Interview Tips in APPSC Group 1 (2018): ఇంటర్వ్యూల్లో రాణించేందుకు నిపుణుల సలహాలు...
ఏపీపీఎస్‌సీ గ్రూప్–1(2018)..ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నియామక ప్రక్రియలో చివరి దశగా పేర్కొనే..ఇంటర్వ్యూలకు ఏపీపీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటించింది! ఈ నెల(జూన్) 15 నుంచి.. ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని పేర్కొంది. 169 పోస్ట్‌ల భర్తీకి చేపట్టిన ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో ప్రతిభ చూపి.. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు.. తుది సమరానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్–1(2018) ఇంటర్వ్యూల్లో రాణించేందుకు నిపుణుల సలహాలు...
- ఈ నెల 15 నుంచి 29 వరకు గ్రూప్–1(2018) ఇంటర్వ్యూలు
- గ్రూప్–1 ఎంపిక ప్రక్రియలో తుది దశ ముఖాముఖి
- ఇటీవలే విడుదలైన మెయిన్ ఫలితాలు
రాత పరీక్షల్లో అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నైపుణ్యాలను, సమకాలీన పరిణామాలపై అవగాహనను పరీక్షిస్తారు. కానీ మౌఖికంగా నిర్వహించే ఇంటర్వ్యూ మాత్రం.. సబ్జెక్టు నైపుణ్యాలతోపాటు సమయస్ఫూర్తి, అన్వయ నైపుణ్యం పరిశీలించే విధంగా జరుతుంది. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు సమకాలీన అంశాలపై అవగాహనతో బోర్డ్ రూమ్‌లోకి అడుగుపెట్టాలి అంటున్నారు నిపుణులు.
మొత్తం 325.. ప్రతి రోజు 30 మంది
ఆంధ్రప్రద్రేశ్ పబ్లిస్ సర్వీక్ కమిషన్ గ్రూప్–1 (2018)కు సంబంధించి రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్ ఫలితాలను ఇటీవల ప్రకటించింది. 169 పోస్ట్‌లకుగాను 325 మందిని తుదిదశ ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు.ఈ నెల 15నుంచి మూడు బోర్డ్‌ల ఆధ్వర్యంలో ఒక్కో బోర్డ్‌లో 10 మంది చొప్పున రోజుకు 30 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఒక్కో బోర్డ్‌కు రోజుకు పది మంది అంటే..ఒక్కో అభ్యర్థికి కనీసం 20నుంచి 30నిమిషాల వ్యవధిలో ఇంటర్వ్యూ జరిగే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో రాణించాలంటే..భావ వ్యక్తీకరణ, చెప్పే సమాధానం,ఆలోచనలు, అభిప్రాయాల్లో స్పష్టత చాలా అవసరం.
Job Interview Tips: జాబ్ ఇంటర్వ్యూల్లో తరచుగా అడిగే ప్రశ్నలు.. దీటైన సమాధానాలు!
సమకాలీన అవగాహన
ఇంటర్వ్యూ ప్రధాన ఉద్దేశం.. ముఖ్యంగా గ్రూప్–1 స్థాయి అధికారిగా ఎంపికయ్యే అభ్యర్థులకు అవసరమైన సమకాలీన అంశాల అవగాహన, సమస్యల పట్ల స్పందించే తీరు, నిర్ణయ నేర్పును ఇంటర్వ్యూ బోర్డు గమనిస్తుంది. కాబట్టి అభ్యర్థులు ప్రధానంగా సమకాలీన అంశాలపై పట్టు సాధించి.. ఇంటర్వ్యూ బోర్డ్ రూంలో అడుగుపెట్టాలి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు,లక్షిత వర్గాలు–లబ్ధిదారులు తదితర విషయాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి.
వ్యక్తిగతం, వృత్తి నేపథ్యం
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం, వృత్తి నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి తమ అకడమిక్ నేపథ్యం, తమ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యం, తమ అకడమిక్ నైపుణ్యాలను విధి నిర్వహణలో ఎలా అన్వయిస్తారో సమర్థంగా చెప్పగలిగే విధంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలి. ఇప్పటికే వేరే ఉద్యోగాలు చేస్తూ గ్రూప్–1 ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత ఉద్యోగంలో తమ విధులు, ఇప్పటికే విధుల పరంగా తాము సాధించిన ఫలితాలు, లేదా ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలు, అవి ఉపయోగపడిన తీరు గురించి ప్రశ్నలు అడిగితే చెప్పగలగాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేస్తుంటే.. తమ శాఖల్లో అమలవుతున్న పథకాలు, తమ పరిధిలో వాటి అమలు తీరు, విధి నిర్వహణ పరంగా సదరు అభ్యర్థుల ప్రమేయం వంటి వాటిపై ప్రశ్నలు ఎదురయ్యే ఆస్కారముంది.
Interview Tips: కరెక్ట్ బాడీలాంగ్వేజ్‌తో ఇంటర్వ్యూలో విజయం సాధించే మార్గాలు..
సొంత అభిప్రాయాలు
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు సొంత అభిప్రాయాలను కలిగి ఉండాలి. బోర్డ్ సభ్యులు.. ఆయా అంశాలపై అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అందుకోసం సమకాలీన అంశాలు, సమస్యలు, ప్రభుత్వాలు తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాలపై ప్రశ్నలు సంధిస్తారు. కాబట్టి అభ్యర్థులు దిన పత్రికల ఎడిటోరియల్స్‌ను, ప్రముఖుల విశ్లేషణలను చదవడమే కాకుండా.. వాటిపై తమ స్వీయ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఏదైనా ఒక అంశం గురించి ప్రశ్నించినప్పుడు.. తమ స్వీయ విశ్లేషణతో మెప్పించేలా సన్నద్ధమవ్వాలి. లేకుంటే.. అభ్యర్థికి స్వీయ అభిప్రాయం లేదనే ప్రతికూల భావన కలిగే ప్రమాదం ఉంది.
నిర్ణయ సామర్థ్యం
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు తమ నిర్ణయ సామర్థ్యాన్ని(డెసిషన్ మేకింగ్ స్కిల్) వ్యక్తపరిచే విధంగా వ్యవహరించాలి. ఏదైనా సమస్య ఎదురైతే.. తక్షణం స్పందించే నేర్పు, సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఎంతో అవసరం. కాబట్టి ఒక అధికారిగా ఏదైనా సమస్య ఎదురైతే ఎలా స్పందిస్తారు? అందుకు సహేతుక కారణాలతో వివరించే నేర్పు ఓర్పు కూడా ఉండాలి.
ఇంటర్వ్యూ సమయంలో ఎదురయ్యే ప్రశ్నలకు సానుకూల దృక్పథంతో సమాధానాలు ఇవ్వాలి. ముఖ్యంగా.. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రశ్నలు ఎదురైనప్పుడు సానుకూల దృక్పథంతో నిర్మాణాత్మకంగా విశ్లేషించగలగాలి.
Resume Tips: రెజ్యూమే ఇలా సింపుల్‌గా.. కంపెనీలు గుర్తించేలా..
బిడియం లేకుండా
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఆందోళన, బిడియం వంటివి అధిగమించాలి. బిడియంతో బోర్డ్ రూమ్‌లో అడుగుపెడితే.. సమాధానాలు తెలిసిన ప్రశ్నలు ఎదురైనా.. వాటిని సరిగా చెప్పలేక విజయావకాశాలు కోల్పోయే ఆస్కారముంది. కాబట్టి బిడియాన్ని అధిగమించేందుకు అవసరమైతే మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం వంటివి కూడా చేయాలి. అదే విధంగా సమాధానాలను చెప్పడాన్ని ప్రాక్టీస్ చేయాలి. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల్లోని ఆందోళనను తగ్గించి..ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్లు సహకరిస్తారు.
అందరికీ అభివాదం
ఇంటర్వ్యూ బోర్డ్‌లో ఒక చైర్మన్, నలుగురు లేదా అయిదుగురు సభ్యులు ఉంటారు. బోర్డ్ రూమ్‌లోకి అడుగుపెట్టిన అభ్యర్థులు ముందుగా చైర్మన్‌కు అభివాదం చేస్తూ.. మిగతా సభ్యులకు కూడా అభివాదం చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. అదే విధంగా సమాధానాలు ఇచ్చే సమయంలోనూ ప్రశ్న అడిగిన బోర్డ్ సభ్యుడినే చూస్తూ చెప్పకుండా.. మిగతా వారికి కూడా ఆ సమాధానం తెలుపుతున్నట్లుగా వ్యవహరించాలి. అంటే.. అందరితో ఐ కాంటాక్ట్ కచ్చితంగా కొనసాగించాలి.
ఆహార్యం.. ఎంతో ముఖ్యం
ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ ఆహార్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే హావ భావాలు వ్యక్తం చేయడంలోనూ నియంత్రణ పాటించాలి. అనవసరంగా చేతులు కదిలించడం, కాళ్లు కదిలించడం వంటివి చేకూడదు. అదే విధంగా తమకు కేటాయించిన సీట్లో బిగుసుకొని కూర్చొని సమాధానం ఇవ్వడం కూడా సరికాదు. ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుల ముందు వినమ్రంగా మెలగడం మేలు చేస్తుంది.
ప్రశ్న.. చర్చ.. ఏదైనా సరే
ఇంటర్వ్యూ అనేది సాధారణంగా ఒక చర్చా వేదికగా భావించొచ్చు. ఇది ప్రశ్నల రూపంలో ఉండే అవకాశం ఉంది. అంటే..ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న నేరుగా జవాబు చెప్పడంతోనే ముగియకుండా.. దానికి కొనసాగింపుగా అనుబంధ ప్రశ్నలు, బోర్డ్ సభ్యుల అభిప్రాయాలతో కలిసి చర్చగా మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలాంటప్పుడే కొందరు అభ్యర్థులు ఇబ్బందికి గురవుతారు. ముఖ్యంగా సదరు అంశంపై లోతైన అవగాహన లేకపోతే ఈ ప్రమాదం మరింత ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో నిజాయతీగా తమకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పి..మిగతా విషయాలు తెలియవని అంగీకరించాలి.
మిమ్మల్నే ఎందుకు?
గ్రూప్–1 ఇంటర్వ్యూ సమయంలో ..‘మిమ్మల్నే ఈ సర్వీసుకు ఎందుకు ఎంచుకోవాలి? లేదా ఈ సర్వీసుకు మీరు ఎలా సరితూగుతారని భావిస్తున్నారు’ వంటి ప్రశ్నలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు తాము ఆ పోస్ట్‌లకు ఎలా సరితూగుతారు.. విధుల నిర్వహణకు తమకున్న లక్షణాలు, నైపుణ్యాల గురించి చెప్పగలగాలి. ఈ ప్రశ్నలకు సాధారణంగా ఎక్కువ మంది పబ్లిక్ సర్వీస్ అంటే ఆసక్తి అనే సమాధానం ఇస్తుంటారు. ఈ సమాధానం చెబుతూనే.. ఇప్పటి వరకు తాము వృత్తి పరంగా, లేదా సమకాలీన అంశాల అవగాహనతో పొందిన నైపుణ్యాలు.. గ్రూప్–1 పోస్ట్‌ల విధుల్లో సమర్థంగా అన్వయించగలమనే విధంగా సమాధానాలు సిద్ధం చేసుకోవాలి.
పేపర్ రీడింగ్
ఇప్పటి నుంచి ఇంటర్వ్యూ రోజు వరకు అభ్యర్థులు ప్రతి రోజు రెండు ప్రామాణిక దినపత్రికలు చదవడం అలవర్చుకోవాలి. వాటిలో ప్రచురితమైన ముఖ్య కథనాలు, ఎడిటోరియల్స్, వ్యాసాలు, సమకాలీన అంశాలతో సినాప్సిస్ రాసుకోవాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా..న్యూస్ పేపర్లను చదవడం విస్మరించకూడదు. ఆ రోజు న్యూస్ పేపర్లో ప్రాధాన్యంగా భావించిన న్యూస్, దానికి సంబంధించిన కథనంపై స్పష్టమైన అభిప్రాయం ఏర్పరచుకోవాలి.
Group 1 Preliminary Exam: 60 డేస్ ప్రిలిమ్స్ ప్లాన్.. సిలబస్, సబ్జెక్ట్ అంశాలు..
ఒత్తిడి లేకుండా
లక్షల్లో పోటీని తట్టుకుని చివరగా 1:2 నిష్పత్తిలో జరిగే ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కొంత ఒత్తిడికి గురవుతారు. దీనికి భిన్నంగా ఇప్పటి నుంచే ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి.
దృష్టి సారించాల్సిన అంశాలు
- ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలు.. అందులో ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకున్న ఒప్పందాలు.
- జాతీయ స్థాయిలో నెలకొంటున్న ద్రవ్యోల్బణ పరిస్థితులు.
- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,లక్షిత వర్గాలు,ఉద్దేశంపై అవగాహన.
- పాలనలో సాంకేతిక నైపుణ్యాల వినియోగంపై అవగాహన.
- రాష్ట్రంలో పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు.
- యువత కోసం అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు.
- జాతీయ స్థాయిలో ఆర్థిక, రక్షణ రంగాల్లో తాజా పరిణామాలు.
- అంతర్జాతీయ సంబంధాలపై అవగాహన పెంచుకోవాలి.
బ్యాలెన్స్‌డ్ అప్రోచ్
గ్రూప్–1, సివిల్స్ వంటి ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు బ్యాలెన్స్‌డ్ అప్రోచ్‌తో వ్యవహరించాలి. ముఖ్యంగా వివాదాస్పద అంశాలపై ప్రశ్నలు వచ్చినప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాలి. సింగిల్ సైడ్ ఇంటర్వ్యూతో అభ్యర్థులకే ప్రమాదం అని గుర్తించాలి. అదే విధంగా సమాధానాలు ఇచ్చే సమయంలో బోర్డ్ సభ్యులందరినీ ఉద్దేశిస్తూ ఉండే విధంగా ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేయాలి.
–వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ
Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!