Skip to main content

Tenth Class Best Courses : ఆఫ్టర్‌ టెన్త్‌..సత్వర ఉపాధికి.. ఒకేషనల్‌ కోర్సులు ఇవే..!

హైస్కూల్‌ స్థాయి నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకూ.. వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాల్సిన పరిస్థితి! నైపుణ్యాలుంటే.. ఎక్కడైనా.. కొలువుదీరే అవకాశం లభిస్తుంది! అందుకే ఇటీవల కాలంలో వృత్తి విద్య కోర్సుల(ఒకేషనల్‌ కోర్సులు) గురించి చర్చ జరుగుతోంది.

ఇలాంటి.. వృత్తి విద్య కోర్సులను.. ఇంటర్మీడియెట్‌ స్థాయిలోనే అభ్యసించొచ్చు! తద్వారా ఆయా విభాగాల్లో వృత్తి నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు! రెండేళ్ల ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత.. ఉపాధితోపాటు ఉన్నత విద్య పరంగా పలు అవకాశాలు అందుకోవచ్చు! ప్రస్తుతం.. పదో తరగతి పూర్తి చేసుకొని.. ఇంటర్మీడియెట్‌తోనే ఉపాధి పొందాలని కోరుకుంటున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. ఒకేషనల్‌ కోర్సులపై ప్రత్యేక కథనం..

పదో తరగతి పూర్తి చేసుకున్న వారిలో అధిక శాతం మందికి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులుæ సుపరిచితం. కానీ.. వీటితోపాటు ఇంటర్మీడియెట్‌ స్థాయిలో అందుబాటులో ఉన్న ఒకేషనల్‌ కోర్సులు అభ్యసిస్తే.. చిన్న వయసులోనే క్షేత్ర స్థాయి నైపుణ్యాలు లభిస్తాయి. పూర్తి చేసుకున్న ఒకేషనల్‌ కోర్సు ఆధారంగా ఉపాధి అవకాశాలు కూడా సొంతం చేసుకోవచ్చు.

27 ఒకేషనల్‌ కోర్సులు :

  • తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌లు ప్రస్తుతం పలు ఒకేషనల్‌ కోర్సులను అందిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం–27 వరకూ వివిధ ఒకేషనల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ మొదలు ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ వరకు.. అగ్రికల్చర్‌ నుంచి పారా మెడికల్‌ వరకు దాదాపు అన్ని రంగాలకు సరితూగే విధంగా వృత్తి నైపుణ్యాలను అందించే ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి.
  • టెక్నికల్‌ కోర్సుల్లో.. ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ టెక్నీషియన్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ అప్లయిన్సెస్‌ సర్వీసింగ్, రూరల్‌ ఇంజనీరింగ్‌ టెక్నీషియన్, వాటర్‌ సప్లయ్‌ అండ్‌ శానిటరీ ఇంజనీరింగ్, డీటీపీ అండ్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ వంటివి ఉన్నాయి.
  • బిజినెస్, కామర్స్‌ విభాగాల్లో.. అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్, మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌మెన్‌షిప్, ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌ కోర్సుల్లో చేరొచ్చు.
  • అగ్రికల్చర్‌కు సంబంధించి క్రాప్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, డైరీయింగ్, ఫిషరీస్, సెరీకల్చర్‌; హోమ్‌ సైన్స్‌ విభాగంలో హోటల్‌ ఆపరేషన్స్, కమర్షియల్‌ గార్మెంట్స్‌ డిజైనింగ్‌ అండ్‌ మేకింగ్, ప్రీ–స్కూల్‌ టీచర్‌ ట్రైనింగ్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
  • పారా మెడికల్‌ విభాగాల్లో.. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, ఆప్తాల్మిక్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌
  • ఇతర విభాగాల్లో టూరిజం అండ్‌ ట్రావెల్, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్‌ వంటివి ఉన్నాయి.
  • ఇలా ప్రస్తుతం వృత్తి నిపుణులు అవసరమవుతున్న అన్ని రంగాలకు ఉపయోగపడే ఒకేషనల్‌ కోర్సులను అందిస్తూ.. ఇంటర్‌ స్థాయిలోనే క్షేత్ర నైపుణ్యాలు పొందేలా ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌లు అవకాశం కల్పిస్తున్నాయి.


నేరుగా డిప్లొమా రెండో సంవత్సరం :
ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సుల్లో ఇంజనీరింగ్, టెక్నికల్‌ ట్రేడ్‌ల విద్యార్థులు.. తాము చదువుకున్న ట్రేడ్‌లకు సంబంధించి నేరుగా డిప్లొమా(పాలిటెక్నిక్‌) రెండో సంవత్సరంలో అడుగు పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత డిప్లొమా ఉత్తీర్ణతగా నిర్వహించే ఈ–సెట్‌లో ర్యాంకు ఆధారంగా.. లేటరల్‌ ఎంట్రీ విధానంలో బీటెక్‌ రెండో సంవత్సరంలో ప్రవేశించొచ్చు. ఉదాహరణకు ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ టెక్నిషియన్‌ కోర్సు చదివిన విద్యార్థులు.. డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్‌ ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో సంవత్సరంలో అడుగు పెట్టొచ్చు. అంతేకాకుండా బోర్డ్‌లు నిర్వహించే బ్రిడ్జ్‌ కోర్సుల ఉత్తీర్ణత ద్వారా ఎంసెట్‌కు హాజరై.. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ విభాగాల్లో బ్యాచిలర్‌ కోర్సుల్లో చేరొచ్చు. వీటితోపాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్, మాస్టర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌లో చేరే అవకాశం కూడా ఉంది.

ఒకేషనల్‌ డిగ్రీ కోర్సులు :
ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. బ్యాచిలర్‌ స్థాయిలో అందుబాటులో ఉన్న ఒకేషనల్‌ కోర్సుల్లో అడుగు పెట్టొచ్చు. ఇంటర్‌ స్థాయిలో తాము చదివిన గ్రూప్‌/ట్రేడ్‌కు సరితూగే విధంగా ప్రస్తుతం పలు ఒకేషనల్‌ కోర్సులు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా బయో మెడికల్‌ సైన్సెస్, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అండ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, బిజినెస్‌ ప్రాససెస్‌ అండ్‌ డేటా అనాలిసిస్‌.. ఇలా పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

అప్రెంటీస్‌ :
ఒకేషనల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. తమ ట్రేడ్‌లకు సంబంధించి మరిన్ని క్షేత్ర నైపుణ్యాలు సొంతం చేసుకునేలా అప్రెంటీస్‌షిప్‌ చేసే అవకాశం కూడా ఉంది. ఒకేషనల్‌ కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల లోపు ఈ అప్రెంటీస్‌షిప్‌ చేయొచ్చు. ఇది ఆ కోర్సుకు సంబంధించిన ఇండస్ట్రీ/హాస్పిటల్‌లో ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఏడాది అప్రెంటీస్‌షిప్‌ కాలంలో స్టయిపండ్‌ కూడా అందిస్తారు. ఈ అప్రెంటీస్‌షిప్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ నియామకం సమయంలో ప్రాధాన్యం లభిస్తుంది.

ప్రాక్టికల్స్‌కు పెద్దపీట :
ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సుల ప్రత్యేకత.. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేయడం. మొత్తం సిలబస్‌లో 40 శాతం మేరకు ప్రాక్టికల్స్‌కే నిర్దేశించారు. దీంతో విద్యార్థులు ఎక్కువ సమయం లేబొరేటరీల్లో వెచ్చించి.. ప్రాక్టికల్‌ నైపుణ్యాలు సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఫలితంగా వీరు ఉపాధి కోణంలో.. ఐటీఐ, డిప్లొమా విద్యార్థులతో సమానంగా పోటీ పడే వీలుంటుంది.

సంప్రదాయ డిగ్రీ కోర్సులు :
ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. సంప్రదాయ బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లోనూ చేరే అవకాశం ఉంది. ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నికల్‌ ట్రేడ్‌ విద్యార్థులు బీఎస్సీలో; పారా మెడికల్, హోమ్‌ సైన్స్‌ విద్యార్థులు బీఎస్సీ బీజెడ్‌సీలో; ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ అభ్యర్థులు బీకాం, బీఏ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

బ్రిడ్జ్‌ కోర్సులు..
ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తి చేసుకొని.. ఆ తర్వాత ఇంటర్‌ బోర్డ్‌ నిర్వహించే బ్రిడ్జ్‌ కోర్సులో ఉత్తీర్ణతతో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఎంసెట్‌కు హాజరై ఇంజనీరింగ్‌/మెడిసిన్‌లలో కూడా చేరొచ్చు. అదేవిధంగా ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఎఫ్‌) కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్‌లో; ఎంఎల్‌టీ కోర్సు ఉత్తీర్ణులు బీఎస్సీ ఎంఎల్‌టీలో చేరొచ్చు. అగ్రికల్చర్, హోంసైన్స్‌ చదివిన వారు బీఎస్సీ (అగ్రికల్చర్‌) కోర్సులో చేరేందుకు అర్హులు.

స్వల్పకాలిక ఒకేషనల్‌ కోర్సులు..

  • పదో తరగతి ఉత్తీర్ణత ఆధారంగా ఇంటర్మీడియెట్‌ స్థాయిలో స్వల్పకాలిక ఒకేషనల్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • అగ్రికల్చర్‌.. బీకీపింగ్, మష్రూమ్‌ కల్చర్, వెటర్నరీ కాంపౌండర్, సెరికల్చర్‌ అసిస్టెంట్, ఫామ్‌ అసిస్టెంట్, ఫిషరీస్‌ అసిస్టెంట్‌; కంప్యూటర్‌ సైన్స్‌.. వెబ్‌ డిజైనింగ్‌–ఇంటర్నెట్, కంప్యూటర్‌ మెయింటెనెన్స్, ఆటోకాడ్, అకౌంటింగ్‌ ప్యాకేజెస్, అడ్వాన్స్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్, అడ్వాన్స్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్, హార్డ్‌వేర్‌ టెక్నా లజీ, డేటాఎంట్రీ, అడ్వాన్స్‌ మల్టీమీడియా, గ్రాఫిక్‌–యానిమేషన్‌; మోటార్‌ డ్రైవింగ్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ, ఎయిర్‌ కండీషనింగ్‌–రిఫ్రిజిరేషన్, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్, ప్లాస్టిక్‌ టెక్నాలజీ, ఆటో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, వెల్డింగ్, కార్పెంట్రీ; హోం సైన్స్‌..అపారల్‌ కన్‌స్ట్రక్షన్, కంప్యూటర్‌ బేస్డ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్, సాఫ్ట్‌టాయ్స్‌–ఫ్లవర్‌ మేకింగ్, బ్యుటీషియన్‌ కోర్సు, కుకరీ, ఎంబ్రాయిడరీ–జిగ్‌–జాగ్,బేకరీ–కన్‌ఫెక్షనరీ, ఫ్యాషన్‌ డిజైనింగ్, టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌ తదితర యాభైకు పైగా స్వల్ప కాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


సత్వర ఉపాధి..
ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సత్వర ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు. ఐటీఐ ఉత్తీర్ణులతో దీటుగా ఆయా ఉద్యోగాలకు పోటీ పడే అర్హత లభిస్తోంది. సదరు సంస్థల్లో ట్రేడ్‌మెన్, టెక్నిషియన్స్‌గా ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాలు :
ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ప్రభుత్వ కొలువులకు పోటీపడొచ్చు. ఆర్‌ఆర్‌బీలోని టెక్నికల్‌ కేటగిరీలోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా పలు ప్రభుత్వ శాఖలు నిర్వహించే నియామక పరీక్షల ద్వారా ఆయా శాఖల్లో టెక్నిషియన్లు, సూపర్‌వైజర్స్‌ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

స్వయం ఉపాధి :
ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు పుష్కలమని చెప్పొచ్చు. ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నిషియన్‌ ట్రేడ్‌ అభ్యర్థులు వెహికిల్‌ మెకానిక్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అదే విధంగా పారా మెడికల్‌ కోర్సుల విద్యార్థులు సొంతగా ల్యాబ్స్‌ను నెలకొల్పచ్చు. ఇలాంటి వారికి కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ద్వారా రుణ సదుపాయం కూడా లభిస్తోంది. మొత్తంగా చూస్తే ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే చక్కటి ఉపాధి కోరుకునే వారికి ఒకేషనల్‌ కోర్సులు సరైన మార్గంగా పేర్కొంటున్నారు.

ఒకేషనల్‌ కోర్సులు.. ముఖ్యాంశాలు

  • ఇంటర్మీడియెట్‌ స్థాయిలో 27 ట్రేడ్‌లలో ఒకేషనల్‌ కోర్సులు.
  • ఇంటర్‌ తర్వాత లేటరల్‌ ఎంట్రీ విధానంలో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశించే అవకాశం.
  • ఉపాధి కోణంలో ఐటీఐ విద్యార్థులతో సమానంగా ఉపాధి.
  • అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్, స్టయిపెండ్‌ సదుపాయం
  • అప్రెంటీస్‌షిప్‌ సర్టిఫికెట్‌తో మరింతగా ఉద్యోగావకాశాలు.
  • బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తి చేస్తే ఎంసెట్‌కు హాజరయ్యే అర్హత.
Published date : 13 Oct 2021 05:08PM

Photo Stories