Skip to main content

కోచింగ్ లేకుండానే ‘క్లాట్’ప్రిపరేషన్...

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) జాతీయస్థాయిలో.. నీట్, జేఈఈ తర్వాత ఎక్కువ మంది హాజరవుతున్న ప్రవేశ పరీక్ష. క్లాట్‌లో ప్రతిభ చూపితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల తోపాటు ఇతర ప్రముఖ లా కాలేజీల్లోనూ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలను ఖరారు చేసుకోవచ్చు. క్లాట్‌కు ఏటా డిసెంబర్ చివరివారంలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. పరీక్షను మే రెండో వారంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి క్లాట్-2019కు ఇంకా ఏడు నెలలకు పైగా సమయం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో క్లాట్ ఔత్సాహికులకు ఉపయోగపడేలా సిలబస్, చదవాల్సిన పుస్తకాలు, ప్రిపరేషన్ గెడైన్స్...
పరీక్ష స్వరూపం :
క్లాట్-2019 సిలబస్, పరీక్ష విధానాన్ని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం-ఒడిశా.. డిసెంబర్‌లో అధికారికంగా ప్రకటించనుంది. కానీ, పరీక్ష నిర్వహణకు సంబంధించి పాత విధానమే కొనసాగే అవకాశముంది.

క్లాట్ (యూజీ)

సబ్జెక్టు

మార్కులు

ఇంగ్లిష్ (కాంప్రెహెన్షన్‌తో కలిపి)

40

జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్

50

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (న్యూమరికల్ ఎబిలిటీ)

20

లీగల్ ఆప్టిట్యూడ్

50

లాజికల్ రీజనింగ్

40

క్లాట్ (యూజీ)ను ఆన్‌లైన్ విధానంలో 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. పేపర్‌లో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావు వంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు.

ప్రిపరేషన్ :
ఇంగ్లిష్ :

  • గత కొన్నేళ్లుగా క్లాట్ సరళిని గమనిస్తే మిగిలిన విభాగాలతో పోల్చితే ఇంగ్లిష్ సులభంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగంలో ముఖ్యంగా కాంప్రెహెన్షన్, గ్రామర్‌ల ద్వారా అభ్యర్థుల ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీని పరీక్షిస్తారు. ఇచ్చిన పాసేజ్‌ను, దానిలో దాగున్న ప్రధాన భావాన్ని, పదాలకు అర్థాన్ని తెలుసుకోగలిగినప్పుడే అభ్యర్థులు కాంప్రెహన్షన్ విభాగంలో మార్కులు పొందగలుగుతారు.
  • గ్రామర్ కి సంబంధించి కరెక్షన్, ఇన్‌కరెక్ట్ సెంటెన్సెస్, సరైన పదాలతో ఖాళీలను పూరించడం తదితర కోణాల్లో ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు రీడింగ్ కాంప్రెహెన్షన్, గ్రామర్, వొకాబ్యులరీలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి.
  • రెన్ అండ్ మార్టిన్; ఎస్.చాంద్ ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ పుస్తకాలను అనుసరించడం లాభిస్తుంది.

జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ :
  • ఈ విభాగంలోని జనరల్ నాలెడ్జ్ అంశాన్ని జనరల్ అవేర్‌నెస్; స్టాటిక్ జనరల్ నాలెడ్జ్‌గా విభజించుకోవాలి. కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి అడిగే ప్రశ్నలు అభ్యర్థుల్లోని జాతీయ, అంతర్జాతీయ అంశాలపై పరిజ్ఞానాన్ని పరిక్షించే విధంగా ఉంటాయి.
  • జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విభాగంలో.. కరెంట్ అఫైర్స్‌కి 70 శాతం వెయి టేజీ ఇస్తుండగా.. స్టాటిక్ జీకేకి 30 శాతం వెయిటేజీ లభిస్తోంది.
  • కరెంట్ అఫైర్ ప్రిపరేషన్‌కి న్యూస్ పేపర్లు; మ్యాగజీన్‌లు; స్టడీ ఐక్యూ; వెబ్‌సైట్లు, జీకే స్టడీ.కామ్ తదితరాలను అనుసరించాలి. సంవత్సర కాలవ్యవధిలోని జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి.
  • స్టాటిక్ జీకేలో పాలిటీ, ఎకానమీ; జాగ్రఫీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి సంబంధించి పాలిటీ కీలకంగా నిలుస్తుంది. రాజ్యాంగంపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు రాజ్యాంగంలోని వివిధ అధికరణలు-వాటి ఆధారంగా చేసిన చట్టాల గురించి తెలుసుకోవాలి.
  • స్టాటిక్ జీకే ప్రిపరేషన్‌కి ఆర్‌ఎస్ అగర్వాల్ ఆబ్జెక్టివ్ జీకే పుస్తకం; www.sakshieducation.com వెబ్‌సైట్ ఉపయోగపడతాయి.

మ్యాథమెటిక్స్ :
ఈ విభాగం ద్వారా ఎలిమెంటరీ మ్యాథ్స్‌లో అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. కాబట్టి పదోతరగతి వరకు ఉన్న మ్యాథ్స్ పుస్తకాల్లోని ప్రాథమిక భావనలపై పట్టుసాధించాలి.
  • నంబర్ సిస్టమ్స్, అర్థమెటిక్ టాపిక్స్; లాభాలు; పని-కాలం, శాతాలు, కొలతలు, సరాసరి, ట్రయాంగిల్, జామెట్రీ సర్కిల్స్, మోడ్రన్ మ్యాథమెటిక్స్‌లోని ప్రాబబిలిటీ, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, ఆల్‌జీబ్రా (1 లేదా 2) అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • ఎం.టైరా మ్యాథమెటిక్స్ పుస్తకం; ఎస్.చాంద్ ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ పుస్తకాలను అధ్యయనం చేయడం లాభిస్తుంది.
  • గత ప్రశ్నపత్రాలతోపాటు ప్రధానంగా ఎనిమిది, తొమ్మిదో తరగతుల్లోని బేసిక్స్‌పై పట్టుసాధించాలి.

లీగల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ :
క్లాట్ అభ్యర్థి విజయావకాశాలను విశేషంగా ప్రభావి తం చేసే విభాగం.. లీగల్ ఆప్టిట్యూడ్. ఈ విభాగంలో 50 ప్రశ్నలు.. 50 మార్కులకు ఉంటాయి. ఇందులో అభ్యర్థుల్లో న్యాయ విద్య పట్ల ఉన్న ఆసక్తి, పరిశోధన దృక్పథం, సమస్య పరిష్కార సామర్థ్యాలను పరీక్షిస్తారు.
  • లీగల్ ఆప్టిట్యూడ్‌లో ఒక చట్టానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని పేర్కొంటారు. కొన్ని వాస్తవ సమస్యలను పేర్కొని సదరు ప్రాథమిక సూత్రాన్ని అనువర్తింప చేయడం ద్వారా ఏ సమస్యకు సరైన సమాధానం లభిస్తుందో గుర్తించమంటారు. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ పరంగా ఈ కోణంలో దృష్టిసారించాలి.
  • లీగల్ ఆప్టిట్యూడ్‌కి సంబంధించి లీగల్ నాలెడ్జ్ అంశానికి 30 శాతం వెయిటేజీ లభిస్తుంది. దీని ప్రిపరేషన్‌లో భాగంగా లాకు సంబంధించిన మ్యాగజీన్‌లు, పుస్తకాలు చదవడం ద్వారా న్యాయ పదజాలంపై అవగాహన పెంచుకోవాలి. న్యాయ పదాల గురించి తెలుసుకోవాలి. అలాగే కాన్‌స్టిట్యూషన్ లా నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు.

లాజికల్ రీజనింగ్ :
  • లాజికల్ రీజనింగ్‌ను క్లాట్ పరీక్షలో అత్యంత క్లిష్టమైన విభాగంగా భావిస్తారు. అభ్యర్థుల్లోని లాజికల్ ఆలోచనలను, విధానాలను అంచనా వేయడంతోపాటు వారిలోని తర్కబద్ధతను తెలుసుకోవడం ఈ విభాగం ప్రధాన ఉద్దేశం. ఈ విభాగంలో లాజికల్ సీక్వెన్సెస్, అనాలజీస్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • బ్లడ్ రిలేషన్స్, కోడింగ్-డీ కోడింగ్, ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్, డెరైక్షన్స్ తదితర 7 లేదా 8 అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
  • ఆర్‌ఎస్ అగర్వాల్ వెర్బల్ రీజనింగ్, టాటా మెక్‌గ్రాహిల్ ఎల్‌శాట్; ఎంకే పాండే అనలిటికల్ పుస్తకాలను అనుసరించడం లాభిస్తుంది.

బలహీనతలపై దృష్టిసారించాలి :
క్లాట్‌కి ప్రిపేరయ్యే అభ్యర్థులు ముందు స్వీయ బలహీనతలను గుర్తించి, వాటిపై దృష్టిపెట్టాలి. ప్రిపరేషన్ పరంగా సాధ్యమైనన్ని సెక్షనల్ టెస్టులు; మాక్‌టెస్ట్‌లకు హాజరవ్వాలి. వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ వ్యూహాలను రూపొందించుకోవాలి. పరీక్షకు ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రస్తుతం అకడెమిక్ సబ్జెక్టులతోపాటు కనీసం రెండు నుంచి మూడు గంటలు క్లాట్ ప్రిపరేషన్‌కి కేటాయించాలి. ఈ సమయాన్ని పరీక్ష తేదీ దగ్గరపడే కొద్దీ 5 లేదా 6 గంటలకు పెంచాలి.
- ధనుంజయ్ దుత్త, క్లాట్-2017 (యూజీ) 21వ ర్యాంకర్.
Published date : 02 Oct 2018 06:07PM

Photo Stories