Skip to main content

IAS Officers in Telangana: 41మంది ఐఏఎస్‌ల బదిలీ.. బదిలీ అయిన అధికారుల ప్రస్తుత, కొత్త పోస్టింగ్‌లు ఇవీ..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం భారీగా అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీ చేపట్టింది. అందులో 41 మంది ఐఏఎస్‌లు కాగా.. ఇద్దరు ఐపీఎస్, ఒకరు ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఉన్నారు.
Telangana Govt transfers 41 IAS officers in reshuffle

ఇందులో కీలకమైన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల ఇన్‌చార్జి సీఎండీ పోస్టుల నుంచి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీని ప్రభుత్వం తప్పించింది. ఆయనను వాణిజ్య పన్నులు, ఎౖMð్సజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శిగా మరో కీలక పోస్టు కు బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌కు ఇంధన శాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కో బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే మరికొందరు అధికారుల బదిలీ ఉండనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

కఠిన చర్యలకు దిగడంతో..: రాష్ట్రంలో

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కీలకమైన ఇంధన శాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కోల బాధ్యతను రిజ్వీకి అప్పగిస్తూ జనవరి 3న ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ.. అన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించినట్టు ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్‌ ఉద్యోగ సంఘాలతోపాటు కొందరు రాజకీయ పెద్దల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నట్టు తెలిసింది. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలను కలిసి రిజ్వీని బదిలీ చేయాలంటూ పైరవీలు చేసినట్టు సమాచారం. విద్యుత్‌ సంస్థల ఆర్థిక వ్యవహారాల్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా మెరిట్, సీనియారిటీ ఆధారంగా విద్యుదుత్పత్తి కంపెనీలు, కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని రిజ్వీ ఆదేశాలు జారీ చేయడం కొందరికి రుచించలేదనే చర్చ జరిగింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో రిజ్వీని ప్రభుత్వం బదిలీ చేయనున్నట్టు నెల రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రిజ్వీని ఇంధన శాఖ, ట్రాన్స్‌కో, జెన్‌కో బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. అయితే ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖలను అప్పగించింది. ఈ రెండు శాఖల్లో ఆదాయం లీకేజీని అరికట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. 

సుల్తానియాకు ఆర్థిక శాఖ 

రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌ను కూడా ప్రభుత్వం ఆరు నెలలు గడవక ముందే ఆ శాఖ నుంచి తప్పించి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న సందీప్‌కుమార్‌ సుల్తానియాకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టు ఇచ్చారు. ప్రణాళిక ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలూ అప్పగించారు. అంతేకాదు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలూ ఆయనే చూస్తారని పేర్కొన్నారు.

 ఆమ్రపాలి చేతికి నగరాభివృద్ధి.. 

హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ కాటా ఆమ్రపాలికి ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణంగా ఈ పోస్టులో అత్యంత సీనియర్‌ అధికారులను నియమిస్తుంటారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమితులైన అధికారుల్లో జూనియర్‌ ఆమ్రపాలి కావడం గమనార్హం. ఇప్పటికే ఆమె మూసీ రివర్‌ ఫ్రంట్, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌లకు ఎండీగా, ఓఆర్‌ఆర్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. దీంతో హైదరాబాద్‌ నగరాభివృద్ధికి సంబంధించిన కీలక విభాగాలన్నీ ఆమ్రపాలికి అప్పగించినట్టు అయింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం జాయింట్‌ సీఈఓ సర్ఫరాజ్‌ అహ్మద్‌ హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా కీలక పోస్టుకు బదిలీ అయ్యారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌ కె.అశోక్‌రెడ్డి జలమండలి ఎండీగా బదిలీ అయ్యారు. గతంలో ఆయన బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా వ్యవహరించారు. 

శైలజా రామయ్యర్‌కు మళ్లీ చేనేత బాధ్యతలు 

మంత్రి డి.శ్రీధర్‌బాబు సతీమణి శైలజా రామయ్యర్‌ను ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి పోస్టు నుంచి దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి పోస్టుకు బదిలీ చేసింది. పరిశ్రమల శాఖ కిందకు వచ్చే చేనేత, వస్త్ర, హస్తకళల శాఖ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగించింది. 2012 జూలై నుంచి 2022 నవంబర్‌ వరకు శైలజా రామయ్యర్‌ చేనేత శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. 

రిజిస్ట్రేషన్ల శాఖకు జ్యోతిబుద్ధ ప్రకాశ్‌.. 

రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ కీలకమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ, సర్వే–సెటిల్మెంట్‌–ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్, భూభారతి పీడీ అదనపు బాధ్యతల నుంచి నవీన్‌ మిట్టల్‌ను ప్రభుత్వం తప్పించింది. జ్యోతిబుద్ధ ప్రకాశ్‌కే అదనపు బాధ్యతలుగా ఈ పోస్టులను అప్పగించింది. 

మళ్లీ వారికి ప్రాధాన్యత లేని పోస్టింగ్స్‌... 

సీనియర్‌ ఐఏఎస్‌ సబ్యసాచి ఘోష్, సంజయ్‌కుమార్, వాణీప్రసాద్, అహ్మద్‌ నదీమ్‌లకు మళ్లీ పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టింగ్స్‌ లభించాయి. యువజన అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌ పశు సంవర్థక శాఖకు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న సంజయ్‌కుమార్‌ కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్‌ పొందారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.వాణీప్రసాద్‌ను ప్రభుత్వం యువజన అభివృద్ధి శాఖకు బదిలీ చేసింది.   

బదిలీ అయిన అధికారుల ప్రస్తుత, కొత్త పోస్టింగ్‌లు ఇవీ.. 

Telangana Govt transfers 41 IAS officers in reshuffle


 

Published date : 25 Jun 2024 11:24AM

Photo Stories