Skip to main content

Job Trends : ఉద్యోగంలో జాయినింగ్‌కు.. ఆల‌స్యం ఇందుకేనా..! ఇలా అయితే..

software company delaying joining date reasons

ఇంజనీరింగ్‌ పట్టా సొంతం చేసుకోవాలి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో నెగ్గి.. ఆఫర్‌ లెటర్‌ అందుకోవాలి! ఆ ఆఫర్‌ లెటర్‌తో సాఫ్ట్‌వేర్‌ కెరీర్‌లో దూసుకుపోవాలి. ఇది ఎక్కువ మంది ఇంజనీరింగ్‌ విద్యార్థుల స్వప్నం కానీ..గత కొన్ని నెలలుగా పరిణామాలను పరిశీలిస్తే..కొంత భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా.. అపాయింట్‌మెంట్‌ తేదీలు ఖరారు చేయడంలేదు!! ఈ నేపథ్యంలో.. ఐటీ కంపెనీల్లో ఆన్‌బోర్డింగ్‌లో ఆలస్యానికి కారణాలు.. రానున్న రోజుల్లో జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌.. జాయినింగ్‌ లెటర్స్‌ చేతికి రాని విద్యార్థుల ముందున్న మార్గాలేమిటో తెలుసుకుందాం..

  • ఐటీ సంస్థల్లో ఆన్‌ బోర్డింగ్‌లో ఆలస్యం
  • ఆఫర్‌ ఇచ్చినా జాయినింగ్‌ తేదీలపై అస్పష్టత
  • ఆందోళనలో ఆఫర్‌ లెటర్లు అందుకున్న అభ్యర్థులు
  • నూతన నియామకాలుంటాయంటున్న దేశీయ ఐటీ కంపెనీలు
     
  • విక్రమ్‌.. 2022లో బీటెక్‌ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు 2021 నవంబర్‌లో నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో ప్రముఖ ఐటీ సంస్థలో రూ.5లక్షల వార్షిక వేతనంతో ఆఫర్‌ సొంతం చేసుకున్నాడు. బీటెక్‌ సర్టిఫికెట్‌ జూన్‌లోనే చేతికందినా..ఇప్పటివరకూ ఆఫర్‌ ఇచ్చిన సంస్థ నుంచి ఆన్‌ బోర్డింగ్‌(జాయినింగ్‌) తేదీపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు.
  • రమేశ్‌.. ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌లో విజయం సాధించి.. ఆఫర్‌ ఖరారు చేసుకున్నాడు. దీనికోసం..అప్పటికే పని చేస్తున్న సంస్థకు రాజీనామా కూడా చేశాడు. కానీ.. రోజులు గడుస్తున్నా.. ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ నుంచి జాయినింగ్‌ తేదీపై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో తన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని దిగులు చెందుతున్నాడు.
  • ఇలా విక్రమ్, రమేశ్‌లే కాకుండా..వేల మంది ఉద్యోగార్థులకు ప్రస్తుతం ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. క్యాంపస్‌ డ్రైవ్స్‌లో ఆఫర్లు ఖరారు చేసిన సంస్థలు.. జాయినింగ్‌ తేదీపై జాప్యం చేస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. 
  • క్యాంపస్‌ డ్రైవ్స్‌ లేదా ఇతర నియామక విధానాల ద్వారా ఆఫర్‌ అందుకుని.. ఆన్‌ బోర్డింగ్‌ లెటర్స్‌ అందని వారి సంఖ్య 30 వేలకు పైగా ఉంటుందని అంచనా. 
  • ఈ సంఖ్య ఐటీ కంపెనీలకు సంబంధించినది మాత్రమేనని.. ఇతర రంగాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మరింత ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు.

IIT Jobs: ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌.. ఏడాదికి రూ.2కోట్లకు పైగా వేత‌నం..

సందిగ్ధ పరిస్థితులు

  • కొన్ని కంపెనీలు గతేడాది ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చినా.. ఇప్పటివరకు అపాయింట్‌మెంట్‌ తేదీలు ఖరారు చేయలేదు..
  • ఫేస్‌బుక్, గూగుల్, ఇంటెల్‌ వంటి టాప్‌ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుపై సంకేతాలు ఇస్తున్నాయి..
  • మరోవైపు దేశీయంగా టీసీఎస్, విప్రో వంటి సంస్థలు కొత్త నియామకాలు ఉంటాయని పేర్కొంటున్నాయి..
  • పై మూడు రకాల పరిస్థితుల కారణంగా ఇటు ఫ్రెషర్స్‌తోపాటు, ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు, అదే విధంగా గతేడాది క్యాంపస్‌ డ్రైవ్స్‌లో ఎంపికైన వారు సందిగ్ధ పరిస్థితికి గురవుతున్నారు. 

ఐటీ దిగ్గజాల నుంచే జాప్యం

  • ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా.. జాయినింగ్‌ లెటర్స్‌ జారీలో జాప్యం చేస్తున్న కంపెనీల్లో అధికంగా ఐటీ దిగ్గజ సంస్థలే ఉండడం విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా మరికొన్ని సంస్థలు.. ఆఫర్‌ లెటర్స్‌ ఇచ్చిన వారికి.. సదరు ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లుగా సమాచారం కూడా ఇస్తున్నాయి. ఇలా ఆఫర్‌ తిరస్కరణ సందర్భంలో.. ‘మా సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మీ అర్హతలు లేవు’ అనో.. లేదా ‘మీరు మీ ప్రొఫైల్‌కు సరిపడే సర్టిఫికేషన్స్‌ పూర్తి చేయలేదు’ అనో పేర్కొంటున్నాయి. దీంతో క్యాంపస్‌ డ్రైవ్‌లో తమ అకడమిక్‌ ప్రతిభను, మార్కులను, స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసి, ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన సంస్థలు.. ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఏంటి? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగుల తొలగింపు

  • ప్రస్తుత పరిస్థితుల్లో పలు ఎంఎన్‌సీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయనే సంకేతాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 
  • ఇప్పటికే ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలోని మేటా సంస్థలో 12 వేల మందిని పనితీరు ప్రాతిపదికగా తొలగించనున్నట్లు ప్రకటించారు.
  • దాదాపు 1.15 లక్షల ఉద్యోగులు ఉన్న ఇంటెల్‌ సంస్థ.. అంతర్జాతీయంగా 20 శాతం మేరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. 
  • దేశీయంగానూ ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ రెండున్నర వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 
  • గూగుల్‌ సంస్థ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రాబడిలో తగ్గుదలతో నూతన నియామకాల విషయంలో కొంతకాలం స్వీయ నిషేధం విధించింది.

Best Engineering Branch: బీటెక్‌... కాలేజ్, బ్రాంచ్‌ ఎంపిక ఎలా

మాంద్యం సంకేతాలే కారణమా!

  • ఐటీలో ఆన్‌బోర్డింగ్‌ ఆలస్యానికి అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందనే సంకేతాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలోని సంస్థల్లో అధిక శాతం అమెరికాలోని కంపెనీలకు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సేవలందిస్తున్నాయి. అమెరికా మాంద్యం ముంగిట నిలిచిందనే అంచనాల కారణంగా.. అక్కడి కంపెనీల్లో కార్యకలాపాలు మందగిస్తున్నాయి. ఫలితంగా ఆయా సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. దీంతో.. సదరు సంస్థలకు సేవలపై ఆధారపడిన మన ఐటీ కంపెనీలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇది అంతిమంగా ఆన్‌ బోర్డింగ్‌లో జాప్యానికి కారణమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా కొత్త ప్రాజెక్ట్‌లు రావడం కొంత కష్టంగా ఉంది. ఇది కూడా ఆన్‌ బోర్డింగ్‌లో జాప్యానికి మరో కారణమని చెబుతున్నారు.

ఉన్నత విద్యపై ప్రభావం

  • ఐటీ కంపెనీలు జాయినింగ్‌ లెటర్లు ఇవ్వక పోవడం వల్ల ఆఫర్‌ లెటర్లు ఖరారు చేసుకున్న విద్యార్థుల ఆర్థిక పరిస్థితితోపాటు, ఉన్నత విద్యపైనా ప్రభావం చూపుతోంది. 
  • పలువురు విద్యార్థులు ఎడ్యుకేషన్‌ లోన్స్‌ ద్వారా కోర్సులు పూర్తి చేసుకున్నారు. ఉద్యోగంలో చేరాక వాటిని తీర్చేయొచ్చని భావించారు. కానీ ఆఫర్లు ఖరారైనా.. ఇప్పటికీ విధుల్లో చేరకపోవడంతో ఆదాయం లేక..లోన్‌ రీ పేమెంట్‌ చేయలేని పరిస్థితి నెలకొంది.
  • అంతేకాకుండా ఆన్‌ బోర్డింగ్‌ జాప్యంతో విద్యార్థులు ఉన్నత విద్య కోర్సుల్లో చేరాలా వద్దా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

టైర్‌–2, 3 ఇన్‌స్టిట్యూట్స్‌లోనే సమస్య

ఆన్‌ బోర్డింగ్‌ తేదీల్లో జాప్యం అనేది ఎక్కువగా టైర్‌–2, టైర్‌–3 ఇన్‌స్టిట్యూట్‌ల విషయంలోనే తలెత్తుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. టైర్‌–1 ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు జాయినింగ్‌ తేదీలను సంస్థలు ఖరారు చేస్తున్నాయని చెబుతున్నారు. టైర్‌–2, టైర్‌–3 ఇన్‌స్టిట్యూట్స్‌ల విద్యార్థులు సంస్థలు పేర్కొన్న సర్టిఫికేషన్స్‌ పూర్తిచేయకపోవడం లేదా శిక్షణ తీసుకోకపోవడం ఇందుకు కారణమంటున్నారు.

Best Branch in Engineering : Btechలో బెస్ట్ బ్రాంచ్ ఏది..? ఎలా సెల‌క్ట్ చేసుకోవాలి..?

నూతన నియామకాలు!

  • ఇటీవల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన టీసీఎస్‌.. తాము కొత్తగా 12 వేల నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. 
  • ‘మూన్‌ లైటింగ్‌’పై నిషేధం విధించిన విప్రో.. ఈ ఏడాది ప్రథమార్థంలో 14 వేల మందిని నియమించినట్లు తెలిపింది. వచ్చే త్రైమాసికంలోనూ నియామకాలు కొనసాగిస్తామని పేర్కొంది. హెచ్‌సీఎల్‌ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 30 వేల మందిని నియమిస్తామని తెలిపింది. ఇప్పటికే పది వేలకు పైగా ఫ్రెషర్లకు అవకాశం ఇచ్చామని వెల్లడించింది.

ఇప్పుడేం చేయాలి?

  • ఇప్పటికే ఆఫర్స్‌ ఖరారు చేసుకున్న వారు.. ఇతర ఉద్యోగాల కోసం అన్వేషణ సాగించొచ్చు. ఈ విషయాన్ని ఆఫర్‌ ఇచ్చిన మొదటి సంస్థకు తెలియజేయాలి.
  • కొత్త ఉద్యోగంలో చేరే సందర్భంలోనూ తమకు అంతకుముందే ఆఫర్‌ వచ్చిన విషయాన్ని, ఆన్‌ బోర్డింగ్‌లో జాప్యాన్ని తెలియజేయాలి. 
  • కొత్త ఉద్యోగంలో ఏదైనా సర్వీస్‌ బాండ్‌ వంటి నిబంధనలు ఉంటే.. సంస్థ ప్రామాణికతను పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన నిర్ణయానికి రావాలి. 
  • ఆన్‌ బోర్డింగ్‌కు మరికొన్ని రోజులు వేచి చూడాలని సంస్థ కోరితే..అభ్యర్థులు ఫ్రీలాన్సింగ్‌ వర్క్‌పై దృష్టి పెట్టొచ్చు. 
  • ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానాల్లో తమ నైపుణ్యాలకు పదును పెట్టుకునే కోర్సులు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. 
  • స్వీయ అన్వేషణ మార్గాల ద్వారా కొత్త ఉద్యోగం కోసం యత్నించాలి. 

ఆ ఇన్‌స్టిట్యూట్స్‌కు సమస్య లేదు

ఫ్రెష్‌ రిక్రూట్‌మెంట్స్‌ విషయంలో ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌ విద్యార్థులకు ఎలాంటి సమస్య లేదు. ఇప్పటికే ఐఐటీలు, ఐఐఎంలలో పీపీఓలు, ఎస్‌పీఓలు భారీగా లభించిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ రిక్రూట్‌మెంట్‌ కూడా ఆశాజనకంగానే ఉంటుంది. మిగతా కాలేజీల విద్యార్థులు తమ అర్హతలకు సరితూగే లేటెస్ట్‌ నైపుణ్యాలు నేర్చుకుని.. స్వీయ అన్వేషణ మార్గాల ద్వారా ఉద్యోగం సొంతం చేసుకునేందుకు కృషి చేయాలి. 
– ప్రొ‘‘ అభినవ్‌ కుమార్, ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్, కెరీర్‌ సర్వీసెస్, ఐఐటీ–హైదరాబాద్‌

Published date : 26 Oct 2022 07:05PM

Photo Stories