Skip to main content

పదితోనే బీటెక్‌ దిశగా.. ఆర్‌జీయూకేటీ సెట్‌ 2021తో..

ఏపీ ట్రిపుల్‌ ఐటీలు.. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే ఆలోచనతో, సంకల్పంతో ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్‌లు! వీటి పర్యవేక్షణకు..

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ) పేరుతో.. ప్రత్యేకంగా యూనివర్సిటీని సైతం స్థాపించారు. ఈ యూనివర్సిటీ.. ప్రతి ఏటా ఆర్‌జీయూకేటీ సెట్‌(ఆర్‌జీయూకేటీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) నిర్వహించి.. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తోంది. తాజాగా 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ఆర్‌జీయూకేటీ–సెట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్‌జీయూకేటీ–సెట్‌ వివరాలు, అర్హతలు, ప్రవేశం కల్పించే కోర్సులు, ఎంపిక విధానంపై ప్రత్యేక కథనం...

బీటెక్‌ చదవాలంటే.. పదో తరగతి ఉత్తీర్ణతతో ఇంటర్‌ ఎంపీసీలో చేరాలి. ఆ తర్వాత ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్టులకు హాజరు కావాలి. వీటిలో ర్యాంకు సాధిస్తేనే.. బీటెక్‌లో ప్రవేశం లభిస్తుంది. ఇందుకోసం ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే కోచింగ్‌లు, రూ.లక్షల్లో ఫీజులు చెల్లించాలి. ఇలాం టి వ్యయభారం గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు భరించలేని పరిస్థితి. దాంతో నాడు పల్లె ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారుతున్న పరిస్థితులను గమనించిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. ఏపీ ట్రిపుల్‌ ఐటీలను నెలకొల్పారు.

నాలుగు క్యాంపస్‌లు..
పదో తరగతి ఉత్తీర్ణతతోనే బీటెక్‌ దిశగా అడుగులు వేసేందుకు అవకాశం కల్పించడం ఏపీ ట్రిపుల్‌ ఐటీల ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఏపీ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లు బీటెక్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. ఆర్‌.కె.వ్యాలీ(ఇడుపులపాయ), నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంల్లో ఈ క్యాంపస్‌లు ఉన్నాయి. ఒక్కో క్యాంపస్‌లో వేయి సీట్లు చొప్పున నాలుగు క్యాంపస్‌ల్లో మొత్తం నాలుగు వేల సీట్లలో ప్రవేశం కల్పిస్తున్నారు.

పీయూసీ + బీటెక్‌..
మొత్తం ఆరేళ్ల వ్యవధిగల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో తొలి రెండేళ్లను పీయూసీ (ఇంటర్మీడియెట్‌ తత్సమాన) కోర్సుగా పరిగణిస్తారు. ఆ తర్వాత నాలుగేళ్లు బీటెక్‌ ప్రోగ్రామ్‌ బోధన కొనసాగుతుంది. మొదటి రెండేళ్ల పీయూసీలో..ఎంపీసీ గ్రూప్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, తెలుగు, ఐటీ సబ్జెక్టులను అందిస్తున్నారు. వీటితోపాటు బయాలజీని ఆప్షనల్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. బయాలజీని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న విద్యార్థులకు భవిష్యత్‌లో మెడికల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లకు హాజరయ్యే అర్హత సైతం లభిస్తుంది.

బీటెక్‌.. మూడో సంవత్సరం నుంచి..
మొదటి రెండేళ్లు పీయూసీ పూర్తి చేసుకున్న తర్వాత.. మూడో ఏడాది నుంచి బీటెక్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభమవుతుంది. బీటెక్‌లో ఏడు బ్రాంచ్‌లను ఎంచుకునే అవకాశం ఉంది. అవి.. కెమికల్‌ ఇంజనీరింగ్‌; సివిల్‌ ఇంజనీరింగ్‌; కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌; ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌; ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌; మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌; మెకానికల్‌ ఇంజనీరింగ్‌. తొలి రెండేళ్ల పీయూసీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు.. తమకు నచ్చిన బ్రాంచ్‌లను ప్రాథమ్యాల వారీగా పేర్కొనాలి. ప్రవేశాల కమిటీ.. వాటిని పరిశీలించి.. పీయూసీలో పొందిన మార్కులు, బీటెక్‌ స్థాయిలో అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకొని.. బ్రాంచ్‌లను కేటాయిస్తుంది.

పీయూసీతో ఎగ్జిట్‌..
ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో.. తొలి రెండేళ్ల పీయూసీ పూర్తి చేసుకున్న తర్వాత.. ఎగ్జిట్‌ అవకాశం కూడా ఉంది. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు హాజరై.. సీటు సొంతం చేసుకున్న విద్యార్థులకు ఉపయోగపడేలా ఎగ్జిట్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఎగ్జిట్‌ అయిన విద్యార్థులకు పీయూసీ సర్టిఫికెట్‌ అందిస్తారు. దాని ఆధారంగా సదరు విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశం పొందొచ్చు.

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌..
ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో అమలవుతున్న లెర్నింగ్‌ బై డూయింగ్, ఇతర వినూత్న బోధన విధానాల ఫలితంగా.. బీటెక్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అలవడుతున్నాయి. దాంతో∙వీరికి ఎంఎన్‌సీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్స్‌ నిర్వహించి.. ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఏపీ ట్రిపుల్‌ ఐటీల విద్యార్థులు గేట్, పీజీఈసెట్‌ తదితర ఉన్నత విద్య ఎంట్రెన్స్‌ టెస్ట్‌లలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. యూపీఎస్‌సీ–ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌తోపాటు, ఇతర ఉద్యోగ పోటీ పరీక్షల్లోనూ విజయం సాధిస్తున్నారు.

స్కాలర్‌షిప్‌..
ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సదుపాయం సైతం అందుబాటులో ఉంది. కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న రిజర్వేషన్‌ కేటగిరీ విద్యార్థులు; రూ.రెండు లక్షలలోపు ఉన్న ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా..
ఆర్‌జీయూకేటీ–సెట్‌–2021 దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయాలి. ఈ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌కు ఉపక్రమించేముందే అన్ని వివరాలు దగ్గర ఉంచుకోవాలి. అవి.. పదో తరగతి హాల్‌టికెట్‌ నెంబర్‌; పుట్టిన తేదీ సర్టిఫికెట్‌; కుల ధ్రువీకరణ పత్రం; ఆధార్‌ నెంబర్‌; ఎన్‌సీసీ, పీహెచ్, సీఏపీ కేటగిరీ విద్యార్థులు అందుకు సంబంధించిన ధ్రువ పత్రాలు;ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్‌; ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌; తెల్ల రేషన్‌ కార్డ్‌/రైస్‌ కార్డ్‌; నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్‌; లోకల్‌ కేటగిరీ కోరుకుంటున్న అభ్యర్థులు.. అందుకు సంబంధించి అధికారులు జారీ చేసిన రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌.

ఆర్‌జీయూకేటీ సెట్‌ ఇలా..
ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో అడుగు పెట్టేందుకు ప్రతి ఏటా ఆర్‌జీయూకేటీ–సెట్‌ పేరుతో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలో విజయం సాధించాల్సి ఉంటుంది. సెట్‌ ఫలితాలు వెలువడ్డాక.. ప్రత్యేకంగా మరోసారి అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆ నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వంద మార్కులకు పరీక్ష..
• ఆర్‌జీయూకేటీ సెట్‌ మొత్తం వంద మార్కులకు ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. అంటే.. ఈ పరీక్ష పెన్‌ పేపర్‌ ఆధారిత విధానంలో ఓఎంఆర్‌ పద్ధతిలో ఉంటుంది.
• మ్యాథమెటిక్స్‌ నుంచి 40 ప్రశ్నలు, ఫిజికల్‌ సైన్సెస్‌ నుంచి 40 ప్రశ్నలు, బయలాజికల్‌ సైన్సెస్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు.
• ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
• పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. ∙ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే (బహుళైచ్ఛిక ప్రశ్నలు) ఉంటాయి.
• నెగెటివ్‌ మార్కుల విధానం లేదు.

పదో తరగతి స్థాయి ప్రశ్నలు..
ఆర్‌జీయూకేటీ సెట్‌లో ప్రశ్నలు పదో తరగతి స్థాయి సిలబస్‌ ఆధారంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు సెట్‌ సిలబస్‌ను పరిశీలించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. పదో తరగతి స్థాయిలో తాము చదివిన అంశాలను మరోసారి పునశ్చరణ చేసుకోవాలి. దాంతోపాటు ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి.

ఆర్‌జీయూకేటీ సెట్‌–2021.. ముఖ్య సమాచారం
అర్హత:
పదో తరగతి,తత్సమాన కోర్సు మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి: డిసెంబర్‌ 31, 20201నాటికి 15ఏళ్లు నుంచి 18ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 21ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 06.09. 2021
రూ.వేయి ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 11 వరకు;
హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: సెప్టెంబర్‌ 18 నుంచి;
ప్రవేశ పరీక్ష తేది: సెప్టెంబర్‌ 26, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.rgukt.in
ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌: https://www.rguktcet.in/SiteContent/frmPaymentProcedure

Published date : 31 Aug 2021 05:42PM

Photo Stories