Summer Placements: ఐఐఎంల్లో.. సమ్మర్ ప్లేస్‌మెంట్స్ హవా!
- ఐఐఎంలలో మొదలైన ఎస్‌పీఓ ప్రక్రియ
- పలు ఇన్‌స్టిట్యూట్స్‌లో వందశాతం ఆఫర్లు
- సగటున రూ.2 లక్షల స్టయిఫండ్
కార్పొరేట్ సంస్థలకు ఐఐఎం విద్యార్థులు హాట్ కేక్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయా కంపెనీలకు అవసరమైన నిర్వహణ నైపుణ్యాలు ఐఐఎంల విద్యార్థుల్లో ఉంటాయని భావించడమే ఇందుకు నిదర్శనం. తాజాగా ఐఐఎంలలో కొనసాగుతున్న ఎస్‌పీఓ ప్రక్రియ, అందిస్తున్న ఆఫర్లే ఇందుకు నిదర్శనం అంటున్నారు నిపుణులు.
సమ్మర్ ప్లేస్‌మెంట్స్‌గా
ఐఐఎం పీజీ ప్రోగ్రామ్‌ల్లో చేరిన విద్యార్థులు మొదటి సంవత్సరం పూర్తయ్యాక లభించే సెలవు రోజుల్లో సమ్మర్ ప్లేస్‌మెంట్స్ చేస్తారు. అంతకుముందు కంపెనీలు విద్యార్థులను ఇంటర్న్ ట్రైనీగా ఎంపిక చేసేందుకు ప్రత్యేక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ సమ్మర్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో నెగ్గిన విద్యార్థులకు సంస్థలు రెండు వారాల వ్యవధిలో ఇంటర్న్ ట్రైనీగా విధులు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తాయి. ఇలా ఇంటర్న్ ట్రైనీగా ఎంపికైన వారికి స్టయిపండ్ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందిస్తాయి. ఇది రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది.
చదవండి: ఐఐఎంల్లో గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వూ.. ప్రిపరేషన్ సాగించండిలా..
అందరికీ ఆఫర్స్
- 2023-25 బ్యాచ్ విద్యార్థులకు సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ వెల్లువెత్తున్నాయి.
- ఐఐఎం-లక్నోలో మొత్తం 576 మంది విద్యార్థులకు సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ లభించాయి. వీరికి సగటు స్టయిఫండ్ నెలకు రూ 1.31 లక్షలుగా, గరిష్ట స్టయిఫండ్ రూ.3.5 లక్షలుగా నిలవడం గమనార్హం.
- ఐఐఎం-కోల్‌కతలో.. 466 మంది విద్యార్థులకు గాను అందరికీ సమ్మర్ ప్లేస్‌మెంట్స్ లభించడం విశేషం. వీరికి సగటు స్టయిఫండ్ రూ.1.65 లక్షలుగా, గరిష్ట స్టయిఫండ్ రూ.3.75 లక్షలుగా ఉంది.
- ఐఐఎం-నాగపూర్‌లోనూ నూటికి నూరు శాతం విద్యార్థులకు సమ్మర్ ప్లేస్‌మెంట్స్ లభించాయి. సగటు స్టయిఫండ్ రూ.79 వేలుగా ఉంది.
కొనసాగుతున్న ప్రక్రియ
దేశంలోని ఇతర ఐఐఎంలలోనూ ప్రస్తుతం సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ఐఐఎం-అహ్మదాబాద్, బెంగళూరు తదితర క్యాంపస్‌లలో ఈ నెల రెండో వారంలోపు ఈ ప్రక్రియ పూర్తవనుంది. ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం-ఇతర ఐఐఎంలలోనూ సమ్మర్ ప్లేస్‌మెంట్స్ దాదాపు వంద శాతం లభించే సంకేతాలున్నాయని ఆయా క్యాంపస్ ప్లేస్‌మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
చదవండి: Management Entrance Test: ఎక్స్‌ఏటీతో మేనేజ్‌మెంట్ విద్య
బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్, ఫైనాన్స్
- ఐఐఎంలు, ఇతర బి-స్కూల్స్‌లో సమ్మర్ ప్లేస్‌మెంట్స్‌లో ఈ ఏడాది కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల హవా కనిపించింది. ఇప్పటి వరకు అన్ని బి-స్కూల్స్‌లో దాదాపు 40 శాతం మేర సమ్మర్ ప్లేస్‌మెంట్స్.. కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సంస్థల నుంచే ఉన్నాయి. బీసీజీ, బెయిన్ అండ్ కో, యాక్సెంచర్ స్ట్రాటజీ, పీడబ్ల్యూసీ, డెలాయిట్, కేపీఎంజీ, సినర్జీ కన్సల్టింగ్ కంపెనీలు టాప్ రిక్రూటర్స్‌గా నిలిచాయి.
- కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల తర్వాత ఐటీ, ఈ-కామర్స్ సంస్థలు టాప్ రిక్రూటర్స్‌గా ఉన్నాయి. ఈ రంగాల్లో డేటా మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేసే విధంగా ఆఫర్లు లభించాయి. అదే విధంగా గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలు కూడా ఎస్‌పీఓ ఆఫర్లు కల్పించాయి.
సేల్స్, అండ్ మార్కెటింగ్‌లోనూ
సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫైల్స్‌లోనూ ఈ ఏడాది సమ్మర్ ప్లేస్‌మెంట్స్ జోరు కొనసాగింది. ముఖ్యంగా ప్రొడక్ట్ రీసెర్చ్, మార్కెట్ అనాలిసిస్ విభాగాల్లో విధులు నిర్వర్తించే విధంగా ఈ ఆఫర్స్ లభించాయి. అదే సమయంలో జనరల్ మేనేజ్‌మెంట్ విభాగంలోనూ సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్ ఖరారయ్యాయి. పలు సంస్థలు ఈ విభాగాల్లో విద్యార్థులను నియమించుకునే క్రమంలో విశ్లేషణాత్మక దృక్పథం, మార్కెట్ పరిస్థితులపై వారికున్న అవగాహనను క్షుణ్నంగా పరిశీలించి ఆఫర్స్ ఇచ్చినట్లు ఐఐఎంల వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ప్రొఫైల్స్‌లో అధికంగా
సమ్మర్ ప్లేస్‌మెంట్ ఆఫర్స్‌లో ఎక్కువగా డేటా మేనేజ్‌మెంట్; ఫైనాన్స్ మేనేజ్‌మెంట్; జనరల్ అడ్మినిస్ట్రేషన్; సేల్స్ అండ్ మార్కెటింగ్; డేటా అనలిటిక్స్; బిజినెస్ స్ట్రాటజీస్ ప్రొఫైల్స్ ముందంజలో ఉంటున్నాయి.
ఎందుకంత క్రేజ్
సమ్మర్ ప్లేస్‌మెంట్స్ పేరిట కంపెనీలు ఐఐఎంల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఆఫర్స్, రూ.లక్షల్లో స్టయిపండ్ ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే వినిపిస్తున్న సమాధానం.. ఈ ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు రియల్ టైమ్ నైపుణ్యాలు, అప్‌డేటెడ్ నాలెడ్జ్ ఉంటుందని ఆయా సంస్థలు భావించడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక్కడ బోధన విధానాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. విద్యార్థులను కార్పొరేట్ లీడర్లుగా తీర్చిదిద్దే విధంగా కరిక్యులం ఉంటుంది. అందుకే ఈ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి ఇంటర్న్ ట్రైనీలను నియమించుకునేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొంటున్నారు.
పూర్తిస్థాయి కొలువుకు మార్గం
సమ్మర్ ప్లేస్‌మెంట్స్ ట్రైనింగ్ సమయంలో విద్యార్థులు చూపే పనితీరు ఆయా సంస్థల్లో పూర్తిస్థాయి కొలువుకు మార్గంగా నిలుస్తుంది. ఎస్‌పీఓ దక్కించుకున్న అభ్యర్థులు ట్రైనీగా ప్రతిభ చూపితే.. అదే సంస్థలో శాశ్వత నియామకం సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంటర్న్‌షిప్ చేసిన సమయంలో తమకు కేటాయించిన విధులు, విభాగాల్లో తమ సామర్థ్యాలను, నైపుణ్యాలను ప్రదర్శించిన ∙వారికి కంపెనీలు ముందుగానే ఆఫర్స్ ఖరారు చేస్తున్నాయి. ఇలాంటి అభ్యర్థులకు ద్వితీయ సంవత్సరం చివర్లో నిర్వహించే ఫైనల్ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియల్లో పాల్గొనకుండానే ఫైనల్ ఆఫర్ లభిస్తుంది.
ఫైనల్ ప్లేస్‌మెంట్స్
ప్రస్తుతం సమ్మర్ ప్లేస్‌మెంట్ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఫైనల్ ప్లేస్‌మెంట్ ప్రక్రియ కూడా ఆశాజనకంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంస్థల వ్యాపారాలు పుంజుకుంటున్నాయని, అవి తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని క్యాంపస్ ప్లేస్‌మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకు అవసరమైన స్కిల్స్ ఉన్న వారిని నియమించుకునేందుకు ప్లేస్‌మెంట్స్‌కు వస్తున్నాయని చెబుతున్నారు.
చదవండి: దేశవ్యాప్తంగా బీస్కూల్స్‌లో మేనేజ్‌మెంట్ విద్యకు ఏటీఎంఏ.. సాధిస్తే మంచి భవిష్యత్తుకు..
ఇతర బి-స్కూల్స్‌లోనూ
ఐఐఎంలతోపాటు దేశంలోని ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లోనూ ఈ ఏడాది సమ్మర్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ ఆశాజనకంగా ఉండనున్నాయి. అలాగే మరో ప్రముఖ బీస్కూల్ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ-జెంషెడ్‌పూర్‌లోనూ వంద శాతం ఇంటర్న్‌షిప్ ఆఫర్లు లభించాయి. అంతేకాకుండా రెండు నెలల వ్యవధికి ఇచ్చే స్టయిపండ్ కూడా గరిష్టంగా రూ.3.5 లక్షలుగా నమోదవడం విశేషం. అదే విధంగా ఢిల్లీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగంలోనూ ఎంబీఏ విద్యార్థులకు బెస్ట్ ఆఫర్లు లభిస్తాయని భావిస్తున్నారు.
Tags
- Careers
- Careers Management
- Summer Placements
- Indian Institutes of Management
- Skills
- Institutes
- BFSI
- Finance Posts
- B schools
- IIM Nagpur
- Sakshi Bhavitha
- IIM
- ManagementEducation
- InnovationSkills
- CorporateWelcome
- SummerPlacement
- CareerOpportunities
- CorporatePartnerships
- CareerProspects
- IT Sector
- sakshi education latest jobs notifications
- IIM stipends