Skip to main content

Interview Tips: కరెక్ట్ బాడీలాంగ్వేజ్‌తో ఇంటర్వ్యూలో విజయం సాధించే మార్గాలు..

నడిచేతీరు, చూసేవిధానం, కూర్చునే విధానం, మాటతీరు, నవ్వేవిధానంం వంటి శారీరకకదలికల మీద మనలో చాలామంది శ్రద్ధ పెట్టరు. కొన్ని సందర్భాల్లో అసలు వీటిని పట్టించుకోరు. కానీ ఇంటర్వ్యూల్లో ఇవీ కీలకపాత్ర పోషిస్తాయి. అవును... మీరు చదివింది కరెక్టే. ఉద్యోగం ఇచ్చేవారికి మీ మాటలకంటే మీ బాడీలాంగ్వేజ్ మీద శ్రద్ధ ఎక్కువ. మీ మాటల కంటే, మీ బాడీలాంగ్వేజ్ మీ గురించి వారికి మరింత సమాచారాన్ని అందిస్తుంది. మీ బాడీలాంగ్వేజ్ వారితో సమాచారగ్రాహిణిగా వ్వవహరిస్తుంది. మీగురించి చాలా విషయాలు మీ బాడీలాంగ్వేజ్ చెప్పేస్తుంది. మీ ప్రతి చర్య ఇంటర్వ్యూవర్‌కు ఒక్కో సంకేతాన్ని ఇస్తుంది. మీరు ఆ ఉద్యోగానికి సరిపోతారో, లేదో కూడా అదే నిర్ణయిస్తుంది. అంటే ఇంటర్వ్యూల్లో సరైన బాడీలాంగ్వేజ్ ను వినియోగించడం మీద మీ విజయం ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి, ఇంటర్వ్యూకు అవసరమైనకొన్ని ప్రాధమిక బాడీలాంగ్వేజ్ టిప్స్, వాటి వివరాలు మీకోసం.
job interview body language tips
job interview body language tips

 

సరైన హ్యండ్‌షేక్ ఇవ్వాలిమొదటిగా ఇంటర్వ్యూ రూమ్‌లోకి ప్రవేశించగానే ప్లజెంట్ స్మైల్‌తో హ్యండ్‌షేక్ ఇవ్వండి. కుడి చేత్తో మాత్రమే షేక్‌హ్యండ్ ఇవ్వాలి సుమా! మీరు తీసుకెళ్లే ఫైల్స్ మీకు ఎడమవైపు ఉండేలా చూసుకోండి. ఇంటర్వ్యూవర్స్ చేతిని ఎట్టిపరిస్థితుల్లోనూ నలిపేయకండి. ఎందుకంటే మీరు వెళ్లింది ఇంటర్వ్యూకు. కుస్తీ పోటీకి కాదు. ఈ విధంగా చేయడం ద్వారా ఎదుటి వారికి ఆధిపత్య (డామినేషన్) సంకేతాన్ని ఇస్తాము. వణుకుతున్నచేతులతో కూడా షేక్‌హ్యండ్ ఇవ్వకూడదు. ఇటువంటి వీక్ షేక్‌హ్యండ్ రెక్రూటర్స్కు ఎప్పుడూ ఇవ్వకూడదు. కాబట్టి నిశ్చలంగా, గట్టిగా షేక్‌హ్యండ్ ఇవ్వాలి. ఈ షేక్‌హ్యండ్ ప్రోసెస్ కరెక్ట్‌గా లేనటై్లతే మీ ఫ్రెండ్స్‌తో లేదా సన్నిహితులతో ముందుగా ప్రాక్టీస్ చేసి వెళ్లాలి. చివరిగా, హ్యండ్‌షేక్ ఇచ్చేటప్పుడు, విష్ చేసేటప్పుడు ఐ కాంటాక్ట్ మాత్రం మర్చిపోకూడదు. అంటే కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పాలన్నమాట.

డెరైక్ట్ ఐ కాంటాక్ట్ మెయిన్‌టైన్ చేయాలి
ఇంటర్వ్యూ సమయంలో డెరైక్ట్ ఐ కాంటాక్ట్ మెయిన్‌టైన్ చెయ్యాలి. కళ్లలోకి చూస్తూ మాట్లాడటం ద్వారా ఇంటర్వ్యూ పట్ల ఇంటెరెస్ట్ కనబరుస్తున్నట్టూ, వాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటున్నట్టు సంకేతాన్ని ఇస్తాము. ఒకవేళ ఇంటర్వ్యూలో ఒకరికంటే ఎక్కువ మంది ఇంటర్వ్యూవర్స్ ఉన్నటై్లతే అందరి వైపు చూస్తూ మాట్లాడాలి. ఎవరు ప్రశ్న అడుగుత్నున్నారో వారి వైపు ఎక్కువ సార్లు చూస్తూ, అప్పుడప్పుడు మాత్రం ఇతర ఇంటర్వ్యూవర్స్ వైపు చూస్తూ ఉండాలి. పైకి కానీ, కిందకి గానీ, పక్కలకు కానీ అస్సలు చూడకూడదు. ఈ విధంగా చూడటం వల్ల మీ పట్ల అపనమ్మకాన్ని, తక్కువ ఆత్మవిశ్వాసం కనబరస్తున్నారనే సంకేతం వారిని చేరుతుంది. కాబట్టి, వారు మాట్లాడేటప్పుడు వారి వైపు చూస్తూ, వాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటున్నట్టు తలను ఊపుతూ వినాలి. అలాగే ఇంటర్వ్యూ పట్లసానుకూలధృక్పధం, ఆత్మవిశ్వాసాన్ని కనబరచాలి.

ఆకట్టుకునే వస్త్రధారణ
ఇంటర్వ్యూకి సరైన డ్రెస్‌తో వెళ్లాలి. మీ డ్రెస్సింగ్ ఇంటర్వ్యూ చేసే కంపెనీని బట్టి ఉండాలి. ఒక వేళ మీరు హాస్పిటల్ మేనేజ్‌మెంట్ లేదా స్పోర్‌‌ట్స ఆర్గనైజేషన్ లేదా కార్పొరేట్ కంపెనీ.. లకు ఇంటర్వ్యూకి వెళ్లవలసి వస్తే, ఒక్కో ఉద్యోగానికి ఒక్కో విధమైనడ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి. కొన్ని కంపెనీలు అయితే డ్రెస్ కోడ్ కూడా మెయిన్‌టైన్ చేస్తాయి. కాబట్టి ఇంటర్నెట్‌లో ఆయా కంపెనీల గురించి కొంత రీసెర్చ్ చేసి, సూటబుల్ ఇంటర్వ్యూ సూటు ఎంపిక చేసుకోవాలి. మీ వస్త్రధారణ ఇంటర్వ్యూవర్‌ని ఆకర్షించాలి. అయితే క్యాజువల్ డ్రెస్‌తో మాత్రం అస్సలు వెళ్లకూడదు. కార్పొరేట్ కలర్స్ ఎంపిక చేసుకోవాలి. నగలను ఎక్కువగా ధరించకూడదు. సింపుల్‌గా, ప్రొఫెషనల్‌గా కనిపించాలి. ఈ విధంగా తయారవడంవల్ల మీరు కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. అంతేకాకుండా ఇంటర్వ్యూకి మిమ్మల్ని అన్ని విధాలా సిద్ధంగా ఉంచుతుంది.

చేతి కదలికలు అదుపులో ఉంచడం
కొంతమందికి కాళ్లను ఊపడం, చేతులను అన్ని వైపులకు తిప్పడం అలవాటు. ఏదీఏమైనప్పటికీ, ఈ విధమైన కదలికలవల్ల మీనుంచి వారి దష్టి మరలే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ సమయంలో మీ చేతి వేళ్లతో, వెంట్రుకలతో ఆటలాడకూడదు. ఇబ్బందిగా కదలకపోవడం వల్ల, రిక్రూటర్స్ మీరు చెప్పేవిషయం మీద దష్టి పెట్టగలరు. హెయిర్‌తో లేదా పెన్‌తో ఆటలాడటం వల్ల మీరు ఇంటర్వ్యూపట్ల ఇంటరెస్ట్ కనపరచడం లేదనే సంకేతం వారికి చేరవచ్చు. మీరు ఏం ఫీల్ అవుతున్నారో అక్కడ ప్రదర్శించక పోవడం మంచిది. మీరు చెప్పే విషయాలకు మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ సూట్ కావాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీపట్ల వారికి నమ్మకం కుదురుతుంది. మీరు చెప్పేది నిజాయితీగా చెప్పాలి. మీ నిజాయితీ మీ ముఖంలో స్పష్టంగా కనిపించాలి.

అదేపనిగా తల ఊపడం ఆపాలి
ఇంటర్వ్యూవర్ చెప్పే ప్రతి విషయానికి మీరు అంగీకరిస్తున్నట్టు తల వూపకూడదు. వాళ్లు చెప్పే ప్రతి విషయానికి గొఱ్ఱెలా తలవూపడం వల్ల మీరు చెప్పేది నేను అంగీకరిస్తున్నాననే సంకేతం వారికి చేరుతుంది. కానీ రిక్రూటర్సుకు ఇంటర్వ్యూ సమయంలో ఎదుటి వారి తెలివితేటలను చదవడం ఇష్టం. మీ అభ్రిప్రాయాలను తెలియజేస్తూ, వారితో ఏకీభవించవలసి వస్తే తలను ఒకటి లేదా రెండూ సార్లు ఊపడం ద్వారా మీ అంగీకారాన్ని తెల్పడం మంచిది.

చేతులు ముడుచుకోకూడదు
కొంత మందికి ఇంటర్వ్యూ సమయంలో చేతులు కట్టుకోవడం అలవాటు. కానీ చేతులు ముడుచుకోవడం లేదా కట్టుకోవడం చేయకూడదు. అది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే సంకేతం వారికి చేరవేస్తుంది. ఆవిధంగాకాకుండా మీ చేతులను ఫ్రీగా వదిలివేసినటై్లతే అది మీ వ్యక్తిత్వాన్ని, ఓపెన్‌నెస్‌ను వ్యక్తీకరిస్తుంది. మీరు మాట్లాడనప్పుడు మీ చేతులను తటస్థంగా లేదా మధ్యస్థంగా ఉంచాలి. మీరు మాట్లాడేటప్పుడు మీ పొజిషన్ నాచురల్‌గా ఉండాలి. మీరు చెప్పేవిషయానికి అనుగుణంగా మీ చేతి కదలికలు ఉండాలి. అయితే చేతికదలికలు అదుపులో ఉంచడం మాత్రం మర్చిపోకూడదు. సందర్భానికి తగినట్టుగా ఉండాలి.

రిలాక్స్‌గా కుర్చోవాలి
మీరు కూర్చునే విధానం కూడా ఇంటర్వ్యూలో కీలక పాత్రపోషిస్తుంది. భుజాలు కిందికి వదిలి, నిటారుగా, రిలాక్స్ పొజిషన్లో కూర్చోవాలి. వెనక్కివాలి కూర్చోకూడదు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఎదురుగా సిద్ధంగా ఉన్నాననే విధంగా కూర్చోవాలి. మీరు కూర్చునే విధానం ప్రొషెషనల్‌గా కాన్ఫిడెంట్‌గా, ప్రిపేర్గ్‌గా ఉన్నారనే విషయాన్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి తెలియజేస్తుంది. ఇంటర్వ్యూవర్ గమనించినా, గమనించకపోయినా మీరు మీ బెస్ట్ బిహేవియర్‌ను కనపరచాలి.

మాట్లాడే విధానం
ఇంటర్వ్యూ సమయంలో కొంత మంది మధువుగా, సంశయిస్తూ మట్లాడుతారు లేదా ఫాస్ట్‌గా అర్థంకాకుండా మాట్లాడుతారు. కాబట్టి ఆ విధంగాకాకుండా, తెలిసిన వ్యక్తులతో ఏవిధంగా మట్లాడుతారో, అట్లా ప్రశాతంగా, తేలికగా మాట్లాడాలి. మీకు మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటే సంశయించకుండా కొంచెం నీళ్లు తాగిన తర్వాత ఇంటర్వ్యూవర్ తో మీ సంభాషణ కొనసాగించాలి. నిదానంగా, ఆలోచించి మాట్లాడటం ద్వారా రిక్రూటర్ మీరు చెప్పేవిషయాన్ని అర్ధం చేసుకోగలుగుతారు.

చెదరని చిరునవ్వు ఉండాలి
ఇంటర్వ్యూ సమయంలో చిరునవ్వు నిజంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిరునవ్వుతో కూడిన సంభాషణ ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా చేస్తుంది. ఈ విధమైన బాడీలాంగ్వేజ్‌తో మీరు మంచి సత్సంబంధాలను పెంపొందించుకోవచ్చు. రాని నవ్వును ఒలికించడం కంటే అసలు నవ్వకపోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడూ చిరచిర లాడుతూ, దురుసుగా వ్వవహరించే వారిని ఉద్యోగిగా నియమించడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అయితే ఇంటర్వ్యూచేసే వారిలో కొంతమంది మాత్రం నెర్వస్ గా ఉండటాన్ని అర్థంచేసుకుని, వారిని తేలికపరచడానికి ప్రయత్నించవచ్చు. ఇంటర్వ్యూ ముగిసేంతవరకూ నవ్వుతూనే ఉండవల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే అపహాస్యపాలవడం ఖాయం. అందుకని ఒకటి లేదా రెండు సార్లు నవ్వితే సరిపోతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ రూమ్‌లో నవ్వే సందర్భం వస్తే నిస్సందేహంగా నవ్వవచ్చు. అనవసర జోక్స్ వేసి ఇబ్బందుల్లో ఇరక్కోకూడదు.

చివరిగా..
ఇంటర్వ్యూ పూర్తికాగానే అక్కడి నుంచి హడావిడిగా వెళ్లిపోయే ప్రయత్నం చేయకూడదు. మీ వస్తువులను తీసుకుని, చిరునవ్వుతో నెమ్మదిగా పైకి లేవడానికి కొంత సమయం తీసుకుని బయటికి రావాలి.

ఇంటర్వ్యూ ముగిసేంత వరకూ మీ బాడీలాంగ్వేజ్ నిజాయితీగా ఉండాలి. ఫేక్ అయితే ఇంటర్వ్యూవర్ దానిని గుర్తించే అవకాశం ఉంది. మొదటి ఇంప్రెషన్‌తోనే మీరు బెస్ట్ అనిపించాలి. సెకండ్ ఛాన్స్ ఇవ్వకూడదు.

చ‌ద‌వండి:  Resume Tips: రెజ్యూమే ఇలా సింపుల్‌గా.. కంపెనీలు గుర్తించేలా..

Published date : 28 Jan 2022 02:48PM

Photo Stories