Skip to main content

కార్పొరేట్‌ కొలువులకు కేరాఫ్‌ ఇంటర్న్‌షిప్‌...

ఇంటర్న్‌షిప్స్‌.. ఎంబీఏ(మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌) విద్యార్థులకు ఎంతో కీలకం! ఇంటర్న్‌షిప్‌తో క్షేత్ర నైపుణ్యాలతోపాటు వాస్తవ పరిస్థితులపై అవగాహన వస్తుంది. ఫలితంగా.. జాబ్‌ మార్కెట్‌ పోటీలో ముందంజలో నిలుస్తారు.
internships
internships

అందుకే టాప్‌ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం దక్కించుకునేందుకు..ఎంబీఏ విద్యార్థులు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. కొత్తగా కోర్సులో చేరిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ చేయడానికి సరైన సమయం ఏది.. ఇంటర్న్‌షిప్‌ అందుకునేందుకు మార్గాలు.. ఎలాంటి సంస్థల్లో చేరాలి.. ఇలా అనేక సందేహాలు ఎదురవుతుంటాయి!! ఈ నేపథ్యంలో..ఇంటర్న్‌షిప్‌తో ఎంబీఏ విద్యార్థులకు ప్రయోజనాలు.. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు..అందుకునేందుకు మార్గాలు.. నేర్చుకోవాల్సిన నైపుణ్యాలపై ప్రత్యేక కథనం...

ఇంటర్న్‌షిప్‌ అంటే.. విద్యార్థులు తాము ఎంచుకున్న స్పెషలైజేషన్‌కు సరితూగే సంస్థలో.. సంబంధిత విభాగంలో నిర్దిష్ట వ్యవధిలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించడం! ఉదాహరణకు ఎంబీఏ ఫైనాన్స్‌ చదువుతున్న విద్యార్థులు.. ఏదైనా సంస్థలో ఫైనాన్స్‌ విభాగంలో కొద్దికాలం పనిచేసి.. దానిద్వారా వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందుతారు. తద్వారా ఎంబీఏ విద్యార్థులు కోర్సు చదువుతున్నప్పుడే ప్రాక్టికల్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. దాంతోపాటు మార్కెట్లో సంస్థలు అనుసరిస్తున్న వాస్తవ విధానాలతోపాటు, తాజా పరిస్థితులు తెలుసుకోవచ్చు. 

భవిష్యత్తు కెరీర్‌కు మార్గంగా..
ఎంబీఏ విద్యార్థులకు మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఆపరేషన్స్‌ వంటి విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ వ్యవధి నెల రోజుల నుంచి రెండు నెలల వరకూ ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు.. ఇంటర్న్‌ ట్రైనీగా ఎంపికైన సంస్థలో.. విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సదరు విభాగంలోని ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో చూపే ప్రతిభ, పనితీరు భవిష్యత్తు కెరీర్‌కు మార్గంగా నిలుస్తుంది.

జాబ్‌ రెడీ స్కిల్స్‌..
ఇంటర్న్‌షిప్‌తో మార్కెట్‌ అవసరాలకు తగినట్లుగా జాబ్‌ రెడీ స్కిల్స్‌ను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. కోర్సులో భాగంగా తరగతి గదిలో బోధించిన అంశాలను ఇంటర్న్‌షిప్‌ శిక్షణ సమయంలో.. వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే వీలుంటుంది. అంతేకాకుండా ఇంటర్న్‌ ట్రైనీగా చేరిన అభ్యర్థి పనితీరు, దృక్పథం, నైపుణ్యం నచ్చితే.. సదరు సంస్థ పూర్తిస్థాయి ఉద్యోగం ఆఫర్‌ చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కొలువు లభించకున్నా..ఇంటర్న్‌షిప్‌ ట్రైనింగ్‌ వివరాలను రెజ్యుమేలో పేర్కొనడం ద్వారా..భవిష్యత్తులో ఇతర సంస్థల్లో ఉద్యోగ వేటలో ముందంజలో నిలవొచ్చు. 

సరైన సమయంలో..
ఇంటర్న్‌షిప్‌లో చేరేందుకు సరైన సమయం ఏది? అనే సందేహం చాలామంది ఎంబీఏ విద్యార్థులకు ఎదురవుతోంది. అధిక శాతం మంది విద్యార్థులు ఫైనలియర్‌లోనే ఇంటర్న్‌షిప్‌ చేయాలనే భావనలో ఉంటారు. కానీ.. ప్రస్తుతం అమలవుతున్న నిబంధనల ప్రకారం–తొలి సెమిస్టర్‌ ముగిసినప్పటి నుంచి ఎప్పుడైనా ఇంటర్న్‌ ట్రైనీగా సంస్థల్లో చేరొచ్చు. రెండేళ్ల ఎంబీఏ కోర్సులో.. రెండో ఏడాది అంతా ప్రాజెక్ట్‌ వర్క్, కేస్‌ స్టడీస్‌ తదితర అకడమిక్‌ అంశాలకు సమయం కేటాయించాల్సి వస్తోంది. అందుకే తొలి ఏడాది నుంచే ఇంటర్న్‌షిప్‌ ప్రయత్నాలు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఐఐఎంల్లో ఇలా..
మేనేజ్‌మెంట్‌ విద్యకు పేరుగాంచిన ఐఐఎంల్లో.. ఇంటర్న్‌షిప్‌ విధానం కొంత వినూత్నంగా ఉంటోంది. ఇక్కడ విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే సంస్థలు సమ్మర్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహిస్తుంటాయి. ఎంపికైన వారికి కోర్సు మొదటి సంవత్సరం తర్వాత లభించే సెలవుల్లో ఇంటర్న్‌ ట్రైనీగా పనిచేసేలా ఆఫర్‌ లెటర్లు ఇస్తాయి. ఇక్కడ ఇంటర్న్‌షిప్‌ కాల వ్యవధి ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉంటుంది. ఈ సమయం లో ఇంటర్న్‌ ట్రైనీకి రూ.30వేల నుంచి రూ.1.5 లక్షల వరకు స్టయిపండ్‌ లభిస్తుంది. 

అవకాశాల అన్వేషణ ఇలా..
➤ ఎంబీఏ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ అవకాశాల కోసం ఇంటర్నెట్‌ ఆధారంగా అన్వేషణ సాగించొచ్చు. ప్రస్తుతం పలు సంస్థలు తమ అధికారిక వెబ్‌సైట్‌ల్లోనే ఇంటర్న్‌ ట్రైనీ ఖాళీల వివరాలను ప్రకటిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు సంబంధిత కంపెనీల వెబ్‌సైట్‌లను వీక్షించడం ద్వారా.. ఖాళీలు ఏర్పడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. 
➤ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు తెలుసుకోవడానికి మరో మార్గం..జాబ్‌ పోర్టల్స్‌.విద్యార్థులు ఆయా పోర్టల్స్‌లో తమ రెజ్యుమేను అప్‌లోడ్‌ చేసుకోవాలి. ఫలితంగా ఏదైనా సంస్థలో అవకాశం ఉంటే ఆ సమాచారం వెంటనే తెలుస్తుంది. 
➤ ఇంటర్న్‌షిప్స్‌ ఖాళీల వివరాలు అందించేందుకు ఇప్పుడు ప్రత్యేక పోర్టల్స్‌ సైతం ఏర్పాటవుతున్నాయి. ఇవి సంస్థలు, ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందాలు చేసుకొని.. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలకు అనుసంధాన వేదికలుగా నిలుస్తున్నాయి. విద్యార్థులు ఇలాంటి మాధ్యమాలను కూడా ఉపయోగించుకోవచ్చు. 

సంస్థ ఎంపికలో..
ఇంటర్న్‌ ట్రైనీ అవకాశాల కోసం అన్వేషణ సాగించే విద్యార్థులు.. సంస్థలను ఎంచుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎంబీఏలో తమ స్పెషలైజేషన్‌కు సరితూగే కంపెనీలు, విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రయత్నం చేయాలి. ఫలితంగా రియల్‌ టైం నాలెడ్జ్, ప్రాక్టికల్‌ ఎక్స్‌పోజర్‌తోపాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, విశ్లేషణ నైపుణ్యాలు సొంతమవుతాయి. కంపెనీలకు ఎదురవుతున్న సమస్యలు, వాటికి ఆ రంగంలోని నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు తెలుసుకునే వీలు లభిస్తుంది.
 
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో..
2021తోపాటు 2022లోనూ అధిక శాతం సంస్థలు వర్చువల్, ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్స్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. కాబట్టి ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు విద్యార్థులు సన్నద్ధమవ్వాలి. 

ఇంటర్న్‌షిప్‌లో ఇలా 
➤ ఇంటర్న్‌షిప్‌ సమయంలో విద్యార్థుల పనితీరు భవిష్యత్‌ కెరీర్‌కు బాటలు వేస్తుంది. కాబట్టి బృంద సభ్యుడిగా చక్కటి పనితీరు, అంకిత భావం, నేర్చుకునే తత్వంతోపాటు చొరవను ప్రదర్శించాలి. 
➤ ఇంటర్న్‌ ట్రైనీగా మంచి పనితీరు చూపిన అభ్యర్థులకు కంపెనీలు ఉద్యోగ ఆఫర్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. అవి ఇచ్చే సర్టిఫికెట్‌ భవిష్యత్తులో ఉద్యోగాన్వేషణలో కీలకంగా నిలుస్తుంది.
➤ ఇంటర్న్‌ ట్రైనీగా విద్యార్థులు ప్రాబ్లమ్‌ సాల్వింగ్,డెసిషన్‌ మేకింగ్,క్రిటికల్‌ థింకింగ్,స్ట్రాటజిక్‌ థింకింగ్‌ వంటి నైపుణ్యాలను అలవరచుకోవాలి. 

ట్రైనీల ఫీడ్‌బ్యాక్‌..
ఇటీవల కాలంలో సంస్థలు ఇంటర్న్‌ ట్రైనీల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ అడుగుతున్నాయి. శిక్షణ సమయంలో గమనించిన విషయాలు, గుర్తించిన సమస్యలు, ఆయా విభాగాల పనితీరుపై అభిప్రాయాలు కోరుతున్నాయి. ట్రైనీల ఫీడ్‌ బ్యాక్‌ వాస్తవమేనని తేలితే.. సదరు విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. పలు కంపెనీలు ఇంటర్న్‌ ట్రైనీ పనితీరు నచ్చితే.. శాశ్వత కొలువు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. 

నలభై శాతం నియామకాలు..
సంస్థలు నలభై శాతం మేరకు ఆఫర్లు అప్పటికే తమ దగ్గర ఇంటర్న్‌షిప్‌ చేసిన వారికే ఇస్తున్నాయి. దీన్నిబట్టి ఇంటర్న్‌షిప్‌ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఎంబీఏ విద్యార్థులు స్టయిఫండ్‌ లేదా ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వకుండా.. ప్రాక్టికల్‌ ఎక్స్‌పోజర్‌ కోసం ప్రయత్నించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 


ఇంటర్న్‌షిప్స్‌..ముఖ్యాంశాలు
➤ క్షేత్ర నైపుణ్యాలు, వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు మార్గం..ఇంటర్న్‌షిప్స్‌.
➤ ఇంటర్న్‌ ట్రైనీగా మంచి పనితీరు ద్వారా అదే సంస్థలో కొలువు దక్కించుకోవచ్చు. 
➤ పలు కంపెనీల నియామకాల్లో 40 శాతం మేరకు ఇంటర్న్‌ ట్రైనీలతోనే భర్తీ.
➤ ఐఐఎంల్లో ఏడాది ముందు నుంచే ఇంటర్న్‌షిప్‌ ఎంపిక ప్రక్రియ ప్రారంభం.
➤ కంపెనీల వెబ్‌సైట్స్, జాబ్‌ పోర్టల్స్, ఇంటర్న్‌షిప్‌ వెబ్‌సైట్స్‌ ద్వారా ఖాళీల వివరాలు తెలుసుకోవచ్చు. 
 

Published date : 03 Sep 2021 03:59PM

Photo Stories