Skip to main content

పరీక్ష తీరు మారింది.. ప్రిపరేషన్ శైలి మారాల్సిందే...

పరీక్ష తీరు మారింది.. ప్రిపరేషన్ శైలి మారాల్సిందే... ఎంతో మంది అభ్యర్థుల్లో ఆసక్తిని, ఆందోళనను పెంచిన సివిల్స్ మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 2న ప్రారంభమై డిసెంబర్ 8న ముగిశాయి. మారిన విధానంలో తొలిసారి నిర్వహించిన మెయిన్స్ పరీక్షల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? ఇటు పరీక్ష లు రాసిన అభ్యర్థులు, అటు సివిల్స్ ఫ్యాకల్టీ ఏమంటున్నారు? మొత్తం మీద యూపీఎస్సీ మార్పులను ఆహ్వానించవచ్చా? వచ్చే ఏడాది పరీక్షకు సిద్ధమయ్యేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైనవాటిపై విశ్లేషణ..

సులువుగానే వ్యాస రచన..
ఎస్సేలో నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రశ్న మహాత్మాగాంధీ ప్రసిద్ధ కొటేషన్‌పై ఉంది. అది ‘నీవు ఇతరుల్లో ఏ మార్పును అయితే కోరుకుంటున్నావో.. ముందు ఆ మార్పు నీలోనే మొదలుకావాలి’. ఈ ప్రశ్నకు అభ్యర్థులు మూడు, నాలుగు పేజీల కంటే ఎక్కువ సమాధానం రాయలేరు. మరో ప్రశ్న ఎకానమీపై ఉంది. ఇంకో ప్రశ్న మనిషి ఆలోచనలకు సంబంధించింది. బ్రిటిష్‌వారు మనదేశాన్ని వదిలివెళ్లిపోయినా వారి ఆలోచనలనే మనం అనుసరిస్తున్నాం. ఇది దేశాభివృద్ధికి ప్రతిబంధకమా? ఈ ప్రశ్నకు సమాధానం సంతృప్తికరంగా రాయలేం. చివరి ప్రశ్న సైన్స్ అండ్ టెక్నాలజీపై ఉంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఈ ప్రశ్నకు సమాధానం రాశారు. శాస్త్ర, సాంకేతిక రంగ ప్రయోజనాలను నిత్య జీవితం నుంచి మొదలుపెట్టి ఏడు లేదా ఎనిమిది రంగాల్లో దేశాభివృద్ధి, రక్షణ, సైబర్ సెక్యూరిటీ ఇలా వివిధ రంగాల్లో దాని ఉపయోగాలను వివరిస్తే మంచి మార్కులు పొందొచ్చు. ఇందులో అభ్యర్థి సృజన, ఒరిజినాలిటీ, విషయపరిజ్ఞానం, మానసిక సంతులన, ఒక అంశాన్ని సర్వ కోణాల నుంచి దాని పర్యవసానాలను ఆలోచించి, విశ్లేషించి రాయగల నేర్పు పరిశీలిస్తారు. అభ్యర్థి తన అంతరంగాన్ని అక్షరీకరించి సమాధానం రాయాలి. తన జీవిత అనుభవాలను సొంతంగా రాయగలిగేలా ఉండాలి. విస్తృతమైన అధ్యయనం, సాహిత్యం, సహనం, పురాణాలు, సమకాలీన రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై పట్టు ఉన్నవారు ఈ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయొచ్చు.

జనరల్ ఇంగ్లిష్.. ఎంతో కష్టం..
అర్హత పరీక్షగా నిర్వహించే జనరల్ ఇంగ్లిష్ పేపర్ కఠినంగా ఉంది. ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చదివినవాళ్లు కూడా ఆన్సర్ చేయలేరేమో అన్నంత కష్టంగా ఉంది. ఇంత కఠినంగా ఇవ్వడం వల్ల ప్రాంతీయ భాషల్లో సివిల్స్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులకు అశనిపాతంగా మారే ఆస్కారం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఇబ్బందికరమని నిపుణులు పేర్కొంటున్నారు. జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని కఠినంగా ఇవ్వడం ద్వారా ఇంగ్లిష్‌పై తప్పనిసరిగా పట్టు సాధించాల్సిందేనని యూపీఎస్సీ స్పష్టం చేసిందని అంటున్నారు. కాబట్టి అభ్యర్థులు యూపీఎస్సీ మార్పులకనుగుణంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది పరీక్షలు రాయనున్నవారు ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఇలా అయితేనే జనరల్ ఇంగ్లిష్ అనే హార్డిల్‌ను దాటగలరు. లేకుంటే సబ్జెక్టులపై ఎంత పట్టున్నా.. అర్హత పరీక్షగా నిర్దేశించిన ఇంగ్లిష్‌లోనే కనీస మార్కులు సాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

జాగ్రఫీ ఆప్షనల్
Bavitha
జాగ్రఫీలో 10, 15, 25 మార్కుల ప్రశ్నలు ఇచ్చారు. 30 మార్కుల ప్రశ్నలు ఇవ్వలేదు. గతంలో 30 మార్కుల ప్రశ్నలు ఉండేవి. ముఖ్యంగా ఫిజికల్ జాగ్రఫీ చాలా డెప్త్‌గా ఉంది. అభ్యర్థులకు కొంచెం కష్టంగా అనిపించింది. ఉదాహరణకు పేపర్-1లో స్థానిక పవనాలు ప్రాంత శీతోష్ణస్థితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?, సీహెచ్‌సీలు పర్యావరణం మీద ఎలాంటి ప్రభావానికి కారణమవుతాయి? ఉదాహరణలివ్వండి వంటి ప్రశ్నలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాల్లో లేని కొన్ని ప్రశ్నలను కూడా ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు స్పష్టతతో లేవు. ప్రశ్నలన్నీ కూడా వివరించండి, విశ్లేషించండి, ఉదాహరణలివ్వండి, కారణాలేమిటి? ఇలా అభ్యర్థిలోని విషయ పరిజ్ఞానాన్ని, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేసేలా ఉన్నాయి. పేపర్-1లో ధ్వని కాలుష్యాన్ని నివారించడానికి చట్టపరమైన చర్యలు ఏమి తీసుకున్నారు? అనే ప్రశ్నలో స్పష్టత లేదు. పేపర్-1 సెక్షన్-బీలో ఎలాంటి ఇబ్బందీ లేదు. ప్రశ్నలన్నీ దాదాపు వర్తమాన వ్యవహారాలపైనే ఉన్నాయి. పేపర్-2 మాత్రం జనరల్ స్టడీస్ పేపర్‌లా ఉంది. మ్యాప్ పాయింటింగ్ సులువుగా ఇచ్చారు. దీన్ని 20 మార్కులకు రెండుగా (10 మార్కుల చొప్పున) విభజించి అడిగారు. ఇకపోతే ప్రశ్నలన్నీ ప్రస్తుత పరిణామాలపైనే ఉన్నాయి. సబ్జెక్టుపై పట్టు ఉన్నవారు సులువుగా రాయొచ్చు. పేపర్-1 జాగ్రఫీలో భాగంగా అడిగినప్రశ్నలన్నీ ఎక్కువ సమస్యలు, రీజనింగ్, లాజికల్, లింక్‌డ్‌గా ఉన్నాయి. వర్తమాన వ్యవహారాలపై అభ్యర్థి విశ్లేషణాత్మక శక్తిని పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు.

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
గతంతో పోలిస్తే ఈ ఏడాది పేపర్-1 అంత కష్టంగా లేదు. రెండో పేపర్ గతంలో మాదిరిగానే సాధారణ స్థాయిలోనే ఉంది. అయితే చాలా ప్రశ్నలు అభ్యర్థులకు అర్థం కాకుండా ఉన్నాయి. ప్రశ్న అర్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. సమాధానం రాయడానికి అందుబాటులో ఉన్న సమయం అసలు సరిపోదు. ఇంగ్లిష్‌లో ప్రశ్న అర్థం కాకుంటే హిందీలో చదవడానికి ఇబ్బందే. ఉదాహరణకు పేపర్-1లో 1 ఏలో ఇచ్చిన ప్రశ్నలో స్పష్టత లేదు. అదేవిధంగా 1.ఇలో ఉన్న ప్రశ్న పూర్తిగా తప్పు.
సివిల్స్ మెయిన్స్ రాసినవారిలో సగం మంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్‌తోనే పరీక్ష రాశారు. మిగిలిన ఆప్షనల్స్‌తో పోలిస్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కష్టంగా ఉంది. తెలుగు సాహిత్యం లాంటి కొన్ని ఆప్షనల్స్ ప్రశ్నలు సూటిగా, స్పష్టంగా, సులువుగా ఉంటున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంచెం బెటర్‌గానే ఉందని చెప్పొచ్చు.

హిస్టరీ ఆప్షనల్
Bavitha
హిస్టరీ ఆప్షనల్ విషయంలోనూ ఈసారి కొన్ని మార్పులు ఉన్నాయి. వాటిని గుర్తిస్తే దానికనుగుణంగా ప్రిపరేషన్‌ను మార్చుకునే అవకాశముంటుంది. 250 మార్కుల చొప్పున రెండు పేపర్లుగా హిస్టరీ ఆప్షనల్ ఉంది. అందులో పేపర్-1లో కీలకంగా చెప్పుకోవాల్సింది మ్యాప్ పాయింటింగ్. దీనికి 50 మార్కులు కేటాయించారు. గతంలో ప్రదేశాల పేర్లు ఇచ్చి వాటిని మ్యాప్‌లో గుర్తించమనేవారు. అంతేకాకుండా మూడు నుంచి నాలుగు వాక్యాల వివరణ రాయాల్సి ఉండేది. ఈసారి పాయింట్లను గుర్తించిన మ్యాప్ ఇచ్చి, ఆ పాయింట్‌లో ఉండే ప్రాంతాన్ని కనుగొని, దానిపై వివరణ రాయమని అడిగారు. అయితే క్లూగా అది ఏ రకమైన ప్రాంతం అనే అంశాన్ని తెలిపారు. ఉదాహరణకు నియోలిథిక్ సైట్ అని, ఓడరేవు, ప్రీ హరప్పన్ స్థావరం అని ప్రతి పాయింట్‌కు క్లూ ఇచ్చారు. మ్యాప్ మీద, ఆయా ప్రదేశాల మీద పూర్తి అవగాహన ఉంటేనే సులువుగా వీటికి సమాధానం రాయొచ్చు.

మిగిలిన ప్రశ్నల విషయానికొస్తే గత ఆప్షనల్ ప్రశ్నలకు, ఇప్పుడిచ్చిన ప్రశ్నలకు పెద్ద వ్యత్యాసం లేదు. ప్రశ్నలన్నీ అధికంగా రాజకీయేతర అంశాల నుంచి అడిగారు. అయితే ఏ ప్రశ్నకు రెడీమేడ్ సమాధానం లభించదు. ప్రశ్న సరళిని బట్టి అభ్యర్థి వద్ద ఉన్న సమాచారాన్ని ప్రశ్నకనుగుణంగా మార్చి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రాచీన భారతదేశంలో బ్యాంకింగ్, వడ్డీ వ్యాపార విధానాన్ని సమకాలీన ఆధారాల సహాయంతో వివరించమని అడిగారు. అదేవిధంగా లిఖిత, శాసనాధారాలను దృష్టిలో ఉంచుకుని ప్రాచీన భారత దేశంలో భూ యాజమాన్యాన్ని సమీక్షించండి? అనే ప్రశ్న ఇచ్చారు. మొత్తం మీద చరిత్రలోని విభాగం ఏదైనా ప్రశ్నల తీరు దాదాపు ఇదే రీతిగా ఉంది. కాబట్టి ఔత్సాహిక అభ్యర్థులు అధ్యయనం సమయంలోనే ఆయా అంశాలపై ప్రశ్నలు ఏవిధంగా అడిగే అవకాశముంటుందో కొంత మేరకు ఊహించాలి. దానికనుగుణంగా పరిపూర్ణంగా సిద్ధమైతే ప్రశ్నలు ఎలా వచ్చినా అప్పటికప్పుడే సమాధానాన్ని రాయొచ్చు. మొత్తం మీద ఈ కొత్త సిలబస్ హిస్టరీ ఆప్షనల్‌గా ఉన్న అభ్యర్థులకు చాలామందికి అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు.

గతేడాది కంటే ప్రశ్నల సంఖ్య పెరిగింది. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడానికి అభ్యర్థులకు సమయం సరిపోలేదు. ముందునుంచీ రైటింగ్ ప్రాక్టీస్ ఉన్నవాళ్లు, విశ్లేషణాత్మక సామర్థ్యం ఉన్నవారు మినహాయించి మిగిలినవారు పోటీలో వెనుకంజలో ఉన్నట్లే. కాబట్టి అభ్యర్థులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్ శైలిని మార్చుకొంటేనే విజయం సాధ్యం.

జనరల్ స్టడీస్ పేపర్-1
పేపర్-1లో హిస్టరీ నుంచి 14 ప్రశ్నల వరకు అడిగారు. ఒక్కొక్క ప్రశ్నకు పది మార్కులు. హిస్టరీ నుంచే 140 మార్కులు సాధించే అవకాశం ఉంది. పైగా ఈ పేపర్‌లోని ప్రశ్నలన్నీ తప్పనిసరిగా రాయాలి. ఛాయిస్ లేదు. ఈ ప్రశ్నలన్నీ ఏపీపీఎస్సీ గ్రూప్-1 మాదిరిగా పది మార్కుల ప్రశ్నలే. ప్రశ్నల ప్రామాణికత విషయంలో తేడా ఉంది. ఎక్కువగా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక దృక్పథంలో చరిత్ర నుంచి ప్రశ్నలు అడిగారు. ఉదా: దేవాలయ వాస్తు కళా వికాసంలో చోళుల వాస్తు కళను అత్యున్నతమైన దశగా ఎందుకు భావిస్తారు? అని ఇచ్చారు. డల్హౌసీని ఆధునిక భారత నిర్మాతగా నిరూపించమని అడిగారు. ఈ ప్రశ్నల సరళిని బట్టి చూస్తే అభ్యర్థులు గతంలో మాదిరి హిస్టరీ విషయంలో సెలెక్టివ్ విధానాన్ని అనుసరించడం సాధ్యం కాదు. అణు విద్యుత్, చమురు, సహజవాయువుకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో దానిపై ప్రశ్నలు అడిగారు. సదరన్ స్టేట్స్‌లో పంచదార మిల్లులు ఎక్కువగా ఉండటానికి, పత్తి, వస్త్ర పరిశ్రమలు వికేంద్రీకృతం కావడానికి గల కారణాలను విశ్లేషించండి? పశ్చిమ కనుమల్లో నదులు డెల్టాలను ఏర్పరచకపోవడానికి కారణాలేంటి? వంటి జాగ్రఫీ సంబంధిత ప్రశ్నలు అడిగారు. తూర్పు కోస్తా తీరంలో ఫైలిన్ సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా తుపానులకు ఎలా పేర్లు పెడతారు వివరించండి? వంటి ప్రశ్నల తీరును చూస్తే ప్రశ్నలన్నీ ప్రస్తుత వర్తమాన వ్యవహారాలపైనే ఉంటున్నాయి.

చిన్నరాష్ట్రాలపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రాంతీయవాదం ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. వివరించండి? ప్రపంచీకరణ భారతదేశంలో ఏజ్‌డ్ పాపులేషన్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? భారతదేశంలో పట్టణీకరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో ఎదురయ్యే సామాజిక సమస్యలను చర్చించండి? వంటి ప్రశ్నలు కూడా సమకాలీన పరిస్థితులపైనే ఉన్నాయి.

జనరల్ స్టడీస్ పేపర్-2
పేపర్-2లో భాగంగా ఇచ్చిన ప్రశ్నలు ఎకానమీని బాగా అధ్యయనం చేసిన వారికి సులువుగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు చక్కని సమాధానం రాయాలంటే ఆర్థిక సంఘం, సెబీ, మధ్యాహ్న భోజన పథకం, కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్‌‌డ పథకాలు, ఎలక్ట్రానిక్ నగదు బదిలీ, మిలీనియం వృద్ధి లక్ష్యాలు, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, పురా, సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులు, సూక్ష్మ రుణ సంస్థలు వంటి అంశాలపై అవగాహన అవసరం. ఆయా అంశాల పట్ల అవగాహనే కాకుండా వాటి పనితీరుకనుగుణంగా విమర్శనాత్మక పరిశీలన అధ్యయనం ఉండాలి. స్థానిక ప్రభుత్వాల ఫైనాన్‌‌సను పటిష్టపరిచే క్రమంలో 13వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇంతకుముందు సిఫార్సుల కంటే ఏ విధంగా భిన్నమైనవి అనే ప్రశ్నకు సమాధానం రాయాలంటే ఇచ్చిన అంశానికి సంబంధించి వివిధ ఆర్థిక సంఘాల సిఫార్సులను అధ్యయనం చేసి ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి మిలీనియం వృద్ధి లక్ష్యాల సాధనలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు పాత్ర, విధులలో తేడా లాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఈ పేపర్‌లో ఎకానమీకి సంబంధించి పది ప్రశ్నలు ఉన్నాయి. 200 పదాల పరిమితి కలిగిన ప్రతి ప్రశ్నకు 10 మార్కులు నిర్దేశించారు. నిర్దేశిత సిలబస్‌లోనే ఉన్నందువల్ల ఈ ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు ఇవ్వొచ్చు. అదేవిధంగా పాలిటీ విభాగంలో మనదేశానికి వివిధ దేశాలతో ఉన్న అంతర్జాతీయ సంబంధాలపై ప్రశ్నలు ఉన్నాయి. బంగ్లాదేశ్, మాల్దీవుల్లో జరిగిన పరిణామాలు.. మన దేశంపై ప్రభావం/సంబంధం వంటి ప్రశ్నలు ఇచ్చారు. వీటితోపాటు ఎంత బలమైన లోక్‌పాల్ బిల్లు ఉన్నా అవినీతిని నియంత్రించలేకపోవచ్చు. చర్చించండి? 2014లో అప్ఘానిస్థాన్ నుంచి అంతర్జాతీయ బలగాలను ఉపసంహరించాలనుకుంటున్నారు. దీనివల్ల ముఖ్యంగా భారతదేశంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే ప్రశ్నలను చూస్తే ప్రశ్నలన్నీ లింక్ బేస్డ్‌గా ఉంటున్నాయి.

జనరల్ స్టడీస్ పేపర్-3
Bavitha
జనరల్ స్టడీస్ పేపర్-3లో ఎకనమిక్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అనే అంశాలు ఉన్నాయి. వీటి నుంచి 25 ప్రశ్నలు అడిగారు. వీటిలో ఎకానమీ నుంచి 12 ప్రశ్నలు రాగా, మిగిలిన అంశాల నుంచి 13 ప్రశ్నలు ఇచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోడైవర్సిటీ, సెక్యూరిటీ, మేథోసంపత్తి హక్కులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ప్రశ్నలన్నీ దాదాపు సమకాలీన అంశాలపైనే ఉండటం గమనార్హం. మేథో సంపత్తి హక్కులు అనే అంశంలో 1970 నాటి భారత పేటెంట్ చట్టానికి 2005లో జరిగిన సవరణలకు కారణాలు అడుగుతూనే నోవార్టిస్ ఫైల్ చేసిన పేటెంట్స్‌ను తిరస్కరించడంలో సుప్రీంకోర్టు ఈ సవరణను ఎలా ఉపయోగించుకుంది వివరించమని అడిగారు. అదేవిధంగా డిజిటల్ సిగ్నేచర్, 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ, క్రికెట్‌లో అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ మొదలైన వాటిని వివరించండి? వంటి ప్రశ్నలు ఇచ్చారు. సిలబస్‌లోని ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్‌లో భాగంగా అక్రమ మైనింగ్ అంటే ఏమిటి? అనే ప్రశ్న అడిగారు. ప్రస్తుత సమకాలీన అంశాల్లో మరొకటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్. వాటి ద్వారా భద్రత ప్రభావాలపై ప్రశ్న కూడా ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీలో భాగంగా సైబర్ వార్‌ఫేర్ అనేది ఉగ్రవాదం కంటే ఏ విధంగా తీవ్రమైంది? భారత్ ఏ విధంగా దాని ప్రభావానికి గురవుతుందని, భారత్‌లో ఈ అంశానికి చెందిన సంసిద్ధత ఎలా ఉందని అని అడిగారు? దాదాపు ఇలా అన్ని ప్రశ్నలు సమకాలీన అంశాలతో ముడిపడి ఉన్నాయి. పేపర్-3లో సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఇచ్చిన రెండు ప్రశ్నలు వైద్య రంగానికి సంబంధించినవి. ఆ రెండు ప్రశ్నలు చాలా ఇన్‌డెప్త్‌గా, వైద్య రంగంలో అసాధారణమైన పట్టు ఉన్నవారు తప్పతే మిగిలినవారు ఆన్సర్ చేయలేనివిధంగా ఉన్నాయి. ప్రశ్నలన్నీ సమకాలీన సమస్యలపైన, అప్లికేషన్ ఓరియెంటెడ్ విధానంలో ఉన్నాయి. ఇది మంచి ధోరణి. దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామంగా గుర్తించాలి. అభ్యర్థి సమగ్ర వ్యక్తిత్వాన్ని అంచనా వేసేలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఏ ఇబ్బంది లేకుండా జవాబులు ఇవ్వడానికి ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలతోపాటు దానితో ముడిపడి ఉన్న అన్ని సమకాలీన అంశాలు తెలిసి ఉండాలి. ఇందుకోసం దినపత్రికల్లో వచ్చే విశ్లేషకుల ఆర్టికల్స్ తప్పనిసరిగా చదవడం అలవాటు చేసుకోవాలి.

జనరల్ స్టడీస్ పేపర్-3లో భాగంగా ఎకానమీకి సంబంధించి ఇచ్చిన ప్రశ్నలు వర్తమాన అంశాలకు అనుగుణంగా ఇచ్చారు. ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలకు జవాబు రాయాలంటే విద్యార్థులకు కాన్సెప్ట్ పట్ల అవగాహన తప్పనిసరి. ఇచ్చిన ప్రతి ప్రశ్నను వర్తమాన అంశాల ప్రాతిపదికగా జవాబు రాసినప్పుడు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. సిలబస్‌కనుగుణంగా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌బీఎం), సమ్మిళిత వృద్ధి, నూతన కంపెనీల బిల్లు 2013, పన్ను వ్యయం, ఆహార భద్రతా బిల్లు, వ్యవసాయ సబ్సిడీలు, పింక్ రివల్యూషన్, ప్రపంచీకరణ, భూ సంస్కరణలు, వ్యవసాయ ఉత్పాదకత, పేదరికం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, మల్టీ బ్రాండ్ రిటైల్ రంగం, వస్తు, సేవలపై పన్నులాంటి కాన్సెప్ట్‌ల ఆధారంగా ప్రశ్నలను రూపొందించారు. ప్రతి కాన్సెప్ట్‌ను ఈ పేపర్‌లో కూడా వర్తమాన అంశాలకు అన్వయించి ప్రశ్నగా రూపొందించారు. సిలబస్‌లో వివిధ కాన్సెప్ట్‌లను అధ్యయనం చేసే క్రమంలో వాటిని వివిధ అంశాలకు సంబంధించి లోతైన అధ్యయనం చేసినవారికి ఈ ప్రశ్నలు కష్టం కావు. రాబోయే కాలంలో సివిల్స్ మెయిన్‌‌సకు హాజరయ్యే అభ్యర్థులు ఎకానమీని అధ్యయనం చేసే క్రమంలో కాన్సెప్ట్‌పై అవగాహనతో పాటు వాటిని వివిధ అంశాలకు అన్వయించుకుంటూ అధ్యయనం చేయాలి. ప్రతి ప్రశ్నకు సంబంధించిన జవాబు వాస్తవికతకు దగ్గరగా చూపించే క్రమంలో డేటాపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైన జవాబును 200 పదాల పరిమితిలో పాటిస్తూ సమయ పరిమితిలోగా అన్ని ప్రశ్నలకు జవాబు రాసే విధంగా సంసిద్ధులు కావాలి.

జనరల్ స్టడీస్ పేపర్-4
పేపర్-4లో మొత్తం 25 ప్రశ్నలకు మూడు గంటల్లో సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 200 పదాలు రాయాలి. ఇచ్చిన ప్రశ్నను అర్థం చేసుకొని, ఏం రాయాలో ఆలోచించుకుని, సమాధానాన్ని మనసులోనే రూపొందించుకుని ఆన్సర్ రాయాలి. ఒక్కో ప్రశ్నకు గరిష్టంగా ఏడు నిమిషాల సమయం మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎగ్జామినర్‌ను ఆకట్టుకునేలా సమాధానం రాయడం కత్తి మీద సామే. చాయిస్ కూడా లేదు. మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. జనరల్ స్టడీస్‌లో అన్ని పేపర్లకు చాలా మంది అభ్యర్థులు 10 నుంచి 15 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వగలిగారు! గతంలో మెయిన్స్ పరీక్ష ల్లో 200 పదాల ప్రశ్నకు జవాబు రాయడానికి 12 నిమిషాల సమయం లభిస్తే ఈసారి ఏడు నిమిషాల సమయం మాత్రమే లభించింది. ఇంత తక్కువ సమయంలో ప్రశ్నను అర్థం చేసుకుని, సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా సమాధానం రాయడం చాలా కష్టం. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీలో సెక్షన్ -ఏ, సెక్షన్-బీ అన్నీ కేస్ స్టడీస్. మొత్తం 250 మార్కుల పేపర్‌లో 150 మార్కులు కేస్ స్టడీల నుంచే ఉన్నాయి. అయితే సిలబస్‌లో ఉన్న ఏడు చాప్టర్లలో ఒక చాప్టర్‌కు మాత్రమే సగానికి పైగా వెయిటేజ్ ఇచ్చి, మిగిలినవాటికి ఇవ్వలేదు.

ఇన్‌పుట్స్
Bavitha
జాగ్రఫీ:
గురజాల శ్రీనివాసరావు
జీఎస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్: డాక్టర్ బి.జె.బి.కృపాదానం.
ఎస్సే: బి.కృష్ణారెడ్డి
ఎకానమీ: తమ్మా కోటిరెడ్డి
హిస్టరీ: యాకూబ్‌బాష
సైన్స్ అండ్ టెక్నాలజీ: సి.హరికృష్ణ
Published date : 26 Dec 2013 02:20PM

Photo Stories