Mahesh Bhagwat, IPS : గైడెన్స్ లేకనే ఫెయిల్ అయ్యా..అందుకే ఇలా చేస్తున్నా..
ఇలా ఇప్పటివరకు వెయ్యికి పైగా అభ్యర్థులు సివిల్స్ సాధించేలా తీర్చిదిద్దారు. తాజాగా 2020 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మొదటి 20 ర్యాంకుల్లో ఆరు మంది (3, 8, 14, 18, 19, 20), వంద ర్యాంక్స్‌లో 19 మందికి ఈయనే మెంటార్‌షిప్ వహించారు. ఆయనే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం.భగవత్. సెప్టెంబర్ 28వ తేదీన తెలంగాణ టాపర్ పీ శ్రీజ (20వ ర్యాంక్), కనక్నాల రాహుల్ (218వ ర్యాంక్), పీ గౌతమి (317వ ర్యాంక్)లు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
నాకు ఎదురైన సమస్యలను...
1993లో యూపీఎస్సీ మెయిన్స్‌లో పాసయ్యా. కానీ సరైన గైడెన్స్ లేకపోవటంతో ఇంటర్వ్యూలో ఫెయిలయ్యా. లోలోపల ఏదో తెలియని భయం. మానసికంగా కృంగదీసింది. స్థానికంగా ఉన్న సీనియర్ ఆఫీసర్ల మార్గనిర్దేశంతో రెండో ప్రయత్నంలో 1994లో విజయం సాధించా. సివిల్స్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేందుకు నాకు ఎదురైన ఇబ్బందులు నేటి యువతకు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో 2014 నుంచి శిక్షణ ఇవ్వటం ప్రారంభించా.
మనం కష్టాల్లో ఉన్నప్పుడు..
హోదా వచ్చాక ఎవరైనా గౌరవిస్తారు. సాయం చేస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సరైన మార్గనిర్ధేశం చేసేవాళ్లే చాలా అవసరం. సివిల్స్‌లో ప్రతి ఒక్క మార్కు కూడా కీలకమే. దేశంలో ఏటా 10 లక్షల మంది పోటీపడితే ఉత్తీర్ణలయ్యేది 800 మంది లోపే ఉంటుంది. టాప్ 10 ర్యాంకర్ల మధ్య ఒక్క మార్కు తేడానే ఉంటుంది.
ఇంటర్వ్యూకు ఇవి పాటించకపోతే విజయం సాధించలేం..
సివిల్స్‌లో 275 మార్కులతో ఉండే మౌఖిక పరీక్ష చాలా కీలకం. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. లేకపోతే విజయం సాధించలేం. అందుకే ఇంటర్వ్యూకు ప్రిపేర్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించా. అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసం, మనోధైర్యాన్ని నింపేందుకు మెయిన్స్ పూర్తవగానే 3 నుంచి 4 నెలల పాటు ఉచితంగా ఇంటర్వ్యూపై కోచింగ్ ఇస్తున్నాం.
వీరి సాయంతో..
భద్రాద్రి–కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐఆర్‌ఎస్‌లు (ఏపీ) సాధు నరసింహా రెడ్డి, నితేష్ పాథోడ్, ముకుల్ కులకర్ణి, ఐఆర్‌ఎస్ రిటైర్డ్ రాజీవ్ రణాదే, ఐఏఎస్‌లు నీల్‌కాంత్ అవద్, ఆనంద్ పాటిల్, డాక్టర్ శ్రీకర్ పరదేశి, అభిషేక్ సరాఫ్, ఎంయూఏడీ జాయింట్ కమిషనర్ సమీర్ ఉన్హాలే, ఐసీఏఎస్ సుప్రియ దేవస్థలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ శైలేంద్ర డియోలాంకర్, జేపీసీ డైరెక్టర్ డాక్టర్ వివేక్ కులకరి్ణలు కూడా నాతోపాటు సివిల్స్ అభ్యర్థులకు సహకరిస్తున్నారు. రెండు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా, జూమ్, వీడియో కాల్స్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులకు భౌతికంగా శిక్షణ ఇస్తున్నాం. ఫారెస్ట్ సర్వీసెస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల పరీక్షలకు కూడా ట్రెయినింగ్ ఉంటుంది.
నా వద్ద శిక్షణ పొందిన వారు...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, బీహార్, అసోం, ఒడిశా, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన సివిల్స్ అభ్యర్థులు మా వద్ద శిక్షణ పొందుతున్నారు. నా వద్ద శిక్షణ పొందిన సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (హైదరాబాద్ మాజీ సీపీ ఏకే ఖాన్ కుమారుడు), భైంసా ఏఎస్‌పీ కిరణ్ ఖరేలు ప్రస్తుతం మన రాష్ట్రంలో విధుల్లో ఉన్నారు.
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Civils Topper Yaswanth Kumar Reddy Exclusive Interview: ఎప్పటికైనా నా లక్ష్యం ఇదే..