Skip to main content

ఫాంగ్‌.. దిగ్గజ ఎంఎన్‌సీ కంపెనీల్లో అందుకో ఆఫర్‌!

FAANG
facebook

ఫాంగ్‌(ఎఫ్‌ఏఏఎన్‌జీ).. ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌లకు సంక్షిప్త నామం. ఇవి అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు. మార్కెట్లో వృద్ధి పరంగా.. ప్రగతిపథంలో పయనిస్తున్న టాప్‌ కంపెనీలు! అమెరికాకు చెందిన ఈ టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఫాంగ్‌ కంపెనీల్లో కొలువు దక్కితే..ఆకర్షణీయ వేతనాలతోపాటు ఎదిగేందుకు ఆకాశమే హద్దు అనే అభిప్రాయం!! అందుకే టాప్‌ ఐఐటీలు మొదలు.. స్థానిక ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరికీ ఫాంగ్‌ కంపెనీల్లో నియామకాలపై ఎంతో ఆసక్తి. ఈ నేపథ్యంలో.. ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ.. అవసరమైన అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం.. 

బీటెక్‌ పూర్తయ్యాక.. మీ డ్రీమ్‌ కంపెనీ ఏది అని అడిగితే.. ఎక్కువ మంది నుంచి టక్కున వచ్చే సమాధానం.. గూగుల్, ఫేస్‌బుక్‌! తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో.. ఉద్యోగార్థులకు ఆకర్షణీయ సంస్థల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో అమెజాన్, గూగుల్‌ నిలిచాయి. ఫాంగ్‌గా పేర్కొనే ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌.. ఆన్‌క్యాంపస్, ఆఫ్‌క్యాంపస్‌ విధానాల్లో నియామకాలు జరుపుతున్నాయి. ఆఫ్‌–క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ కోసం ముందుగా తమ సంస్థల వెబ్‌సైట్స్‌ ద్వారా ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నాయి. ఆయా ప్రకటనల ఆధారంగా అభ్యర్థులు తమ రెజ్యుమే ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది.

ఫేస్‌బుక్‌.. ఫేస్‌ చేయాలంటే!
ఫేస్‌బుక్‌ అభ్యర్థుల్లో కోర్‌ నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తూనే.. క్రియేటివిటీకి పెద్దపీట వేస్తుంది. ఫేస్‌బుక్‌ ఎంపిక ప్రక్రియ నాలుగైదు వారాలపాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెజ్యుమే ఆధారంగా ముందుగా టెలిఫోన్‌ సంభాషణ జరుగుతుంది. ఇందులో అభ్యర్థుల లక్ష్యాలు, అభిరుచులు, సంస్థలో ఉద్యోగంపై ఉన్న వాస్తవ ఆసక్తిని తెలుసుకుంటారు. ఆ తర్వాత టెలిఫోనిక్‌ లేదా వీడియో విధానంలో మరో రెండు ఇంటర్వూలు నిర్వహిస్తారు. వీటిలో విజయం సాధిస్తే.. సంస్థ కార్యాలయంలో జరిగే ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని సూచిస్తారు. ఇక్కడ మరో మూడు లేదా నాలుగు రౌండ్లలో రిటెన్, ఓరల్‌ టెస్ట్‌లు ఉంటాయి. 

రిటెన్‌ టెస్ట్‌ల్లో కోడింగ్‌కు సంబంధించి రెండు లేదా మూడు ప్రశ్నలు ఇచ్చి.. వాటిని పరిష్కరించమని అడుగుతారు. ఇందుకు అరగంట నుంచి గంట వరకు సమయం ఇస్తారు. ఈ దశ దాటిన వారిని ఇంటర్వూ రౌండ్స్‌ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వూలు టెలిఫోనిక్‌ లేదా వీడియో కాల్స్‌ రూపంలో ఉంటాయి. ఒక్కో రౌండ్‌ ఇంటర్వూ దాదాపు 45 నిమిషాలపాటు జరుగుతుంది. ఫేస్‌బుక్‌ మూడు రకాల ఇంటర్వూలను నిర్వహిస్తోంది. అవి.. కోడింగ్‌ ఇంటర్వూ, డిజైన్‌ ఇంటర్వూ, బిహేవియరల్‌ ఇంటర్వూ.

కోడింగ్‌ ఇంటర్వూ కొన్ని సందర్భాల్లో రాత పరీక్ష రూపంలో ఉంటోంది. అభ్యర్థుల్లోని కోడింగ్‌ నైపుణ్యాలు పరిశీలించేలా ఈ పరీక్ష నిర్వహిస్తారు. తొలి దశలో నిర్వహించే కోడింగ్‌ పరీక్షతో పోల్చితే ఇది కొంత క్లిష్టంగా ఉంటుంది. దాదాపు అరగంట వ్యవధిలో జరిగే ఈ కోడింగ్‌ ఇంటర్వూలో చివరి అయిదు నుంచి పది నిమిషాలు అభ్యర్థులను మౌఖికంగా పరీక్షించేందుకు కేటాయిస్తారు.

డిజైన్‌ ఇంటర్వూ రౌండ్‌లో..సిస్టమ్‌ డిజైన్‌ లేదా నిర్దిష్టంగా ఒక ప్రొడక్ట్‌ డిజైన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. డిజైన్‌ ప్రిన్సిపుల్స్, అభ్యర్థులు అప్పటికే చేసిన డిజైన్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. బిహేవియరల్‌/కల్చరల్‌ ఫిట్‌ ఇంటర్వూలో.. అభ్యర్థుల దృక్పథాన్ని, లక్షణాలను పరీక్షిస్తారు. లక్ష్యాలు, ప్రొఫైల్, నేపథ్యం, విలువలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. వీటికి అభ్యర్థులు ఇచ్చే సమాధానాలతో ఇంటర్వూ ప్యానెల్‌ సంతృప్తి చెందితే.. ఫేస్‌బుక్‌ కొలువు ఖరారైనట్లే!​​​​​​​​​​​​​​​​​​​​​

Published date : 14 Jul 2021 06:24PM

Photo Stories