Law Entrance Test: ఎల్‌శాట్‌కు అర్హతలు, ప్రవేశ విధానం, పరీక్ష ప్యాట్రన్, ప్రిపరేషన్..
దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ప్రతి ఏటా క్లాట్ (కామన్ అడ్మిషన్ లా టెస్ట్) నిర్వహిస్తారు. క్లాట్‌తో సంబంధం లేకుండా.. ఇతర లా కాలేజీల్లో ప్రవేశానికి జరిపే మరొక జాతీయస్థాయి పరీక్ష.. లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్–ఇండియా(ఎల్‌శాట్–ఇండియా). లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్.. ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. ప్రస్తుతం 2022 జనవరి సెషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఎల్‌శాట్‌కు అర్హతలు, ప్రవేశ విధానం, పరీక్ష ప్యాట్రన్, ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం..
దేశంలోని పలు న్యాయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. ఎల్‌శాట్. ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా దాదాపు 85 లా కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్.. అమెరికాలో లా కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ సంస్థ మన దేశంలోనూ లా స్కూళ్లల్లో అడ్మిషన్స్ కోసం ఎల్‌శాట్–ఇండియా నిర్వహిస్తోంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా బ్యాచిలర్ ఆఫ్ లా, పీజీ లా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
ప్రవేశం కల్పించే కోర్సులు
- ఎల్‌శాట్‌లో స్కోర్ ఆధారంగా వివిధ లా ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీకామ్ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ; మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ; రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం తదితర కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హతలు
- ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే వారు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
- రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందాలనుకునే వారు ఎల్‌ఎల్‌బీ పూర్తిచేయాలి.
చదవండి: ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపే.. లా కోర్సుల ప్రవేశ పరీక్షల గురించి తెలుసుకోండిలా..
ప్రవేశం ఇలా
ఎల్‌శాట్ ఇండియా స్కోరు ఆధారంగా ఆయా లా ఇన్‌స్టిట్యూట్‌లు అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తాయి. సదరు విద్యా సంస్థల నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తాయి. కోర్సుల స్వభావాన్ని బట్టి ఇతర అర్హతలు కూడా ఉంటేనే ప్రవేశం లభిస్తుంది. పూర్తి సమాచారం కోసం సంబంధిత విద్యాసంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
పరీక్ష విధానం
- ఎల్‌శాట్–ఇండియా పరీక్షను ఆన్‌లైన్, రిమోట్ ప్రోక్టార్డ్ విధానంలో నిర్వహించనున్నారు. రిమోట్ ప్రోక్టార్డ్ ద్వారా అభ్యర్థులు తమ ఇంటి నుంచే పరీక్ష రాసుకునే సదుపాయం ఉంది.
- పరీక్ష సమయం 2 గంటల 20 నిమిషాలు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నపత్రం ఉంటుంది. నాలుగు సెక్షన్‌ల నుంచి ప్రశ్నలుంటాయి. మొదటి రెండు సెక్షన్‌లలో లాజికల్ రీజనింగ్ 1,2; మిగతా రెండు సెక్షన్‌లలో అన లిటికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఒక్కో సెక్షన్‌కు 35 నిమిషాల సమయం కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు.
విభాగాలు వారీగా ప్రశ్నలు–సమయం
పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో.. అనలిటికల్ రీజనింగ్ నుంచి 23 ప్రశ్నలు–35 నిమిషాలు, లాజికల్ రీజనింగ్(1) 22 ప్రశ్నలు–35 నిమిషాలు, లాజికల్ రీజనింగ్(2) 23 ప్రశ్నలు–35 నిమిషాలు, రీడింగ్ కాంప్రహెన్షన్ 24 ప్రశ్నలు–35 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. మొత్తం 92 ప్రశ్నలకు 2 గంటల 20 నిమిషాల సమయం లభిస్తుంది. దీనికి అదనంగా 15 నిమిషాలు విరామ సమయం ఇస్తారు.
ప్రిపరేషన్ ఇలా
- ప్రిపరేషన్ ప్రారంభించే ముందు పరీక్ష విధానం, సిలబస్ గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా టాపిక్ వైజ్‌గా సమయాన్ని కేటాయిస్తూ.. ప్రిపరేషన్ కొనసాగించాలి.
- ప్రిపరేషన్‌కు సంబంధించి ప్రామాణిక పుస్తకాలు, మెటీరియల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.
- ఎల్‌శాట్‌లో రాణించేందుకు ప్రాక్టీస్ ముఖ్యమని గుర్తించాలి. ప్రాక్టీస్‌లో భాగంగా ఎక్కువగా మాక్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ టెస్టులు రాయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచి స్కోర్ లభించే అవకాశం ఉంటుంది.
- ఎల్‌శాట్ పరీక్ష కాఠిన్యత కొంత ఎక్కువగానే ఉంటుంది. పక్కా ప్రణాళిక, సరైన ప్రిపరేషన్‌తో విజయం సాధించొచ్చు. మొదటి ప్రయత్నంలో స్కోర్ తక్కువగా వచ్చినా.. కొంత కాలం తర్వాత మళ్లీ పరీక్ష రాసి స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు.
ముఖ్యమైన సమాచారం
ఎల్‌శాట్ జనవరి–2022 సెషన్
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 03, 2022
- ఎల్‌శాట్ ఇండియా పరీక్ష తేదీ: 15.01.2022
ఎల్‌శాట్ మే–2022 సెషన్
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2022
- ఎల్‌శాట్ ఇండియా పరీక్ష తేదీ: మే 09–13, 2022
- వెబ్‌సైట్: https://www.discoverlaw.in/
చదవండి: క్లాట్‌తో జాతీయ సంస్థల్లో న్యాయ విద్య.. ప్రిపరేషన్ సాగించండిలా.. !