JEE – Advanced – 2023: మారిన సిలబస్‌తో అడ్వాన్స్‌డ్!
» 2023 నుంచి మారిన సిలబస్‌తో జేఈఈ అడ్వాన్స్‌డ్
» జేఈఈ–మెయిన్ సిలబస్ అంశాల కొనసాగింపు
» సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారంగా కొత్త సిలబస్
» మెయిన్‌తో అనుసంధానం చేసుకోవాలంటున్న నిపుణులు
» అడ్వాన్స్‌డ్‌ను జూన్ 4న నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఎన్‌టీఏ
జేఈఈ – అడ్వాన్స్‌డ్ – 2023 సిలబస్‌లో మార్పులు ఉంటాయని జాయింట్ అడ్మిషన్ బోర్డ్ గతంలోనే స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ఇటీవల కొత్త సిలబస్‌ను విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే.. అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన స్కోర్ సాధించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
మూడు సబ్జెక్టుల్లోనూ మార్పులు
- జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ను ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో నిర్వహిస్తారు. తాజా సిలబస్‌ను పరిశీలిస్తే.. ఈ మూడు సబ్జెక్ట్‌లోనూ మార్పులు చేశారు. కొన్ని కొత్త అంశాలను చేర్చారు.
- ఫిజిక్స్‌లో.. జనరల్ ఫిజిక్స్, మెకానిక్స్, థర్మల్ ఫిజిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ వేవ్స్, ఆప్టిక్స్, ఫోర్స్‌డ్ అండ్ డ్యాంప్డ్ ఆసిలేషన్స్, ఈఎం వేవ్స్ అండ్ పోలరైజేషన్ అంశాలను కొత్తగా చేర్చారు. ఇదే సమయంలో సెమీ కండక్టర్స్ అండ్ కమ్యూనికేషన్స్‌ను తొలగించారు.
- మ్యాథమెటిక్స్‌లో.. సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్‌ను తొలగించి.. దాని స్థానంలో కొత్తగా స్టాటిస్టిక్స్, అల్జీబ్రా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మాట్రిసెస్ తదితర అంశాలను చేర్చారు.
- కెమిస్ట్రీలో.. న్యూక్లియర్ కెమిస్ట్రీ విభాగాన్ని తొలగించారు. అదే విధంగా బయో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్‌లో మార్పులు చేశారు. గ్యాసెస్ అండ్ లిక్విడ్స్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, మాలిక్యులర్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మేటర్ విభాగాల్లోనూ కొత్త అంశాలను చేర్చారు. రిడాక్స్ రియాక్షన్స్, సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్ వంటి వాటిని కూడా చేర్చారు.
Also read: JEE Mains 2023 : జేఈఈ అర్హతలో మార్పులు ఇవే.. ఇంటర్‌లో కూడా..
జేఈఈ–మెయిన్‌కు కొనసాగింపుగా
జేఈఈ–అడ్వాన్స్‌డ్ సిలబస్‌లోని మార్పులను పరిశీలిస్తే.. జేఈఈ–మెయిన్ సిలబస్‌కు కొనసాగింపుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొంతమంది జేఈఈ–మెయిన్ సిలబస్ కంటే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ కొత్త సిలబస్‌ను ఆకళింపు చేసుకోవడం సులభమని అంటున్నారు. అడ్వాన్స్‌డ్ సిలబస్ విస్తృతంగా కనిపిస్తున్నప్పటికీ.. మెయిన్ పరీక్షల సిలబస్‌ను ఆసాంతం చదివిన వారికి అడ్వాన్స్‌డ్ సిలబస్‌పై అవగాహన పొందడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొంటున్నారు.
సీబీఎస్‌ఈ విద్యార్థులకు అనుకూలం
జేఈఈ–అడ్వాన్స్‌డ్ సిలబస్‌లో మార్పులు సీబీఎస్‌ఈ బోర్డ్ +1,+2 విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేసినట్లుగా ఉందని పేర్కొంటున్నారు. దీంతో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేసిన వారికి ఎక్కువ అనుకూలత ఉంటుందని అంటున్నారు. స్టేట్ బోర్డ్‌ల పరిధిలో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులు చదివిన వారికి ఇబ్బంది ఎదురవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు.. గత కొన్నేళ్లుగా సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆధారంగా చేసుకుని తమ బోర్డ్ సిలబస్‌లోనూ మార్పులు చేశాయని.. దీనివల్ల విద్యార్థులు అంతగా ఆందోళన చెందక్కర్లేదని సబ్జెక్ట్ నిపుణులు భరోసా కల్పిస్తున్నారు.
Also read: NTA: జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ షెడ్యూల్
శిక్షణ అవసరం లేని విధంగా
వాస్తవానికి విద్యార్థులు బోర్డ్ సిలబస్‌తో మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతూ విజయం సాధిస్తున్నారు. కాని అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన స్కోర్ కోసం మాత్రం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. దీంతో మెయిన్ తర్వాత అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీకి మధ్య ఉండే వ్యవధిలో శిక్షణ ఒత్తిడి, ప్రిపరేషన్ ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగానే తాజా మార్పులు చేసినట్లు ఐఐటీల వర్గాలు పేర్కొంటున్నాయి. మెయిన్ సిలబస్‌కు కొనసాగింపుగా అడ్వాన్స్‌డ్ సిలబస్‌లో మార్పులు చేయడం ద్వారా విద్యార్థులు ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత పొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నాయి.
వెబ్‌సైట్‌లో కొత్త సిలబస్
జేఈఈ అడ్వాన్స్‌డ్–2023 కొత్త సిలబస్‌ను అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: NTA: ఇంటర్‌లో ఇంత శాతం మార్కులు సాధిస్తేనే జేఈఈ మెయిన్స్‌కు..
గత ఏడాది మాదిరిగానే పరీక్ష
జేఈఈ–అడ్వాన్స్‌డ్–2023 సిలబస్‌లో మార్పులు చేసిన నేపథ్యంలో పరీక్ష విధానంలోనూ మార్పులు ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రెండు పేపర్లుగా నిర్వహించే ఈ పరీక్షలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే గత ఏడాది మాదిరిగానే పరీక్ష విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని ఎక్కువ మంది నిపుణులు పేర్కొంటున్నారు.
గత పరీక్ష విధానం ఇలా
- అడ్వాన్స్‌డ్–2022 పరీక్షను రెండు పేపర్లుగా(పేపర్–1, పేపర్–2)గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహించారు.
- పేపర్–1లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రతి సబ్జెక్ట్‌లో మూడు సెక్షన్లుగా పరీక్ష జరిగింది.
- మ్యాథమెటిక్స్‌లో మొదటి సెక్షన్‌ను 8 ప్రశ్నలతో 24 మార్కులకు, రెండో సెక్షన్‌ను 6 ప్రశ్నలతో 24 మార్కులకు, మూడో సెక్షన్‌ను 4 ప్రశ్నలతో 12 మార్కులకు నిర్వహించారు.
- ఫిజిక్స్‌లో..సెక్షన్–1లో 8 ప్రశ్నలు(24 మార్కులు),సెక్షన్–2లో 6 ప్రశ్నలు(24 మార్కులు), సెక్షన్–3లో 4 ప్రశ్నలు(12 మార్కులు) అడిగారు.
- కెమిస్ట్రీలో..సెక్షన్–1లో 8ప్రశ్నలు(24మార్కులు), సెక్షన్–2లో 6 ప్రశ్నలు(24 మార్కులు), సెక్షన్–3లో 4 ప్రశ్నలు(12 మార్కులు) అడిగారు.
- మొత్తంగా పేపర్–1ను ప్రతి సబ్జెక్ట్‌లో 18 ప్రశ్నలతో 60 మార్కులకు చొప్పున నిర్వహించారు.
Also read: Rajeeva Laxman Karandikar named as chairperson of the National Statistical Commission
పేపర్–2
పేపర్–2ను కూడా పేపర్–1 మాదిరిగా మూడు సబ్జెక్ట్‌లో.. ప్రతి సబ్జెక్ట్‌లో మూడు విభాగాలతో నిర్వహించారు. ప్రశ్నలు, మార్కుల విధానంలోనూ పేపర్–1 మాదిరిగానే.. ప్రతి సబ్జెక్ట్‌లో 18 ప్రశ్నలు, 60 మార్కులు చొప్పున కేటాయించారు. వాస్తవానికి గత మూడేళ్లుగా ప్రశ్నల సంఖ్యలో మార్పులు జరగట్లేదు. కాబట్టి ఈసారి కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని, మార్కింగ్ విధానంలో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
జూన్ న జేఈఈ అడ్వాన్స్‌డ్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను జూన్ 4న నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీఏ) ప్రకటించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్–2 ఉంటుందని పేర్కొంది. జేఈఈ మెయిన్స్ లో ఉత్తీర్ణులైన వారిలో టాప్ 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. ఇందులో వచ్చే ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు.
Also read:JEE Mains 2023: పరీక్షల వివరాలు
ప్రిపరేషన్ ఇలా
ఫిజిక్స్
- ఎలక్ట్రో డైనమిక్స్; మెకానిక్స్; హీట్ అండ్ థర్మో డైనమిక్స్, ఎలక్ట్రో డైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్;సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.
మ్యాథమెటిక్స్
- కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్. వీటితోపాటు 3–డి జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్;పారాబోలా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్;బైనామియల్ థీరమ్; లోకస్ అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి.
కెమిస్ట్రీ
- కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌడ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.
Also read: JEE Advanced 2023 Syllabus Revised; Check Major Changes
కొత్త అంశాలపై ప్రత్యేక దృష్టి
విద్యార్థులు అడ్వాన్స్‌డ్–2023లో కొత్తగా చేర్చిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీటికోసం కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. అదే విధంగా మెయిన్ సిలబస్‌ను అడ్వాన్స్‌డ్ సిలబస్‌తో బేరీజు వేసుకోవాలి. ఉమ్మడిగా అంశాలకు, ప్రత్యేక అంశాల ప్రిపరేషన్‌కు వేర్వేరుగా సమాయాన్ని కేటాయించాలి.
ముఖ్య సమాచారం
- సిలబస్‌లో మార్పులతో అడ్వాన్స్‌డ్–2023 నిర్వహణ.
- అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లో నూతన సిలబస్.
- సీబీఎస్‌ఈ విద్యార్థులకు అనుకూలంగా ఉందనే అభిప్రాయాలు.
- జేఈఈ మెయిన్ సిలబస్ అంశాల కొనసాగింపుగా అడ్వాన్స్‌డ్ సిలబస్.
- జేఈఈ అడ్వాన్స్‌డ్ నూతన సిలబస్ వివరాలకు వెబ్‌సైట్: https://jeeadv.ac.in