే యుద్ధంలో రక్తం కారదు. అభ్యాసంతో పాటు భగవద్గీతలో చెప్పిన మరో విషయం ‘వైరాగ్యం’. వైరాగ్యం అంటే సన్యసించి అడవికెళ్లమని కాదు. పని చేసేటపుడు ధ్యాసంతా పనిపైనే కేంద్రీకరించి ఫలితం గురించి అనాసక్తంగా ఉండమని. ధ్యాసంతా, శ్రద్ధంతా పనిమీద కాక ఫలితంపై ఉంటే పని చేయలేమని దానర్థం. చేయాల్సిన పనిమీద శ్రద్ధ పెట్టి చేసినపుడు రావలసిన ఫలితాలు అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాకాక శ్రద్ధంతా ఫలితంపై ఉంటే ఒత్తిడి పెరిగిపోయి చేసే పని నాణ్యతను తగ్గించేస్తుంది.

విజేతలంతా సాధారణ వ్యక్తులే...
ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక పదేపదే దాన్ని మార్చుకునే వారుంటారు. రెండు కుందేళ్ల వెంటపడితే ఏదీ దొరకదు అనేది గమనించాలి. లక్ష్యసాధనలో అపజయాలు వస్తే కుంగిపోయి వెనుదిరిగే వారు, లక్ష్యాన్ని మార్చుకునేవారు ఏ లక్ష్యాన్నీ సాధించలేరు. కాళోజీ అన్నట్లు ‘‘ఆకు రాలిందని ఏడుస్తూ కూర్చున్నవాడు వసంతానికి స్వాగతం పలకలేడు’’. సముద్రయానంలో అక్కడ వచ్చే భీషణ అలలపై కాక మన పడవలో ఉండే చిల్లులపై శ్రద్ధ పెట్టడం అవసరం. అప్పుడే సురక్షితంగా గమ్యం చేరగలుగుతాం. ఒక విశ్వవిఖ్యాత క్రీడాకారుడి దగ్గరకు ఒక అభిమాని వచ్చి ‘‘మీలాగా ఆడి చిరస్థాయిగా నిలిచిపోవటానికి నా జీవితాన్నంతా ధారపోస్తాను’’ అన్నాడు. దానికి ఆ క్రీడాకారుడు ‘నేను ధార పోశాను’ అని సమాధానమిచ్చాడు. ‘లక్ష్యసాధనలో సఫలమైన వాళ్లు లేజర్ కిరణాల్లాంటి ఏకాగ్రత కలిగిన సాధారణ వ్యక్తులే. లక్ష్యసాధనలో కావల్సిన శ్రద్ధ ఎలా ఉండాలో చెబుతూ పులితో మల్లయుద్ధం చేస్తున్నప్పుడెలా ఉంటుందో అలా ఉండాలి. మనం అలిసి విరామం కావాలంటే ఉండదు. పులి అలిసిపోతేనే విరామం’ అన్నాడా క్రీడాకారుడు.

క్షణశః కణశశ్చైవ విద్యామర్ధంచ సాధయేత్
క్షణత్యాగే కుతోవిద్యా? కణత్యాగే కుతోధనమ్


క్షణం పోనీయకుండా విద్యను, కణం (చిన్న మొత్తం) పోనీయకుండా ధనాన్ని సాధించాలి. క్షణాలను నిర్లక్ష్యం చేసినవానికి విద్య, కణాలను నిర్లక్ష్యం చేసినవానికి ధనం రావు. శ్రద్ధ, ఏకాగ్రత అనేవి భయం వల్ల బలం వల్ల వచ్చేవి కావు. కేవలం లక్ష్యం సాధించాలనే తపన వల్లే ఇవి సాధ్యం. పేదప్రాంతం నుంచి వచ్చి, బాల్యంలో Attention Deficit Disorder (దేనిపైనా దృష్టి నిల్వలేకపోయే వ్యాధి)తో బాధపడినా... ప్రపంచంలో ఎవరూ సాధించలేనిది సాధిద్దామనుకుని, కలలు గని బీజింగ్ ఒపింపిక్స్‌లో 8 స్వర్ణ పతకాలు సాధించటం ద్వారా 36 ఏళ్ల ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు అమెరికన్ ఈతగాడు మైఖేల్ ఫెల్ప్స్. మనకు ఊహాశక్తి ఉండాలే కాని ఏదీ అసాధ్యం కాదు. ‘భగవంతుడు అందరికీ శక్తి ఇస్తాడు. కొందరు మాత్రమే తమ కృషితో, శ్రద్ధతో దాన్ని 10 రెట్లు చేసుకుంటారు. వారిదే గెలుపు’ అంటాడు అతను. దశరథ మహారాజు కుమారులైన రామ, లక్ష్మణులను కాలి నడకన అడవిలోకి తీసికెళ్లి సకల విద్యలూ నేర్పించిన విశ్వామిత్రుడు. రాజకుమారులైనా.. విద్యార్జన కోసం గడ్డిమీద శయనించారని (తృణశయనే) అంటూ...

‘క్రియాసిద్ధిః సత్వేభవతి మహతాం న ఉపకరణే’

‘కార్యసాధకులు తమ ఆత్మ విశ్వాసంపై ఆధారపడి శ్రద్ధాసక్తులతో కార్యసాధన చేస్తారు. కానీ ఉపకరణాల మీద ఆధారపడి కాదు అంటారు’ వాల్మీకి. కార్యసాధకునికి పరికరాలు, సౌకర్యాలు కాదు ప్రధానం. దీక్ష, శ్రద్ధ.

అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం (శ్రద్ధ వల్లే జ్ఞానం లభిస్తుంది) అన్నారు.

జీవితంలో ఎన్నిసార్లు మనం శ్వాసను తీసుకుంటామన్నది కాదు ముఖ్యం. మన పనిలో నిమగ్నమయి తదేక దృష్టి, శ్రద్ధ, ఏకాగ్రత వల్ల ఎన్నిసార్లు మనం శ్వాసను తీసుకోవటం మర్చిపోతున్నాం అనేదే ముఖ్యం అంటారు వాల్ట్ డిస్నీ.

తేనెటీగ కష్టపడుతుంది. కందిరీగ కష్టపడుతుంది. తేనెటీగ కష్టానికి ఫలితం తేనె. మరి కందిరీగ కష్టానికి ఫలితం? నిరంతర అభ్యాసం వల్ల శరీరం ఆరోగ్యంగానూ, మనసు నిర్మలంగానూ, హృదయం పరిపూర్ణంగానూ, జేబు నిండుగానూ ఉంటాయంటారు. శిక్షణలో చెమటోడిస్తేనే యుద్ధంలో రక్తం కారదు.
 
A.V.Rajamouli, IAS
Published date : 20 Nov 2021 02:48PM

Photo Stories