Skip to main content

కృషితో నాస్తి దుర్భిక్షం!!

పదో తరగతి, పన్నెండో తరగతి లేదా డిగ్రీ తర్వాత ఏం చదవాలి! ఏ రంగంలో ఉద్యోగానికి ప్రయత్నించాలి? ఇది నేటితరం పిల్లలు, తల్లిదండ్రులను వేధించే ప్రశ్న. కెరీర్ విషయంలో ఆసక్తిని, అభిరుచిని అనుసరించకుండా... ఇతరులను అనుకరించాలని ప్రయత్నించడం.. గమ్యం తెలియకుండా బస్‌స్టాండ్‌లో తోటి ప్రయాణికుడు ఎక్కిన బస్సు ఎక్కినట్లే అవుతుంది! ఆర్థిక, వ్యక్తిగత అవసరాలూ, అవకాశాలు... ఎంచుకున్న కెరీర్‌కు భవిష్యత్తు ఎలా ఉంటుందో విశ్లేషించుకొని నిర్ణయం తీసుకోవాలి. అలా చేస్తే ఎంచుకున్న రంగంలో ఎంతైనా ముందుకు వెళ్లగలరు!!

అక్కడ పనిచేసేది ఐదు వేల మంది. కనీస విద్యార్హత 8వ తరగతి. ప్రతి రోజూ మూడు గంటల పని. వారి టర్నోవర్ ఏడాదికి 50 కోట్లు. ఒక్కొక్కరికి నెల జీతం 6 వేలు. సాంకేతిక పరిజ్ఞానం శూన్యం అయినా.., రోజుకు రెండు లక్షల లావాదేవీలు. పనిలో పొరపాటు జరిగే అవకాశం ఒకటిన్నర కోట్ల లావాదేవీలకు ఒకసారి మాత్రమే. వారందించే సేవల్లో, పనిలో 99.999 శాతం పొరపాటు జరగదు. సమ్మె అన్న మాటే లేదు. ఒక్కొక్కరు కనీసం 40 లావాదేవీల్లో పాల్గొన్నా... నియమాలు, చట్టాలను ఉల్లంఘించరు. ఉల్లంఘిస్తే ప్రభుత్వానికే కాకుండా.. సంస్థకు కూడా జరిమానా కట్టాల్సిందే. బెంగళూరులో జరిగిన సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) సదస్సులో.. Best Business Model గా ప్రశంసలు పొందడంతోపాటు, గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. వీరే నవీ ముంబై టిఫిన్ బాక్స్ సప్లయర్స్ అసోసియేషన్!

1880లో ప్రారంభించి, ముంబై సబర్బన్ ప్రాంతాల్లో పని చేసేవారికి ప్రతిరోజు ఆహారమందించే అన్నదాతలు. చేసే పనిపట్ల ప్రేమ, ఉత్సాహం, అంకితభావం, పనినే పండగగా భావించే మనస్తత్వం, రోజూ అదే పని చేస్తున్నా.. విసుగు, అసహనం లేకుండా చేసే మనస్తత్వం.. ఇవన్నీ ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకూ... అందుబాటులో ఉన్న బోలెడు కోర్సుల్లో... ఏది ఎంచుకోవాలో నిర్ణయిం చుకోలేని యువతకూ, వారి తల్లిదండ్రులకూ... ఒక చక్కని విషయసూచికలా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదేమో!

ప్రకృతిలోని వివిధ రకాల జీవులు, విభిన్న కార్యాల నిర్వహణ కోసం ఎలా నిర్దేశించడం జరిగిందో... మానవ సమాజంలోని అన్ని రంగాల్లోనూ ఇష్టంతో, బాధ్యతతో పనిచేసే వ్యక్తుల అవసరముంది. ప్రతి పక్షీ తన గొంతుతో పాడితేనే ప్రకృతి వైవిధ్యభరితంగా, ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని పక్షులూ కోయిలలైనా, కాకులైనా దుర్భరమే. ఒకసారి.. బాల్యంలో తమకు పాఠాలు నేర్పిన మాస్టారును కలిసినపుడు కొంతమంది విద్యార్థులు .. ‘కెరీర్‌లో తమ తరం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిళ్లు మరేతరం ఎదుర్కోలేదని’ చెప్పారు. దాహంగా ఉందన్న విద్యార్థుల కోసం మాస్టారు లోపలికెళ్లి ఒక ట్రేలో రాగి, ప్లాస్టిక్ , వెండి, స్టీల్ గ్లాసుల్లో పానీయం సగం వరకు నింపి తీసుకువచ్చారు. కొందరు వెండి, స్టీలు గ్లాసులు తీసుకోగా... ఒకరిద్దరు ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నారు. మాస్టర్ ఒక రాగి గ్లాసును తీసుకొని తాగుతూ.. ‘చెరుకు రసం చాలా బాగుంది కదా!’ అని ప్రశ్నించారు. ‘మీరు చెరుకు రసం ఎక్కడ ఇచ్చారు? మా గ్లాసులో వేడినీరు ఉందని వెండి గ్లాసు తీసుకున్నవాళ్లు, తమ గ్లాసులో నీళ్లు కనీసం చల్లగా లేవని స్టీలు గ్లాసు తీసుకున్నవాళ్లు.. తమ గ్లాసులోది చెరుకు రసం కాదని’ పేర్కొన్నారు. ఈ మాటలు విన్న మాస్టర్ ఇలా అన్నారు... ‘దాహం తీర్చడానికి నేను తీసుకువచ్చిన గ్లాసుల్లో.. అందంగా, ఆకర్షణీయంగా ఉండే వెండి, స్టీలు, ప్లాస్టిక్ గ్లాసుల్నే అందరూ ముందుగా తీసుకున్నారు.. కానీ రాగి గ్లాసుల్ని తీసుకోలేదు. మీ ధ్యాస ఆకర్షణీయమైన గ్లాసులపై ఉంది కానీ దాహం తీర్చుకోవడంపై లేదు.’ కెరీర్ గ్లాసులాంటిదైతే.. జీవితం, లోపల పానీయం వంటిది! జీవితాన్ని జీవించడానికి కెరీర్ ఒక ఉపకరణం మాత్రమే. ఉపకరణం విలువపై దృష్టి సారించి, జీవన నాణ్యతను కోల్పోతే... మిగిలేది.. మీ ముఖాల్లో కనిపించేది.. విసుగు, అసహనం, నిర్లిప్తతే అన్నారు మాస్టారు. ఆసక్తి, అభిరుచి ఆధారంగా కాకుండా తోటివారిని చూసి ఎంచుకున్న కెరీర్‌లో ఇమడక, బయటకు రాలేక, ఆనందం వెతుక్కోలేక ఒత్తిడికి గురయ్యేవారందరికీ ఈ సంఘటన ఒక మార్గదర్శి.

తనతో తాను ప్రశాంతంగా జీవించడానికి ఒక సంగీత కళాకారుడు గానం చేయాలి; చిత్రకారుడు చిత్రాలను గీయాలి; ఒక కవి కవిత్వాన్ని చెప్పాలి అంటాడు.. అబ్రహం మాస్లో. సమాజంలో వీరందరి అవసరం ఉంది. జీవన నాణ్యతను కేవలం సంపాదించే ధనంతోనే నిర్ధారించడం అవివేకం. మనం వేసుకునే బ్రాండ్ దుస్తుల ఆధారంగా కాకుండా... మన వ్యక్తిత్వం ద్వారా మనకంటూ మనం ఒక ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించుకోగలిగామా! అనేది ముఖ్యం.

11ఏళ్ల వయసు నుంచి పొదుపు చేసి దాచుకున్న డబ్బు, న్యూస్‌పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో 14 ఏళ్లకే చిన్న పొలం కొనుక్కున్న వ్యక్తి.. నేడు 30 బిలియన్ డాలర్లకు పైగా సేవా కార్యక్రమాలకు విరాళం ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరైనా 50 ఏళ్లక్రితం కట్టుకున్న ఇంట్లోనే ఇప్పటికీ నివాసం. ఏ పనైనా కనీస సౌకర్యాలతో చేస్తూ, అవసరానికి మించి ఏదీ కొనరు. ఆడంబరాలకు పోయి పార్టీలు చేసుకోరు. పనిచేసి ఇంటికి వచ్చి తనకూ, తన భార్యకూ, పాప్‌కార్న్ చేయడం.. అవి తింటూ రేడియో వినడం.. ఆయన హాబీ. ‘మనం ఆనందించే పనులే చేయాలి. కానీ, సంపదను ప్రదర్శించడం కోసమో... ఇతరులను మెప్పించడం కోసమో ఏ పనీ చేయరాదంటారు. ఆయన్ని కలిసి మాట్లాడటానికి అరగంట సమయం తీసుకున్న బిల్‌గేట్స్... ఆరు గంటలు మాట్లాడి వెళ్లారు. ఆయనే వారెన్ బఫెట్! ధనాన్ని ప్రాతిపదికగా తీసుకొని వృత్తిని, కెరీర్‌ను ఎంచుకునే వ్యక్తి జీవితం బానిస జీవితమే అవుతుంది అంటారు ఆయన. ‘గాలిలో మేడలు కట్టడం తప్పు కాదు. అయితే, వాటిని అక్కడే ఉంచి, వాటి కింద పునాదులు కట్టడం ప్రారంభించాలంటారు. ఏ పని ఎంచుకున్నా... బతికినన్నాళ్లు జీవించే విధంగా ఎంచుకోమంటారు’ బఫెట్. ఏ పనిలో జీవించగలరో తెలుసుకుని కెరీర్‌ను ఎంచుకుంటే.. అందులో అత్యుత్తమంగా రాణించి.. సామాజిక సంతులనానికి తోడ్పడి నవారవుతారు. నిజమైన నిపుణుడు తన పనికీ, ఆటకూ.. శ్రమకూ, విశ్రాంతికీ.. చదువుకూ, విరామానికి (రీక్రియేషన్) తేడా తెలియనివ్వడు. అతనూ తెలుసుకోవాలని ప్రయత్నించడు.

ఎంచుకున్న కెరీర్‌లో అత్యంత వేగంగా, సులభంగా అత్యున్నత స్థానానికి వెళ్లాలని ఆరాటపడతాం. జీవితంలో ఏదీ తేలికగా రాదు. తేలిగ్గా వచ్చింది తేలిగ్గానే పోతుంది. కఠోర పరిశ్రమ, క్రమశిక్షణే విజయానికి పునాదులు అనే అంశాన్ని గుర్తెరగాలి. ఎంచుకున్న కెరీర్‌లో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకాగానే... మరో రంగం వైపు వెళ్లాలనుకునేవారు... తమ అసలు ఇబ్బంది కోర్సు కాదని.. తమ సోమరితనమేనని గుర్తించాలి. భర్తృహరి చెప్పినట్లు అల్పులు సమస్యలు వస్తాయనే సంశయంతో.. కార్యాన్ని ఆరంభించరు. మధ్యములు ఆరంభించి సమస్యలు రాగానే ఆ కార్యాన్ని విడిచిపెడతారు. ఉత్తములు సమస్య వచ్చినప్పుడల్లా తన కర్మ అని ఎవరినో నిందించకుండా.. రెట్టించిన ఉత్సాహంతో కార్యాన్ని పూర్తిచేస్తారు.

ఒక యువతి తన తల్లి దగ్గరకు వెళ్లి ‘‘జీవితంలో ఏది సాధించాలన్న అన్నీ సమస్యలే ఎదురవు తున్నాయి. జీవితంతో పోరాడి అలిసిపోయాను’’ అని వాపోతుంది. కుమార్తెను సముదాయించిన ఆ తల్లి... వంటగదిలోకి తీసుకెళ్లి మూడు పాత్రల్లో నీటిని వేడిచేసి... మొదటి పాత్రలో క్యారెట్లు, రెండోదానిలో గుడ్లు, మూడో పాత్రలో కాఫీ గింజలు వేసింది. 20నిమిషాల తర్వాత పాత్రలను చూసి నీవు ఏం గమనించావు అని ప్రశ్నిస్తూ కూతురికి ఇలా వివరించింది... ‘‘క్యారెట్, కోడి గుడ్డు, కాఫీ గింజలూ... మూడూ ‘మరుగుతున్న నీళ్లు’ అనే ఒకేరకమైన ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ.. ప్రతిస్పందనలు వేర్వేరు. గట్టిగా, బలంగా వెళ్లిన క్యారెట్ నీళ్లు వేడి కాగానే మెత్తబడి బలహీనపడిపోయింది. పైకి గట్టిగా కనిపించినా.. లోపల సున్నితంగా ఉండే గుడ్డు నీళ్లు వేడవగానే లోపల కూడా కఠినంగా అయిపోయింది. కానీ, కాఫీ గింజలు మాత్రం నీళ్లు వేడవగానే వేడి నీళ్లను కాఫీగా మార్చేశాయి.కాఫీ గింజల్లా సమస్యను అవకాశంగా మార్చుకోవాలి’’అని అంటుంది తల్లి. ఎంచుకున్న కెరీర్‌లో కష్టాలు ఎదురైనపుడు కాఫీ గింజల్లా ప్రతిస్పందిస్తే ఏ లక్ష్యమైనా సాధ్యమే.

జీవితం ఒక విద్యాలయమనుకుంటే... కన్ను తెరచి కన్ను మూసేవరకూ.. ప్రతి మనిషీ విద్యార్థే! జీవితాంతం దేని కోసం పరిగెడతామో.. జీవితాంతంలో అది మనది కాదు! అన్న సత్యాన్ని వంట పట్టించుకోగలిగితే.. ఎంచుకున్న ఏ రంగంలోనైనా ప్రాధాన్యతలను సరిగ్గా నిర్ధారించుకోగలుగుతాం. జీవితం అనేది చిన్నప్పుడు స్కూల్లో నిమ్మకాయను స్పూనులో పెట్టుకొని పరిగెత్తే పందెం లాంటిది. స్పూనులోని నిమ్మకాయ కింద పడిపోకుండా ఎవరైతే పందెంలో ప్రథములుగా వస్తారో.. వారే గెలిచినట్లు. నిమ్మకాయ కింద పడిపోతే ప్రథముడిగా వచ్చినా... లాభం ఉండదు. జీవితంలో కూడా అంతే. ఆనందం, ఆరోగ్యం, సున్నితమైన మానవ సంబంధాలు, ఇవన్నీ నిమ్మకాయ లాంటివి. వీటన్నీటితో పయనించి, గమ్యం చేరితేనే జీవితానికి సార్ధకత. లేకపోతే జీవితంలో నుంచి జీవం దూరమైపోతుంది. వైఫల్యాలను ఎదుర్కొంటావేమో అని భయపడేవాళ్లూ.. వైఫల్యాలను ఎదుర్కొంటున్నవారూ.. వనరుల లేమితో బాధ పడేవారూ.. సాటివారి వృద్ధి చూసి తాము వెనకబడిపోతున్నామని విచారించే వాళ్లూ.. నిరాశ చెందకుండా పట్టుదలతో ప్రయత్నించాలి. ఆశలు వాడితే జీవితానికి పరిమళం ఎక్కడిది? ఆశించిన ఫలితాలు రాకపోతే.. ఆత్మహత్యలు గురించి ఆలోచించే కంటే.. విచారం వదిలి.. ఆచరణపై దృష్టిసారించాలి.

అనిర్వేదః శ్రీయేమూలం అనిర్వేదః పరం సుఖం
అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః


నిర్విచారమే శ్రేయాలకు మూలం. విచారం లేకపోవుటే గొప్ప సుఖాలకు కారణం. విచారం లేని సత్ప్రవర్తనే సదా కార్యసిద్ధిని సమకూరుస్తుంది.

టెర్రీఫాక్స్ అనే కెనడా యువకుడికి కేన్సర్ వ్యాధితో కాలు తీసేయాల్సి వచ్చింది. డాక్టర్లు కూడా ఎక్కువ కాలం బతకడని చెప్పారు. మరణించేలోగా కేన్సర్‌పై పరిశోధనల కోసం కావాల్సినంత డబ్బు సమకూర్చడానికి పూనుకున్నాడు.. టెర్రీఫాక్స్. కృత్రిమ కాలుతో ప్రతిరోజూ 26 మైళ్లు పరుగెత్తుతూ (మారథాన్ పరుగుకు సమానం)... అలా దాదాపు 3 వేల మైళ్లకు పైగా పరిగెత్తి... కావాల్సిన ధనాన్ని సమకూర్చాడు. టెర్రీఫాక్స్ కథ ఏ రంగాన్నైనా లక్ష్యంగా ఎంచుకున్న ప్రతి విద్యార్థికీ ప్రేరణ కావాలి. 1000 మైళ్ల ప్రయాణమైనా... ఒక్క అడుగుతో మొదలుపెడదాం. ఎందుకంటే... కృషితో నాస్తి దుర్భిక్షం! నిత్య కృషీవలునికి కరువన్నదే లేదు.
 
A.V.Rajamouli, IAS
Published date : 20 Nov 2021 02:55PM

Photo Stories