Skip to main content

JEE Advanced: ఐఐటీలకు దీటైన ఇన్‌స్టిట్యూట్‌లు!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకుతో ఐఐటీల్లో ప్రవేశం లభిస్తుంది. అడ్వాన్స్‌డ్‌–2021కు లక్షా 41వేల 699 మంది హాజరైతే.. 41,862 మంది అర్హత సాధించారు. కానీ.. ఐఐటీల్లో అడ్మిషన్‌ లభించేది మాత్రం 16వేల మందికే! మరి మిగతా వారి పరిస్థితి?! ఐఐటీ స్వప్నం సాకారం కాలేదని ఆవేదన చెందాల్సిందేనా.. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివే అవకాశం రాలేదని దిగాలు పడాల్సిందేనా!! ఐఐటీల్లో సీటు రాకున్నా.. అంతగా ఆందోళన చెందక్కర్లేదు అంటున్నారు నిపుణులు. కారణం.. ఇప్పుడు జాతీయ స్థాయిలో.. ఐఐటీలకు దీటైన ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులో ఉండటమే! ఈ విద్యాసంస్థలు అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి! వీటిలో సీటు సొంతం చేసుకుంటే.. భవిష్యత్‌లో ఉజ్వల అవకాశాలు అందుకోవచ్చు. ఐఐటీలకు దీటైన ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌టీ, ఐసర్, ఐఐపీఈ, ఆర్‌జీఐపీటీలపై ప్రత్యేక కథనం...
Alternatives to IITs
Alternatives to IITs
  • అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణులకు చక్కటి ప్రత్యామ్నాయం..ఐఐఎస్సీ, ఐఐఎస్‌టీ, ఐసర్, ఐఐపీఈ, ఆర్‌జీఐపీటీ.
  • జాతీయ స్థాయి ప్రాముఖ్యం ఉన్న విద్యా సంస్థలుగా ఈ ఇన్‌స్టిట్యూట్‌లకు గుర్తింపు
  • ఐఐటీ కౌన్సెలింగ్‌తోపాటు వీటిపైనా దృష్టిపెట్టాలంటున్న నిపుణులు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులు ఐఐటీల్లో సీటు లభించనంత మాత్రాన కుంగిపోనక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణుల ముంగిట పలు దీటైన ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. వీటిలో అడుగుపెట్టి కోర్సులు పూర్తి చేసుకుంటే.. చక్కటి కెరీర్‌ అవకాశాలు అందుకోవచ్చు.

ఐఐఎస్‌సీ, బెంగళూరు

  • అంతర్జాతీయ ప్రమాణాలతో సైన్స్‌ విద్యను అందిస్తూ గుర్తింపు పొందిన ప్రముఖ విద్యాసంస్థ.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ),(బెంగళూరు).ఈ ఇన్‌స్టిట్యూట్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(రీసెర్చ్‌) కోర్సు అందుబాటులో ఉంది. విద్యార్థులు బయాలజీ,కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ల్లో ఏదో ఒక సబ్జెక్ట్‌ను మేజర్‌గా ఎంచుకొని పరిశోధనల దిశగా అడుగులు వేయొచ్చు. 
  • నాలుగు మార్గాల్లో ప్రవేశం: ఈ ఇన్‌స్టిట్యూట్‌ అందించే బీఎస్‌ కోర్సులోకి  జేఈఈ మె యిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్‌ యూజీ, కేవీపీవై(కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌లలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. 
  • రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌: ఐఐఎస్‌సీ–బెంగళూరు అందించే బీఎస్‌ డిగ్రీ ప్రత్యేకత..రీసెర్చ్‌ దృక్పథంతో బోధన సాగించడం. దాంతోపాటు ఫ్యాకల్టీ చేస్తున్న రీసెర్చ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కార్పొరేట్‌ సంస్థ ల్లో ఇంటర్న్‌షిప్‌ కూడా లభిస్తుంది.
  • ఆకర్షణీయ వేతనాలు: ఐఐఎస్‌సీ, బెంగళూరులో బీఎస్‌ కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్లు ఖరారవుతున్నాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) మొదలు మాన్యుఫ్యాక్చరింగ్‌ వరకూ.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. గతేడాది ప్లేస్‌మెంట్స్‌లో కనీస వార్షిక వేతనం రూ.6 లక్షలు. కాగా గరిష్ట వార్షిక వేతనం రూ.11 లక్షలుగా నమోదైంది.
  • వెబ్‌సైట్‌: https://ug.iisc.ac.in/index.html 

ఐఐఎస్‌ఈఆర్‌ (ఐసర్‌)

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌..›ఐసర్‌. దేశంలో సైన్స్‌ విద్యను అందించే చక్కటి వేదికలు.. ఐసర్‌ క్యాంపస్‌లు. బేసిక్‌ సైన్స్‌ రంగంలో విద్యార్థులను ప్రోత్సహించి మెరికల్లా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేసింది. వీటిలో కూడా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశం పొందొచ్చు.

  • కోర్సులు: ఐఐఎస్‌ఈఆర్‌కు దేశ వ్యాప్తంగా ఏడు క్యాంపస్‌లు(బరంపూర్, భోపాల్, కోల్‌కత, పుణె, తిరువనంతపురం, మొహాలి, తిరుపతి) ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియెట్‌ అర్హతగా అయిదేళ్ల బీఎస్‌–ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీలో ప్రవేశం కల్పిస్తున్నారు. అదే విధంగా ఐఐఎస్‌ఈఆర్‌ భోపాల్‌ క్యాంపస్‌లో నాలుగేళ్ల బీఎస్‌ ఇంజనీరింగ్‌ సైన్సెస్, బీఎస్‌ ఎకనామిక్‌ సైన్సెస్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. 
  • సీట్ల సంఖ్య: బీఎస్‌–ఎంఎస్‌ కోర్సుకు సంబంధించి ఏడు క్యాంపస్‌లలో కలిపి మొత్తం 1741 సీట్లు ఉన్నాయి. ఐఐఎస్‌ఈఆర్‌ భోపాల్‌ క్యాంపస్‌లో బీఎస్‌ ఇంజనీరింగ్‌ సైన్సెస్‌లో 73 సీట్లు, బీఎస్‌ ఎకనామిక్‌ సైన్సెస్‌లో 42 సీట్లలో ప్రవేశం కల్పిస్తున్నారు. 
  • ప్రవేశ ప్రక్రియ: ఐసర్‌ల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకుతోపాటు మరో రెండు విధానాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అవి.. కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన(కేవీపీవై)లో ఉత్తీర్ణత/స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ బోర్డ్స్‌ ఛానల్‌(ఎస్‌సీబీ) పేరుతో.. ఐసర్‌ ప్రత్యేకంగా నిర్వహించే అప్టిట్యూడ్‌ టెస్ట్‌. ఈ రెండు విధానాలకు సంబంధించి ఈ నెల(అక్టోబర్‌) 25న తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు జరుగనుంది. 

అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు సమాచారం

  • అడ్వాన్స్‌డ్‌ ద్వారా దరఖాస్తు తేదీలు: అక్టోబర్‌ 20–నవంబర్‌ 3, 2021
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.iiseradmission.in/

ఆర్‌జీఐపీటీ

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణులకు చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న మరో ఇన్‌స్టిట్యూట్‌.. రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ(ఆర్‌జీఐపీటీ). ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీలో ఏర్పాటైన ఈ విద్యాసంస్థకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ హోదా లభించింది. ఆర్‌జీఐపీటీ ప్రస్తుతం నాలుగేళ్ల బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు అందిస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా వీటిలో ప్రవేశం కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణులు ఈ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

సీట్ల వివరాలు

  • బీటెక్‌లో కెమికల్‌ ఇంజనీరింగ్, సీఎస్‌ఈ, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పెట్రోలియం ఇంజనీరింగ్‌లలో..ఒక్కో బ్రాంచ్‌లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • బీటెక్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో 30 సీట్లు, బీటెక్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌లో 50 సీట్లు, రెన్యువబుల్‌ ఎనర్జీ ఇంజనీరింగ్‌లో 30 సీట్లు చొప్పున ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
  • వీటితోపాటు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా ఆర్‌జీఐపీటీ అందిస్తోంది. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(40 సీట్లు), జియో సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ జియో ఫిజికల్‌ టెక్నాలజీ/జియోలాజికల్‌ టెక్నాలజీ(30 సీట్లు) ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్‌ 26,2021 
  • తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు: అక్టోబర్‌ 28,2021
  • రెండో రౌండ్‌ సీటు కేటాయింపు: నవంబర్‌ 9, 2021
  • మూడో రౌండ్‌ సీటు కేటాయింపు: నవంబర్‌ 17,2021

వెబ్‌సైట్‌: https://www.rgipt.ac.in

ఐఐపీఈ

పెట్రోలియం రంగానికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎనర్జీ(ఐఐపీఈ). 2016లో విశాఖపట్నంలో నెలకొల్పిన ఈ ఇన్‌స్టిట్యూట్‌కు జాతీయ ప్రాముఖ్యం కలిగిన ఇన్‌స్టిట్యూట్‌గా (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌) గుర్తింపు లభించింది. ఐఐపీఈలో ప్రస్తుతం బీటెక్‌–పెట్రోలియం ఇంజనీరింగ్, బీటెక్‌–కెమికల్‌ ఇంజనీరింగ్, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అడ్వాన్స్‌డ్‌ ర్యాంకుతో సీటు

  • ఐఐపీఈలోని బీటెక్‌ ప్రోగ్రామ్‌(పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్‌)లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 
  • ఒక్కో బ్రాంచ్‌లో 50 సీట్లు చొప్పున మొత్తం 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
  • అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా..ఇన్‌స్టిట్యూట్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించాక.. రౌండ్ల వారీగా సీట్ల కేటాయింపు విధానాన్ని ఐఐపీఈ అమలు చేస్తోంది. 2021–22 విద్యా సంవత్సరంలో నాలుగు రౌండ్లలో సీట్ల కేటాయింపు చేయనుంది. 
  • ఫీజుల్లో రాయితీ: ఐఐపీఈలో ఎస్‌సీ/ఎస్టీ వర్గాలకు, కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న వారికి ట్యూషన్‌ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు కల్పిస్తున్నారు.కుటుంబ వార్షికాదాయం రూ. అయిదు లక్షలలోపు ఉన్న వారికి ట్యూషన్‌ ఫీజులో 2/3వ వంతు మినహాయింపునిస్తున్నారు.
  • కెరీర్‌ అవకాశాలు: ఐఐపీఈలో కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులకు బహుళ జాతి కంపెనీల్లో కొలువులు ఖాయమవుతున్నాయి. హిందుస్థాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్, గెయిల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ అవకాశాలు అందుకోవచ్చు. సగటు వేతనం రూ.4 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటోంది.

దరఖాస్తు సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ∙ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 10, 2021
  • తొలి రౌండ్‌ సీటు కేటాయింపు జాబితా వెల్లడి: నవంబర్‌ 11
  • రెండో రౌండ్‌ సీటు కేటాయింపు జాబితా: నవంబర్‌ 16
  • మూడో రౌండ్‌ సీటు కేటాయింపు జాబితా: నవంబర్‌ 20
  • నాలుగో రౌండ్‌ సీటు కేటాయింపు జాబితా: నవంబర్‌ 29.

     
వెబ్‌సైట్‌: https://iipe.ac.in

ఐఐఎస్‌టీ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ స్పేస్‌ సైన్స్‌ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ).. దేశంలో అంతరిక్ష విద్యకు కేరాఫ్‌గా నిలుస్తోంది. అంతరిక్ష శాస్త్రంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌ ఇది. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో ముందంజలో నిలుస్తూ.. టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు పొందుతోంది.

  • బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ కోర్సులు: ప్రస్తుతం ఐఐఎస్‌టీలో నాలుగేళ్ల బీటెక్, అయిదేళ్ల బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. బీటెక్‌లో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, ఏవియానిక్స్‌(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌) బ్రాంచ్‌లను అందిస్తున్నారు. బీటెక్‌లో ఒక్కో బ్రాంచ్‌లో 70 సీట్లు చొప్పున, బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీలో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
  • అడ్వాన్స్‌డ్‌ ర్యాంకుతో అడ్మిషన్‌: ఈ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఐఐఎస్‌టీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా లభిస్తున్నాయి. 
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వేయిలోపు ర్యాంకుతో ప్రవేశం పొందిన మొదటి అయిదుగురికి మొదటి సంవత్సరం ఫీజు నుంచి మినహాయింపు ఇస్తారు. ఈæ విద్యార్థులు మొదటి సంవత్సరంలో 9 జీపీఏ సాధిస్తే తర్వాత సంవత్సరాల్లో కూడా ఫీజు మినహాయింపు పొందొచ్చు. 
  • అదేవిధంగా కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షలలోపు ఉన్న వారికి ఫీజును కొంతమేర తగ్గిస్తున్నారు. అలాగే కుటుంబ వార్షికాదాయం రూ.లక్షలోపు ఉన్న విద్యార్థులకు/ఎస్‌సీ/ఎస్‌టీ/దివ్యాంగులకు పూర్తిగా ట్యూషన్‌ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తున్నారు.
  • ఇస్రోలో సైంటిస్ట్‌లుగా: బీటెక్, డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు పూర్తి చేసుకున్న వారికి ఇస్రోలోనే సైంటిస్ట్‌/ఇంజనీర్‌గా కొలువులు లభిస్తున్నాయి. వీరు కనీసం 7.5జీపీఏతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో కూడా ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు.

దరఖాస్తు సమాచారం
ఐఐఎస్‌టీ అడ్మిషన్‌ జాబితా వెల్లడి: అక్టోబర్‌ 21, 2021
బ్రాంచ్‌ ప్రాథమ్యాలను మార్చుకునే అవకాశం: అక్టోబర్‌ 22, 2021
సీటు కేటాయింపు తేదీ: అక్టోబర్‌ 23, 2021
ఐఐఎస్‌టీలో ప్రవేశ తేదీ: నవంబర్‌ 30, 2021
క్లాసుల ప్రారంభం: డిసెంబర్‌ 7, 2021.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://admission.iist.ac.in

ప్రత్యామ్నాయాలపై దృష్టి మేలు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణులు..ఐఐటీల్లో ప్రవేశానికే పరిమితం కాకుండా.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టడం మేలు. ఇప్పుడు పలు జాతీయ ప్రాముఖ్యం కలిగిన ఇన్‌స్టిట్యూట్‌లు అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇవి అనుసరిస్తున్న బోధన ప్రమాణాలు, ఇతర అంశాల కారణంగా వీటికి కార్పొరేట్‌ వర్గాల నుంచి మంచి గుర్తింపు లభిస్తోంది. ఫలితంగా ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఎంఎన్‌సీ కొలువులు లభిస్తున్నాయి. 
ప్రొ‘‘ టి.హేమంత్‌ కుమార్, ప్రొఫెసర్‌ ఇంచార్జ్, సీడీఎస్, ఐఐపీఈ

Published date : 23 Oct 2021 03:52PM

Photo Stories